శకుంతల కథ | మహాభారతం | Story of Shakunthala | Mahabharatham | Ep-03

writer
0

శుక్రుడు తనను ముసలివాడు కమ్మని శపించగానే యయాతి శుక్రుడి కాళ్ళవేళ్ళా పడి, " నన్ను శపించటం నాయ్యం కాదు. శర్మిష్ఠ పుత్రభిక్ష వేడింది. ఆమె కోరిక తీర్చకపోతే నాకు భ్రూణహత్య చేసిన పాపం చుట్టుకుంటుంది. అందుకని ఆమె కోర్కె తీర్చాను. అంతేగాని దేవయానికి అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు. నన్ను మన్నించండి," అన్నాడు.


"నా శాపం వ్యర్థం కావటం ఎన్నటికీ జరగదు. అయితే నువ్వింకా కొంతకాలం యౌవనం అనుభవించగోరినట్టయితే, నీ ముసలితనం ఎవరైనా యువకుడి కిచ్చి, వాడి యౌవనం నువు పుచ్చుకునేటందుకు అవకాశం ఇస్తాను," అన్నాడు శుక్రుడు.


తన ముసలితనం తీసుకుని యౌవనం ఇవ్వమని పరాయివాళ్ళను అడిగేకన్న తన కొడుకులనే అడిగి, అందుకు సమ్మతించే వాడికే తన అనంతరం రాజ్యాభిషేకం జరిగేటట్టు చేస్తే బాగుంటుందని యయాతి ఆలోచించాడు. అందుకు శుక్రుడు సమ్మతించాడు.


యయాతికి వెంటనే ముసలితనం వచ్చే సింది. తల వణికింది. కీళ్ళు పట్టు తప్పాయి. జుట్టు నెరిసింది. ముఖమంతా ముడతలు పడింది. ఉబ్బసరోగం పట్టు కున్నది. ఆ స్థితిలో ఆయన తన పెద్ద కొడుకైన యదువును పిలిచి, అతనికి తన శాపం గురించి చెప్పి, "నాయనా, కొంత కాలం నా ముసలితనం నువు పుచ్చుకుని, నీ యౌవనం నా కొస్తావా? ఆ తరువాత నీ యౌవనం నీకిచ్చి నా ముసలితనం నేను తీసుకుంటాను,” అన్నాడు.


యదువు ఈ ఏర్పాటుకు ఎంత ఎంత మాత్రమూ ఒప్పుకో లేదు. యయాతి మండిపడి, యదువుకూ, అతని సంతతి అయిన యాదవులకు రాజ్యార్హత లేకుండా చేశాడు. యదువు ఒకడేగాదు, యయాతి కొడుకులు మిగిలిన వాళ్ళుకూడా తండ్రి ముసలితనాన్ని స్వీకరించటానికి ఒప్పుకో లేదు. శర్మిష్ఠ కొడుకులలో చిన్నవాడైన పూరు డొక్కడే తండ్రి చేసే ఏర్పాటుకు సమ్మతించాడు. శుక్రుడి దయవల్ల యయాతి తన ముసలితానాన్ని పూరుడి కిచ్చి, పూరుడి యౌవనాన్ని తాను పొంది, విశ్వాచి అనే అప్సరసను వెంట బెట్టుకుని అందమైన స్థలాలలో విహరించుతూ, యథేచ్ఛగా సుఖించాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆయన పూరుడికి తన యౌవ నాన్ని ఇచ్చి, ముసలివాడై, పూరుడికి రాజ్యా భిషేకం చేశాడు.


పూరుడికి పౌష్టి, కౌసల్యా అని ఇద్దరు భార్యలు. ఇద్దరికీ పుత్రులు జన్మించారు. కౌసల్యకు పుట్టిన కొడుకుల సంతతిలో, జనమేజయు డనేవాడి పరంపరలో పదహారో తరం వాడుగా దుష్యంతు డనేవాడు పుట్టాడు. దుష్యంతుడికీ, విశ్వామిత్రుడి కుమార్తె అయిన శకుంతలకూ భరతు డనే అతి చక్కని కొడుకు కలిగాడు.


విశ్వామిత్రుడికి కుమార్తె ఎలా కలిగిందంటే-


ఒకప్పుడు విశ్వామిత్రుడు అతి తీక్ష్యమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి ఇంద్రుడు భయపడి, మేనక అనే అప్సరను పిలిచి, "విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు పూర్తి అయితే దేవతలకు అపాయం కలుగు తుందని నాకు భయంగా ఉన్నది. అందుచేత నువు వెళ్ళి, నీ చాతుర్యమంతా వినియోగించి విశ్వామిత్రుడి తపస్సు భంగం చెయ్యి,” అన్నాడు.


విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు. ఆయన రాజవంశంలో పుట్టి, తన తపశ్శక్తి చేత బ్రాహ్మణుడయాడు. మహా ముక్కోపి. వశిష్టుడంతటివాడికే పుత్రశోకం కలి గించాడు. శాపంచేత చండాలుడైపోయిన త్రిశంకు చేత ఆయన యజ్ఞం చేయిస్తే, ఆయనకు భయపడి ఇంద్రుడే వెళ్ళి హవిర్భాగం పుచ్చుకున్నాడు. ఆ త్రిశంకుణ్ణి విశ్వామిత్రుడు తన శక్తిచేత స్వర్గానికి పంపి, దేవతలు తోసెయ్యగా కిందపడి పోతున్న త్రిశంకుడికి అంతరిక్షంలో ఒక స్వర్గం సృష్టించి అందులో అతన్ని నిలిపాడు. ఇదంతా తెలిసి కూడా మేనక విశ్వామిత్రుడి తపస్సు భంగం చెయ్యటానికి బయలుదేరి విశ్వామిత్రుడున్న ఆశ్రమానికి వచ్చింది.


మేనక విశ్వామిత్రుడికి కనబడి నమ స్కారం చేసి, ఆ ఆశ్రమంలో విహరించ సాగింది. గాలికి చెదిరిపోయే చీరను సరి చేసుకుంటూ తిరుగుతున్న మేనకను చూడగా చూడగా, దాని అందానికి విశ్వా మిత్రుడి మనస్సు చెదిరిపోయింది. ఆయనలో కలిగిన వికారాన్ని గమనించి మేనక తాను వచ్చిన పని నెరవేరుతున్నదనుకుని, ఆయనకు వశురాలయింది. వారి దాంపత్య ఫలితంగా మేనకకు ఒక అందమైన కూతురు పుట్టింది. ఆ పసిగుడ్డును మాలినీనదీ తీరాన నిర్జనారణ్యం మధ్య ఉంచి, తన మానాన తాను దేవలోకానికి మేనక తిరిగి వెళ్ళిపోయింది.


క్రూరమృగాలు స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రాంతంలో ఆ పసిబిడ్డను శకుంతపక్షులు తమ రెక్కలతో కప్పి కాపాడాయి. మధ్యాన్నం వేళ కణ్వమహాముని స్నానం చెయ్యటానికి వచ్చి, శకుంతపక్షుల రెక్కల నీడన సురక్షితంగా ఉన్న ఆ బిడ్డను చూసి, చుట్టుపక్కల ఆ బిడ్డ తాలూకు మనుపు లెవ్వరూ లేకపోవటం చేత, ఆ బిడ్డను దగ్గిర లోనే ఉన్న తన ఆశ్రమానికి తీసుకుపోయి, శకుంతల అనే పేరు పెట్టి, తన కూతురి లాగే పెంచ నారంభించాడు. శకుంతల కూడా నానాటికీ పెరుగుతూ, కణ్వమహా మునినే తన తండ్రిగా భావించి, ఆశ్రమంలో పనులన్నీ చేస్తూ వస్తున్నది.


ఒకనాడు దుష్యంతుడు మాలినీనది తీరానికి సపరివారంగా వేటకు వచ్చి, అక్కడ కణ్వమహాముని ఆశ్రమాన్ని చూశాడు. అది చాలా గొప్ప ఆశ్రమంగా, అతనికి తోచింది. మునికుమారులు వేదపఠనం చేస్తున్నారు. కొందరు అగ్నిలో హవిస్సులు వేల్చుతున్నారు. ఒకచోట అధ్యయనమూ, చర్చా జరుగుతున్నది. సామగానం వినిపిస్తున్నది.


దుష్యంతుడు తన, పరివారాన్ని ఆగమని చెప్పి, తాను ఒక్కడే ఆశ్రమం ప్రవేశించి కణ్వుడి కుటీరానికి వచ్చాడు. కుటీరంలో కణ్వుడు లేడు. లోపల ఎవరని దుష్యం తుడు గట్టిగా పిలిచేసరికి, తాపస స్త్రీ వేషంలో ఉన్న శకుంతల లోపలి నుంచి వచ్చింది. ఆమె దుష్యంతుణ్ణి చూస్తూనే రాజని గ్రహించి, అతనికి అర్ఘ్యపాద్యాలిచ్చి, అతిథి సత్కారాలు చేసి, "మీకేం కావాలి?" అని అడిగింది.


ఎంతో అందంగానూ, సుకుమారంగానూ ఉన్న శకుంతలను చూసి దుష్యంతుడు ఆమె అతిథిమర్యాదకు చాలా ఆశ్చర్య పడుతూ, "అమ్మాయీ, నే నిక్కడి అర ణ్యాలలో వేటాడ వచ్చి, కణ్వమహాముని దర్శనం చేసుకుని పోదా మనుకున్నాను. ఆయన కుటీరంలో లేరా? ఎటువెళ్ళారు?" అడిగాడు.


"ఆయన నా తండ్రి, ఫలాలూ, సమిధలూ తీసుకు రావటానికి వెళ్ళారు. ఒక్క క్షణం ఆగితే వచ్చేస్తారు,” అన్నది శకుంతల.


శకుంతల మాట్లాడే సొంపు చూస్తున్న కొద్దీ దుష్యంతుడికి ఆమె మీద మోహం జాస్తి కాసాగింది. స్తూనే ఉన్నది. ఆమె కన్య అని తెలు అతను శకుంతలతో, "కణ్వమహాముని బ్రహ్మచర్య వ్రతం పూనినవాడని విన్నాను. ఆయన నీకు తండ్రి ఎలా అయారు? అసలు నువ్వెపరి బిడ్డవు? ఈ ఆశ్రమంలోకి ఎలా వచ్చావు ? నిన్ను చూసిన మాత్రం చేతనే నా మనసు నీ కేసి ఆకర్షించబడుతున్నది. నిజం సంగతి చెప్పు," అన్నాడు.


తన జన్మవృత్తాంతాన్ని శకుంతల అదివరకే, కణ్వమహాముని మరొక మునికి చెప్పుతుండగా విని ఉన్నది కావటంచేత, దుష్యంతుడికి చెప్పేసింది.


"అయితే, నువు రాజకన్యకవే నన్న మాట. ఇంత చక్కని దానివి, ఇంత సుగుణవతివి, ఇలా నారబట్టలు కట్టి, అడవి పళ్లు తింటూ ఈ ఆశ్రమ కుటీరంలో నివసించటం నా కేమీ నచ్చలేదు. నాకు భార్యవై నా రాజభవనంలో సమస్త సుఖాలూ తను భవించు. నా రాజ్యానికి నువే రాణివిగా ఉండు,” అన్నాడు దుష్యంతుడు.


"అడవికి వెళ్ళిన మా నాన్నగారు రాగానే ఆయన అనుమతి పొంది, మీరు నన్ను పెళ్ళాడండి," అని శకుంతల అన్నది.


తనకు భార్య కావాలని ఆమెకు కోరిక ఉన్నట్టు దుష్యంతుడికి స్పష్టమయింది. అతను శకుంతలతో, "చూడు, నా మనస్సు నీ కోసం పరితపిస్తున్నది. గాంధర్వ వివాహం క్షత్రియులకు చెల్లుతుంది. గాంధర్వ వివాహానికి మంత్ర తంత్రాలు అవసరం లేదు. వధూవరుల ఇష్టమే తప్ప పైవాళ్ళ అనుమతితో అవసరం లేదు. అది రహస్య వివాహం,” అన్నాడు,


తనకు అతనివల్ల కొడుకు పుట్టే పక్షంలో ఆ కొడుకును దుష్యంతుడు యువరాజును చేసే షరతు మీద శకుంతల అతనితో గాంధర్వ వివాహానికి ఒప్పుకున్నది. వారిద్దరూ అప్పుడే భార్యాభర్తలయారు. దుష్యంతుడు శకుంతలకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతూ, "నేను మా నగరానికి వెళ్ళి, నిన్ను తీసుకు రావటానికి మనుషులను పంపుతాను,” అని శకుంతలకు నచ్చ చెప్పాడు. ఈ సంగతి కణ్వమహామునికి తెలిస్తే ఆయన కోపించి ఏం చేస్తాడో నని దుష్యంతుడికి మనసులో భయంగానే ఉన్నది. శకుంతలకు కూడా అలాటి భయమే ఉన్నది.


తరవాత కణ్వమహాముని కందమూల ఫలాలు తెచ్చి పడేసి, కాళ్ళూ, చేతులూ కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. శకుంతల సిగ్గు పడుతూ, భయపడుతూ వచ్చి దగ్గిర నిలబడింది. ఆయన దివ్యదృష్టితో జరిగినది గ్రహించి, "అమ్మా, నువు తగిన భర్తనే పెళ్ళాడావు. ఈ గాంధర్వ వివాహం ఫలితంగా నీకు మహా చక్రవర్తి కాదగిన కొడుకు పుడతాడు. నీకేమన్నా కోరిక ఉంటే చెప్పు,” అన్నాడు.


"నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయు రైశ్వర్య బలాలు కలవాడేగాక వంశకర్తగా కూడా ఉండాలని నా కోరిక," అన్నది శకుంతల, అలాగే అవుతుందన్నాడు. కణ్వుడు. శకుంతల మనస్సు ఊరట చెందింది.


కాలక్రమాన శకుంతల ఒక కొడుకును కన్నది. కణ్వమహాముని ఆ కుర్రవాడికి శాస్త్రోక్తంగానూ, క్షత్రియోచితంగానూ జాత కర్మ మొదలైనవి చేశాడు. ఆ కుర్రవాడు శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతూ, ఆరేళ్ళు వచ్చేసరికే సింహాలనూ, పులులనూ, ఏనుగు లనూ ఎక్కి తిరగటమూ, వాటిని ఆశ్రమంలో ఉండే చెట్లకు కట్టెయ్యటమూ మొదలైన పనులు చేసి, ఆశ్రమంలో ఉండే మును లను హడలగొట్టసాగాడు. వాణ్ణి ఆశ్రమంలో అందరూ సర్వదమను డని పిలిచేవారు.


ఒకనాడు కణ్వమహాముని శకుంతలతో, 'అమ్మా, నీ కొడుకు ఇప్పుడే యువరాజు కాదగినట్టుగా ఉన్నాడు. వాడు వాడి తండ్రి దగ్గర ఉండటం మంచిది. నువ్వయినా, భర్త ఉండగా ఎంత కాలమని పుట్టింట ఉంటావు? నిన్ను నీ భర్త వద్దకు పంపు తాను," అన్నాడు.


కణ్వుడి శిష్యులు కొందరు శకుంతలనూ ఆమె కొడుకునూ వెంట బెట్టుకుని దుష్యంతుడి నగరానికి వెళ్ళి, ఆమె వద్ద అనుమతిపొంది ఆశ్రమానికి తిరిగి వెళ్ళారు. 


ద్వారపాలకుడు శకుంతలనూ, ఆమె కొడుకునూ దుష్యంతుడి వద్దకు వెళ్ళనిచ్చాడు. కాని శకుంతలను చూసి దుష్యంతుడు గుర్తుపట్టినట్టు కనిపించి లేదు. శకుంతలకు గుండెలో గుబులు పుట్టుకొచ్చింది. ఆమె అతనితో, "రాజా, నువ్వొకసారి వేటాడుతూ కణ్వాశ్రమానికి వచ్చిన మాట మరిచావా ? వీడు నీ కొడుకు. వీణ్ణి యువరాజు చేస్తానని మాట ఇచ్చావు. నన్ను వశపరచుకోవటానికి ఇచ్చిన మాటను మీర వద్దు,” అన్నది.


దుష్యంతుడు అంతా ఎరిగి ఉండి కూడా, ఎరగనట్టు నటిస్తూ, "దుర్మార్గు రాలా, అసలు నువ్వెవరు? నిన్ను నేనెరుగను. అసందర్భాలు మాట్లాడక, వచ్చిన దారే వెళ్ళు,” అన్నాడు.


శకుంతలకు దుఃఖంతోబాటు కోపం కూడా వచ్చింది. ఆమె దుష్యంతుడితో, "రాజా, నీకేమీ తెలియదంటావా? ఇతరు లెరగరుగదా అని అబద్ధ మాడతావా? జరిగినదానికి నువే సాక్షివి. నీ అంతరాత్మ సాక్షి. నిజాన్ని కప్పిపుచ్చటం మహా పాతకం. ఏ సద్బుద్ధితో ఆనాడు నన్ను నీదాన్ని చేసుకున్నావో, ఆ సద్బుద్ధితోనే ఇవాళ నన్ను ఏలుకో. పశుపక్ష్యాదులు కూడా తమ సంతానాన్ని ప్రేమిస్తాయి. వీడు నీ కొడుకు, కన్న కొడుకును కాదనకు,” అన్నది.


అప్పటికి దుష్యంతుడి వైఖరిలో మార్పులేదు.


ఆ సమయంలో ఆకాశం నుండి అశరీర వాణి ఇలా అన్నది: "రాజా, ఈ పిల్లవాడు నీకు శకుంతల యందు పుట్టినవాడు. ఈ కొడుకును ప్రేమతో భరించు. వాడు భరతుడని పేరు పొందుతాడు.”


దుష్యంతుడి భయం తీరిపోయింది. శకుంతల తన భార్యేననీ, ఆమె కుమారుడు తన కుమారుడేననీ లోకానికి వెల్లడ యింది. అందుచేత అతను ధైర్యంగా వారిని చేరదీశాడు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)