పూర్వం ముత్తు పల్లి అనే గ్రామంలో శీనయ్య అనే రజకుడు ఉండేవాడు. రజకుడు అంటే చాకలి అని అర్థం. ఊళ్ళో అందరి బట్టలు ఊరి చివర ఉండే పంటకాలువ ఒడ్డున ఉతికి, కాలువ గట్టున ఆరేసేవాడు ఆ శీనయ్య. ఉదయం గంజితాగి, తన గాడిద మీద మురికి గుడ్డల మూటలు పెట్టి, గాడిదను తొలుకుంటూ కాలువ గట్టుకి వెళ్ళటం, ఆ తర్వాత ఆ మురికి గుడ్డల్ని సున్నం, సబ్బు ఉపయోగించి కాలువలో శుభ్రంగా ఉతికి ఆరేసి, సాయంత్రం కాగానే ఆ బట్టలు చక్కగా మడతలు పెట్టి, మూట కట్టి మళ్ళీ గాడిదపై వేసి ఊళ్ళోకి వెళ్ళి ఉదయం బట్టలు వేసిన వాళ్ళకి ఉతికిన బట్టలు ఇచ్చి, మెల్లగా ఇంటికి చేరేవాడు.
అయితే ఈ శీనయ్య పరమ పీనాశివాడు. తాను బాగా మూడు పుటలా తినేవాడు. పాపం బండచాకిరి చేసే అతని గాడిదకు సరిగా గడ్డి వేసేవాడు కాదు. ఇలా పాపం గాడిద చాలీచాలని ఆహారంతో గాడిద చాకిరీ చేస్తూ కాలం వెళ్ళదీస్తుంది.
ఒకరోజు శీనయ్య దగ్గరలో ఉన్న నగరం అనే పట్టణంలో సంత జరుగుతుండటంతో సరుకులు కొందామని గాడిదను తీసుకొని బయలుదేరాడు.
చాకలి శీనయ్యతో పాటు మంగలి జగ్గయ్య, గ్రామ పురోహితుడు శర్మ, ఇతర వ్యాపారులు సంతకి బయలు దేరారు. సంత అంటే ఏమిటో తెలుసా?
పూర్వకాలంలో ఇప్పటిలాగా కిరాణా దుకాణాలు, షాపింగ్ హల్స్ లేవు కదా, అందుచేత ఎక్కడైనా ఒక పట్టణంలో చిన్న, చిన్న కొట్లు, మార్కెట్లు వారానికి ఒకసారి పెట్టేవారు. వాటినే సంతలు అంటారు. ఈ సంత జరిగిన రోజున చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు సంత జరిగే ప్రాంతానికి వెళ్ళి తమకు కావాల్సిన సరుకులు కొనుగొలు చేస్తూ ఉండేవారు.
ఇదిగో ఆ రోజునా ఇలాంటి సంతే నగరంలో జరుగుతుందన్నమాట. ఇక ముత్తు పల్లికి నగరానికి మధ్య దూరం పదిమైళ్ళు. పైగా ఈ పదిమైళ్ళు అడవి కుండా వెళ్ళాలి.
ఆ రోజుల్లో బస్సులు, రైళ్ళు లేవు. కనీసం సైకిళ్ళు కూడా లేవు. కనుక ఆనాటి ప్రజలు ఎడ్లు, గుర్రాలు కట్టిన బళ్ళలో వెళ్ళేవారు. సామాన్యులు కాలినడకన ఇంకో చోట నుండి వెళ్ళేవారు.
సరే శీనయ్య అతని బృందం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక గంటలో నగరానికి నడిచి చేరుకున్నారు. సంత మంచి కోలాహలంగా ఉన్నది. శీనయ్య కూడా కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ బయలుదేరాడు. అప్పటికి సాయంత్రం ఆరు అయింది. అది చలికాలం, పైగా పౌర్ణమి రోజులు కావటాన ఒక్కడే అయినా ధైర్యంగా తన గ్రామానికి బయలుదేరాడు శీనయ్య.
ఉదయం అతనితో బాటు వచ్చిన వాళ్ళు, ఏదో పని ఉండి, ఆ రాత్రికి నగరంలోనే ఉండిపోయారు. మరి శీనయ్య కూడా ఉండిపోతే రేపు ప్రొద్దున ఊళ్ళో జనాల మురికి బట్టలు ఎవరు ఉతుకుతారు. కనుక శీనయ్య ఏమీ సంకోచించకుండా సంతలో కొన్న సరుకులు గాడిదపై వేసి, ఏదో పాట పెద్దగా పాడుకుంటూ ముత్తు పల్లి వైపు నడక సాగించాడు.
సరిగ్గా అడవి మధ్యలోకి వచ్చే సరికి ఎక్కడినుండో పులి గాండ్రింపు వినబడింది. ఆ గర్జన విన్న శీనయ్యకు కాళ్ళు చేతులు బిగుసుకు పోయాయి. భయంతో అతని గాడిద కూడా గుడ్లు మిటకరించి శీనయ్య వెనకాల దాక్కుంది.
కాసేపటికి పులి అరుపు ఇక వినబడలేదు. దాంతో శీనయ్య బిక్కచచ్చి నిల్చున్న గాడిదను తట్టి, మళ్ళీ నడక ప్రారంభించాడు. కొంత దూరం పోయాక ఒక చెట్టు క్రింద ఒక పులి చర్మం పడి ఉన్నది. శీనయ్య ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి, ఆ చర్మాన్ని తీసుకొని గాడిదపై వేసి మళ్ళీ నడక ప్రారంభించాడు. రాత్రి 9 గంటలకి శీనయ్య, అతని గాడిద ఇల్లు చేరారు. శీనయ్య భార్య ఇంట్లోంచి బయటికి వచ్చి గాడిద మీదున్న సామానులు తీస్తూ, వాటిలో ఉన్న పులి చర్మాన్ని చూసి భయంతో కెవ్వున అరిచింది. దాంతో శీనయ్య కంగారు పండి, భార్య దగ్గరికి వచ్చి ఒసేయ్, అరిచి చావకు అది పెద్ద పులికాదు. దాని చర్మం అన్నాడు పెద్దగా నవ్వుతూ, దానికి అతని భార్య ఇలా అన్నది. ఛీ, ఆ చచ్చిన పులి చర్మం మనకెందుకు ఆవతల పారేయకుండా, దానికి శీనయ్య ఇలా అన్నాడు. ఏమేయ్ ఆ పులితొలే మన గాడిదకి కావాల్సినంత గడ్డి, గాదం దొరికేలా చేస్తుంది.
అదెలా అన్నది ఆశ్చర్యంగా శీనయ్య భార్య. అదెలాగో చూద్దుగానివి అని, గాడిద దగ్గరగా వెళ్ళి దానికి తన దగ్గరున్న పులి చర్మాన్ని నేర్పుగా కప్పాడు. ఇప్పుడు కాస్త దూరం నుంచి చూస్తే, శీనయ్య గాడిద పులిలా కనిపిస్తుంది.
శీనయ్య గాడిద చెలిలో ఇలా అన్నాడు. ఈ రోజు రాత్రి నుంచీ, ప్రతిరాత్రి ఈ ఊళ్ళొ రైతుల పొలాల మీద పడి నీ ఇష్టం వచ్చినట్టు మెక్కి పారేయ్.
గాడిద ఆనందంగా ఊళ్ళొ రైతులు పొలాలలోకి వేగంగా వెళ్ళి, వరి పైరు కస, కస నమలటం ప్రారంభించింది.
అదే సమయానికి ఆ పొలానికి కాపాలాగా ఉందామని వచ్చిన ఇద్దరు రైతులు పులి చర్మంలో ఉన్న గాడిదను చూసి, పులి అని భ్రమించి పెద్దగా అరిచి గడ, గడలాడుతూ ఊళ్ళొకి పారిపోయారు. క్షణాల్లో ఈ వార్త ఊరంతా గుప్పుమన్నంది. ఏమిటావార్త మన గ్రామ పొలాలలో రాత్రిళ్ళు పులి తిరుగుతుందని. అంతే రాత్రిళ్ళు రైతులు పొలాలకేసి రావటం మానేశారు.
శీనయ్య గాడిద పంట పండింది. రోజు రాత్రి పూట, ఆ ఊరి చేలల్లో కావాల్సినంత గడ్డి, గాదం కడుపార తిని తెల్లారి గట్ల ఇల్లు చేరేది. ఇలా రోజులు గడుస్తున్నాయి. తేరగా దొరికే గడ్డీ, గాదం తిని శీనయ్య గాడిద యమాబలిసి పోయింది. నిజం నిప్పులాంటిది. అది ఎల్లకాలం దాగదు. ఒకరోజు శీనయ్య గాడిద చేలో మేస్తుండగా, ఎక్కడి నుండో ఒక ఆడ గాడిద ఓండ్ర పెట్టసాగింది. ఆ ఓండ్ర విన్న శీనయ్య గాడిద కూడా కులాసాగా ఓండ్ర పెట్టింది. దూరంగా నక్కి చూస్తున్న ఒక రైతు ఇది కనిపెట్టాడు.
ఇన్నాళ్ళు. తమని మోసం చేసి తమ పొలాల లోని పంట మేస్తున్నాది, పులి చర్మం కప్పుకున్న ఒక గాడిద అని తెలిసి, అందర్నీ కేకేసి పిలిచాడు. అందరూ దుడ్డ కర్రలు తీసుకొని శీనయ్య గాడిదని చావ బాదారు. ఆ దెబ్బలు తట్టుకొలేక ఆ గాడిద దగ్గరలో ఉన్న అడవులలోకి పారిపోయింది. ఆ తర్వాత శీనయ్య గాడిద మళ్ళీ ఊళ్ళోకి రాలేదు.
నీతి : అవతారం చూసి మోసపోరాదు.