కంకిపాడు అనే గ్రామంలో శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా తెలివి గలవాడు. కానీ డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే కక్కూర్తి గల మనిషి. ఈ శర్మ ఏంచేసినా డబ్బు కోసమే చేస్తాడు. వడ్డీ వ్యాపారం చేసి, అధిక వడ్డీ గుంజి బాగా సంపాదించాడు. గ్రామంలో ఒక ఇల్లు, దగ్గరలో ఉన్న పట్టణంలో రెండు ఇల్లు నిర్మించుకున్నాడు.
ఒకరోజు ఆ గ్రామానికి నలుగురు వ్యాపారులు వచ్చి బట్టలు, ఇతర సుగంధ ద్రవ్యాలు అమ్మి బాగా డబ్బు సంపాదించారు. ఆ తర్వాత సంపాదించిన డబ్బుని వజ్రాలుగా మార్చి, నాలుగు వజ్రాలు కొన్నారు. ఒక్కొక్క వ్యాపారీ, ఒక వజ్రం చొప్పున తీసుకున్నారు.
ఆ తర్వాత వాళ్ళు వాళ్ళుండే నగరానికి తిరుగు ప్రయాణం కట్టారు. అయితే కాకతాళాయంగా శర్మ కూడా ఆ రోజే నగరానికి ప్రయాణం కట్టాడు. ముందు వ్యాపారులు నడుస్తున్నారు. వాళ్ళ వెనుకగా కాస్త దూరంలో శర్మ నడుస్తున్నాడు.
ఇంతలో వాళ్ళకి ఒక అడవి ఎదురయింది. ఆ అడవిలో దొంగల బాధ అధికం అని ఆ వ్యాపారులు విని ఉన్నారు. దొంగలు ఎదురు పడి బాధిస్తే, వాళ్ళకి చిక్కాకుండా ఆ వజ్రాలని ఎలా కాపాడుకోవాలి అని ఆ వ్యాపారులు చింతించసాగారు. వాళ్ళు ఒక బావి గట్టున ఆగి దాహం తీర్చుకొన్నారు.
అప్పుడు వారిలో ఒక వ్యాపారికి తట్టింది. ఆ వజ్రాల్ని దొంగల కటం పడకుండా దాచే విధానం. అతను వెంటనే మిగిలిన వర్తకులతో ఇలా అన్నాడు.
సోదరులారా! మనం మన వజ్రాలని మింగేసామంటే ఆ దొంగలు చచ్చిన అవి ఎక్కడున్నాయో తెలుసుకోలేరు. ఆ తర్వాత మన నగరం చేరినాక, ఇళ్ళకు వెళ్ళి ఏదో విధంగా ఆ వజ్రాన్ని పొట్ట నుండి బయటికి తీసుకోవచ్చు. అతని మాటలకి మిగిలిన వ్యాపారులు సంతోషించి, బావిలోంచి కాసిని నీళ్ళు తొడి ఒక్కొక్క వర్తకుడు, ఒక్కొక్క వజ్రాన్ని మింగి కాసిని నీళ్ళు తాగారు. వాళ్ళ వెనకగా వస్తూ, వాళ్ళ మాటలు విన్న శర్మ ఈ విధంగా ఆలోచించాడు.
“వీళ్ళకి ఇప్పుడు దొవలో దొంగలు ఎదురుపడటం ఖాయం. అప్పుడు దొంగలు వీళ్ళని సోదా చేసి ఏమీ దొరక్కపోతే, వీళ్ళను చంపేస్తారు. అప్పుడు చచ్చిన వీళ్ళని వదిలేసి దొంగలు వెళ్ళిపోతారు. అప్పుడు నేను వీళ్ళ పొట్టలు చీల్చి, వీళ్ళ పొట్టల్లో ఉన్న ఆ నాలుగు వజ్రాలు కులాసాగా సొంతం చేసుకుంటాను.
శర్మ ఇలా ఆలోచిస్తూ, వ్యాపారుల వెనుకగా నడుస్తున్నాడు. శర్మ తమ వజ్రాలపై కన్ను వేసాడని తామ చావుకై గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్నాడని పాపం ఆ అమాయక వ్యాపారులకి తెలియదు.
అయితే అనుకొని విధంగా ఆ వ్యాపారుల్ని, శర్మని దొంగలు ఎదుర్కొలేదు. ఆ అడవిలో ఉండే ఒక అనాగరిక అడవి మనుషులు ఎదుర్కొన్నారు. ఆ ఆట వికుల దగ్గర ఒక రాబందు ఉన్నది. అది ఎవరైనా, సంపదతో ఆ మార్గాన వెళుతుంటే పెద్దగా అరుస్తుంది.
ఆ అరుపు విన్న అడవి మనుషలు చాలా దూరం నుండే డబ్బు, దస్కం ఉన్న ప్రయాణీకులు అటు వైపుగా వస్తున్నారని గ్రహించి, ఆ మార్గంలో మాటువేసి ప్రయాణీకుల దగ్గరగా రాగానే వాళ్ళ దగ్గరున్న సంపదలు దొచుకొని వాళ్ళని చంపేస్తారు. ఇదీ వాళ్ళు తర, తరాలుగా చేస్తున్న పని.
చివరికి అనుకున్నంత అయింది. అనాగరిక అడవి మనుషులు వ్యాపారుల్ని, శర్మని బంధించారు. ఆ తెగ నాయకుడు నల్లగా, ఎత్తుగా, భయంకరంగా ఉన్నాడు.
అతడు వ్యాపారుల వద్దకు వచ్చి పెద్దగా గర్జించాడు. రేయ్, మర్యాదగా మీ దగ్గరున్న డబ్బు, నగలు ఇచ్చేసి ప్రాణాలు దక్కించుకోండి. ఆ ఆటవిక నాయకుడి బెదిరింపుకి వ్యాపారులు గడ, గడలాడిపోయారు. అప్పుడు శర్మ ఇలా అనుకున్నాడు.
ఈ దొంగల నాయకుడు వ్యాపారుల్ని చంపి అయినా సరే, వాళ్ళు పొట్టల్లో దాచుకున్న వజ్రాలు తీసుకొని తీరతాడు. తానూ ఎలాగూ, వాళ్ళ చేతిలో చావక తప్పదు. కనుక తానే ముందు వాళ్ళ చేతుల్లో ముందుగా మరణిస్తే, తన పొట్టలో వజ్రం లేదు కాబట్టి, మిగిలిన వాళ్ళ పొట్టల్లో కూడా ఏమీ ఉండవని భావించి వాళ్ళనైనా వదిలేస్తాడు. శర్మ అలోచనలు ఇలా ఉండగా, అటు ఆటవిక నాయకుడు పెద్దగా అరుస్తున్నాడు.
ఓరేయ్ నా రాబందు దగ్గర సంపదలేని వాళ్ళని చూసి అరవదురా, నిజం చెప్పండి. డబ్బు, నగాలు ఎక్కడ దాచారు అని. వ్యాపారులు ఏం చెప్పాలో అర్థంకాక గుటకలు మ్రింగుతున్నారు. అప్పుడు శర్మ ఆటవిక నాయకుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు.
“ఓరి నాయకా! మా వద్ద ఏ సొత్తు లేదని చెపితే నీవు నమ్మటం లేదు. అందర్నీ చంపి, పొట్టలు చీల్చి మరీ సంపద కోసం వెదుకు దామని చూస్తున్నావు. నీకంత అప నమ్మకంగా ఉంటే, ముందు నన్ను చంపి, నా పొట్టచీల్చి చూసుకో, నా పొట్టలో ఏమీ లభించని పక్షంలో మిగిలిన వారి పొట్టల్లో కూడా ఏమీ ఉండవని భావించి వాళ్ళని వదిలేయ్!
అప్పుడు ఆ తెగ నాయకుడు తన పెంపుడు రాబందు ఎప్పుడూ, అబద్ధం చెప్పదనీ, వాళ్ళ దగ్గర ఏదో ఒక సంపద ఉండి తీరుతుందని అన్నాడు. సరే నీ మాట కూడా ఎందుకు నిర్లక్ష్యం చెయ్యాటం. ముందు నిన్ను చంపి, నీ పొట్ట చీల్చి చూస్తాను, పొట్టలో ఏమీ లేకుంటే, ఈ వ్యాపారులు పొట్టల్లో కూడా ఏమీ ఉండవని నిర్ణయించి, వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తా అన్నాడు. ఆ తర్వాత శర్మ తల నరికి చంపారు. తర్వాత అతని పొట్ట చీల్చి చూడగా, అందులో ప్రేగులు, రక్తం తప్ప, ఏ డబ్బు బంగారం లేవు. దాంతో ఆ తెగ నాయకుడు తన రాబందు పొరపాటు పడిందని విశ్వశించి, మిగిలిన నలుగురు వ్యాపారుల్ని బంధ విముక్తుల్ని చేసి, వెళ్ళి పొమ్మని చెప్పాడు.
దాంతో ఆ వ్యాపారులు బ్రతికించావు దేముడా అనుకొని, తమ నగరం వైపు దాదాపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. శర్మ ఎంత నీచుడైనా, తన చావు ద్వారా మిగిలిన నల్గురికి ప్రాణదానం చేసాడు. తన ప్రాణాన్ని బలిదానం చేసి, తోటి మానవుల్ని కాపాడాడు.
నీతి : అన్ని దానాలలోకి తనని తానే ఇతరుల కోసం బలి పెట్టుకోవటమే గొప్పదానం అవుతుంది.