కష్టమైన పని | భేతాళ కథలు | Tales of Vikram and Betala | Kashtamaina Pani

writer
0

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, తలపెట్టిన కార్యం ఎన్ని కష్టాలకైనా ఓర్చి, సాధించి తీరాలన్న నీ పట్టుదల ప్రశంసనీయమైనదే. కాని నువ్వు చేపట్టిన కార్యం నీ కోసమా, లేక కపట వర్తనులైన మరెవరి కోసమా అన్నది నాకు తెలియదు. సమర్థులూ, తెలివైనవారూ కూడా ఒక్కొక్కసారి కపట స్వభావుల మాయమాటలు నమ్మి మోసపోతూ ఉంటారు. ప్రతిభా సంపన్నులైన ఇద్దరు యువకులను జనవంద్యుడనే ఒక తపస్వి, మాయమాటలతో వంచించిన కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,” అంటూ ఇలా చెప్పసాగాడు:


రాముడు పండితుడు, భీముడు మల్ల వీరుడు, సోముడు జలవిన్యాసాల్లో ఉద్దండుడు. ఈ ముగ్గురు యువకులు తమ విద్యలను ప్రదర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రజపురంలో కలుసుకుని మిత్రులయ్యారు. ఆ గ్రామస్థులు వారి ప్రతిభకు మెచ్చి గ్రామంలో ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. కాని కొన్నాళ్ళకు ప్రజపురంలో వానలు కురవక కరువొచ్చింది. ముగ్గురు మిత్రులూ కాయకష్టం చేయడం ఇష్టంలేక, వేరే ఊరు వెతుక్కుంటూ వెళ్ళి శ్రీనగరం చేరారు. అక్కడ ఒకరోజు ఆశ్రయం కోసం బసవయ్య అనే భాగ్యవంతుడి ఇంటి వద్దకు వెళ్ళారు.


ఆ సమయానికి బసవయ్య ఇంట్లో జన వంద్యుడనే తపస్వి ఉన్నాడు. బసవయ్య ఆతిథ్యానికి సంతృప్తుడై, “వచ్చే ఏడాదికి నీ కోడలికి పండంటి కొడుకు పుడతాడు, అని దీవించాడాయన.


ఆ మాట విని బసవయ్య ముఖం చిన్న బోయింది. ఆయన భార్య విమలమ్మ, “స్వామీ, మాకు సంతానం లేదు. మీ దీవెనతో మాకు కొడుకు పుట్టినా, వాడి పెళ్ళి ఇరవైయేళ్ళ తరవాత కదా!" అని బాధపడింది.


జనవంద్యుడు క్షణం పాటు కళ్ళు మూసి తెరిచి, “నేనలా దీవించడం దైవసంకల్పం. ఒక యోగ్యుడైన యువకుణ్ణి దత్తత చేసుకుని పెళ్ళి జరిపించండి. ఏడాదిలో మీ కోడలు మనవడి నెత్తుకుంటుంది, అన్నాడు.


బసవయ్య వెంటనే, “దత్తత చేసుకోవాలని మేమూ అనుకున్నాం. కాని యోగ్యుడెవరో తెలుసుకునేదెలా?" అన్నాడు.


అప్పుడే రాముడు, భీముడు, సోముడు ఆ ఇంటి తలుపు తట్టారు. వాళ్ళు తమ గురించి చెప్పేలోగా జనవంద్యుడు ఒక్కొక్క రినీ పేర్లతో పిలిచి, “ఉన్న ఊళ్ళో కరువొచ్చి, కాయకష్టం చేయడం ఇష్టం లేక, మీ ప్రతి భకు తగ్గపని వెతుక్కుంటూ వచ్చారు, అవునా?' అన్నాడు. ముగ్గురు మిత్రులూ తెల్లబోయి, “తమరు మహానుభావులు. మీ దర్శనం మా అదృష్టం. మా గురించి అన్నీ తెలిసిన తమరే మాకు తరుణోపాయం చూపాలి," అంటూ ఆయనకు నమస్కరించారు.


జనవంద్యుడు వారితో, “భాగ్యవంతుడైన ఈ బసవయ్యకు సంతానం లేదు. దశరథ పర్వతం మీది వశిష్ట వృక్షానికి కాసిన పుత్ర కామేష్ఠి ఫలం తింటే ఇతడి భార్య సంతానవతి అవుతుంది. అయితే, ఆ పర్వతం పశ్చిమ దిశలో లేదు. తక్కిన మూడు దిశలలో ఎక్కడు న్నదీ నాకు తెలియదు. మీరు ముగ్గురూ మూడు దిక్కులకు వెళ్ళి ఆ ఫలాన్ని అన్వేషిం చండి. ఫలం తెచ్చినవారికి బసవయ్య ఆస్తిలో సగం ఇస్తాడు. రెండు మాసాల్లో ఫలం ఎవరికీ దొరక్కపోతే-ఫలాన్వేషణలో అందరికంటే ఎక్కువ కష్టపడ్డవాణ్ణి ఆయన దత్తత చేసు కుంటాడు. ఫలాన్వేషణలో ముగ్గురికీ ఉపాధి లభిస్తుంది, అన్నాడు.


మిత్రులు ముగ్గురూ ఫలాన్వేషణలో తలో దిక్కుకు బయలుదేరారు.


ఉత్తరం వైపు వెళ్ళిన రాముడు దశరథ పర్వతం గురించి వాకబు చేస్తూ, వంచనుడనే భూస్వామి వద్దకు వెళ్ళాడు. ఆయన అతడి ప్రయాణం గురించి విని, దశరథ పర్వతం వివరాలు నిజాయితీపరులకూ, తెలివైన వాళ్ళకూ మాత్రమే చెప్పాలని నియమం. నువ్వు ఆరు వారాలు నేను చెప్పిన పని చెప్పి నట్టు చేసి నమ్మకస్థుణ్ణని నిరూపించుకో. తరవాత నువ్వు తెలివైన వాడివనిపిస్తే, ఆ పర్వతం వివరాలు చెబుతాను, అన్నాడు.


ఆ మాట నమ్మిన రాముడు, సరేనని ఆయనవద్ద పనిలో చేరాడు. వంచనుడతని చేత రోజూ పెరడంతా ఊడిపించేవాడు. నీళ్ళు తోడించేవాడు. కట్టెలు కొట్టించేవాడు. అవేవీ తనకు ఇష్టంలేకపోయినా, కార్యసాధనకోసం ఆరువారాలు గొడ్డుచాకిరీ చేశాడు రాముడు. ఆ తరవాత అతడు పర్వతం ఆచూకీ చెప్ప మంటే, “ఆరు వారాల్లో నమ్మకస్థుణ్ణుని రుజువు చేశావు. కానీ ఇప్పుడు దశరథ పర్వతం వివ రాలు చెబితే వెంటనే వెళ్ళి పోగలవు. మరి ఇంత నమ్మకస్థుడయిన పనివాణ్ణి వదులు కుంటానా? ఆమాత్రం గ్రహించలేని నీ తెలివి ఏం తెలివి? నీకు దరశథ పర్వతం వివ రాలు తెలుసుకునే అర్హత లేదు,” అన్నాడు వంచనుడు.


ఆయనకు పర్వతం గురించి ఏమీ తెలియ దనీ, తను మోసపోయాననీ గ్రహించిన రాముడు, ఉస్సూరుమంటూ శ్రీనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు.


దక్షిణం వైపు వెళ్ళిన భీముడు విచిత్రపుర మనే గ్రామం చేరుకుని తన మల్లవిద్యను ప్రదర్శించాడు. సంతోషించి గ్రామస్థులతణ్ణి అక్కడే స్థిరపడమన్నారు. ప్రస్తుతం తను వచ్చిన కార్యం గురించి చెప్పి, భీముడు అందుకు తిరస్కరించాడు. దానిని విన్న శిలాద్రుడనే వాడు, “మా గ్రామానికి కొంత దూరంలో దుర్గమమైన పర్వత శ్రేణి ఉన్నది. నేనొక పర్వతారోహకుణ్ణి. ఆ పర్వతాల విశే షాలు తెలుసుకునేందుకు నీలాంటి బలశాలి తోడు కోసం చూస్తున్నాను. నువ్వు సరేనంటే బయలుదేరుదాం. వాటి మధ్యలో దశరథ పర్వతం ఉండవచ్చు,” అన్నాడు.


అది తనకు నచ్చినదీ, వీలయినదీ కావ డంతో అందుకు భీముడు సరేనన్నాడు. మరు నాడే ఇద్దరూ కలిసి పర్వతశ్రేణి కేసి బయలు దేరారు. ఆ దారి దుర్గమమూ, ప్రమాదక రమూ అయినది. ఎగుడు దిగుడు దారి. క్రూర మృగాల బెడద. విషసర్పాల బెడద. ఆహార సంపాదనకు కష్టపడే వారు. ఇలా ఆరు వారాలు కష్టపడి యాత్ర ముగించి తిరుగు ప్రయాణమయ్యారు. విచిత్రపుర గ్రామ స్థులు వారికి ఘనసన్మానం చేశారు. దశరథ పర్వతం జాడ తెలియకపోయినా, తను బాగానే కష్టపడ్డానన్న తృప్తితో భీముడు శ్రీనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు.


ఇక తూర్పు దిశగా వెళ్ళిన సోముడు మకరా వళీ నదీ తీరానవున్న జలపురం చేరుకుని జలవిన్యాసాలతో గ్రామస్థుల్ని రంజింప జేశాడు. సంతోషించిన గ్రామస్థులతణ్ణి అక్కడే స్థిర పడమంటే ప్రస్తుత పరిస్థితిని చెప్పి తిరస్క రించాడు. అప్పుడతడి కథవిన్న మకరుడనే వాడు, “ఈ నదిలో రెండు వారాలు ప్రయాణం చేస్తే మొసళ్ళ ద్వీపం చేరుకోవచ్చు. ఆ ద్వీపంలో దశరథ పర్వతం ఉండవచ్చు. కాని నది మధ్యలో మొసళ్ళెక్కువ. వాటి భయంతో ఇంతవరకు ఎవ్వరూ ఆ ద్వీపం చేరే సాహసం చేయలేదు. నేనొక నావికుణ్ణి. ఆ ద్వీపం విశేషాలు తెలుసుకోవడానికి నీవంటి జలనిపు ణుడి తోడుకోసం చూస్తున్నాను. నువ్వు సరేనంటే బయలుదేరుదాం," అన్నాడు.


సోముడు సమ్మతించడంతో, వాళ్ళిద్దరూ మకరద్వీపం కేసి పడవలో ప్రయాణ మయ్యారు. రెండు రోజుల ప్రయాణం తర వాత నదిలో మొసళ్ళ బెడద మొదలయ్యింది. సోముడు జలచరాలను మించిన జలవిన్యా సాలు చేసి మొసళ్ళను బెదరగొట్టి తరిమాడు. అలా రెండు వారాలు ప్రయాణం చేశాక వాళ్ళు మొసళ్ళద్వీపం చేరుకున్నారు.


వెంటనే అక్కడున్న కొందరు వాళ్ళను చుట్టుముట్టి, తమరాజు మొసలన్న వద్దకు తీసుకువెళ్ళారు. మొసలన్న వారికథ విని, “మా దేవత మొసలమ్మ. మొసళ్ళ కొలను మధ్యలో ఆమె విగ్రహం ఉన్నది. ఆమె తనకు నరబలి కావాలనిపించినప్పుడు పరదేశీయుల్ని ప్రేరేపించి ఇక్కడికి రప్పించుకుంటుంది. మీరు అలా వచ్చినవారే. మిమ్మల్ని మొసళ్ళ కొలనులో వేస్తాం. మా దేవత మొసలి రూపంలో వచ్చి మిమ్మల్ని ఆహారంగా స్వీకరిస్తుంది, అన్నాడు. 33


సోముడా మాటలు విని, “నాది ఒక్కటే విన్నపం. తమరు నన్ను ముందు మొసళ్ళ కొలనులో వేయించండి. దేవత నన్ను కరు ణిస్తే, కొలను మధ్యలో వున్న విగ్రహానికి సాష్టాంగ పడి వస్తాను. ఒకవేళ నేను మొస లమ్మకు ఆహారమైతే, నా మిత్రుణ్ణి కూడా కొలనులో వేయించండి," అన్నాడు.


ఆ మాటకు మొసలన్న మనసులో నవ్వు కుని, దగ్గరుండి సోముణ్ణి మొసళ్ళ కొలనులో వేయించాడు. ఆ వెంటనే ఒక పెద్ద మొసలి పెద్దగా నోరు తెరిచి అతడి మీదికొచ్చింది. సోముడు పలురకాల జలవిన్యాసాలు చేసి ఆ మొసలిని తరిమేసి కొలను మధ్యకు చేరి అక్కడున్న మొసలమ్మ విగ్రహానికి సాష్టాంగ పడి తిరిగి వచ్చాడు. ఆ దృశ్యం చూసిన మొసలన్న, “మీకు మా దేవత దీవెనలున్నవి. మీకు అతిథిమర్యాదలు చేసి, పంపడం నా విధి. మీకు ఇష్టమైనన్ని రోజులుండి దశరథ పర్వతం గురించి వెతకండి," అన్నాడు.


రెండు వారాలు అన్వేషించాక ఆ దీవిలో దశరథ పర్వతం లేదని తేలింది. బాగానే కష్టపడ్డానన్న తృప్తితో సోముడు శ్రీనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు.


రెండు మాసాల గడువు పూర్తయ్యేసరికి రాముడు, భీముడు, సోముడు శ్రీనగరంలో బసవయ్య ఇంటికి వచ్చారు. అప్పుడక్కడ జనవంద్యుడు కూడా ఉన్నాడు. ఆయన వారి అనుభవాలు విని, ''నేను చెప్పినట్టే, ఫలా న్వేషణ కారణంగా మీకు ఉపాధి కల్పించే ప్రాంతాలు దొరికాయి. మీలో భీముడు విచిత్రపురం, సోముడు జలపురం వెళ్ళి హాయిగా జీవించండి. మీ అందరిలోకీ చాలా కష్టమైన పని చేసినప్పటికీ వేరెక్కడా ఉపాధి లభించని రాముణ్ణి బసవయ్య దత్తత చేసుకుంటాడు, అన్నాడు.


ఇది వింటూనే భీముడు, సోముడు, కలవరపడి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందారు. తరవాత తేరుకుని జనవంద్యుడికి శిరసువంచి నమస్కరించి సెలవు తీసుకున్నారు.


బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, తమను బసవయ్య దత్తత చేసుకోవాలన్న కోరిక కార ణంగానే భీముడు, సోముడు దశరథ పర్వతం కోసం ఎంతో కష్టపడ్డారు. ఎక్కువ కష్ట పడ్డ వాడినే బసవయ్య దత్తత చేసుకోగలడని కూడా జనవంద్యుడు చెప్పాడు. సంతాన ఫలాన్వే షణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడ్డది వాళ్ళు ఇద్దరు. జనవంద్యుడు ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడానికి బదులు, తెలివితక్కువగా వంచనుడి వలలో పడి కొన్నాళ్ళు బండచాకిరీ చేసి తిరిగివచ్చిన రాముణ్ణి ఎక్కువ కష్టపడ్డాడని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి? రాముడి పట్ల ఆయన పక్షపాత వైఖరికి ఇది నిదర్శనంకాక మరే మిటి? నా సందేహాలకు సమాధానం తెలిసీ చెప్పక పోయావో నీ తల పగలిపోతుంది,” అన్నాడు.


దానికి విక్రమార్కుడు, "రాముడు వంచ నుడి వలలో పడ్డది సంతాన ఫలాన్వేషణ కోసం. అందుకని అతడు తనకు ఏమాత్రం ఇష్టం లేని, అలవాటు లేని కాయకష్టానికి సిద్ధపడ్డాడు. తక్కిన ఇద్దరూ ఫలాన్వేషణ విషయం అనుమానమైనా కష్టమైన పనులు చేయడానికి ప్రాముఖ్యతనిచ్చారు. వాళ్ళు చేసినవి కష్టమైన పనులే. కాని, వారికవి ఇష్టమైనవి; పేరు తెచ్చేవి; వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించేవి. ఇష్టముంటే ఎంత కష్టమైన పనైనా సులభమే. ఇష్టం లేకుంటే ఎంత సులభమైన పనీ కష్టమే. ఆ విధంగా కష్టమైన పని చేసినవాడు రాముడు. అందుకే జనవం ద్యుడు అతన్ని ఎంపిక చేశాడు. ఇందులో ఎలాంటి పక్షపాతమూ లేదు. పైగా ఇద్దరి శ్రమా వృథా కాలేదు. ఉపాధికి దారిచూపాయి. మొదట ఆశ్చర్యపోయినప్పటికీ, తరువాత దీనిని గ్రహించడం వల్లే వారు తపస్వికి కృతజ్ఞ తతో శిరసు వంచి నమస్కరించారు, అన్నాడు.


రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు. 


(కల్పిత కథ)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)