సత్యవ్రతుడు | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

ఒకప్పుడు గురుశిష్యులిద్దరు అడవిదారిలో ప్రయాణం చేస్తు న్నారు. అవి శీతాకాలం రోజులు.


అడవంతా పచ్చగా కళకళలాడుతోంది. ఎండ తీవ్రత లేదు. నడుచుకుంటూ పోతున్నారు.


గురువు గారి పేరు సదానంద యోగి. శిష్యుడి పేరు శాకాంబరుడు.


శాకాంబరుడు అంటే అర్థం తెలుసుగదా.. శాకము అంటే ఆకులు అలములు మొదలయిన వాటిని శాకములంటారు. అంబరం అంటే వస్త్రము. శాకములను వస్త్రముగా ధరించిన వాడని అర్థం. శాకాంబరీ దేవి అమ్మవారికి పేరు కూడా వుంది.


సరి అసలు విషయానికొద్దాం.


ఈ సదానంద యోగి మహాజ్ఞాని.


సకల శాస్త్రాలు సకల ధర్మాలు బాగుగా తెలిసిన వాడు. యోగవిద్యల మర్మం ఎరిగిన వాడు. దైవాన్ని ప్రసన్నం చేసుకున్న సిద్ధయోగి. ఆయన వయసు డెభ్భై దాటినా యువకుడిలా ఎంత దూరమైనా కాలినడకనే ప్రయాణం చేస్తాడాయన.


సదానందయోగికి శిష్యులు చాలామంది ఉన్నారు. కాని యువకుడయిన శాకాంబరుడు ఆయన ప్రియశిష్యుడు. ఎక్కడికి వెళ్ళినా అతన్నే తోడు తీసుకుని సాగిపోతాడాయన.


కదళీ వనంలో గాయత్రీ యాగం చేస్తున్నట్టు రాజుగారి నుంచి ఆహ్వానం అందింది. అక్కడికే ఈ ప్రయాణం. దారిలో మార్గాయాసం తెలీకుండా శాకాంబరుడు తన సందేహాలను అడుగుతుంటాడు. ఆయన నివృత్తి చేస్తుంటాడు. అలా కబుర్లు చెప్పుకుంటూ ఎంత దూరమైనా సాగిపోగలరు.


“గురువుగారూ... లోకంలో ఎన్నో వ్రతాలు వున్నాయి గదా. వాటిలో ఉత్తమమైన వ్రతం ఏది?” అంటూ ఒక సందేహం వెలిబుచ్చాడు శాకాంబరుడు.


"సత్యవ్రతాన్ని మించిన వ్రతం లేదు నాయనా.. వెంటనే బదులిచ్చాడు సదానంద యోగి. " అంటూ


“అర్థం కాలేదు స్వామీ” అన్నాడు శాకాంబరుడు.


“చెప్తాను విను. దైవ కృప కోసం మనం ఏం చేస్తామో అది పూజ. మనం ఏదయితే ఆచరిస్తామో అది అచారం.


ఏం చేస్తే మంచిది అనుకుంటామో అది ఉత్తమమైనది గౌరవప్రదమైనది.


అలాగే ఏది సత్యమో గుర్తించి ఆచరిస్తామో అది సత్యవ్రతం. వ్రతదీక్షలు ఎన్ని వున్నా సత్యవ్రతాన్ని మించింది లేదు. హరిశ్చంద్రుడి గాథ నీకు తెలసు గదా?”


“తెలుసు గురువుగారూ.. హరిశ్చంద్ర మహారాజు చేత అబద్ధం పలికించాలని విశ్వామిత్ర మహర్షి పెట్టిన తిప్పలు మర్చిపోగలమా!” “అవును. సత్యం పలకటమే ఈ వ్రత నియమం. ఎన్ని కష్టాలు వచ్చినా ఆఖరికి ప్రాణం మీదికి వచ్చినా కూడా ఆడినమాట తప్పకూడదు.


నిజం తప్ప అబద్ధం పలుకరాదు. సత్ప్రవర్తన ఎల్లప్పుడూ సత్యం పలికేవారికి ఆ సత్యదేవుని కృపాకటాక్షాలు ఎప్పుడూ వుంటాయి. విజయం వరిస్తుంది” అంటూ వివరించారు గురువుగారు.


“అలాగా గురువుగారూ.. అయితే నేనెప్పుడూ నిజాయితీగా వుంటాను. అసత్యం పలుకను” అన్నాడు శిష్యుడు.


“అదంత సులువు కాదు నాయనా. సత్యవ్రతం అంటే మాటలు కాదు. అసిధారా వ్రతం వంటిది. అంటే కత్తి మీద సాము లాంటిదన్న మాట. నీకిప్పుడు అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు అర్థమవు తుంది.”


మౌనంగా తల వూపాడు శిష్యుడు శాకాంబరుడు.


ఇద్దరూ అలా నడుచుకుంటూ భోజన వేళకు ఒక కొండ వాగు వద్దకు చేరుకున్నారు. అక్కడే భోంచేసి ఒకింత సేద తీరాలని గురువుగారు ఆశించి వాగు ఒడ్డునే వటవృక్షం కింద మకాం చేసారు.


 అంతలో ఒక బాటసారి రొప్పుతూ రోజుతూ వేగంగా అటుగా పరిగెత్తుకు వచ్చాడు.


అతను గురుశిష్యుల్ని చూడలేదు. కంగారుగా వస్తూ వటవృక్షం వెనుక ఒక పొదలోకి పోయి దాక్కున్నాడు.


అతను ఎవరో ఏమిటో తెలీదు. నడివయసు వ్యక్తి. ఒంటి మీద బంగారు ఆభరణాలున్నాయి. భుజాన బరువుగా సంచి వుంది. వ్యాపారస్తుడిలా వున్నాడు. అతన్ని గమనించిన శాకాంబరుడు ఏదో అడగబోతుంటే వారించాడు గురువు.


వెంట తెచ్చుకున్న చద్ది విప్పుకుని భోంచేస్తూ కూర్చున్నారు.


కాస్సేపటికి పొడవాటి కర్రలు, కత్తులు ధరించిన ఆరుగురు దొంగలు అటుగా పరిగెత్తుకు వచ్చారు. గురుశిష్యుల్ని చూసి ఆగారు. సాధువులు, సన్యాసుల దగ్గర బూడిద తప్ప దోచుకోవటానికి ఏమీ ఉండదని వాళ్ళకి తెలుసు.


దొంగల్లో ఒకడు ముందుకొచ్చి పలకరించాడు.


"ఇదిగో సాములూ... ఒక మనిషి ఇటుగా పారిపోయి వచ్చాడు. మీరు చూసారా?” అనడిగాడు.


“ఆ... ఆఁ... చూసాం” అన్నారు తాపీగా గురువుగారు. “ఎక్కడ వాడు?” మళ్ళీ అడిగాడు దొంగ.


గురువుగారు ఆ మనిషి దాక్కున్న చోటు చెప్పేస్తారని అనుకున్నాడు శిష్యుడు. కాని గురువుగారు మాత్రం అలా చెప్పలేదు. "అతడు యిలా వాగుకి అడ్డంపడి ఆ వెదురు డొంకల్లోని తూర్పు దిక్కుగా పరిగెత్తటం చూసాం” అన్నాడాయన.


ఆ మాట వింటూనే దొంగలు వాగులో దిగి అవతలున్న వెదురు డొంకల్లో ప్రవేశించి తూర్పు దిక్కుగా పరిగెత్తారు. మళ్ళీ వెనక్కు రాలేదు వాళ్ళు.


శిష్యుడు శాకాంబరుడు నమ్మలేకపోతున్నాడు. గురువుగారు అబద్ధ మాడారు.


సత్య వ్రతం గురించి చెప్పిన గురువుగారు యిలా అసత్యం పలకటం ఏమిటి? ఆశ్చర్యపోయాడు.


గురువు సదానంద యోగి మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఆ మనిషి దాక్కున్న పొద వైపు చూసారు. పొదలోకి వ్యక్తి ఇవతలకు వచ్చి చేతులు జోడించాడు.


“వాళ్ళు తిరిగి వచ్చినా రావచ్చు. వెంటనే వెళ్ళిపో" అంటూ హెచ్చరించి అతన్ని పంపివేశాడు గురువు.


ఇద్దరూ చద్ది తిని లేచాక ఇక ఆపుకోలేక తన సందేహాన్ని అడిగేసాడు శిష్యుడు శాకాంబరుడు.


“గురువుగారూ.. అసత్యం మహా పాపమని తెలిసి కూడా మీరు అసత్యం పలికారు. ఆ దొంగలకు అబద్ధం చెప్పారు. ఇందులో వున్న ధర్మ సూక్ష్మం అర్థం కాలేదు” అన్నాడు.


“పిచ్చివాడా నేను ముందే చెప్పా గదా.. సత్యవాక్కు పరిపాలన అంటే కత్తి మీద సాము లాంటిదని. ఇప్పుడు నేను నిజమే చెప్పాననుకో.. ఆ దొంగలు క్రూరంగా అతన్ని చంపి నగలూ, ధనమూ దోచుకుపోతారు.


అతన్ని చంపిన పాపం ఎవరిది? అతన్ని పట్టిచ్చినందున ఆ హత్యా దోషం మనకు తగులుతుంది. ధన మాన ప్రాణాలకు హాని కలిగే సమయంలో అబద్ధం చెప్పొచ్చు. ఎవరికీ అపకారం చేయని అబద్ధం మూలంగా ఏ పాపం అంటదు. నేను చెప్పిన అసత్యం ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. కాబట్టి దోషం లేదు” అంటూ వివరించాడు సదానందయోగి.


గురువు మాటలకు సంతృప్తి చెందాడు శాకాంబరుడు. అప్పటకి పొద్దు తిరగటంతో గురుశిష్యులిద్దరూ తిరిగి తమ ప్రయాణాన్ని ముందుకు సాగించారు.


నీతి: సమయాను కూలంగా వ్యవహరించాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)