మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది.
గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది.
అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం.
పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది.
ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది.
అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తనే. అదెలానంటే యజమాని కనబడగానే కుక్క తోక ఆడిస్తుంది. ఆపై ముందరి కాళ్ళు పైకెత్తి, యజమాని ఛాతిపై వేసి యజమానిని నవ్విస్తుంది. ఇలా ఆలోచించిన గాడిద తాను కూడా కుక్కలాగే చేసి యజమాని మెప్పును పొందాలని గట్టిగా నిర్ణయిం తీసుకొంది.
అంతే ఆ రోజు నుండి గాడిద ప్రవర్తన మారిపోయింది. యజమాని పాపయ్య కనిపించినప్పుడల్లా, తోక ఆడించటం మొదలు పెట్టింది. పాపయ్య ఇది గమనించినా, ఏమి పట్టంచుకోలేదు.
ఆ తర్వాత ఒక రోజు పాపయ్య స్నానం చేసి, వాకిట్లో అరుగు పై కూర్చుని ఉండగా, గాడిద పాపయ్యకు ఎదరుగా నుంచుని రెండు కాళ్ళు అతడి ఛాతీపై ఉంచి, వేగంగా తోకను ఊపసాగింది.
దాంతో పాపయ్యకు దడ పుట్టింది. దీని సిగతరగా ఈ గాడిదకి గానీ పిచ్చెక్కలేదు కదా అనుకున్నాడు. కానీ ఆ సారి గాడిదని ఏమీ అనకుండా వదిలేసాడు.
దాంతో గాడిదకు ధైర్యం పెరిగి పోయింది. ఒకసారి పాపయ్య గోచీ పెట్టుకుని, ముక్కాలి పీటపై కూర్చుని, భార్యతో ఒంటికి నలుగు పెట్టించుకుంటున్నాడు.
ఇంతలో ఎవరో వచ్చి పిలుస్తే, అతని భార్య వీధిలోకి వెళ్ళింది. ఇంతలో అటువచ్చిన గాడిద, ముక్కాలి పీటపై కూర్చుని ఉన్న పాపయ్యను చూసి తోక ఆడిస్తూ, అతని భుజాలపై తన ముందు కాళ్ళు పెట్టింది.
దాంతో హడాలిపోయిన పాపయ్య తన గాడిదకు పిచ్చి ఎక్కింది. అని నిద్దాంరించుకొని, దాన్ని తీసుకెళ్ళి దొడ్లో ఉన్న ఒక చెట్టుకి కట్టేసి, ఒక బడిత తీసుకొని దాన్ని చావబాది వదిలి పెట్టాడు. దాంతో గాడిదకు యజమాని మెప్పును పొందాలన్న ఆశ చచ్చిపోయింది.
యజమాని కొట్టిన దెబ్బలకు మూలుగుతూ గాడిద తనలో తాను ఇలా ఆలోచించుకోసాగింది. నేను చేసిన పనులు ఆ కుక్క చేస్తే ముద్దుగా చూసిన యజమాని తను చేస్తే, ముద్దు చెయ్యక పోగా, చావబాదాడు. ఇదేంటి ఇలా జరిగింది.
నాకు కుక్కకీ ఉన్న తేడా ఏమిటి? ఇలా ఆలోచిస్తూ దెబ్బల బాధకి పెద్దగా ఓండ్రి పెట్టింది. దాంతో పాపయ్య ఇంట్లోంచి బయటికి వచ్చి గాడిదను ఇంకొసారి కర్రతో చావబాదాడు.
ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తేనే, వాళ్ళకి రావాల్సిన గుర్తింపు వస్తుంది. ప్రక్క వాడిని చూసి అసూయపడి తనవి కాని పనులు చేస్తే బాధే మిగులు తుంది.
పులిని చూసి అసూయపడి ఒక నక్క తన శరీరం అంతా వాతాలు పెట్టుకొని, పులి అంతదాన్ని అయ్యానని అనుకొన్నది. వాతలు మిగిలాయి. నక్క నక్కే అవుతుంది కానీ పులిలా ఏనాటికీ కాలేదు.
నీతి : అసూయపడిన వాళ్ళకి కష్టాలు తప్పవు.