భుజాలెక్కే భూతం | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

పూర్వం చందొలు అడవులలో “పాపాసురుడు” అనే బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. వాడు పరమకూౄరుడు. తనకు లభించిన మనుషుల్ని నిర్ధాక్షిణ్యంగా నమిలి మింగేసేవాడు. వాడి కూృరత్వానికి ఎందరో బాటసారులు ప్రాణాలు పొగొట్టుకున్నారు.


ఈ రాక్షసుడు ఒక ఎత్తైన బండరాయిపై కూర్చుండి, అటువైపుగా వచ్చిపోయే మనుషుల్ని దగ్గరికి పిలిచి, చంపి తినేసేవాడు. ఇలా ఆ బ్రహ్మరాక్షసుడి దుర్మర్గాలు కొనసాగుతున్నాయి. దాంతో తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ మార్గంలో ప్రయాణించేవాళ్ళు కారు. కారణం వాళ్ళకి తెలుసు. ఆ మార్గంలో బ్రహ్మరాక్షసుడు ఉంటాడని.


ఒకరోజున రాజయ్యఅనే పల్లిటూరి వ్యక్తి నగరం నుండి, చందోలు వెళ్తూ, రెండు ఊళ్ళ మధ్యలో ఉన్న చందొలు అడవుల కుండా నడుస్తుండగా, బ్రహ్మరాక్షసుడి పిలుపు వినబడింది.


ఆ భయంకర స్వరానికి రాజయ్యకి హడలు పుట్టింది. సరే ధైర్యాని చిక్కాబట్టికొని, ఆ పిలుపు వినవచ్చిన వైపు నడిచాడు. అక్కడ పెద్ద రాతిబండ మీద తాపీగా కూర్చుని ఉన్న పాపాసురుడు కన్నించాడు.


దాదాపు ఏడు అడుగుల ఎత్తు ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడిని చూడగానే రాజయ్యకు గొంతు తడారిపోయింది భయంతో... అప్పుడు ఆ రాక్షసుడు గట్టిగా అరిచాడు.


ఓరి మానవుడా! ఏమిటి నీ పేరు అని, దడ, దడ లాడుతున్న గుండెను నిగ్రహించుకొని, వణుకుతున్న స్వరంతో, రాజయ్య అన్నాడు. అప్పుడు రాక్షసుడు, ఓహో, నీ పేరు రాజయ్య, సరే. నన్ను నీ భుజాలపై ఎక్కించుకొని చందొలు ఊళ్ళోకి తీసుకెళ్ళు అన్నాడు. ఆ మాట వినగా రాజయ్య గుండె జల్లుమన్నది. ఆ పర్వతాకారుడ్ని నేను ఎలా మోయగలను అనుకున్నాడు మనసులో...


అయినా ధైర్యంగా నటిస్తూ, చందోలు గ్రామంలో నీకేంటి పని అన్నాడు. అప్పుడు రాక్షసుడు, రేయ రాజయ్య ఈ మార్గంలో జనాలు ఎవరూ రావటం లేదు, దాంతో నాకు చాలా కాలంగా ఆహారం లేకుండా పోయింది.


నేనే చందోలు గ్రామంలో మకాం వేశాననుకో, కావాల్సినంత మందిని అక్కడే తినవచ్చు అన్నాడు.


రాక్షసుడి మాటలకి రాజయ్య ఉలిక్కి పడ్డాడు. ఓరి - నీ దుంపతెగ, నువ్వు అడవిని వదిలి, గ్రామంలో చేరితే, ఆ గ్రామంలోని జనాల్ని చంపేసి, ఆ గ్రామాన్ని స్మశానంగా మారుస్తావు అని మనసులో అనుకున్నాడు. అయినా పైకి ఏమీ అనకుండా, రాక్షసుడిని చందోలు గ్రామానికి మోసుకు వెళటానికి అంగీకరించాడు.


మోసుకు వెళ్ళను అంటే ఆ రాక్షసుడు ఇక్కడే తనని చంపిపారేస్తాడన్న భయం రాజయ్యకి ఉంది. రాజయ్య తనని భుజాలపై మోసుకొని తీసుకెళ్ళటానికి అంగీకరించగానే రాక్షసుడు, రాజయ్యను తను కూర్చున్న బండ దగ్గరకు రమ్మని పిలిచాడు.


రాజయ్య అలాగే బండ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. ఆ రాక్షసుడు గభాల్న బండ మీద నుండి దూకి, రాజయ్య భుజాలపై రెండు వైపులా కాళ్ళు వేసి కూర్చున్నాడు.


రాజయ్య రాక్షసుడి బరువుకి ఊగిపోయాడు. కానీ నిగ్రహించుకొని స్థిరంగా నిలబడ్డాడు.


పాపాసురుడిని మోసుకుని బయలుదేరాడు రాజయ్య. రాక్షసుడి పాదాలు, రాజయ్య పొట్ట దగ్గర దాకా వచ్చాయి. రాజయ్య రాక్షసుడి కాళ్ళు పరిశీలిస్తూ చందొలు గ్రామం వైపు నడకసాగించాడు.


రాజయ్య నడుస్తునే, రాక్షసుడి కాళ్ళు, పాదాలు పరిశీలించసాగాడు. రాక్షసుడి కాళ్ళు, మడమల దాకా దృఢంగా ఉక్కు ముక్కల్లా ఉన్నా- వాడి పాదాలు మాత్రం తమలపాకుల్లా మృదువుగా ఉన్నాయి. ఇది చూసి రాజయ్యకు ఆశ్చర్యం కలిగి, ఆ మాటే రాక్షసుడ్ని అడిగాడు.


అప్పుడు రాక్షసుడు ఇలా చెప్పాడు. రేయ మానవుడా, నాకు ఒక ఋషి శాపం ఇచ్చాడు. ఆ శాపం ప్రకారం నేను నా కాళ్ళతో నడిస్తే తల పగిలి మరణిస్తానని దాంతో నేను, నడవ కుండా, నీలాంటి వాళ్ళ భుజాలు ఎక్కి ఎటైనా వెళ్తుంటాను.


రాక్షసుడి మాటలు విన్న రాజయ్య బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. ఈ రాక్షసుడు ఎట్టి పరిస్థితిలో నడిచిరాడు. కారణం వాడు నడిస్తే, ముని శాపం వలన తల పగిలి చస్తాడు. కనుక వీడిని ఎలాగైనా ఎక్కడైనా దింపితే, తను క్షేమంగా వాడి బారి నుండి తప్పించుకోవచ్చు. దాంతో ఆ రాక్షసుడిని ఎలాగైనా తన భుజాలుపై నుండి దింపాలని ఆలోచించసాగాడు. ఇంతలో వాళ్ళకి ఒక చెరువు కనిపించింది.


ఆ చెరువు చూడగానే రాక్షసుడు రేయ రాజయ్య! నన్ను చెరువులోకి తీసుకెళ్ళు స్నానం చేస్తాను అన్నాడు. సరే అని రాజయ్య రాక్షసుడిని మోసుకొని చెరులోకి దిగాడు.


రాక్షసుడు రాజయ్య భుజాల మీద నుండి చెరువులోకి ధడాల్న దూకాడు. ఆపై రాజయ్య చెరువు గట్టు మీదకి వచ్చి, చెరువులో స్నానం చేస్తున్న రాక్షసుడ్ని గమనించసాగాడు. రాక్షసుడు స్నానం చేసి సంవత్సరాలు అయినట్టుంది కాబోలు, హాయిగా ఆ చెరువులో ఈత కొడుతూ, స్నానం చేస్తున్నాడు.


సమయం చూసి రాజయ్య వేగంగా నడుచుకుంటూ చందొలు వైపు బయలుదేరాడు, అది గమినించిన రాక్షసుడు, రాజయ్యని గట్టిగా పిలిచాడు. అయినా రాజయ్య ఆ పిలుపు వినబడనట్టుగా ముందుకు సాగిపోయాడు. అలా వెళ్ళిపోతున్న రాజయ్యను ఆపాలంటే రాక్షసుడు నడిచి తీరాలి. నడిస్తే ఋషి శాపం ఫలించి తల పగిలి చస్తాడు.


కనుక రాక్షసుడు, రాజయ్యని నానా తిట్లు తిడుతూ ఆ చెరువులోనే ఉండిపోయాడు. ఆపై ఎవరు ఆ చెరువు వైపు నుండి వెళ్తున్నా, రాక్షసుడు వాళ్ళని పిలిచి, తనను బయటికి మోసుకెళ్ళమని ప్రార్థించేవాడు.


కానీ బ్రహ్మరాక్షసుడిని, కొరి, కొరి ఎవరు భుజాలకెత్తుకుంటారు. ఆ విధంగా రాజయ్య తెలివి, సమయ స్ఫూర్తి వల్ల రాక్షసుడి పీడా జనాలకి వదిలింది.


నీతి : బలం కన్నా తెలివి గొప్పది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)