దుష్టులతో స్నేహం | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

పూర్వం చంద్రగిరి అడవులలో సంజీవి అనే సింహం ఉండేది. ఆ సింహం పేరుకి క్రూర మృగం అయినా చాలా మంచి గుణాలు కలిగి మంచి పేరు కలిగి ఉండేది. ఒక రకంగా ఆ అడవికి,ఆ సింహం రాజుగానే భావించవచ్చు. ఆ సింహానికి ఒక కాకి, ఒక నక్క ఒక తొడేలు మంచి స్నేహితులుగా ఉండేవి.


రోజూ సాయంకాలం సింహం తన స్నేహితులతో కలిసి అడవిలో షికారు చేస్తూ, బాగా ఆకలైనప్పుడు మాత్రమే ఏదైనా జంతువును వేటాడేది. అలా సింహం చేత చంపబడ్డ జీవాన్ని కాకి, నక్క, తొడేలులతో కలిసి సింహం భుజించేది.


ఒకరోజు సాయంకాలం సింహం దాని మిత్రులు అడవిలో సంచరిస్తుండగా, వాళ్ళకి ఒంటరిగా తిరుగుతున్న ఒక ఒంటె కన్పించింది. అది చూసిన సింహం, నక్కను పిల్చి ఇలా అన్నది. ఓయీ నక్క మిత్రమా! 


అక్కడ ఓ ఒంటె ఒంటరిగా తిరుగుచున్నది. అది బహుశా ఎవరిదో వ్యాపారికి చెందిన ఒంటె కావచ్చు. దొవ తప్పి ఇక్కడ తిరుగుతున్నట్టుగా ఉన్నది. నీవు వెళ్ళి దాన్ని నా వద్దకు పిల్చుకు రా! దాంతో ఆ నక్క ఒంటె దగ్గరికి వెళ్ళి సింహం రాజుగారు రమ్మంటున్నారని చెప్పింది.


అప్పుడు ఒంటె సింహం దగ్గరికి వచ్చి నమస్కరించి నిల్చున్నది. అప్పుడు సింహం ఒంటెను కూడా తన మిత్రబృందంలో చేరమని ఆహ్వానించింది.


ఆ అడవిలో దిక్కు, దివానం లేకుండా తిరుగుతున్న తనకి సింహం ఆశ్రయం దొరకటంతో ఒంటె సంతోషంగా సింహం రాజుగారి స్నేహ బృందంలో చేరింది. ఆ తర్వాత సింహం, నక్క, తొడేలు, కాకి, ఒంటె రోజు హాయిగా వన విహారం చేస్తూ, కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి.


ఒకసారి ఆ అడవికి ఒక యువరాజు వేటకి వచ్చాడు. అతడు అనేక జంతువుల్ని వేటాడి, చివరగా సింహం పై ఒక బాణం వేసాడు. ఆ బాణం సింహం నడుం భాగంలో దిగింది. అయిన యువరాజు వేయబోతున్న రెండో బాణానికి అందకుండా పారిపోయి, తన గుహను చేరుకుంది.


ఆ తర్వాత సింహం కోతి వైద్యుడిని పిలిపించింది. కోతి వైద్యుడు అడవిలో ఏ జంతువుకి ఏ రోగం వచ్చినా మంచి వైద్యం అందిస్తూ ఉంటుంది. సరే ఆ కోతి వైద్యుడు సింహం నడుములో దిగబడ్డ బాణాన్ని లాగి, ఏవో పశర్లు పూసి కట్టు కట్టి వెళ్ళిపోయింది.


సింహం స్నేహితులు దిగాలుగా సింహం ప్రక్కనే నిల్చున్నాయి. అలా కొద్ది రోజులు గడిచాయి. సింహానికి గాయం తగ్గింది. కానీ శరీరంలో పూర్వపు శక్తి నశించింది. దాంతో జంతువుల్ని వేటాడే శక్తి కూడా పోయింది. పైగా ఎక్కడలేని నీరసంతో గుహలో నుంచి బయటికి నడిచే శక్తి కూడా లేకుండా పోయింది.


ఎప్పుడైతే సింహం వేటాడటం మానేసిందో కాకి, నక్క, తొడేళ్ళకి ఆహారం లేకుండా పోయింది. దాంతో సింహంతో సహా అవి మూడు ఆకలికి డొక్కలు మాడి బక్కచిక్కాయి. కానీ వాళ్ళ మిత్రుడైన ఒంటె శాఖాహారి అంటే పచ్చి గడ్డి వగైరాలు తింటుంది.


కనుక దానికేమీ ఆహార కొరత రాలేదు. రోజు హాయిగా ఆ అడవిలో గడ్డీ, గాదం కడుపునిండా తిని తెగబలిసిపోసాగింది. ఇలా ఒక వారం గడిచింది.


ఒకరోజు సింహం తన మిత్రుల్ని పిలిచి ఇలా అన్నది. నాకు వేటాడే శక్తి నశించింది.


ప్రస్తుతం కనీసం ఈ గుహను విడిచి బయటికి వెళ్ళే ఓపిక కూడా లేదు. మీరంతా అడవిలోకి వెళ్ళి ఏదైనా జీవాన్ని వేటాడి తీసుకురండి. అందరూ కలిసి భోంచేద్దాం.


సింహం మాటలు విని నక్క, తొడేలు, కాకి, ఒంటె అడవిలోకి వెళ్ళి ఏదైనా జీవి దొరకుతుందేమో అని వెతక సాగాయి. వాటి దురదృష్టం వలన ఏ జంతువు వాటికి దొరకలేదు.


ఇంతలో నక్క బుర్రలో ఓ ఆలోచన వచ్చింది. ఆ దుష్ట నక్క తన స్నేహితులు అయిన కాకి, తొడళ్ళను దగ్గరగా పిలిచి, ఇలా చెప్పింది. ఈ ఒంటె గడ్డీ, ఆకులు తిని తెగ బలిసింది.


దీన్ని కనుక సింహంచేత చంపించం అంటే మనకు నెల రోజులు హాయిగా విందు చేసుకోవచ్చు.


నక్క మాటలు విని తొడేలు, కాకి సంబర పడ్డాయి. దూరంగా నిల్చుని గడ్డి తింటున్న ఒంటెకి తనపై జరుతున్న కుట్ర తెలీక అమాయకంగా చూస్తున్నది. సరే, సరే అంటే అనుకుని నక్క ఒక్కటే సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది.


"ఓ సింహరాజా! ప్రస్తుతం మీరు తిండిలేక ఆకలితో బాధ పడుతున్నారని తెలిసి ఈ అడవిలో అన్ని జంతువులు బాధపడుతున్నాయి. మీ కోసం అవన్నీ ప్రాణత్యాగం చేసి, మీకు ఆహారం అవ్వాలని భావిస్తున్నాయి. మీరు కనుక అంగీకరిస్తే, ముందుగా మన ఒంటె మిత్రుడు మీకు ఆహారం అవుతాడట.”


నక్క మాటలు విని ఆగ్రహించిన సింహం ఓరి కుటిలుడా! ఎంత ఆకలి వేస్తే మాత్రం మనతో ఇన్నాళ్ళుగా ఉన్న ఆ అమాయకపు ఒంటెను ఎలా చంపగలననుకున్నావు.


ఈ ఆకలితో బాధనైనా భరిస్తాను కానీ, నమ్మిన మిత్రుడిని చంపను అన్నది. అప్పుడు నక్క గజ, గజలాడుతూ అయ్యా సింహరాజా! మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. రాజైన మీరే ఆకలితో మరణిస్తే, ఈ అడవిలోని మిగిలిన జంతువులకి ఎవరు రక్షణ కల్పిస్తారు. అని సింహాన్ని మంచి మాటల్తో ఒంటెను చంపటానికి అంగీకరింపచేసింది.


ఆ తర్వాత ఒంటె దగ్గరికి వెళ్ళి, ఓయి ఒంటె మిత్రమా! మన రాజుగారు ఆకలితో చావటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన స్నేహితులం అయిన మనం మన ప్రాణాలు ఇచ్చి అయినా సరే ఆయన్ని కాపాడుకోవాలి అని నీతి సూక్తులు వల్లించింది.


నక్క చెప్తున్న మాటల్ని విన్న ఒంటె రాజుగారి కోసం చావటానికి సిద్ధపడింది. ఆ తర్వాత ఒంటె, కాకి, నక్క, తోడేలు కలిసి, రాజుగారి దగ్గరికి వెళ్ళి తమని చంపి ఆకలి తీర్చుకోమని అడిగాయి. సింహం ఏం చెయ్యాలో అర్థంకాక అలా చూస్తూ ఉండిపోయింది.


అప్పుడు ఒంటె ముందుకి వచ్చి, ఓ సింహ మిత్రమా ఈ కాకి నక్క, తొడేలు చాలా చిన్న శరీరాన్ని కలిగి ఉన్నాయి. నాది భారీ శరీరం. మీరు నన్ను చంపితే వారం, పది రోజులు మీకు ఆహారం లభిస్తుంది. మీకు ఆహారం అయిన నాకు పుణ్యం వస్తుంది. కనుక ఏమీ ఆలోచించకుండా నన్ను సంహరించండి అన్నది.


ఇక సింహం ఆకలికి ఆగలేక ఒంటె పైకి లంఘించి, తన పంజాతో ఒంటెని ఒక్క దెబ్బతో చంపివేసింది. ఆ తర్వాత నక్క, తొడేలు, కాకి సింహంతో కలిసి ఆ ఒంటె మాంసాన్ని తృప్తిగా భుజించాయి. నక్క పన్నిన కుట్రకు బుద్ధిలేని ఒంటె బలి అయిపోయింది. 


నీతి : దుష్టులతో స్నేహం వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)