తొందరపాటు తనం | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

పూర్వం నల్లూరు అనే గ్రామంలో రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఆ ఊరి దేవాలయంలో పూజారిగా పని చేస్తూ ఉండేవాడు. రామశాస్త్రి అప్పుడప్పుడు ఆ ఊరి ప్రజలు తమ ఇళ్ళల్లో చేసుకొనే వ్రతాలు, పూజలను జరిపించి వాళ్ళు ఇచ్చే కొద్దిపాటి సంభావనలు తీసుకుంటూ కాలం గడిపేవాడు.


రామశాస్త్రి భార్య సీతమ్మ ఆమె భర్త తెచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే కుటుంబాన్ని గుట్టుగా నడుపుకుంటూ ఉండేది. అయితే రామశాస్త్రి దంపతులకు ఉన్న ఏకైక బాధ వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళకి పెండ్లి అయ్యి 10 సం॥ములు గడిచినా సంతాన భాగ్యం కలగలేదు. దాంతో రామశాస్త్రి ఆయన భార్య ఎన్నో పూజలు, వ్రతాలు చేశారు. తీర్థయాత్రలు చేసి అనేక మంది దేవుళ్ళకి మ్రొక్కుకున్నారు. చివరికి వాళ్ళ పూజలు ఫలించి రామశాస్త్రి భార్య సీతమ్మ ఒక పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది.


లేకలేక కలిగిన ఆ మగ బిడ్డకు ఏ లోపం కలగకుండా ఆ బిడ్డను పెంచసాగారు. రామశాస్త్రి ఇంట్లో ఒక ముంగిసని చాలా కాలంగా పెంచుకుంటున్నాడు. ముంగిస అంటే తెలుసు కదూ! అది ఉడత జాతికి చెందిన పెద్ద పరిమాణంలో ఉండే ప్రాణి. ముంగిసకు, పాముకి ఆజన్మ విరోధం ఉంది. ఎప్పుడైనా పాము, ముంగిస ఎదురెదురు పడి పోట్లా డుకుంటే ముంగిస తనతో పోరాడుతున్న పాముని కొరికి ముక్కలు చేసి చంపేస్తుంది. ఆ రోజుల్లో గ్రామాల్లో పాముల బెడద ఎక్కువగా ఉండేది. అందువల్ల రామశాస్త్రి పాముల నుండి రక్షణకు గాను ముంగిసను పెంచుతూ ఉండేవాడు.


రామశాస్త్రి కుమారుడికి సంవత్సరం వయస్సు వచ్చింది. రామశాస్త్రి ఇంట్లో పెరుగుచున్న ముంగిస ఆ పసి బిడ్డకు మంచి స్నేహితురాలయ్యింది. ఒక రోజు సీతమ్మ ఆ ఊర్లో ఒకరి ఇంట్లో జరుగుచున్న పేరంటానికి వెళ్ళింది. బిడ్డను రామశాస్త్రికి అప్పగించి ఆమె వెళ్ళింది.


రామశాస్త్రి బిడ్డను ఎత్తుకొని ఆడిస్తున్నాడు. ఇంతలో ఆ ఊరి పెదకామందుగారి పాలేరు రామశాస్త్రి ఇంటికి వచ్చి కామందు గారి ఇంట్లో పూజ జరిపించటానికి రమ్మని ఆహ్వానించాడు. రామశాస్త్రి ఆలోచనలో పడ్డాడు.


ఒకప్రక్క భార్య బిడ్డను తనకు అప్పగించి పేరంటానికి వెళ్ళింది. తను బిడ్డను చూసుకుంటున్నాడు. బిడ్డకోసం, పూజ చేయించటానికి కామందుగారి ఇంటికి వెళ్ళకపోతే ఆయనకు కోపం వస్తుంది. దాంతో రామశాస్త్రికి ఒక ఉపాయం తట్టింది.


పసి బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి ముంగిసను ఆ బిడ్డకు కాపలాగా ఉంచి పూజ చేయించటానికి వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక పెద్ద త్రాచుపాము పసిబిడ్డ ఉన్న ఉయ్యాల దగ్గరకు వచ్చింది. అది చూసిన ముంగిస ఆ పాము పైకి పోరాటానికి దిగింది. పాము, ముంగిస దారుణంగా పోరాడుకున్నాయి. చివరికి ముంగిస, పాముని ముక్కలు చేసి చంపేసింది. కాసేపటికి రామశాస్త్రి భార్య ఇంటికి తిరిగి వచ్చింది.


ఇంట్లో బిడ్డ ఉయ్యాల క్రింద రక్తము మడుగు కనిపించింది. అది చూసి ఆమె తాము పెంచుకుంటున్న ముంగిస తమకు లేకలేక కలిగిన బిడ్డను కొరికి చంపేసిందని అపార్థం చేసుకున్నది. దాంతో సీతమ్మ పట్టలేనంత ఆగ్రహంతో ఆ ముంగిసను రోకలి బండతో కొట్టి చంపింది.


పాపం తన యజమాని కొడుకుని కాపాడుట కోసం త్రాచుపాముని చంపిన ఆ ముంగిస యజమాని భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయింది. కాసేపటికి రామశాస్త్రి పూజచేయించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ కుర్చుని ఉన్న భార్య కనిపించింది. దాంతో కంగారు పడిని రామశాస్త్రి ఏం జరిగిందని భార్యని అడిగాడు. భార్య ఇలా చెప్పింది.


మన బిడ్డను కాపాడటానికి బిడ్డ ఉయ్యాల దగ్గరకు వచ్చిన త్రాచుపామును మన పెంపుడు ముంగిస చంపేసింది. నేను వచ్చి చూసేసరికి ఇల్లంతా రక్తం కనిపించి మన బిడ్డను ముంగిస చంపేసిందని అపార్థం చేసుకొని దానిని అన్యాయంగా కొట్టి చంపాను.


మన బిడ్డ ప్రాణం కాపాడిన ఈ ముంగిస ప్రాణం తీసి చాలా పాపం చేశాను. అని సీతమ్మ రోదించ సాగింది. రామశాస్త్రి ఇల్లంతా ఒకసారి పరిశీలించాడు. ఉయ్యాలలో బిడ్డ హాయిగా నిద్రపోతున్నాడు. ఉయ్యాల క్రింద ముంగిస చనిపోయి పడి ఉన్నది.


నీతి : ఏ విషయంలోను తొందరపాటు తనం పడకూడదు, బాగా ఆలోచించి ఏదైనా నిర్ణయించాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)