పూర్వం చంద్రగిరి అడవులలో 'గజేంద్ర' అనే ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా పెద్దదిగా, మహాబలంగా ఉండేది. ఆ అడవిలో ఉండే అన్ని జంతువులు ఆ ఏనుగు ఆకారం, బలం చూసి హడలిపోయేవి. చివరికి కూౄరమృగాలైన పులి, సింహాలు కూడా గజేంద్ర దగ్గరకు కూడా వెళ్ళేవికాదు. ఇక ఆ గజరాజు దినచర్య పరమ అరాచకంగా ఉండేది.
ఉదయం సూర్యోదయం కాగానే నిద్రలేచి అలా అడవి మధ్యలో ఉన్న పెద్ద కొలనులో దిగేది. ఆ తర్వాత గంటల కొద్దీ ఆ కొలనులో స్నానం చేయటం, నీళ్ళతో ఆడుకోవటం చేసేది. దాని తొండాన్ని ఆ కొలనులో ముంచి ‘బర్రున' చాలా నీళ్ళు పీల్చి, అన్ని వైపులకీ చిమ్మేది.
ఆ కొలను చుట్టూ ఉన్న చెట్లపై ఆ ఏనుగు అలా . నీళ్ళు చిమ్మేసరికి ఉండే కోతులు, పక్షులపై నీళ్ళు ధారలు పడి ఊపిరి ఆడక గిల, గిలలాడి చెట్ల మీద నుంచి క్రింద పడి చచ్చేవి.
ఆ తర్వాత స్నానం అయినాక, నీళ్ళ నుండి బయటికి వచ్చి తనకు నచ్చిన పెద్ద పెద్ద చెట్లను తొండంతో పెకిలించి లేతగా ఉండే చెట్ల కొమ్మల్ని హాయిగా భోంచేసేది. ఇంకా అడవిలో ఉండే పళ్ళ చెట్లను కూడా తొండంతో విరగ దీసి, ఆ చెట్ల పండ్లను తింటూ ఉండేది.
ఆ ఏనుగు భారీ ఆకారం చూసి అది చేసే నిర్లక్ష్య చర్యల్ని అడ్డగించే సాహసానికి ఆ అడవిలో ఏ జంతువూ దిగలేదు. ఇక అడవికి రాజైన మృగరాజు సింహం కూడా ఏనుగు బలానికి భయపడి నోర్మూసుకొని కూర్చుంది. ఇలా ఆ ఏనుగు చేస్తున్న అరాచక చర్యలు ఆ అడవిలోని అన్ని జంతువులకి ప్రాణా సంకటంగా మారింది.
ఒకరోజు కొన్ని నక్కలు సమావేశం అయి, ఏనుగు చేస్తున్న చర్యలకు తిట్టుకున్నాయి. ఈ ఏనుగు ధాటికి మనం స్వేచ్ఛగా అడవిలో తిరగలేకపోతున్నాం. అని అక్రోసం వెళ్ళకక్కాయి.
అప్పుడు 'జంబులింగం' అనే కుర్ర నక్క లేచి, నక్క సోదరులారా! మీరు అందరూ అంగీకరిస్తే ఆ ఏనుగుని నేను సంహరిస్తాను. అలా చేస్తే ఆ ఏనుగు పీడా మనకి వదులుతుంది. పైగా అంత ఆకారంలో ఉన్న ఆ ఏనుగు శరీరాన్ని మనం రెండు నెలలు హాయిగా భుజించవచ్చు అని ఉత్సాహంగా చెప్పింది.
జంబులింగం మాటలు విని, మిగిలిన నక్కలు ఉలిక్కిపడ్డాయి. అందులో ఒక నక్క ఇలా అన్నది. ఏనుగు ఛస్తే మనకే కాదు, ఈ అడవిలోని అన్ని జంతువులకీ పండుగే కానీ, ఏనుగు కాలు అంత కూడాలేని ఈ కుర్ర నక్క అంత పెద్ద ఏనుగుని ఎలా చంపుతుంది? దానికి జంబులింగం ఇలా అన్నది.
“మీరు అన్నది నిజమే, నేను ఏనుగు కన్నా చాలా, చాలా చిన్న పరిమాణంలో ఉన్నదాన్నే, కానీ నాకు తెలివి చాలా ఉన్నది. యుక్తిగా ఆ ఏనుగుని వంచించి సంహరిస్తాను.
దాంతో అన్ని నక్కలు ఆనందించి, జంబులింగాన్ని ఏనుగుని చంపే పథకం వేయమని కోరాయి. జంబులింగం ఉత్సాహంగా అక్కడి నుండి బయలుదేరి గజేంద్ర వద్దకు వెళ్ళాడు.
జంబులింగం వెళ్ళేసరికి, గజేంద్రుడు ఒక పెద్ద అరటి గెలను భోంచేస్తున్నాడు. నక్క అతి వినయంగా వంగి, గజేంద్రకి నమస్కారం పెట్టి నిల్చుంది.
గజేంద్రుడు అరటి గెల తినటం ఆపి, ఏయ్ నక్కా ఏంటి ఇలా వచ్చావు అంది గంభీరంగా... దానికి జంబులింగం ఓ గజేంద్రా! మీరు చాలా బలవంతులు.
మీకున్నబలం ఈ అడవిలో ఎవరికీ లేదు. అన్నది మహా వినయం ఒలక బోస్తూ, దానికి గజేంద్రుడు పొంగిపోతూ, అయితే ఏమంటావు అన్నాడు గర్వంగా అప్పుడు జంబులింగం ఇలా అన్నది.
“ఓ! గజరాజా, మీరు ఈ అడవికి రాజు అయి పాలించాలని ఈ అడవిలోని జంతువులు కొరుతున్నాయి. నేను ఆ జంతువుల ప్రతినిధిగా వచ్చాను. మీరు దయచేసి, ఈ అడవికి రాజుగా ఉండటానికి అంగీకరించాలి.”
ఏనుగు ఉత్సాహంగా సరే, ఇప్పుడు ఏంచేద్దామంటావు అన్నది. అప్పుడు జంబులింగం ఇలా అన్నది. ఓ గజేంద్ర ఈ రోజు సాయంత్రం మీరు సింహాసనం ఎక్కాలి, ఒక పండితులవారు మంచి ముహూర్తం నిర్ణయించారు. మీకు ఈ రోజు పట్టాభిషేకం చేస్తాం.
దానితో గజేంద్రకి చాలా సంతోషం కలిగి, సరే పద, అన్నది. నక్క ముందు దొవ చూపిస్తుండగా, గజేంద్ర ఠీవిగా నడుస్తూ నక్క వెనకాల నడవసాగింది.
కొంత దూరం అలా అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక బురద నేల ఎదురయింది. నక్క బరువు తక్కువగా ఉండే జంతువు కనుక అలా చలాకీగా ఆ చిత్తడి నేలను దాటి వెళ్ళింది. ఏనుగు చిత్తడి నేల విషయం పట్టించుకోకుండా బలంగా అడుగులు వేస్తూ, చిత్తడి నేలలో కూరుకుపోసాగింది.
నిముషాలలో గజేంద్ర తల తప్పించి, మిగిలిన శరీరం అంతా ఊబిలాగా ఉన్న ఆ చిత్తడి నేలలో కూరుకుపోయింది. నక్క మాత్రం కూలాసాగా, దూరంగా నించుని కూని రాగాలు తీయసాగింది. గజేంద్రకి జీవితంలో తొలిసారి భయం మొదలైంది. అది ప్రాణభయంతో గజ, గజలాడుతూ ఇలా అన్నది.
"ఓ నక్కా! నేను ఈ బురద నేలలోంచి బయటికి రాలేకపోతున్నాను. దయచేసి నన్ను బయటి లాగి కాపాడు. గజేంద్ర మాటలు విని జంబులింగం బిగ్గరగా ఊళ పెట్టి ఇలా అన్నది.
ఓరీ... బుద్ధిలేని బండ ఏనుగా, ముక్కు, మొహం తెలియని అపరిచితుడిని అయిన నన్ను గుడ్డిగా నమ్మి వచ్చావు. నీ ఖర్మ కాలింది. నీవు ఈ బురదలో చావక తప్పదు.
దాంతో గజేంద్రుడు బిక్క చచ్చిపోయింది. ఆ తర్వాత కొన్ని నిముషాలకి ఆ ఏనుగు పూర్తిగా ఆ చిత్తడి నేలలో కూరుకుపోయి మరణించింది. ఏనుగు పీడా వదిలినందుకు ఆ అడవిలోని జంతువులన్నీ ఆనందించాయి.
నీతి : అపరిచితుల్ని నమ్మరాదు.