పూర్వం నీలగిరి అడవుల్లో గజేంద్ర అనే ఒక ఏనుగు రాజు తన మందతో కలిసి నివశిస్తూ ఉండేది. ఒకసారి అనావృష్టి పరిస్థితులు ఏర్పడి ఆ అడవిలోని పచ్చటి చెట్లలన్నీ ఎండిపోయాయి. చిన్న చిన్న నీటి గుంటల సైతం ఎండి పోయాయి.
దాంతో గజేంద్రుడికి అతని ఏనుగులకి ఆహారం, నీరు దొరకటం గగనం అయిపోయింది. దాంతో అన్ని ఏనుగులు కలిసి తమ రాజైన గజేంద్రుడి దగ్గరికి గుంపుగా వెళ్ళి ప్రస్తుతం అడవిలో ఏర్పడ్డ కరువు వాతావరణం గురించి ఈ విధంగా వివరించాయి.
ఓ రాజా! గత రెండు సంవత్సరాలుగా మన అడవిలో ఒక్క చుక్క వర్షం కూడా పడటం లేదు. ఎండాకాలంలో వర్షం అన్న మాట లేకున్నా సీతాకాలం, వర్షాకాలాల్లో సైతం వాన రాక పోవటం వల్ల ఈ అడవిలో పచ్చదనం అనేది కనుచూపు మేరలో కనిపించటంలేదు. అందువల్ల మన ఏనుగుల జాతి నీరు, ఆహారం లేకుండా అలమటించి పోతున్నాం. దానికి గజేంద్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు.
నా ప్రియమైన సోదరులారా! ప్రస్తుతం మన అడవిలో ఏర్పడ్డ అనావృష్టి పరిస్థిలులు తద్వారా ఏర్పడ్డ కరువు పరిస్థితులు నాకు తెలుసు. అయితే ఈ పరిస్థితులలో మనం ఏమి చెయ్యలో మన మంత్రిగారిని అడిగి తెసుకుందాం. అప్పుడు ఏనుగుల మంత్రి గణేశ్ లేచి నుంచొని రాజుగారికి నమస్కరించి ఇలా అన్నాడు.
ఓ ప్రభూ! నేడు మన ఏనుగుల జాతి అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
ఇలాంటి పరిస్థితులలో మనం నీరు, ఆహారం దొరికే ఇంకొక ప్రదేశానికి వెళ్ళటం మినహా గత్యంతరం లేదు. మంత్రి గణేశ్ మాటలకు అక్కడ సమావేశమైన ఏనుగులన్ని తమ అంగీకారాన్ని తెలిపాయి. అప్పుడు ఏనుగుల రాజు గజేంద్ర మంత్రి గణేన్ని ఇలా అడిగాడు.
మంత్రిగారూ ఎప్పుడు నీటి కరువు లేని మంచి ఆహారం లభించే ప్రదేశం ఎక్కడ ఉన్నది, ఎంత దూరంలో ఉన్నది అన్న విషయాలు మీకు తెలిస్తే చెప్పండి. అప్పుడు మంత్రి గణేశ్ ఇలా అన్నాడు. ఇక్కడికి 200 మైళ్ళు దూరంలో ఉన్న నల్లమల అడవుల్లోని చంద్రసాగరం అనే చిన్న వాగు ఉన్నది. ఆ వాగు సంవత్సరం పొడుగునా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాగు ఒడ్డున అనేక రకాలైన ఫల వృక్షాలు ఉన్నాయి.
కనుక మనం అక్కడికి వలస వెళ్ళి నట్లైతే మన కరువు సమస్య తీరిపోతుంది. గణేశ్ సలహాకు రాజు గజేంద్రుడుతో సహా అక్కడ సమావేశమైన అన్ని ఏనుగులు హర్షధ్వానాలు చేశాయి.
ఆ తర్వాత అన్ని ఏనుగులు అంటే పిల్ల ఏనుగులతో సహా ముసలి ఏనుగుల వరకూ రాజు గజేంద్రుని వెనుకగా బయలుదేరిన వేలాది ఏనుగుల గుంపు కొన్ని వారాల పాటు ప్రయాణం చేసి నల్లమల అడవులలోని చంద్రసాగర్ని చేరుకున్నాయి.
చంద్రసాగర్ని చూడగానే ఏనుగులకి ఒక్కసారిగా ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించింది.
కారణం చాలా వెడల్పు కలిగి మైళ్ళు కొద్ది పొడవునా ప్రవహిస్తున్న ఆ మంచి నీటి వాగు ఆ వాగుకి రెండు వైపులా ఉన్న వెలగపండ్ల చెట్లు, మామిడి పండ్ల చెట్లు, నేరేడు పండ్ల చెట్లు చూసి ఏనుగులు విపరీతమైన ఆనందాన్ని అనుభవించాయి.
దాదాపుగా రెండు మూడేళ్ళుగా సరైన తిండి తిప్పలకు నోచుకోకుండా ఉన్న తమకు ఈ చంద్రసాగరం ఒక వరంలా కనిపించింది. దాంతో ఆ ఏనుగులన్నీ ఆ నాటి నుండి ఆ వాగు చుట్టు ప్రక్కల ఉన్న చెట్ల మధ్య నివాసం ఏర్పరచుకొని ఆ వాగులో స్నానాలు చెయ్యటం నీళ్ళతో ఆడుకోవటం లాంటి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేవి. ఇది ఇలా ఉండగా ఆ వాగు ఒడ్డునే ఉన్న కలుగుల్లో అనేక కుందేళ్ళు నివసిస్తూ ఉండేవి.
ఏనుగులు ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వలస వచ్చే వరకు ఆ కుందేళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడైతే ఏనుగులు ఆ ప్రాంతంలో విచ్చల విడిగా తిరగటం మొదలు పెట్టాయో ఆ వాగు ఒడ్డున నివసించే కుందేళ్ళకు ప్రాణాపాయం ఏర్పడింది.
అది ఎలాగంటే వాగు గట్టు పొడవునా ఉన్న బొరియల్లో నివాసం ఉంటున్న కుందేళ్ళు నీళ్ళు తాగటానికి గుంపులు గుంపులుగా వచ్చే వందలాది ఏనుగుల కాళ్ళు క్రింద పడి చనిపోసాగాయి. దాంతో కుందేళ్ళు సంఖ్య సగానికి సగం తగ్గి పోయింది.
ఒకరోజున ఏనుగులు అక్కడికి రాని సమయంలో కుందేళ్ళన్ని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశానికి కుందేళ్ళు రాణి శశికళ అధ్యక్షత వహించింది. ఆ వాగు ఒడ్డు బొరియల్లో ఉంటున్న సమస్త కుందేళ్ళు గురించి ఏం చెబుతుందో విందామని ఆసక్తిగా ఎదురు చూడసాగాయి.
అప్పుడు కుందేళ్ళ రాణి శశికళ ఇలా అన్నది. ఓ నా ప్రియమైన కుందేలు బంధువులారా! మనం నివాసం ఉంటున్న ఈ చంద్రసాగర వాగు మన పూర్వీకుడు, చంద్రుడు గురించి ఘోర తపస్సు చేసి చంద్రుడి వరంగా పొందాడు.
అలాంటి మన పూర్వీకుల ఆస్తిగా మనకి సంక్రమించిన ఈ చంద్రసాగర వాగుని ఆ భయంకరమైన ఏనుగులు ఆక్రమించివేశాయి. వాటి కాళ్ళ క్రిందపడి మన కుందేళ్ళు కొన్ని వందల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నాయి. కాబట్టి మన ప్రాణరక్షణకు ఆ ఏనుగుల్ని ఈ ప్రాంతానికి రాకుండా మీలో ఎవరైనా చేయగలరా? అని ప్రశ్నించింది.
ఆ ప్రశ్నకు సమాధానంగా ఒక ముసలి కుందేలు లేచి నుంచొని ఆ ఏనుగుల్ని ఈ వాగు ఒడ్డుకి రాకుండా నేను నిరోధించ గలను. అని ప్రకటించింది.
అప్పుడు కుందేళ్ళ రాణి శశికళ ఆ ముసలి కుందేలును దగ్గరకు పిలిచి నీవు ఆ ఏనుగుల్ని ఇక్కడకు రావటం నిరోధించ గలిగితే మన కుందేళ్ళ జాతి మొత్తం నీకు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటుంది అన్నది. ఆ తర్వాత కుందేళ్ళన్ని ఎవరి బొరియలకు వాళ్ళు వెళ్ళిపోయారు.
ఆ మర్నాడు ఉదయం ఏనుగుల గుంపు చంద్రసాగరం వాగుకి తమ నివాస ప్రాంతం నుండి బయలు దేరాయి. అవి సగం దూరంలో ఉండగా వాటికి ఎత్తైన ఒక బండరాయి మీద నుంచొని ఉన్న ముసలి కుందేలు కనిపించింది.
ఏనుగుల గుంపుకు ముందుగా నడుస్తున్న రాజు గజేంద్రుడిని దగ్గరకు రమ్మని పిలిచింది ఆ ముసలి కుందేలు. తనని ఆ కుందేలు అలా రమ్మని పిలవటం ఆసక్తి కరంగా అనిపించి ఏనుగుల రాజు గజేంద్రుడు ఆ ముసలి కుందేలు ఉన్న రాయి వద్దకు వెళ్ళాడు.
50 అడుగుల ఎత్తు ఉన్న ఆ బండరాయి మీద నిలబడటం వల్ల ఆ ముసలి కుందేలు గజేంద్రుడు కన్నా ఎత్తులో ఉండటం జరిగింది. తనకు దగ్గరగా వచ్చిన గజేంద్రతో ముసలి కుందేలు ఇలా అన్నది.
"ఓయీ! గజరాజా! ఈ రోజు నుంచి నీవు, నీ పరివారం ఈ చంద్రసాగర వాగు దగ్గరకి రాకూడదు. మీరు రావటం వల్ల మీ కాళ్ళ క్రింద పడి రోజూ డజన్ల కొద్దీ కుందేళ్ళు మరణిస్తున్నాయి. కుందేలు మాటలకు ఆగ్రహించిన గజేంద్రుడు ఈ వాగు దగ్గరకు మమ్మల్ని రావద్దు అని చెప్పటానికి నీకేమి హక్కు ఉన్నది అని అన్నది.
అప్పుడు ముసలి కుందేలు ఈ చంద్రసాగర వాగు యజమాని అయిన చంద్రుడు మిమ్మల్ని ఈ వాగులోకి రావద్దని నన్ను చెప్పమన్నాడు. నా మాటలు లెక్కచెయ్యకుండా మీరు వాగులో దిగినట్లయితే ఆ చంద్రుడు మిమ్మల్ని అందరిని నాశనం చేస్తాడు అన్నది.
కుందేలు మాటలకు భయపడ్డ గజేంద్రుడు, కుందేలుతో ఇలా అన్నాడు. నేను చంద్రుడిని క్షమాణ కోరుకుంటాను ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పు.
అప్పుడు కుందేలు ఈ రోజు పౌర్ణమి కదా ఈ రోజు రాత్రికి చంద్రుడు ఈ వాగు మీదకు వస్తాడు. అప్పుడు నీవు వచ్చి ఆయన్ని క్షమించమని కోరుకో అన్నది.
ముసలి కుందేలు చెప్పినట్లుగానే, ఆ రోజు రాత్రి గజేంద్రుడు చంద్రసాగర వాగు దగ్గరికి వచ్చింది. ఆ సరికే అక్కడ ఉన్న కుందేలు గజేంద్రుడు దగ్గరకు వచ్చి అదిగో ఆ వాగు పైన చంద్రుడు ఉన్నాడు. చూడు అన్నది.
ఆ బుద్ధిలేని గజేంద్రుడు వాగులో పడ్డ చంద్రుడి నీడను చూసి, నిజంగా చంద్రుడే, ఆ వాగులో ఉన్నాడని భ్రమించింది.
ఇంతలో ఆ వాగులో అలలు ఏర్పడి అందులో కనబడుతున్న చంద్రుడి ప్రతిబింబం వణికింది. అది గజేంద్రుడు గమనించాడు. ఆ విషయాన్ని పసి గట్టిన ముసలి కుందేలు, ఓ గజేంద్రా! చంద్రుడు నిన్ను చూసి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాడు.
నీవు తక్షణం ఆయన్ని క్షమాపణాలు కోరి, ఈ ప్రాంతం నుండి నీ పరివారంతో సహా వెళ్ళిపోతానని చెప్పు అన్నది. దాంతో ఆ మంద బుద్ధి గల గజేంద్రుడు చంద్రుడి నీడకు, ఒడ్డునుంచే తల వంచి క్షమాపణాలు కోరి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఆ రాత్రే గజేంద్రుడు తన పరివారంతో ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళి పోయింది. దాంతో ఏనుగుల పీడవదలి, కుందేళ్ళన్నీ హాయిగా నిట్టూర్చాయి.
ఆ నాటి నుండి కుందేళన్నీ స్వేచ్ఛగా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఆ చంద్రసాగర్ ఒడ్డున ఆనందంగా తిరగసాగాయి.
నీతి : యుక్తి ఉంటే ఎంత అసాధ్యాన్ని అయినా సాధించవచ్చు.