చేటు తెచ్చిన ఉత్సాహం | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

సబ్బవరం అనే గ్రామంలో దేవుడి గుడి ఉంది. కానీ బడి లేదు. అందువల్ల ఆ ఊరి పిల్లలు చాలా దూరం నడిచి పట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. దాంతో ఆ ఊరి పెద్దలు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజుగారి దగ్గరకు వెళ్ళి తమ ఊరిలో ఒక పాఠశాలను నిర్మించమని ప్రార్థించారు. ఆ రాజుగారు విశాల హృదయుడే కాక, బాగా చదువుకున్నవాడు. దాంతో సబ్బవరం గ్రామంలో ఒక పాఠశాల నిర్మింస్తానని గ్రామ పెద్దలకి వాగ్దానం చేసి పంపేసాడు.


కొన్ని రోజుల తర్వాత రాజుగారు ఒక మంత్రిని పిలిచి ఇలా అన్నాడు. మంత్రి వర్యా! మీరు అవసరమైన ఆ ధనాన్ని, పనివాళ్ళని తీసుకొని సబ్బవరం గ్రామానికి వెళ్ళి, అక్కడ ఒక పాఠశాల భవనం నిర్మించి రండి. దానికి ఆ మంత్రి సరేనని కావాల్సివ ధనం మనుషుల్ని తీసుకొని సబ్బవరం బయలుదేరాడు.


ఆ తర్వాత సబ్బవరం గ్రామ పెద్దలు చూపించిన విశాలమైన ఖాళీ స్థలంలో భారీపరిమాణంలో ఉండే ఒక పాఠశాల భవనాన్ని నిర్మించటం మొదలు పెట్టించాడు ఆ మంత్రి. పునాదులు లేచాయి.


ఆ తర్వాత గొడలు కట్టబడ్డాయి. అయితే ఈలోగా ఒక సంఘటన జరిగింది. అదేమంటే ఆ భవన నిర్మాణం జరిగే స్థలానికి దగ్గరలో ఒక నేరేడు చెట్టు ఉన్నది. ఆ చెట్టుపై చాలా కోతులు పగలంతా ఆడుకుంటూ, నేరేడు కాయలు తింటూ కాలక్షేపం చేస్తుంటాయి. అయితే ప్రక్క స్థలంలో జరుగుచున్న భవన నిర్మాణం చూసి ఆ కోతులు ఆసక్తిగా అటువైపు వెళ్తు ఉండేవి. కోతుల వల్ల ఎలాంటి ప్రమాదం రాదు కనుక భవన కార్మికులు ఈ కోతుల్ని ఆవతలకి తొలటం కానీ, వాటిపైకి రాళ్ళు విసరటం కానీ చేసేవాళ్ళుకాదు.

 

పైగా వాళ్ళు తినే ఆహారంలో కొంత భాగం ఆ కోతులకి వేసి ఆనందించేవాళ్ళు. ఒక రకంగా అక్కడున్న కోతుల చర్యల్ని ఆ నిర్మాణ కూలీలు వినోదంగా భావించేవాళ్ళు.


ఇలా కాలం జరుగుతున్నది. ఆ భవనం పైకప్పు వేసేరోజు వచ్చింది. ఆ కాలంలో భవనానికి కప్పు వేయటానికి ముందు, భారీపరిమాణంలో ఉండే దుంగలను గొడలపై అడ్డంగా పరిచి ఆపై సున్నం, ఇసుక లాంటివి కలిపి రాళ్ళతో ఆ దుంగలపై కప్పువేసే వాళ్ళు. అలా చేస్తున్న సమయంలో ఒకరోజు ఇద్దరు కూలీలు ఒక పెద్ద చెట్టు దుంగని రంపంతో అడ్డంగా కోస్తున్నారు.


మధ్యాహ్నం అయేసరికి భోజనం చెయ్యటానికి వెళ్ళాలని ఆ ఇద్దరు పనివాళ్ళు భావించారు. కానీ దుంగని సగమే కోసి ఉండటం వలన ఆ దుంగని కోసిన ప్రాంతంలో ఒక బలమైన కర్రని రెండు చీలికల మధ్య ఉంచి, ఆహారం తీసుకోవటం కోసం వెళ్ళిపోయారు.


వాళ్ళు అలా వెళ్ళారో లేదో, ఒక డజను కోతులు ఆ ప్రదేశానికి వచ్చి అక్కడున్న నిర్మాణా పరికరాలతో ఆడుకోసాగాయి. కొన్ని కోతులు అక్కడున్న కొడవళ్ళు తీసుకొని అటు, ఇటు ఊపాయి. కొన్ని కోతులు అక్కడ వరుసగా పెట్టిన చెక్కలపై ఎక్కి గెంతసాగాయి. ఒక పిల్ల కోతి మాత్రం దూరంగా సగం కోసి ఉంచబడిన చెట్టు దుంగ దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూసింది.


ఆ తర్వాత ఆ కొయ్య దుంగపై ఎక్కి క్రిందికి దూకింది. ఆపై ఆ దుంగలో చీలిక ఉన్న ప్రాంతంలో కాళ్ళు పెట్టి సగం వరకూ కోసిన దుంగ మళ్ళీ దగ్గరగా రాకుండా ఉండటానికి పనివాళ్ళు ఆ చీలిక మధ్య ఉంచిన శీలపై చేతులు వేసి ఆ శీలను అటు, ఇటు ఊపసాగింది.


ఆ శీల చాలా బలంగా ఉండటం వల్ల ఊడి రాలేదు. దాంతో ఆ పిల్లకోతి తన బలం అంతా ఉపయోగించి రెండు చేతులతో ఆ శీలను బలంగా ఉపసాగింది.


ఇంతలో ఆ కోతి ఖర్మకాలి ఆ శీల ఊడి కోతి చేతికి వచ్చింది. శీల అలా బయటికి వచ్చిందో లేదో రెండు చీలి ఉన్న ఆ దుంగ ఢాంమన్న శబ్దంతో ఒకటిగా అతుకున్నది. పిల్లకోతి ఒక్కసారిగా బిగ్గరగా అరిచి ప్రాణం వదిలింది.


ఈ హడావుడికి భోజనాలు చేస్తున్న పనివాళ్ళు పరిగెత్తుకు వచ్చి చూసారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వాళ్ళకి దిమ్మతిరిగింది. ఏముంది అక్కడా? దుంగ చీలికల మధ్య ఉంచిన శీలను పీకిన కోతి క్రింద భాగం చితికి పోయింది. తనకు సంబంధంలేని విషయంలో అతి ఉత్సాహం ప్రదర్శించిన పిల్లకోతి నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయింది.


నీతి : ముందుచూపు లేకుండా ఏ పనీ చేయరాదు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)