జన్మవిముక్తి | భేతాళ కథలు | Tales of Vikram and Betala | Janmavimukthi

writer
0

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటి లాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. ' అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, దైవజ్ఞులు, జ్యోతిష పండి తులమని చెప్పుకునే కొందరు తలా తోకా లేని కారణాలను చూపి, తమను నమ్మినవారిని అవస్థలపాలు చేస్తూ ఉంటారు. భీతి కొలిపే ఈ అరణ్యంలో అపరాత్రివేళ నువ్వు పడుతూన్న శ్రమ చూస్తూంటే, అటువంటి వారెవరో నిన్నీ పనికి పురికొల్పారేమోనన్న అనుమానం కలుగుతున్నది. నీకు తగు హెచ్చరి కగా ఉండేందుకు, అలాంటి కోవకు చెందిన చలాకుడనే జ్యోతిష పండి తుడి కథ చెబుతాను, శ్రమ తెలియ కుండా, విను,” అంటూ ఇలా చెప్పసాగాడు:


మహాపురంలో ఉండే దివాకరుడనే భాగ్య వంతుడు తన కూతురు కళావతికి పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు; వరుసగా పదిమంది యువకు లామెను ఏదో వంక బెట్టి కాదన్నారు. దివా కరుడు బెంగపెట్టుకున్నాడు. ఆయన భార్య ప్రభావతి తన అన్న సుకోపుడికీ విషయం కబురు చేస్తూ, కళావతి జాతకాన్ని కూడా పంపింది..


సుకోపుడు వ్యవహారజ్ఞుడు. జ్యోతిష పండి తుడు చలాకుడు ఆయనకు ప్రాణ స్నేహి తుడు. చెల్లెల నుంచి కబురందగానే, సుకో పుడు కళావతి జాతకాన్ని మిత్రుడికి చూపిం చాడు. చలాకుడది పరీక్షించి, "ఈ జాతకం జగన్మాత సీతాదేవి జాతకాన్ని పోలి ఉన్నది. అందుకే పెళ్ళి, పిల్లల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. జగత్పురం వెళ్ళి, సీతారాముల దర్శనం చేసుకుని, తీసుకున్న ప్రసాదంలో కొంత ఆ ఊళ్ళోని పుణ్యాత్ముల ఇంట ఇస్తే ఈమెకు శుభం జరుగుతుంది. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది,” అన్నాడు.


“అంటే, జాతకం ప్రకారం కళావతికి తగిన వరుడు జగత్పురంలో ఉన్నాడనే కదా నీ అభిప్రాయం. అలా అయితే, మనమూ, మా చెల్లెలి కుటుంబమూ కలిసి జగత్పురం వెళదాం. మరి, ఆ ఊళ్ళోని పుణ్యాత్ములెవరో ఆ నువ్వే మాకు దగ్గరుండి చూపించాలి,” అన్నాడు సుకోపుడు.


చలాకుడు సరేననగానే వాళ్ళిద్దరూ కలిసి మహాపురం వెళ్ళారు. విషయం తెలిసిన దివా కరుడు వెంటనే పురుషులకొకటీ, స్త్రీలకొకటీ విడివిడిగా రెండు గుర్రపు బగ్గీలు ఏర్పాటు చేశాడు. ఆ రోజంతా ప్రయాణం చేసి, వాళ్ళు జగత్పురం చేరుకుని దైవదర్శనం చేసుకుని ప్రసాదం తీసుకున్నారు. ఆ సమయంలో చలాకుడు దగ్గరుండి కళావతి చేత దేవీస్తోత్రం పఠింపజేశాడు.


తిరుగు ప్రయాణంలో ఒక ఇంటి సమీపా నికి వచ్చాక, చలాకుడు బండిని ఆపమని సైగ చేశాడు. బండి ఆగాక ఆయన కళావ తితో, "అమ్మా, కళావతీ! ఈ ఇల్లు పుణ్యాత్ముల దని నాకు తోస్తున్నది. నీ దగ్గరున్న ప్రసాదంలో కొంత ఆ ఇంట్లో ఇచ్చిరా,” అన్నాడు. 


ఆయన ఆదేశం ప్రకారం బండి దిగి ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టిన కళావతికి ఇంటి నుంచి వస్తున్న ఒక యువకుడు ఎదురుపడి ఆమెను కన్నార్పకుండా చూస్తూ నిలబడ్డాడు. ఆ చూపులకు సిగ్గు పడుతూ కళావతి, “సీతారాముల దర్శనార్థం మహా పురం నుంచి ఈ ఊరొచ్చాం. ఇది పుణ్యాత్ముల ఇల్లనీ, ఇక్కడ దేవుడి ప్రసాదం ఇస్తే నాకు శుభం జరుగుతుందనీ పెద్దలు చెప్పారు. ప్రసాదం తీసుకోండి," అంటూ ప్రసాదం అందించబోయింది.


"ఈ ఇంట్లో పుణ్యాత్ములు నా తల్లిదం డ్రులు. ఆ ప్రసాదం వాళ్ళకే ఇవ్వు," అంటూ ఆ యువకుడు లోపలికి వెళ్ళి, తల్లిదండ్రు లతో, “మీకు దేవుడి ప్రసాదమివ్వాలని ఒక యువతి వచ్చింది. మీకామెనచ్చితే నేనామెను దైవప్రసాదంగా భావించి పెళ్ళి చేసుకుం టాను,” అన్నాడు.


ఆ యువకుడి పేరు వీరభద్రుడు. తండ్రి శివకాముడు, తల్లి శివకామమ్మ. ఇన్నాళ్ళూ పెళ్ళికి ఒప్పుకోని కొడుకు ఇప్పుడు చేసు కుంటాననడం వాళ్ళకు పరమానందం కలి గించింది. వాళ్ళకు కళావతి నచ్చింది. చాలా కుడు వధూవరుల జాతకాలు పరిశీలించి చక్కగా కుదిరాయన్నాడు. కళావతికీ, వీర భద్రుడికీ పెళ్ళి నిశ్చయమైపోయింది.


ఆ రోజే తిరుగు ప్రయాణమై, దివాకరుడి కుటుంబం సూర్యాస్తమయం కావడంతో ఆ రాత్రికి మార్గ మధ్యంలోని ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది.


మరునాడు తెల్లవారగానే చలాకుడు సంధ్యావందనం చేయడానికి సత్రానికి కొద్దిదూరంలో ప్రవహిస్తూన్న నది వద్దకు వెళ్ళాడు. సంధ్యవార్చి గట్టు మీదికి వచ్చి అక్కడున్న మర్రి చెట్టుకింద కూర్చున్నాడు. అప్పుడా చెట్టుపై నుంచి ఒక రాక్షసుడాయన ముందుకు దూకి, “అడిగినదానికి బదులిచ్చి నా సందేహం తీర్చు. లేదా నాకు ఆహారమై నా ఆకలి తీర్చు," అన్నాడు.


చలాకుడు జ్యోతిష పండితుడేగాక లౌక్యుడూ, ధైర్యవంతుడూనూ. రాక్షసుడు అడిగిన తీరును బట్టి ఆయన అసలు సంగతి ఊహించి, "నీకీ రాక్షసరూపం నుంచి విముక్తి కావాలి. అంతే కదా?" అన్నాడు.


అది నిజం కావడంతో చలాకుడి మీద రాక్షసుడికి గురి కుదిరింది. వాడాయనకు నమస్కరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. చలాకుడు వాడి కుడి అరచేతిని శ్రద్ధగా పరీక్షించి, “నీ దగ్గరున్న ఏదైనా అద్భుత శక్తితో పుణ్యాత్ములకు ఉపకారం చేసిన మరు క్షణమే, నీకీ జన్మ నుంచి విముక్తి కలుగు తుంది,” అన్నాడు.


"నాకున్న అద్భుతశక్తి ఒకే ఒక మంత్రం మాత్రమే. దానితో పండును మంత్రించి ఇస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే, దాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలను. అయినా, పుణ్యాత్ములకూ, పాపాత్ములకూ భేదం తెలుసుకోలేని జన్మనాది. నువ్వే దాన్ని త్వరగా పుణ్యాత్ములకిచ్చి నా జన్మ విముక్తి కలిగించు," అని వేడుకున్నాడు రాక్షసుడు.


“దేనికైనా సమయం రావాలి కదా? జన్మ విముక్తికి నువ్వు మరి కొంత కాలం వేచి ఉండక తప్పదు. మంత్రించిన సంతానఫలాన్ని అందుకోగల పూణ్యాత్ములు తారసపడగానే వచ్చి తీసుకుంటాను," అని చెప్పి, చలా కుడు అక్కడి నుంచి దివాకరుడు వాళ్ళున్న సత్రానికి వచ్చి, వాళ్ళతో కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు.


అ తరవాత అనుకున్న శుభ ముహూర్తంలో కళావతి, వీరభద్రుల వివాహం ఘనంగా జరిగి పోయింది. కాపురానికి వచ్చిన కళావతి అటు భర్తకు అనుకూలవతిగా ఉంటూ, ఇటు అత్తమామలను కన్నకూతురి కంటే ఎక్కువగా సేవిస్తూ ఇంటా బయటా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నది.


త్వరగా మనవణ్ణి ఎత్తుకోవాలన్న ఆశతో అత్తమామలు కళావతి చేత ఎన్నో నోములు, వ్రతాలు చేయించారు. కాని, పెళ్ళయి మూడేళ్ళయినా కళావతికి పిల్లలు పుట్టలేదు.


దీన్ని అవకాశంగా తీసుకుని రామనాధం అనే బంధువు, తన కూతురు సుభద్రను వీర భద్రుడికి కట్టబెట్టాలన్న దురాశతో, పేరిశాస్త్రిని కలుసుకుని, "నువ్వు శివకాముడి ఇంటికి వెళ్ళి, కళావతికి సంతానయోగం లేదనీ, వీరభద్రుడికి రెండో పెళ్ళి చేయమనీ అతడికి నచ్చజెప్పు. మా సుభద్రను చేసుకుంటే గంపెడు పిల్లలు పుడతారని నమ్మబలుకు. నీ మాట మీద వీరభద్రుడు మా అల్లుడైతే నీకు మంచి బహుమానం ఇస్తాను," అన్నాడు.


డబ్బుకు ఆశపడ్డ పేరిశాస్త్రి రామనాధం చెప్పినట్టే చేశాడు. శివకాముడాయన మాటకు లోబడి కొడుక్కు రెండో పెళ్ళి చేయాలనుకు న్నాడు. వీరభద్రుడు కూడా అందుకు సుముఖత చూపాడు.


విషయం చలాకుడి వరకు వెళ్ళడంతో ఆయన హుటాహుటిగా జగత్పురం చేరుకుని శివకాముణ్ణి చూసి, అందరి జాతకాలూ పరిశీలించి, “కళావతికి సంతాన యోగం ఉన్నది. అయితే, నువ్వూ, నీ భార్యా, నీ కొడుకూ చేసిన కొన్ని పాపాలు శాపాలై ఆమెకు సంతానం కలక్కుండా అడ్డుకుంటున్నాయి. మీరు మీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా రామాల యంలో పూజలు జరిపి, పేదలకు అన్న దానం చేయండి, కళావతికి పండంటి మగ బిడ్డ కలుగుతాడు," అన్నాడు.


దానికి శివకాముడు, “మీరు చెప్పినట్టు చేయడానికి మాకెలాంటి అభ్యంతరమూ లేదు. కాని, మా ఊరి పురోహితుడు పేరిశాస్త్రి, కళావతికి సంతానయోగం లేదన్నాడు. తమరా విషయం ఆయనతో చర్చించి నిజం నిర్ధారించ వలసి ఉన్నది," అన్నాడు.


పేరిశాస్త్రికి కబురు పెట్టి రప్పిస్తే ఆయన కళావతికి సంతానయోగం లేదని నొక్కి చెప్పాడు. అప్పుడు చలాకుడు, “నీ మాటలు నా జ్యోతిష పాండిత్యాన్ని సవాలు చేస్తున్నాయి. కాబట్టి మనం ఈ విషయమై పందెం వేసు కుందాం. ఓడినవారు జ్యోతిషం చెప్పడం మానేసి గుండుగీయించుకుని చెప్పుల మాల వేసుకుని గాడిద మీద ఈ ఊళ్ళో ఊరేగాలి. అందుకు నేను సిద్ధం. నువ్వు సిద్ధమేనా?" అన్నాడు.


చలాకుడి ముఖంలో కనబడ్డ నమ్మకానికి భయపడ్డ పేరిశాస్త్రి, “జ్యోతిషంలో జరిగేవన్నీ ఖచ్చితంగా చెప్పగలమనుకోవడం మూర్ఖత్వం," అంటూ పందెం నుంచి తప్పుకున్నాడు. చలాకుడు మాత్రం ఏ మాత్రం జంకకుండా తన మాట మీద నిలబడ్డాడు. దాంతో శివ కాముడు, భార్య, కొడుకు ఆయన చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుని, పూజలు, అన్న దానాలకు ఏర్పాటు చేశారు.


అన్నీ సక్రమంగా పూర్తవుతూన్న సమ యంలో చలాకుడు వెళ్ళి మర్రి చెట్టు రాక్ష సుణ్ణి కలుసుకుని, “నీకు జన్మవిముక్తి లభించే సమయం వచ్చింది," అని చెప్పి వాడి నుంచి మంత్రించిన సంతానఫలాన్ని పుచ్చుకోగానే రాక్షసుడు పెద్దగా అరిచి నేలకొరిగాడు.


చలాకుడు కళావతికి తన వద్దనున్న సంతాన ఫలాన్నిచ్చి, “ఇప్పుడు నీవిది భుజించు. నీ కడుపు పండి, పండంటి మగబిడ్డ కలుగు తాడు," అని ఆశీర్వదించాడు.


ఆయన చెప్పినట్టే ఏడాదిలోగా కళావతికి మగబిడ్డ కలిగాడు. శివకాముడు చలాకుణ్ణి జగత్పురానికి పిలిచి ఘనంగా సత్కరించాడు.


బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, కళా వతికి వివాహమయినప్పుడే సంతాన ఫలా న్నిచ్చి ఉంటే ఆమెకు కష్టాలు తప్పడంతో పాటు, రాక్షసుడికి మూడేళ్ళు ముందుగానే జన్మవిముక్తి లభించి ఉండేది. చలాకుడు అలా ఎందుకు చేయలేదు? కళావతి సంతాన వతి కాకపోయినప్పుడు, చలాకుడు ఆమెకు నేరుగా సంతానఫలం ఇవ్వకుండా ఆమె అత్తమామలనూ, భర్తనూ తప్పు పట్టడం; పరిహారం చేయించడం; భేషజంతో వారిని తప్పుదారి పట్టించడం కాక మరేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసీ చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది," అన్నాడు.


దానికి విక్రమార్కుడు, “దేనికైనా సమయం రావాలని చలాకుడు మొదటే రాక్షసుడికి చెప్పాడు. తొందర పడివుంటే కార్యభంగం జరిగి ఉండేది. జాతకరీత్యా కళావతి సంతానవతి కావడానికీ, రాక్షసుడు జన్మ విముక్తి పొందడానికీ ఇంకా కనీసం మూడేళ్ళ వ్యవధి ఉన్నదని ఆయన గ్రహించి ఉండాలి. అందు వల్లే, కళావతికి వివాహమై మూడేళ్ళయ్యాక సంతానఫలం ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ సమయంలో భర్త, అత్తమామలు కళావతి సంతానవతి కానందుకు ఆమెను తప్పు పట్టారు. ఆమెకు అన్యాయం తలపెట్టారు. వారికి తగిన బుద్ధి చెప్పాలనే ఆమె సంతానవతి కాకపోవడానికి తప్పు ఆమెది కాదనీ, వారిదనీ నమ్మేలా చేశాడు. ఆమె కథ విన్న ఏ భర్త అయినా, అత్తమామలయినా సంతానవతి కాలేని స్త్రీని తప్పుపట్టడానికి భయపడాలన్న ఆశయంతోనే ఆయన అలా చేశాడు. ఇందులో ఎలాంటి భేషజానికీ తావు లేదు. తగిన సమయంలో సంతానఫలాన్ని రెండు విధా లుగా ఉపయోగించిన చలాకుడు కేవలం జ్యోతిష పండితుడు మాత్రమే కాదు. సమాజ శ్రేయస్సు పట్ల శ్రద్ధాసక్తులుగల మేధావం తుడు అనడంలో సందేహం లేదు," అన్నాడు.


రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)