దుర్యోధనాదుల జననం | మహాభారతం | The Birth of Kauravas | Mahabharatham | Ep-05

writer
0

అప్పుడు సత్యవతి సిగ్గుపడుతూ తాను పడవ నడిపే రోజులలో పరాశరమహర్షికి కృష్ణద్వైపాయనుణ్ణి కన్న వృత్తాంతం చెప్పి," అతను నా కొడుకు. గొప్ప తపస్సు చేసినవాడు. వేదాలను విభజించినవాడు. అతని ద్వారా భరతవంశాన్ని నిలబెట్టుదాం,” అన్నది.


అందుకు భీష్ముడు సమ్మతించాడు. సత్యవతి తలుచుకోగానే కృష్ణద్వైపాయను డనే వ్యాసుడు వచ్చి, "అమ్మా, నన్నెం దుకు తలుచుకున్నావు ?" అని అడిగాడు. సత్యవతి ఆయనకు తన ఉద్దేశం చెప్పింది. వ్యాసుడు సమ్మతించాడు.


తరువాత సత్యవతి అంబికను ఆ రాత్రి అలంకరించుకుని పడుకోమనీ, ఆమె వద్దకు ఆమె " బావ " వస్తాడనీ, అతనికి సంతానం కని వంశం నిలబెట్టమనీ చెప్పింది. "బావ" అంటే భీష్ముడే కాబోలునని అంబిక అనుకున్నది. కాని ఆ రాత్రి ఆమె గదిలోకి వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడి గడ్డమూ, నల్లని ఆకారమూ, ఎర్రని కళ్ళూ చూసి అంబిక భయపడి కళ్ళు గట్టిగా మూసుకున్నది. ఆమె వ్యాసుణ్ణి అంతకు పూర్వం చూసి ఉండలేదు. ఆమె కళ్ళు మూసుకున్న దోషం చేత ఆమెకు పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయాడు.


ఇది చూసి సత్యవతి హతాశురాలై మళ్ళా వ్యాసుణ్ణి తలచుకున్నది. ఈ సారి ఆమె అంబాలికతో, "ఈ రాత్రి నీ వద్దకు ఒక ముని వస్తాడు. అతని ద్వారా ఒక ఉత్తముడైన కొడుకునుకని వంశం నిలబెట్టు," అన్నది.


ఆ రాత్రి అంబాలిక వ్యాసుడి అవతారం చూసి, కళ్ళు మూసుకోలేదు గాని, వెలవెల పోయింది. దాని ఫలితంగా తెల్లని శరీ రంతో పాండుడు పుట్టాడు.


సత్యవతికి తృప్తి కలగలేదు. ఆమె మరొకసారి అంబికను హెచ్చరిస్తూ, " ఈసారయినా మునికి తగిన కొడుకును కను,” అన్నది. కాని వ్యాసుణ్ణి తలుచుకుంటే కంపరం పుట్టుకొచ్చి, ఆమె ఆ రాత్రి తన దాసీని తన పడక గదిలో ఉంచింది. ఆ దాసీ దానికి వ్యాసుడి వల్ల విదురుడు పుట్టాడు.


ఈ విధంగా పుట్టిన ధృతరాష్ట్రుడూ, పాండుడూ, విదురుడూ పెరిగి పెద్దవారవు తూంటే భీష్ముడు రాజ్యభారం వహించి, దేశం సుభిక్షంగానూ, ప్రజలు సుఖశాంతులు కలిగి ఉండేటట్టూ రాజ్యపాలన చేశాడు. భీష్ముడు వారికి క్షత్రియోచిత విద్యలూ, వేదవేదాంగాలూ, నీతిశాస్త్రాలూ, నేర్పించాడు.


వారిలో ధృతరాష్ట్రుడు అమిత బలశాలి, పాండుడు ధనుర్విద్యలో ప్రవీణుడు, విదురుడు ధర్మపరుడు.


కాలక్రమాన భీష్ముడు ఆ ముగ్గురిలోనూ ఒకరికి రాజ్యాభిషేకం చెయ్యవలసి వచ్చింది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. విదురుడు దాసీ పుత్రుడు. అందుచేత వారిద్దరికీ కాక పాండుడికి భీష్ముడు రాజ్యాభిషేకం చేశాడు.


కుర్రవాళ్ళకు వివాహయోగ్యమైన వయసు వచ్చింది. వాళ్ళకు తగిన కన్యలు ఎక్కడ ఉన్నారా అని భీష్ముడు ఆలోచిం చాడు. గాంధార రాజైన సుబలుడికి గాంధారి అనే కూతురున్నది. ఆమె తనకు నూరుగురు కొడుకులు కలిగేటట్టుగా శివుడి వల్ల వరం పొందినట్టు తెలిసింది. భీష్ముడు కొందరు బ్రాహ్మణులను సుబలుడి దగ్గిరికి పంపి, గాంధారిని ధృతరాష్ట్రుడి కిచ్చి వివాహం చెయ్యమని అడిగించాడు. ధృత రాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి కూడా అతని వంశం గొప్ప దనుకుని సుబలుడు ఒప్పు కున్నాడు. తనకు కానున్న భర్త గుడ్డి వాడని తెలియగానే గాంధారి తన కళ్ళకు గంతలు కట్టేసుకుని, తాను కూడా గుడ్డి దిగా ఉండిపోవ నిశ్చయించింది. ఆమె అన్న శకుని ఆమెను హస్తినాపురానికి తీసుకువచ్చి పెళ్ళి జరిపించాడు. తర వాత శకుని భీష్ము డిచ్చిన సత్కారాలన్నీ పొంది, గాంధారిని హస్తినాపురంలో వదిలి, తాను స్వదేశానికి తిరిగిపోయాడు.


ఇక పాండురాజుకు వివాహం కావలసి ఉన్నది. భీష్ముడికి కుంతి అనే యాదవ కన్యను గురించి తెలియ వచ్చింది.


యాదవ ప్రముఖులలో ఒకడైన శూరు డనేవాడు వసుదేవుడి తండ్రి. ఆయనకు పృథ అనే కూతురున్నది. శూరుడి మేనత్త కొడుకు కుంతిభోజు డనేవాడికి పిల్లలు లేక పోగా అతను ఈ పృథను తన కూతురుగా పెంచుకున్నాడు. కుంతిభోజుడి ఇంటికి వచ్చేపోయేవారి కందరికీ పృథ అతిథి సత్కారాలు చేస్తూ ఉండేది. అలాగే ఒక సారి దూర్వాసుడు వచ్చి, ఆమె చేసిన సత్కారాలకు సంతోషించి, ఆమెకు ఒక మంత్రం చెప్పి, "అమ్మాయీ, ఈ మంత్రాన్ని పునశ్చరణ చేసి జపించా వంటే నువు ఏ దేవుణ్ణి కోరితే ఆ దేవుడు వచ్చి నీకు ఒక గొప్ప కొడుకును ప్రసాదిస్తాడు," అని చెప్పాడు.


ముని మాట నిజమో కాదో చూతామని ఆ కుంతి ఒకనాడు సూర్యుణ్ణి మనసులో పెట్టుకుని మంత్రం జపించింది. వెంటనే సూర్యుడు ఆమె ఎదట ప్రత్యక్షమయాడు. ఆమె కొడుకును 'కోరలేదు. అయినా సూర్యుడి వల్ల గర్భవతి కావటం తప్పలేదు. సకాలంలో ఆమెకు కవచకుండలాలు గల కొడుకు పుట్టాడు. ఏం చెయ్యాలో తెలి యక వాణ్ణి ఒక పెట్టెలో పెట్టి, ఆ పెట్టెను ఒక తెప్పకు కట్టి నదీ ప్రవాహంలో వది లింది. అది ఒక సూతుడికి దొరికింది. సూతుడు ఆ పెట్టెలో చిన్న సూర్యుడిలాటి పిల్లవాడుండటం గమనించి, ఆ పిల్లవాణ్ణి తన భార్య అయిన రాధ అనే ఆమె కిచ్చాడు. ఆమె ఆ కుర్రవాణ్ణి పెంచింది. అతనే కర్ణుడు.


ఇది జరిగాక కుంతిభోజుడు తన కుమా ర్తెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి పాండుడు కూడా వెళ్ళాడు. కురు వంశంలో పుట్టి, ఎంతో అందంగానూ, వైభవోపేతుడుగానూ కనిపించిన పాండుడి మెడలో కుంతి వరమాల వేసింది. కుంతి భోజుడా యిద్దరికీ ఘనంగా పెళ్ళిచేసి, అంతులేని కానుకలతో హస్తినాపురానికి పంపాడు. కుంతి కోసం ఒక ప్రత్యేకమైన అంతఃపురం ఏర్పాటయింది. అందులో కుంతీ పాండులు సమస్త సుఖాలూ అనుభవించసాగారు.


పాండుడికి మరొక భార్యను కూడా పెళ్ళిచేయాలని భీష్ముడు నిశ్చయించాడు. మద్రరాజైన శల్యుడికి ఒక చెల్లెలున్నది. భీష్ముడు పెద్ద పరివారంతో శల్యుడి రాజధానికి బయలుదేరి వెళ్ళాడు.


శల్యుడు భీష్ముడికి ఎదురువచ్చి, స్వాగతం తెలిపి తీసుకుపోయి, ఆయన వచ్చిన పని అడిగాడు.


"నీ చెల్లెలు మాద్రిని మా పాండురాజు కిచ్చి పెళ్ళి చెయ్యి,” అన్నాడు భీష్ముడు. "అంతకంటె నాకైనా కావలిసినదేమున్నది? అయితే కన్యాశుల్కం పుచ్చుకోవటం మా వంశాచారం. కన్యాశుల్కం ఇచ్చి మా చెల్లెలిని తీసుకుపోయి తీసుకుపోయి మీ ఇంట వివాహం చేసుకోండి," అన్నాడు శల్యుడు.


వంశాచారాలను పాటించక తప్పదు గనక భీష్ముడు మద్రరాజుకు బంగారమూ, రత్నాభరణాలూ, వస్త్రవాహనాలూ పుష్క లంగా ఇచ్చి, మాద్రిని హస్తినాపురానికి తెచ్చి, ఒక శుభముహూర్తాన పాండురాజు కిచ్చి వివాహం చేశాడు. పాండురాజు తన ఇద్దరు భార్యలతోనూ సుఖంగా కాలం గడపసాగాడు.


భార్యలతో ఒకనెల పాటు సుఖంగా సుఖంగా గడిపిన తరువాత పాండురాజుకు దిగ్విజయం చెయ్యాలన్న కోరిక కలిగింది. అతను చతురంగ బలాలను సమకూర్చుకుని, ప్రయాణభేరి మోగించి, భీష్ముడు మొదలైన వారికీ, బ్రాహ్మణులకూ మొక్కి మొదట దశార్ణ దేశాలను జయించాడు. తరవాత మగధదేశం మీద దండెత్తి, మగధ రాజును చంపాడు. మగధ, కాశీ, పుండ్ర మొదలైన దేశాలు జయించి, అంతులేని కానుకలనూ, కప్పాలనూ పుచ్చుకుని పాండురాజు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. భీష్ముడు మొదలైన పెద్దలు పాండుడికి ఎదురువచ్చి గొప్పగా సన్మా నించారు. పాండురాజు తాను వివిధ దేశాలలో కొల్లగొట్టిన సంపదను భీష్ముడికి, సత్యవతికీ, విదురుడికీ, తమ తల్లులకూ పంచాడు. అందరూ సంతోషించారు. ఆ ధనంతోనే ధృతరాష్ట్రుడు అనేక అశ్వ మేధాలు చేశాడు.


తరువాత పాండురాజు తన యిద్దరు భార్యలనూ వెంట బెట్టుకుని విహారం చెయ్యటానికి హిమవత్ప్రంతంలోని అర ణ్యాలకు వెళ్ళాడు. అక్కడ అతను చాలా కాలం ఉన్నాడు. అతనికి అవసరమైన వస్తువులను ధృతరాష్ట్రుడు పంపుతూ వచ్చాడు.


అక్కడ హస్తినాపురంలో భీష్ముడు విదురుడికి దేవకు డనే రాజు యొక్క కుమార్తె నిచ్చి పెళ్ళి చేశాడు.


ఒకనాడు ధృతరాష్ట్రుడి ఇంటికి వ్యాసుడు చాలా ఆకలితో వచ్చాడు. గాంధారి ఆయనకు సకలోపచారాలు చేసి సంతోష పెట్టింది. వ్యాసుడామెను వర మేదన్నా కోరుకోమన్నాడు. గాంధారి తన భర్తకు తీసిపోని కొడుకులను నూరుమందిని కోరింది.


తరవాత కొంత కాలానికి గాంధారి గర్భ వతి అయింది. ఆమె రెండేళ్ళపాటు గర్భాన్ని మోసింది. ఈ లోపుగానే కుంతికి యుధిష్ఠిరుడు పుట్టినట్టు వార్త వచ్చింది. వ్యాసుడు వరమిచ్చినా కూడా తన కింకా ప్రసవం కాలేదని బాధపడి, గాంధారి తన భర్తతోనైనా సంప్రతించకుండా, తన గర్భాన్ని గట్టిగా కొట్టుకున్నది. అందువల్ల ఆమెకు గర్భ స్రావమయింది. రెండేళ్ళు కష్టపడి మోసిన ఆ పిండం తాలూకు ఖండా లను ఆమె పారేద్దామనుకున్నది. ధృత రాష్ట్రుణ్ణి చూడవచ్చిన వ్యాసుడి కీ సంగతి తెలిసింది.


"ఏమిటి నువు చేస్తున్న పని?” అని ఆయన గాంధారి నడిగాడు.


గాంధారి ఏడుస్తూ, "మీరు నాకు నూరుగురు కొడుకులు కలిగేటట్టు వర మిచ్చారు. నేను రెండేళ్ళు గర్భవతిగా ఉండి కూడా పిల్లలను కనలేదు. ఇంతలో పాండురాజు భార్య అయిన కుంతికి చక్కని కొడుకు పుట్టినట్లు తెలిసింది. ఆ విచారంతో


నా పొట్టను నేనే కొట్టుకుని గర్భస్రావం చేసుకున్నాను. మీ వరం మాట ఏమో గాని ఈ గర్భం ఇలా ముక్కలు చెక్కలయింది,” అన్నది.


"నా వరం ఎన్నటికీ వ్యర్థం కాదు,” అంటూ వ్యాసుడు, గాంధారీ గర్భం నుంచి పడిన మాంస ఖండాలను నూరింటినీ చక్కగా చన్నీట కడిగించి, ఒక్కొక్క ఖండాన్ని ఒక్కొక్క నేతికుండలో పెట్టించ సాగాడు. అప్పుడు గాంధారి ఆయనతో, "ఈ నూరు ఖండాలూ నూరుగురు పిల్ల లవుతారు కాబోలు. వారితోబాటు ఒక ఆడ పిల్ల కూడా కలిగేటట్టు అనుగ్రహించండి. దౌహిత్రుల వల్ల కూడా పుణ్యలోకాలు కలుగుతాయి,” అన్నది.


ఆమె కోరిక సిద్ధించాలని వ్యాసుడు దీవించాడు. స్రావమైన గర్భాన్ని నూట ఒక్క ముక్క చేసి కుండలలో పెట్టించి వ్యాసుడు వెళ్ళిపోయాడు.


తరువాత ఒక్క సంవత్సరం గడిచే సరికి ఒక కుండ నుంచి మొదటి పిల్లవాడు పుట్టాడు. వాడు పుట్టగానే అనేక దుశ్శకునాలు కనబడ్డాయి. వాటిని చూసి ధృతరాష్ట్రుడు భయపడి, భీష్ముణ్ణి, విదు రుజ్జీ, మంత్రులనూ, పురోహితులనూ పిలి పించి, " ఇదివరకే మా వంశంలో యుధి ష్ఠిరుడు పుట్టాడుగదా, ఇప్పుడు పుట్టినవాడికి రాజ్యార్హత ఉంటుందా ? కొంచెం ఆలో చించి చెప్పండి,” అని అడిగాడు.


దానికి వాళ్ళు, "మహారాజా, వీడు పుట్టగానే దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. వీడు వంశనాశకుడు. వీణ్ణి వదిలెయ్యి. నూరుమంది కొడుకులలో ఒకడు లేకపోతే నేం?” అని అన్నారు. విదురుడు కూడా ఆ మాటే చెప్పాడు. కాని పుత్రప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు వాళ్ళ మాటలు విని పించుకోలేదు.


ఆ విధంగా మొట్టమొదట దుర్యోధనుడు పుట్టాడు. తరవాత క్రమంగా దుశ్శాసనుడూ, దుస్సహుడూ మొదలుగాగల కొడుకులూ, దుశ్శల అనే కూతురూ పుట్టారు.


గాంధారి గర్భవతిగా ఉన్న కాలంలో ఆమెకు బదులుగా తనకు పరిచర్యలు చెయ్యటానికి ధృతరాష్ట్రుడు ఒక వైశ్య స్త్రీని చేరదీశాడు. దుర్యోధనాదులు పుట్టిన యేడే ఆ స్త్రీ ధృతరాష్ట్రుడికి యుయుత్సు డనేవాణ్ణి కన్నది.


ధృతరాష్ట్రుడు తన కొడుకుల కందరికీ రాజోచిత విద్యలు నేర్పించి, వారి కందరికీ తగిన కన్యలను తెచ్చి వైభవంగా పెళ్లిళ్లు కూడా చేశాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)