కుక్క కాటుకి చెప్పు దెబ్బ | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

పూర్వం ఓరుగల్లు అనే పట్టణంలో నారాయణ, శర్మ అనే ఇద్దరు ఆప్త మిత్రులు ఉండేవారు. వాళ్ళ స్నేహాన్ని చూసి ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఆశ్చర్యపడేవాళ్ళు. ఇలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒకసారి నారాయణ తన కూతురికి పెళ్ళి చేయాలని అనుకున్నాడు. కానీ అతని దగ్గర తగినంత డబ్బులేక ఆగిపోయాడు.


ఆ విషయం తెల్సిన శర్మ మిత్రుడి ఇంటికి వచ్చి ఒరేయ్ మూర్ఖుడా లక్షాధికారి అయిన నన్ను మిత్రుడిగా కలిగి ఉన్న నీవు కొద్దిపాటి డబ్బులేక కూతురు పెళ్ళి ఆపుతావా, నీకెంత కావాలో చెప్పు. ఇస్తా అన్నాడు.


శర్మ మాటలు విని నారాయణ చాలా ఆనందించి మిత్రమా! నీ గుణం నాకు తెలుసు. కానీ ఎంత మిత్రుడివి అయినా డబ్బు అడిగి మన స్నేహాన్ని అగౌరవపరచటం ఇష్టం లేక నిన్ను అడగలేదు. నిజానికి నీ కన్నా నాకు ఎవరు ఆప్తులు అన్నాడు. సరే శర్మ బలవంతం మీద ఒక రెండు వేల రూపాయలు కూతురి పెళ్ళికోసం అప్పుగా తీసుకొని కూతురి పెళ్ళి ఘనంగా చేసి, తన బాధ్యత దింపుకున్నాడు నారాయణ.


కొద్ది నెలలు గడిచాయి. ఒక రోజు నారాయణ దగ్గరికి వచ్చాడు శర్మ. మిత్రుడిని ఆదరంగా లోనికి పిలిచాడు నారాయణ. కాస్త సమయం గడిచాక శర్మ, నారాయణతో ఇలా అన్నాడు. ఇదిగో నారాయణా! నీవు నాకివ్వాల్సిన డబ్బు వెంటనే ఇచ్చేయ్యాలి.


శర్మ మాటలకి కొంత ఆశ్చర్యపడ్డ నారాయణ త్వరలో ఇచ్చేస్తాను అన్నాడు. అదేం వీలుకాదు నాకు నా డబ్బు అయినా తిరిగి ఇవ్వు. లేదా నీ ఇల్లు అయినా నాకు రాసి ఇవ్వు అన్నాడు. కొంచెం అక్కసుగా. శర్మ మాటలతో నారాయణకి, శర్మ ఎంత కుత్సితుడో అర్థమయి. నీ డబ్బు ఒక వారంలో ఇస్తా అన్నాడు కొంచెం రోషంగా. అప్పుడు శర్మ అదేం కుదరదు. మర్యాదగా ఇప్పుడే ఇవ్వు. లేదా రాజుగారి దగ్గరికి వచ్చి నీ ఇంటి మీద నా దగ్గర అప్పు తీసుకున్నానని అంటే తాకట్టు పెట్టానని చెప్పు అన్నాడు. అక్కసుగా.


దానితో నారాయణ ఇంత చిన్న విషయానికి రాజుగారి దగ్గరికి ఎందుకు అన్నాడు. కానీ శర్మ, నారాయణను రాజుగారి దగ్గరికి వచ్చి తీరాలని పట్టుపట్టాడు. దాంతో నారాయణకు అర్థమయింది. ఈ శర్మ దురాశతో తన ఇల్లు ఏదో విధంగా కాజేయాలని చూస్తున్నాడని. సరే అంత సన్నిహిత మిత్రుడే ద్రోహిగా మారి తనని వంచించాలని చూస్తున్నప్పుడు ఇంకా మంచిగా ఉండి ప్రయోజనం ఏముంది అని భావించి శర్మతో ఇలా అన్నాడు.


శర్మా! నీకు తెలుసు నేను చాలా పేదవాడినని, రాజాస్థానానికి వెళ్ళాలంటే మంచి మంచి దుస్తులు, చెప్పులు తలపాగా, భుజంపై పట్టు కండువా, వెళ్ళటానికి గుర్రపు బండీ కావాలి అవి నా దగ్గర లేవు. అప్పుడు శర్మ, నారాయణ నీవు అడిగినవి అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు బయలుదేరు అన్నాడు ఆత్రంగా.


శర్మ ఇచ్చినవి ధరించి గుర్రపు బండీ ఎక్కి, రాజుగారి దర్బారుకి వెళ్ళాడు నారాయణ. అతని తర్వాత శర్మ కూడా రాజదర్బారీకి చేరాడు. రాజదర్బారులో ఒక మంత్రి, ధన సంబంధ వివరాలు పరిష్కరిస్తూ ఉంటాడు. ఆ మంత్రిని ముందుగా నారాయణ కలిసి, మంత్రి వర్యా! నా మిత్రుడు శర్మకి ఈ మధ్య చిత్తచాంచల్యం వచ్చి, నావన్నీ తనవే అనీ, అవన్నీ తనకి తిరిగి ఇచ్చేయాలని పట్టుబడుతున్నాడు అన్నాడు.


నారాయణ చెప్పింది విన్న న్యాయశాఖ మంత్రి శర్మను తన వద్దకు తీసుకురమ్మని భటుడ్ని పంపాడు. క్షణాల్లో శర్మ న్యాయమంత్రి దగ్గర హాజరు పరచబడ్డాడు. అప్పుడు నారాయణ, శర్మతో ఇలా అన్నాడు. శర్మా! నేను ధరించిన ఈ పట్టు బట్టలు, పట్టు కండువా ఎవరివి?


దానికి శర్మ అవును, నీవు ధరించిన బట్టలు నావే అన్నాడు. తర్వాత నారాయణ నేను ధరించిన తల పాగా ఎవరిది అన్నాడు. వెంటనే శర్మ నీవు ధరించిన పాద రక్షలు తలపాగా నావే అన్నాడు.


అప్పుడు నారాయణ చూసారా మంత్రిగారు, ఈ శర్మ ధోరణి నేను కట్టుకున్న దుస్తులు కూడా తనవే అంటున్నాడు. ఇంకాసేపు ఆగితే నేను వచ్చిన నా గుర్రపు బండీ కూడా తనదే అని అనగలడు అన్నాడు. భయం నటిస్తూ... వెంటనే శర్మ కోపంగా ఒరేయ్ నారాయణ నీకెమన్నా పిచ్చా, నా బట్టలు, చెప్పులు, తలపాగా తీసుకొని ఇప్పుడు నావి కాదంటావా పైగా నా గుర్రపు బండీ, నీది అని చెపుతున్నావా అని అరిచాడు.


దాంతో న్యాయమంత్రి ఇలా అన్నాడు. ఈ శర్మకు మతి చలించింది. కనుక ఇతను చెప్పే మాటలు నేను నమ్మను అన్నాడు. అక్కడున్న జనాలు కూడా శర్మను చూసి హేళనగా నవ్వారు. దాంతో శర్మకు పరువు పోయి, ఇంటికి వెళ్ళిపోయాడు. నారాయణ, మిత్రుడి ద్రోహానికి తగిన ప్రతీకారం చేసాడు.


నీతి : మేధస్సు ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)