పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.
ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.
యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వదిలి రమ్మని ఆజ్ఞాపించింది. దాంతో భటులు ఆ జింక పిల్లను తీసుకెళ్ళి అడవిలో వదిలేసారు. అంతే జింకకు మళ్ళీ బ్రతికినట్టుగా అనిపించి, తన తల్లిదండ్రులు ఉండే చోటికి పరిగెత్తింది. పాపం దాని దురదృష్టం వలన దాని కుటుంబం ఎటో వెళ్ళిపోయింది. దాంతో జింక పిల్ల నిరాశగా ఆ అడవిలో మిగిలి పోయింది. ఆ తర్వాత ఆ జింక పిల్లకు మూడు ప్రాణులతో మంచి స్నేహం ఏర్పడింది. అవేంటో తెలుసా, ఒక తాబేలు, ఒక ఎలుక, ఒక కాకి. అలా జింక వాటితో స్నేహం చేస్తూ, తల్లిదండ్రులు లేని బాధను మర్చిపోయి హాయిగా కాలం గడపసాగింది.
ఇలా నెలలు గడిచాయి. ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రాంతనికి వేట ఆడటానికి వచ్చాడు. వేటగాడిని చూడగానే జింక ఒక్కగెంతులో అడవి లోపలికి పారిపోయింది. కాకి రివ్వున గాలిలోకి ఎగిరింది. ఎలుక దగ్గరలో ఉన్న తన కలుగులో చటుక్కున దూరిపోయింది.
పాపం బండ తాబేలు నిదానంగా పాకుతూ దగ్గరలో ఉన్న పొదలోకి జారుకొవాలని ప్రయత్నం చేసింది. కానీ దాని దురదృష్టం కొద్దీ వేటగాడి చేతులకి చిక్కిపోయింది.
ఆ వేటగాడు చిక్కిందే చాలు, ఈ రోజు ఆహారం దొరికింది అనుకుంటూ తాబేలు కాళ్ళు నాలుగు తాడుతో కట్టేసి భుజాన వేసుకుని అడవిలోంచి తన గ్రామానికి నడవసాగాడు.
వేటగాడు వెళ్ళిన పది నిముషాలకి జింక, ఎలుక, కాకి సమావేశం అయి, తమ మిత్రుడు తాబేలు వేటగాడికి చిక్కిందే అని దుఃఖించారు. అప్పుడు ఎలుక ఇలా అన్నది. చెయ్యాల్సిన పని చేయకుండా, విచారిస్తూ కూర్చొంటే మన మిత్రుడు ఎలా బ్రతుకుతాడు. కనుక మన ప్రయత్నం మనం చేద్దాం. ఆపై దేముడే అన్నీ చూసుకుంటాడు. ఎలుక మాటలు నిజమేననిపించాయి కాకి, జింకలకి దాంతో అవి ఎలాగైనా మన మిత్రుడిని ఆ వేటగాడి బారి నుండి రక్షించాలి, ఏదైనా పథకం చెప్పు అని ఎలుకని అడిగాయి. ఎలుక కసేపు ఆలోచించి ఇలా అన్నది.
ఈ వేటగాడు తన గ్రామం చేరాలంటే దొవలో ఒక వాగుని దాటాల్సి ఉంటుంది మనం ఆ వాగు దగ్గర కాపు వేసి, ఆ వేటగాడిని బురిడీ కొట్టించి, మన తాబేలు మిత్రుడిని రక్షించాలి.
ముగ్గురు మిత్రులు అడ్డదారిలో ప్రయాణించి ఆ వేటగాడి కన్నా ముందుగానే వాగు ఒడ్డుకు చేరుకున్నాయి. దూరంగా వస్తున్నా వేటగాడిని గమనించి ఎలుక, తన పథకాన్ని కాకి, జింకలకి వివరించింది. వేటగాడు వాగు దగ్గరికి వచ్చేసరికి ఎలుక వేసిన వ్యూహం ప్రకారం జింక చచ్చిపోయిన దానిలా వాగు ఒడ్డున పడిపోయింది.
అలాగే కాకి కూడా పథకంలో భాగంగా చచ్చినట్లు నటిస్తున్న జింకను పొడిచి తింటున్నట్టుగా నటించసాగింది. చచ్చి పడుకున్న జింకను గమనించిన వేటగాడు చాలా సంతోషించి ఆ జింకను తీసుకొందామని తాబేలును క్రింద పెట్టి, జింకకేసి నడిచాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న ఎలుక, చటుక్కున వెళ్ళి తాబేలును కట్టిపడేసిన తాళ్ళను పట, పట కొరికి పారేసింది.
వేటగాడు సరిగ్గా తనకి 12 అడుగుల దూరంలోకి రాగానే చచ్చినట్టున్న జింక చివ్వున లేచి పరిగెత్తింది. కాకి కూడా గాలిలోకి ఎగిరింది. వేటగాడు జింక ఆడిన నాటకానికి ఆశ్చర్యపడి కనీసం తాబేలునైనా దక్కించుకొందామని వెనక్కి తిరిగి వెళ్ళిచూసే సరికి వాగులోకి దిగుతున్న తాబేలు కనిపించింది. దాంతో వేటగాడికి వెర్రివెక్కి పోయింది.
ఇంతలో కాకి వేగంగా ఎగిరి వేటగాడి కళ్ళను పొడిచింది. దాంతో వేటగాడు కళ్ళు పోయి భయంతో బెదిరిపోయి వేగంగా వాగు దాటి తన గ్రామంలోకి పరిగెత్తాడు. ఆ తర్వాత కాకి, తాబేలు, జింక, ఎలుక చాలా కాలం ఆ అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ, స్నేహంగా జీవించాయి. ఇక కాకిచే గాయపడ్డ వేటగాడికి ఒక కన్ను పోయింది. దాంతో వేటాడటం మానేసి ఏవో పని, పాటలు చేసుకుంటూ జీవితం గడిపాడు.
నీతి : ఆపదలో ప్రాణాన్ని నిలిపేవాడే నిజమైన స్నేహితుడు.