పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి, భుజాన వేసుకుని మౌనంగా స్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు 'రాజా, నువు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచరి స్తున్నావో నాకు బోధపడటం లేదు. బహుశా నీవు ఏ దేవతనయినా సంతృప్తి పరిచి నీ సమస్యలను పరిష్కరించుకోవ డానికి ఈ విధంగా చేస్తున్నట్లయితే ఆ మేరకు నీ నిర్ణయం మంచిదే అవుతుంది. సర్పముఖంతో పుట్టిన తన కూతురుకు మానవ రూపాన్ని తెప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించిన ఒక రాజు కథను ఈ సంద ర్భంగా నీకు చెబుతాను. తన ప్రార్థనలకు మెచ్చి నాగదేవత తనముందు ప్రత్యక్షమైన ప్పుడు ఈ రాజు మరొక సమస్యను కూడా పరిష్కరించు కోడానికి ఈ అవకాశాన్ని ఉప యోగించుకున్నాడు. ఈ విశేషమేమిటో చెబుతాను, శ్రమతెలియకుండా విను,' అని కథ చెప్పసాగాడు.
జ్ఞానదీపిక రాజ్యం రాజు జీమూత వాహనుడు ధార్మికుడు. ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలోనూ, ప్రజల బాగోగులు చూడడంలోనూ అతనిది అందెవేసిన చేయి. జీమూతవాహనుడి పట్టమహిషి చూడామణి దేవి భర్తకు తగిన ఇల్లాలు. రాజదంపతులకు సందీపుడు ఒక్కడే కొడుకు. వయసు అయిదేళ్లు మించదు.
రాజదంపతులు ఒకసారి వనవిహారా నికి వెళ్లారు. మధ్యాహ్నం భోజనానంతరం యువరాజుతో కలిసి తమ కోసం నిర్మించిన గుడారంలో విశ్రాంతి తీసుకోసాగారు. విశ్రాంతి సమయంలో వారికి చిన్నపాటి కునుకు పట్టింది.
ఆ సమయంలో నిద్రిస్తున్న యువ రాజు మీద ఎండ పడసాగింది. అదే సమ యానికి గుడారంలోకి ఒక నాగసర్పం వచ్చింది. బాలుడి మీద ఎండ పడడం చూసిన నాగసర్పం పడగ విప్పి యువరాజు శిరస్సుమీద ఎండ పడకుండా గొడుగు పట్టింది.
అదే సమయానికి కళ్ళు తెరిచిన మహా రాజుకు ఆ దృశ్యం భయం గొలిపింది. అతను, నాగసర్పం నుంచి యువరాజుకు ప్రమాదం శంకించి ప్రక్కనున్న కత్తి అందుకుని పైకి లేచి తటాలున నాగసర్పం శిరసు ఖండించాడు. నాగసర్పం గిలగిలా కొట్టుకుని మరణించింది.
ఆ సవ్వడికి మేల్కొన్న మహారాణి జరి గిన సంఘటన తెలుసుకుని భీతిల్లి యువ రాజును అక్కున చేర్చుకుంది. మరికొంచెం సేపటికి రాజదంపతులు, యువరాజుతో కలిసి అంతఃపురం చేరుకున్నారు.
ఆ సంఘటన జరిగిన కొంత కాలానికి మహారాణి చూడామణి దేవి గర్భం ధరిం చింది. ఆ శుభవార్త తెలుసుకుని మహా రాజుతో పాటు, రాజ్యవాసులు ఎంతగానో సంతోషించారు. నెలలు నిండిన మహారాణి ఒక ఆడశిశువును ప్రసవించింది. ప్రసవిం చిన బిడ్డను చూసి మంత్రసానులు భీతి చెందారు. ఎందుకంటే జన్మించిన బిడ్డకు దేహమంతా మానవదేహమే కాని శిరసు స్థానంలో పాము తల ఉంది.
క్షణాల్లో ఆ వార్త మహారాజు చెవిన పడింది. అతను హుటాహుటిన అక్కడికి వచ్చి జన్మించిన బిడ్డను చూసి బాధతో విల విల్లాడాడు. అతనా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
రాజ్యవాసులకు మహారాణి, ఆడ శిశువును ప్రసవించిందన్న వార్త మాత్రమే తెలిసింది గాని ఆ బిడ్డ సర్పముఖముతో జన్మించిన విషయం తెలియలేదు.
అటువంటి బిడ్డ పుట్టడానికి కారణం మహారాజు నాగసర్పం శిరస్సు ఖండించడ మేనని మహారాణి భావించి మహారాజుతో మనవి చేసింది. మహారాజు సర్పదోష నివా రణకు పూజలు జరిపించాడు. అయితే ఫలితం కానరాలేదు.
జ్యోతిష్కులు యువరాణి జాతకం చూసి విషయం చెప్పడానికి తటపటాయిం చారు. మహారాజు పదే పదే అడగ్గా 'రాజా! యువరాణి జన్మ నక్షత్రాన్ని బట్టి త్వరలోనే రాజ్యానికి ఆపద రానున్నది' అని మనవి చేశారు. యువరాణికి రాగచంద్రిక అని నామకరణం చేశారు. రాజదంపతులు మాత్రం యువరాణిని సర్పముఖి అని పిలుచుకోసాగారు. జీమూత వాహనుడు ఎందరో రుషులను, మునీశ్వరులను కలిసి తనకు జన్మించిన బిడ్డకి మామూలు రూపు వచ్చేలా చూడమని ప్రార్థించాడు. అయితే వాళ్లు అదంత తేలికయిన విషయం కాదని తేల్చి చెప్పారు.
సర్పముఖికి అయిదేళ్ల ప్రాయం వచ్చింది. అంతలో రాజ్యంలో క్షామం అలుముకుంది. వర్షాలు పడలేదు. పచ్చటి పంట పొలాలు బీళ్లుగా మారాయి. త్రాగు నీటికి కటకట అయింది. పచ్చిక లేక పశు వులు మరణించసాగాయి.
ఆ పరిస్థితికి కారణం యువరాజు జన నమేనని అర్థం చేసుకున్నాడు జీమూత వాహనుడు. అతను ప్రజాక్షేమం గురించి విచారిస్తుండగా, అతని దగ్గరకు దివ్యచరి తుడు అనే సన్యాసి వచ్చి కలిశాడు. 'రాజా, నీ మనోవ్యాధి నాకు తెలుసు. సర్పముఖ జననం. రాజ్యంలోని క్షామం నీ మనసును కలిచివేస్తున్నాయి. అవునా,' అని అడిగాడు.
తను చెప్పకుండానే యువరాణి జన్మ రహస్యం తెలుసుకున్న సన్యాసి సామాన్యుడు కాదని గ్రహించిన మహారాజు; 'అవును మహాత్మా! తరుణోపాయం సెలవీయండి,' అని ప్రార్థించాడు.
'రాజా! దీనికంతటికీ కారణం నీవు చంపిన నాగసర్పమే! నీడనిచ్చిన సర్పాన్ని తొందరపాటుతో చంపావు. ఆ దోషమే నిన్ను వెంటాడుతున్నది. నేను చెప్పినట్లు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది. ఈ రాజ్యానికి దక్షిణదిశన నాగభైరవ కోన అనే ప్రదేశం ఉంది.
అక్కడ అతి పురాతనమైన నాగదేవత విగ్రహం ఉంది. నీవా ప్రాంతానికి వెళ్లి నాగదేవతను క్షమాబిక్ష కోరి, పూజలు జరి పిస్తే మంచి ఫలితం ఉంటుంది,' అని చెప్పాడు.
జీమూత వాహనుడు, దివ్య చరితుడికి పాదాభివందనం చేసి 'మహానుభావా మీరు చేసిన సహాయం ఎనలేనిది. అందుకు కృతజ్ఞతలు,' అని చెప్పాడు.
శుభముహూర్తం చూసి జీమూత వాహ నుడు, ఒంటరిగా అశ్వారూఢుడై నాగభైరవ కోనను వెదుక్కుంటూ వెళ్లాడు. వారం రోజుల ప్రయాణం తర్వాత అతడా కోన చేరాడు. అక్కడ నాగదేవత విగ్రహు కనిపిం చింది. జీమూత వాహనుడు అక్కడున్న కొలనులో శుచిగా స్నానం చేసి, చెట్లకున్న పరిమళభరిత పుష్పాలను కోసి వాటిలో నాగదేవతకు పూజ చేశాడు.
'మాతా! కన్న తండ్రినైనందున మమ కారంతో, బిడ్డను రక్షించుకోవాలన్న తొందరలో నాగసర్పాన్ని చంపాను. అది తప్పే! అందుకు నన్ను శిక్షించు. అంతేకాని నా బిడ్డను గాని, రాజ్యప్రజలను గాని శిక్షించకు,' అని ప్రార్థించాడు.
కొద్ది క్షణాలకు ఆకాశంలో మెరుపు మెరిసింది. బలమైన గాలి వీచింది. అంతలో నాగదేవత విగ్రహు నుంచి 'రాజా! పశ్చాత్తాప హృదయంతో నన్ను వెదుక్కుంటూ ఇంత దూరం వచ్చావు. నిన్ను క్షమిస్తున్నాను. ఏం వరం కావాలో కోరుకో!' అన్న స్వరం వినవచ్చింది.
అప్పుడు జీమూతవాహనుడు, 'నాగ దేవతా, నేను చేసిన తప్పిదం వలన జన్మిం చిన బిడ్డ సర్పముఖముతో జన్మించింది. ఆ బిడ్డకు మామూలు రూపం ప్రసాదించు. అలాగే రాజ్యంలో ఎన్నడూ లేని క్షామం అలుముకుంది. ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు. వర్షాలు కురిసి క్షామం తొలిగేలా చూడు,' అని కోరాడు.
అప్పుడు నాగదేవత ‘రాజా! నీ రెండు కోరికల్లో ఒక్కకోరికను మాత్రమే తీర్చగ లను. ఒకప్పుడు తొందరపాటుతో నాగస ర్పాన్ని చంపి చిక్కులు కొని తెచ్చుకున్నావు. ఈసారి అటువంటి తొందరపాటు ప్రదర్శించక నిదానంగా ఆలోచించి వరం కోరుకో!' అని చెప్పింది.
క్షణం ఆలోచించిన జీమూత వాహనుడు ‘తల్లీ! రాజ్యంలోని క్షామం తొలిగేలా అనుగ్రహించు,' అని కోరాడు. 'తథాస్తు' అని దీవించింది నాగదేవత. జీమూత వాహ నుడు సగం తృప్తితో, సగం అసంతృప్తితో అక్కడున్న నాగదేవత విగ్రహానికి నమస్క రించి వెనుదిరిగాడు.
అతను రాజ్యం చేరేసరికి వర్షం కురవడం ఆరంభమయింది. ఆ తరువాత కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. బీళ్ళుగా మారిన పంట పొలాలు చిగురించాయి. మెల్లగా రాజ్యంలో క్షామపరిస్థితులు వైదొలిగి ప్రజల కష్టాలు తీరాయి.
ఆ పరిస్థితులలో దివ్యచరితుడు మరలా రాజును కలిసి, 'రాజా! నేనొక శాంతియజ్ఞం జరిపిస్తాను. అందువలన అంతఃపుర పరిస్థితులు చక్కబడతాయి,' అని చెప్పి రాజదంపతుల చేత శాంతి యజ్ఞం జరిపించాడు.
కొద్ది రోజులు గడిచేసరికి యువరాణి రాగచంద్రికకు సర్పముఖం మాయమై మానవ శిరము ప్రత్యక్షమయింది.
రాజదంపతుల సంతోషానికి అవధు ల్లేవు. సంతుష్టి చెందిన జీమూత వాహనుడు, దివ్యచరితుడిని ఘనంగా సత్కరించబోయాడు. అప్పుడు దివ్యచరితుడు 'రాజా! నీముందు నేనెంత? నాకెందుకు సత్కారం?' అని నిష్క్రమించాడు. మహారాజు, నాగదేవతకు రాజ్యంలో ఆలయం కట్టించి తన భక్తిని చాటుకున్నాడు.
అంతవరకూ కథ చెప్పిన బేతాళుడు, 'రాజా! ఒకప్పుడు తొందరపాటుతో నాగ సర్పం శిరసు ఖండించిన జీమూత వాహ నుడు, నాగదేవత తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించినప్పటికీ తన కుమార్తె బాగు కోరకుండా, క్షామం తొలగాలని ప్రార్థించడం అవివేకం కదా! ఎలాగూ కొడుకు ఉన్నాడు కాబట్టి ఆడ పిల్ల ఏమైనా ఫర్వాలేదన్న చులకన భావంతో అలా ప్రవర్తించాడా? ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చిన నాగదేవత కంటే, శాంతియజ్ఞం జరిపించి యువరాణికి మామూలు రూపు తెప్పించిన దివ్య చరి తుడు మహిమాన్వితుడు కాదా? ఒక్క కోరి కను మాత్రమే నెరవేర్చిన నాగదేవతను అశక్తురాలిగా భావించి చిన్నచూపు చూడ వలసిన జీమూత వాహనుడు, దేవాలయం కట్టించి ఎందుకు కృతజ్ఞత చాటు కున్నాడు? కాగా, దివ్యచరితుడు మహా రాజును తనకంటే గొప్పవాడిగా ఎందుకు స్తుతించాడు?' అని ప్రశ్నించాడు.
అందుకు విక్రమార్కుడు, 'బేతాళా! రాజ్యంలోని క్షామం తొలగాలని నాగదేవ తను ప్రార్థించడం ద్వారా జీమూత వాహ నుడు రాజుగా తన ప్రథమ కర్తవ్యం నిర్వ ర్తించాడు. రాజుకు భార్య అయినా, బిడ్డలైనా ప్రజల తర్వాతే. అతనికా పరీక్ష పెట్టడానికే నాగదేవత ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చగలను అన్నది. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం ద్వారా మహారాజు నాగదేవత అనుగ్రహు పొందగలిగాడు. కాబట్టి అతనా కోరిక కోరడంలో తొందరపాటు ప్రదర్శించాడు తప్ప అవివేక నిర్ణయం అనడానికి వీలులేదు.
నాగదేవత అనుగ్రహాన్ని అర్థం చేసుకో బట్టే దివ్యచరితుడు శాంతి యజ్ఞం జరి పించి కాగల కార్యం త్వరగా సానుకూలం అయ్యేలా చేశాడే గాని అందులో అతని దివ్య శక్తులేం లేవు. నాగదేవత ఒక కోరిక నెరవేరుస్తానని చెప్పి రెండో కోరికను కూడా నెరవేర్చడం అర్థం చేసుకోబట్టే జీమూత వాహనుడు దేవాలయ నిర్మాణం గావించాడు.
దివ్యచరితుడు, మహారాజును స్తుతించడానికి కారణం, తనవారిని త్యజించడం అన్నది సన్యాసులకే కష్టమైన విషయం. అటువంటిది మహారాజు ప్రజల క్షేమం కోసం కన్నబిడ్డ క్షేమాన్నే ప్రక్కన పెట్టడం చాలా అరుదైన విషయం. అందుకే అతను రాజును ప్రస్తుతించాడు,' అని చెప్పాడు.
బేతాళుడికి సరైన సమాధానం లభించ డంతో శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
(కల్పిత కథ)