బిక్కవోలు అనే గ్రామంలో సత్తెమ్మ అనే వృద్ధురాలు జీవిస్తూ ఉండేది. ఆమెకు 'కామేశం' అనే మనవుడు ఉండేవాడు. సత్తెమ్మ కొడుకు కోడలు గోదావరీ నది వరదల్లో చనిపోగా పసి గుడ్డుగా ఉన్న 'కామేశాన్ని' .. గారాబంగా పెంచి పెద్ద చేసింది. ఎంత గారాబంగా పెరిగినా, కామేశం బాగా చదువుకుని, క్రమశిక్షణాతో జీవించేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి.
కొన్నాళ్ళకి బిక్కవోలు గ్రామానికి దగ్గరగా ఉన్న పట్టణంలో ఉంటున్న ఒక సంపన్నుడి కుమార్తెను కామేశానికి ఇస్తామని పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా సత్తెమ్మకు కబురు చేసారు ఆ సంపన్నుడి బంధువులు. దాంతో సత్తెమ్మ మనవడికి ఈ విషయం చెప్పి, పట్నం వెళ్ళి పెళ్ళి కూతురిని చూసి రమ్మన్నది.
సరే అని ప్రయాణానికి సిద్ధం అయ్యాడు కామేశం. అప్పుడు సత్తెమ్మ తన మనవడితో ఇలా అన్నది. నాయనా! కామేశం మనిషి ఎప్పుడూ ఒంటరిగా కొత్తచోటుకి వెళ్ళకూడదు. పోనీ నేను, నీకు తోడు వద్దామంటే నాకు కీళ్ళ నెప్పులు. అంత దూరం నడవలేను. అందువల్ల ఎవరినైనా తొడు తీసుకెళ్ళు అన్నది.
ఆమె మాటల్ని తీసిపారేస్తూ కామేశం ఇలా అన్నాడు. పోబామ్మా! నీదంతా చాదస్తం నేనింకా పిల్లాడిని అనుకుంటున్నావా? నాకు ఇరవై ఏళ్ళు వచ్చాయి తెలుసా? కామేశం మాటలకి నవ్వి సత్తెమ్మ వారేయ్ నీవెంత పెద్దవాడివి అయినా పెద్ద వాళ్ళు అనుభవంతో చెప్పే మాటల్ని పాటించపోతే నష్టం నీకే గుర్తుంచుకో అన్నది.
దాంతో కామేశం నిదానించి సరే ఎవర్ని తోడు తీసుకెళ్ళమంటావో చెప్పు అన్నాడు. అప్పుడు సత్తెమ్మ ప్రక్క ఇంటి వాళ్ళ ఇంటిలో పెరుగుతున్న ఒక కుక్క పిల్లను తెచ్చి కామేశానికి ఇచ్చి, దాన్ని నీకు తోడుగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తెచ్చి, ప్రక్కింటి వాళ్ళకి అప్పచెప్పు అన్నది.
సరే అని కామేశం ఆ కుక్క పిల్లను ఒక సంచీలో పెట్టుకొని భుజానికి తగిలించుకొని నెత్తి మీద ఆహారం, నీళ్ళు, దుస్తులు ఉన్న సంచీ పెట్టుకొని పట్నం బయలుదేరాడు. అలా నడుస్తూ, నడుస్తూ కామేశం ఒక అడవిలాగా ఉన్న ప్రదేశానికి చేరాడు.
ఇంకా సగం దూరం నడిస్తే కానీ పట్నం రాదు. అసలే అది వైశాఖ మాసం కావటంచేత సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి ఎండ మంటలు పుట్టిస్తున్నది. ఇంకో ప్రక్క ఆకలి, దాహం వేయటంతో కామేశం కాస్త ఆహారం తిని, కాస్సేపు విశ్రాంతి తీసుకుందామని భావించి దగ్గరలో ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు నీడ క్రిందికి చేరాడు.
చెట్టు క్రిందికి చేరగానే కామేశానికి పోయిన ప్రాణం తిరిగి వచిచనట్టు అనిపించింది. భుజాని కున్న సంచీని, నెత్తి మీదున్న సంచీని తీసి నేలపై పెట్టి తాను కూడా తాపీగా నేలపై కూర్చున్నాడు. అప్పటిదాకా సంచీలో ముడుచుకొని కూర్చొన్న కుక్క పిల్ల గభాల్న క్రింద పెట్టిన సంచీలోంచి బయటికి దూకి కామేశం కేసి చూడసాగింది. కామేశానికి అర్థం అయింది. ఆ కుక్కపిల్ల కూడా మంచి ఆకలి మీద ఉన్నదని. వెంటనే ఆహారం ఉన్న సంచీలోంచి కొన్ని రొట్టెలు, పెరుగన్నం, మంచి నీళ్ళు సొరకాయ బుర్ర తీసి బయట పెట్టాడు. ఆహారాన్ని చూడంగానే కుక్క పిల్ల ఆత్రంగా తోక ఊపటం మొదలెట్టింది.
కామేశం చిన్నగా నవ్వుకుని రెండు రొట్టెలు కుక్క పిల్లకి వేసి, తను ఆహారం తీసుకున్నాడు. ఆ తర్వాత కాసిని నీళ్ళు కుక్క పిల్లకు త్రాగించి మిగిలినవి త్రాగాడు.
బాగా నడిచి ఉన్నాడేమో, బాగా అలసటగా అన్పించి ఖాళీ సంచుల్ని, బట్టల్ని కలిపి, తలక్రింద దిండులా పెట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు. కుక్క పిల్ల వికృతంగా అరవటం విని ఉలిక్కి పడి నిద్రలేచి కూర్చున్నాడు కామేశం.
ఏమిటి కుక్క పిల్ల అదేపనిగా అరుస్తున్నదేమిలా అని చుట్టూ పరిశీలనగా చూసాడు. అతనికి చాలా దగ్గరలో రెండు నల్లత్రాచులు పడగలెత్తి కామేశం కేసి చూస్తున్నాయి. ఆ పాముల్ని చూసిన కామేశం హడలిపోయాడు.
అయినా ధైర్యాన్ని చిక్కబట్టుకొని కుక్క పిల్లని, సంచుల్ని తీసుకుని వేగంగా ఆ చెట్టు క్రింది నుండి ఎండలోకి వెళ్ళాడు. అత్యంత వేగంగా వెళ్ళిపోతడని ఊహించని పాములు కాస్సేపు అలాగే ఉండి ఆ తర్వాత జర, జరమని ప్రాకుకుంటూ దగ్గరలోని పుట్టలోకి వెళ్ళిపోయాయి.
కామేశం బ్రతుకు జీవుడా అని నిట్టూర్చి నిద్రలో ఉన్న తనని లేపి, పాము కాటుకి గురి అవకుండా ఆపిన కుక్కపిల్లను ముద్దు పెట్టుకొని, మళ్ళీ నడక సాగించాడు.
అతనికి అప్పుడు అర్థమయింది. మామ్మ చెప్పినట్టు విన్నాడు కనుక తాను విషజంతువుల బారిన పడి చావకుండా బ్రతికాడు అని. ఆ సాయంత్రానికి కామేశం పట్టణంలోని సంపన్నుడి ఇంటికి చేరి పెళ్ళి పనులు కానిచ్చాడు.
నీతి : పెద్దల మాట చద్ది మూట. ఇది విన్నడూ తప్పరాని బంగారు బాట.