పూర్వం పాడేరు అడవులలో సంజీవి అనే బుల్, బుల్ పిట్ట ఒక పనస చెట్టు కొమ్మలపై నివాసం ఉండేది. ఆ పిట్ట నలుగురికి మంచి సలహాలు ఇస్తూ మంచి పేరు పొందింది.
ఒక చలికాలం చలి తీవ్రంగా ఉన్నది. మామూలు ప్రాంతాలలోనే చలికాలం చలి అధికం, అలాంటిది కొండలపైన ఉన్న పాడేరు అడవులలో చలి ఎలా ఉంటుందో వర్ణించటానికి వీలుకాదు.
అలాంటి సమయంలో నాల్గు కోతులు, ఆ అడవిలో చలికి తట్టుకోలేక గజ, గజ వణుకుతూ బుల్, బుల్ పిట్ట నివాసం ఉన్న పనస చెట్టు క్రింద ముడుచుకొని కూర్చున్నాయి. అలా చలికి వణికిపోతున్న కోతుల్లో ఒక పిల్ల కోతి ఇప్పుడు చలి మంట వేసుకుంటే బలే హాయిగా ఉంటుంది అన్నది.
పిల్లకోతి మాటలు విన్న ఒక ముసలి కోతి గబ గబా నాల్గు చితుకులు పొగేసింది. ఇక చలి మంట కోసం నిప్పు కావాలి. నిర్మానుష్యమైన ఆ అడవిలో నిప్పు ఎవరిస్తారు కోతులు విచారించాయి. ఇంతలో వాటికి గాలిలో ఎగురుతూ తళ, తళమని మెరుస్తున్న మిణుగురు పురుగులు కనిపించాయి. వాటిని చూసి కోతులు నిప్పుగా భావించి రెండు మిణుగురు పురుగుల్ని పట్టి చితుకుల మధ్య ఉంచి నిప్పు రాజేయటానికి నోటితో ఊదసాగాయి.
నిజానికి మిణుగురు పురుగులు అలా మెరుస్తాయి కానీ వాటిలో ఎలాంటి నిప్పు మంట ఉండదు. కానీ ఈ విషయం అర్థం కానీ ఆ మూర్ఖపు మర్కటాలు చితుకుల్ని పడీ, పడీ ఊదసాగాయి. కానీ వాటి ఊపిరి పోయేదాకా వూదినా ఆ కట్టిలు మండలేదు. కోతులు చేస్తున్న ఈ బుద్ధిహీన చర్యలకి చెట్టు పైనున్న బుల్, బుల్ పిట్ట ఇలా అన్నది.
“ఓరీ మూర్ఖులారా! ఆ పురుగులు కట్టెల మధ్య ఉంచి, వూదితే నిప్పు రాజుకోదు. నా మాట వినండి-
మీ వృథా చర్యను మానండి. సరిగ్గా గుప్పెడంత కూడా లేని ఈ పాడు పక్షి, మాకు సలహా చెప్పేపాటిదా? పైగా మమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళు అనినిందిస్తుందా... దీనికెంత ధైర్యం అని కోతులు వాటిలో అవి అనుకున్నాయి. కానీ ఆ పిట్ట అవేమీ పట్టించుకోకుండా ఓ బుద్ధిహీన మర్కాటలారా! నేను ఎంతగా చెప్పినా వినరేమిటి -
ఆ పురుగులని ఎంత ఊదినా నిప్పు రాజుకోదు అన్నది. అసలే భరించలేని చలి ఆపై ఎంత ఊదినా ఆ పురుగుల వల్ల నిప్పురాచుకోవటం లేదు. పైగా పైనుండి పిట్ట సలహాలు, ఇక సహనం నశించింది ఆ మూర్ఖపు కోతులకు. అంతే ఓ వృద్ధ వానరం క్షణాల్లో ఆ పనస చెట్టు ఎక్కి అదే పనిగా హితబోధ చేస్తున్న బుల్, బుల్ పిట్టని గుప్పెడుతో పట్టుకుని పై నుండి క్రిందికి విసరి కొట్టింది బలంగా.
అంతే అంత ఎత్తు నుండి విసురుగా నేలపై పడ్డ ఆ బుల్లి పిట్ట చచ్చి ఊరుకుంది. ఆపై చాలా సేపు మంట రాజేయటానికి విశ్వ ప్రయత్నాలు చేసిన ఆ మక్కటాలు విసుగు పుట్టి, అక్కడి నుండి లేచి, వేరే చోటుకి వెళ్ళిపోయాయి.
నీతి : మూర్ఖులకి సలహాలు ఇచ్చిన వాళ్ళకి ప్రమాదం తప్పదు.