పరిష్కారం | భేతాళ కథలు | Tales of Vikram and Betala | Parishkaram

writer
0

పట్టువదలని విక్రమార్కుడు, చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నువ్వు ఏ సమస్యకు పరి ష్కారం వెతుకుతూ ఇలా శ్రమపడు తున్నావో తెలియదు. కాని, విజ్ఞుల మని భావించే కొందరు తేలిగ్గా జరిగే పనిని క్లిష్టం చేసుకుంటూ ఉంటారు. దుర్మార్గుడైన అన్నను తొలగించి, మంచి వాడైన తమ్ముడికి రాజ్యాధికారం అప్ప గించడానికి లేనిపోని గందరగోళంలో పడ్డ ఒక మహారాజు, గురువుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను," అంటూ ఇలా చెప్పసాగాడు: ఆదర్శపాలకుడిగా ప్రజల ఆద రాభిమానాలు చూరగొన్న అవంతి రాజు శూరసేనుడికి వజ్రసేనుడు, విక్రమసేనుడు అని ఇద్దరు కుమారులు. రాజు వయోభారం కారణంగా పెద్దకుమా రుడు వజ్రసేనుడికి రాజ్య పట్టాభిషేకం చేసి, వానప్రస్థం స్వీకరించి భార్యతో సహా సమీప అరణ్యానికి వెళ్ళిపోయాడు.


వజ్రసేనుడు తండ్రి అడుగుజాడలలో రాజ్యపాలన చేయసాగాడు. వజ్రసేనుడికి గురుకులంలో తనతో కలిసి విద్యనభ్యసించిన మణిధరుడంటే ఎంతో ఇష్టం. వజ్రసేనుడు కొన్నాళ్ళకు మణిధరుడి చెల్లెలిని వివాహం చేసుకున్నాడు. వజ్రసేనుడు రాజయ్యాక చుట్టపు చూపుగా వచ్చిన మణిధరుడు రాజ ధానిలోనే స్థిరపడిపోయాడు. లోలోపల అతనికి అధికార దాహం పుట్టుకొచ్చింది. అందువల్ల అతడు వజ్రసేనుడి కళాభిరుచినీ, మృదు స్వభావాన్నీ ఆసరా చేసుకుని ఆయనకు మెల్లమెల్లగా వినోదాలపట్ల ఆసక్తి పెంచి, పాలనా వ్యవహారాల పట్ల అనాసక్తతను కలి గించసాగాడు. క్రమక్రమంగా వజ్రసేనుడు భోగలాలసుడై, పాలనా వ్యవహారాలను పట్టించు కోలేకపోయాడు. మణిధరుడు రాజు తరఫున ఒక్కొక్క అధికారాన్నీ కైవసం చేసుకోవడం మొదలుపెట్టాడు.


అధికారం మణిధరుడి వశం కావడంతో స్వార్థపరులైన అధికారులు అతని చుట్టూచేరి అతన్ని పొగుడుతూ-అమాయకులనూ, బలహీనులనూ పీడించసాగారు. రాజ్యంలో అవినీతి వేళ్ళూనింది; రాజోద్యోగులు ధన వంతులు కాసాగారు. వ్యాపారులు, సాధారణ ప్రజలు అధికారుల దౌర్జన్యాలకు గురవుతూ అష్ట కష్టాలు అనుభవించసాగారు.


ఈ దుస్థితిని భరించలేక పురప్రముఖులు కొందరు రాజును దర్శించి, తమ కష్టాలు చెప్పుకోవాలనుకున్నారుగాని, మణిధరుడు అడ్డు పడడం వల్ల, ఎంత ప్రయత్నించినా రాజదర్శనం సాధ్యం కాలేదు. వాళ్ళందరూ యువరాజు విక్రమసేనుణ్ణి కలుసుకుని తమ కష్టాలు తీరే మార్గం చూడమని మొరపెట్టుకు న్నారు. అన్నను పదవి నుంచి తొలగించి, రాజ్యా ధికారం చేపట్టమని పురికొల్పారు. అయితే విక్రమసేనుడు అందుకు ససేమిరా అన్నాడు.


దాంతో పురప్రముఖులు అరణ్య ప్రాంతంలో తపోజీవనం సాగిస్తూన్న వృద్ధరాజు శూరసే నుడి వద్దకు వెళ్ళి, తమ గోడును విన్నవించి, చిన్న కుమారుణ్ణి రాజును చేస్తే తమ బాధలు తొలగిపోగలవని చెప్పారు. వారి మాటలు విన్న రాజు శూరసేనుడు, “ఐహిక బంధాలకు దూరంగా ఉంటూన్న నేను రాజ్యవ్యవహారా లలో జోక్యం చేసుకోలేను. కొన్ని రోజులు ఓర్పు వహించండి. మీ సమస్య పరిష్కార మవుతుంది,” అని మాట ఇచ్చి పంపాడు.


శూరసేనుడు ఆ రాత్రంతా తీవ్రంగా ఆలో చించాడు. పురప్రముఖులు చెప్పినట్టు చేయడం ధర్మవిరుద్ధం. సరికొత్త సమస్యలు తలెత్తవచ్చునని భావించి, మరునాడు తమ కుమారులకు విద్యనేర్పిన మతంగముని గురుకులాశ్రమానికి బయలుదేరాడు. గురు వును చూసి ప్రజలు అనుభవిస్తూన్న కష్టా లనూ, తన సమస్యనూ విన్నవించి పరిష్కారం సూచించమని ప్రార్థించాడు.


అంతా విన్న గురువు, “అవంతి ప్రజలు అనుభవిస్తూన్న కష్టాల గురించి నేనూ విన్నాను. నీ ఇద్దరు కుమారులూ సద్గుణసంపన్నులే. కాని వజ్రసేనుడి సహాధ్యాయి అయిన మణి ధరుడు దుష్టస్వభావుడు. ఈ అనర్థాలన్నిటికీ అతడే మూలకారణమని భావిస్తున్నాను. పక్షం రోజుల్లో దీనికొక పరిష్కారం కను గొందాం. నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా," అని శూరసేనుణ్ణి సాగనంపాడు.


మరునాడే వజ్రసేనుడికి తాను వస్తున్నట్టు ఇద్దరు శిష్యుల ద్వారా వర్తమానం పంపి, రెండు రోజుల తరవాత గురువు రాజధానికి చేరుకున్నాడు. తనకు విద్యనేర్పిన గురువు వస్తున్నాడని తెలియగానే, వజ్రసేనుడు తన వినోదకార్యక్రమాలన్నిటినీ పక్కనబెట్టాడు. గురువుకు ఘనంగా స్వాగతం పలికి, సభామధ్యంలో ఉన్నతాసనంపై కూర్చోబెట్టి, “తమ రాక నాకెంతో ఆనందంగా ఉన్నది. నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించండి. చేస్తాను," అన్నాడు. 


గురువు మందహాసం చేస్తూ, “విద్యా భ్యాసం పూర్తికాగానే శిష్యుల నుంచి గురు దక్షిణ స్వీకరించడం గురుకుల సంప్రదాయం. అయితే, ఆ రోజు నీతో మాత్రం, ‘అవసరమై నప్పుడు పుచ్చుకుంటాను, అన్నాను జ్ఞాపకం ఉన్నది కదా?" అని అడిగాడు.


“ఎలా మరిచిపోగలను గురువర్యా? ఏం కావాలో సెలవివ్వండి. ఈ క్షణమే సమకూరు స్తాను," అన్నాడు వజ్రసేనుడు.


"అడిగిన తరవాత వెనకడుగు వేయకూ డదు సుమా!" అన్నాడు గురువు.


"ఇచ్చిన మాట తప్పడం మరణ సదృశం అని మీ శిష్యుణ్ణయిన నాకు తెలుసు. నిస్సంకోచంగా అడగండి,” అన్నాడు వజ్రసేనుడు దృఢమైన కంఠస్వరంతో.


"నీ అవంతీ రాజ్యం నాకు గురుదక్షిణగా కావాలి!” అన్నాడు గురువు.


ఆ కోరిక విని ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందిన వజ్రసేనుడు మరుక్షణమే తేరుకుని, "చిత్తం గురువర్యా! తమ అభీష్టానుసారం నా రాజ్యాన్ని...” అంటూండగా పక్కనే వున్న మణిధరుడు అడ్డుపడి, “ఆగండి మహా రాజా! తరతరాలుగా వంశానుగతంగా వస్తూన్న రాజ్యలక్ష్మిని తొందరపడి గురుదక్షిణగా ఇవ్వడం ఏమాత్రం భావ్యం కాదు. ధనధాన్యాలు, మణులు మాణిక్యాలు, పశువులు పొలాలు మరేదైనా ఇవ్వండి,” అన్నాడు.


“కాదు. నీ మాటవింటే మాట తప్పిన వాణ్ణి అవుతాను. మా వంశం అప్రతిష్ఠపాలవుతుంది,” అని వజ్రసేనుడు గురువు కేసి తిరిగి, “తమ అభీష్టానుసారం నా రాజ్యాన్ని గురుదక్షిణగా స్వీకరించండి," అంటూ కిరీటం తీసి గురువు పాదాల చెంత ఉంచాడు.


“నీ గురుభక్తి అనుపమానం వజ్రసేనా! ఇందులో కొంతయినా పాలనా వ్యవహారాల పట్ల శ్రద్ధ, మణిధరుడి వంటి దుష్టులను దూరంగా ఉంచాలన్న ముందుచూపు ఉండి వుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. ప్రజల క్షేమమే ప్రభువులకు అలంకారం," అంటూ గురువు తన ఇద్దరు శిష్యులను దగ్గరికి పిలిచి ఏదో చెప్పాడు.


శిష్యులు అరణ్యానికి వెళ్ళి, శూరసేన మహారాజును రాజధానికి తీసుకువచ్చారు. ఆయన రాగానే గురువు, “రాజా! అవంతి రాజ్యాన్ని వజ్రసేనుడు నాకు గురుదక్షిణగా సమర్పించాడు. దానిని ఇప్పుడు నేను నీకు అప్పగిస్తున్నాను. ఇందులో ఎవరి నిర్బం ధమూ లేదు. రాజ్యాన్ని రెండుగా విభజించి సగభాగానికి వజ్రసేనుణ్ణి, రెండవ సగభాగా నికి విక్రమసేనుణ్ణి పాలకులుగా నియమిం చండి. తద్వారా ప్రజల కష్టాలు తొలగిపోయి, వారు సుఖశాంతులతో వర్థిల్లగలరని ఆశిస్తున్నాను, అన్నాడు.


అన్నదమ్ములిద్దరూ అందుకు సంతోషంగా సమ్మతించడంతో, శూరసేనుడు గురువు సమక్షంలో ఆయన చెప్పినట్టు చేసి, ఆశ్రమా నికి బయలుదేరాడు. ప్రజలు కృతజ్ఞతా పూర్వకంగా చేతులెత్తి మొక్కుతూ ఆయనకు వీడ్కోలు పలికారు.


బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, మొదట పురప్రముఖులు వచ్చి అన్నపై తిరుగుబాటు జరిపి, రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించమన్న ప్పుడు నిరాకరించిన విక్రమసేనుడు, ఆ తరవాత తండ్రి ఇచ్చిన అర్ధరాజ్యాన్ని ఎలా స్వీకరించాడు? వ్యసనపరుడనీ, అసమర్థుడనీ తెలిసి కూడా వజ్రసేనుడికి మళ్ళీ అర్ధరాజ్యం కట్టబెట్టడం విజ్ఞత అనిపించుకుంటుందా? ఐహిక బంధాలు తెంచుకున్న తాను ఇకపై రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకోనని చెప్పిన శూరసేనుడు, గురువును ఆశ్రయించి ఇంత తతంగం ఎందుకు జరిపించాడు? ఇది ఆయనలోని భేషజానికి తార్కాణం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపో తుంది, అన్నాడు.


దానికి విక్రమార్కుడు, “రాజ్యాధికారం వంశానుగతంగా వచ్చే వారసత్వం. తిరుగు బాటు ద్వారా దాన్ని చేపట్టడం; అరాచకానికీ, అపప్రథకూ దారితీయవచ్చు. అందువల్లనే విక్రమసేనుడు పురప్రముఖుల ప్రతిపాద నను తోసి పుచ్చాడు. ఆ తరవాత గురువు, తండ్రి, అన్న సమ్మతించి ఇవ్వడంతో ప్రజా క్షేమం పరిరక్షించవలసినది తన బాధ్యత గనక దానిని స్వీకరించాడు. స్వభావరీత్యా వజ్రసే నుడు కూడా మంచివాడే కావడంవల్ల, ఇంత జరిగాక, బావమరిదిని దూరం చేసుకుంటే మంచి మార్గంలో పయనించి, సత్పరిపాలన అందివ్వడంలో తమ్ముడితో పోటీ పడగలడన్న ఆశాభావంతోనే గురువూ, రాజూ అతనికి మళ్ళీ అర్ధరాజ్యం అప్పగించారు. ఇక వాన ప్రస్థానికి వెళ్ళిన రాజు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించాడన్నది సరికాదు. గురువు స్వీక రించమన్న రాజ్యాన్ని ఆయనవెంటనే కుమారు లకు పంచి ఇచ్చాడు. అది కూడా ప్రజాక్షేమం కాంక్షించి చేశాడే తప్ప, స్వార్థంతో కాదు. భేషజానికి అసలు తావేలేదు. ప్రజాక్షేమమే ప్రధానంగా భావించి గురువు, రాజు అంద రికీ ఆమోదయోగ్యంగా, శాంతియుతంగా సమస్యను పరిష్కరించారు," అన్నాడు.


రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు. 


(కల్పిత కథ)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)