పూర్వం చంద్రగిరిలో భద్రయ్యనే వ్యాపారి నివశించేవాడు. అతను చాలా మంచివాడు.
తనకు సంపాదించటమే కాదు.. అందులో కొంత పేద సాదలకు దానధర్మాలు చేయటం కూడా తెలుసు. మంచితనం మూలంగా అందరూ భద్రయ్యని అభిమానించేవారు.
అతను చంద్రగిరి చుట్టుప్రక్కలే కాదు సుదూర ప్రాంతాల్లో కూడా సరుకు తీసుకెళ్లి వ్యాపారం చేస్తూ బాగా సంపాదించాడు. సాటి వర్తకులు నష్టాల్లో వుంటే వారిని ఆదుకోవటమే కాదు, సలహాలిచ్చి వ్యాపారానికి సాయపడేవాడు.
ఇలా వుండగా ఒకసారి -
పక్కన చోళ దేశంలో సుగంధ ద్రవ్యాలకు కొరత ఏర్పడి మంచి గిరాకీ పెరిగిందని తెలిసింది.
దాంతో కావలసినంత సరుకు తీసుకుని కొందరు పనివాళ్ళతో బయలుదేరి చోళదేశం చేరుకున్నాడు.
సుగంధ ద్రవ్యాలకు నిజంగానే అక్కడ కొరత వుంది. తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకుంటేనే గదా లాభాలుంటాయి. భద్రయ్యకు వ్యాపార చిట్కాలు బాగా తెలుసు. విశేష అనుభవం వుంది. ఎక్కడ ఏ వస్తువులకు గిరాకీ వుంటే అక్కడ ఆ వ్యాపారమే చేస్తాడు.
ఆ విధంగా చోళదేశంలో అతడి సుగంధ ద్రవ్యాల వ్యాపారం ఎంతో లాభసాటిగా సాగింది. చేతిలో సరుకు అయిపోయింది. మరికొంత సరుకుతో ఇంకోసారి చోళదేశం రావాలని నిశ్చయించుకుని స్వస్థలమైన చంద్రగిరికి తిరుగు ప్రయాణమయ్యాడు. తనతో బాటు నలుగురు సేవకులు అంతా తమ ఎడ్ల బండి మీద బయలుదేరారు.
చోళదేశంలో తన సంపాదించిన ధనాన్ని ఒక తోలు సంచిలో వేసి చక్కగా మూతికట్టి తన దగ్గరే ఉంచుకున్నాడు. నమ్మి సేవకులకు కూడా ఎప్పుడూ ఇవ్వడు.
ఎంత నమ్మకస్తులయినా ఎప్పుడు ఏ దుర్బుద్ధి పుడుతుందో ఎవరికి తెలుసు? మనిషిని ప్రలోభ పెట్టే గుణం ధనానికి ఉంది గదా? అందుకే ఎప్పుడూ తన జాగ్రత్తలో తాను ఉండేవాడు భద్రయ్య.
కొంతదూరం వచ్చేసరికి పాపయ్య అనే వ్యాపారస్తుడు దారిలో కలిసాడు.
అందరూ వ్యాపారస్తులే కాబట్టి అరమరికలు లేకుండా కలసి ప్రయాణం చేసారు.
ఆ సమయంలోనే భద్రయ్య దగ్గర తోలు సంచిని పసిగట్టాడు పాపయ్య. దాన్నిండా బంగారునాణాలు!
పాపయ్య బుద్ధి మంచిది కాదు. అతను కపటి. మేకవన్నె పులి. మంచిగా వుంటూనే గోతులు తవ్వేస్తాడు.
కాని ఈ విషయాలు భద్రయ్యకు తెలీదు.
పాపయ్య కన్ను భద్రయ్య తోలు సంచి మీద పడింది. ఎలాగయినా ఆ సంచి కాజేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం ఏవో కబుర్లు చెబుతూ ప్రయాణంలో భద్రయ్యను అంటిపెట్టుకునే వున్నాడు.
చీకటి పడేసరికి వారంతా సింహపురి అనే వూరు చేరుకుని రాత్రికి ఒక సత్రంలో బస చేసారు. భోజనాలు చేసి పడుకున్నప్పుడు పాపయ్య అడిగాడు ఉదయం వేకువజామునే ప్రయాణం ఆరంభిద్దాం అని
కాని భద్రయ్య అంగీకరించలేదు.
“ఇక్కడ నుండి అడవి దారి. చోర భయం వుంది. ఏదో ఒక బిడారు గుంపు బయలుదేరే వరకూ ఆగటం మంచిది” అన్నాడు.
ఆ రాత్రి పాపయ్య ఆలోచించాడు.
భద్రయ్య తోలు సంచి కొట్టేయాలంటే ఇదే అదను. మళ్ళీ అవకాశం రాదు. వేకువనే వెళ్ళిపోవాలి అనుకున్నాడు.
మార్గాయాసంతో గాఢనిద్రలో వుండగా భద్రయ్య తోలుసంచిని సంగ్రహించాడు పాపయ్య. తన మనుషులిద్దర్నీ లేపి చడీ చప్పుడు కాకుండా వేకువనే ప్రయాణం ఆరంభించి తన దారిన వెళ్ళి పోయాడు.
తెల్లవారి చూస్తే ఏముంది? తన సంపాదన బంగారు నాణాలు దాచుకున్న తోలు సంచీ లేదు.
పక్కన పాపయ్య కూడా లేడు. జరిగిన మోసం అర్థమైంది. పనివాళ్ళు నలుగురూ తన యజమానికి జరిగిన నష్టానికి చాలా బాధపడ్డారు.
'ఆ సొమ్ము నాకు రాసి పెట్టి లేనట్టుంది. అందుకే పోయింది. అంతా మన మంచికే' అని సరిపుచ్చుకున్నాడు భద్రయ్య.
తమ వద్ద ఇప్పుడు ధనం లేదు గాబట్టి దొంగలు దోచుకు పోతారన్న భయం లేదు. అందుకే బాగా తెల్లవారగానే చంద్రగిరికి ప్రయాణమయ్యాడు భద్రయ్య.
వారి ఎడ్ల బండ్లు సాయంకాలానికి ఒక కొండవాగును చేరుకున్నాయి.
విశ్రాంతి కోసం అక్కడ ఆగారు. అంతలో ఒక బిడారు గుంపు వాగుదాటి అక్కడికొచ్చింది.
బిడారు నాయకుడు భద్రయ్యను గుర్తుపట్టి దగ్గరకొచ్చాడు. గతంలో చాలాసార్లు భద్రయ్య తన బిడారుతో ప్రయాణించాడు. అందుకే అతన్ని గుర్తించటంలో పొరబాటు పడలేదు.
“అయ్యా.. చాలా రోజుల తర్వాత కనిపించారు నమస్కారం” అన్నాడు.
"బాగున్నావా వీరబాహు? చోళదేశంలో వ్యాపారనిమిత్తం చాలా రోజులు వుండిపోయాను. అందుకే కనబడలేదు” అంటూ పలకరించాడు భద్రయ్య.
“మేం బాగున్నామయ్యా.. ఓసారి ఈ తోలుసంచీ చూడండి. తమదే అనుకుంటున్నాను” అంటూ బరువుగా వున్న తోలుసంచీ అందించాడు బిడారు నాయకుడు వీరబాహు.
ఆ సంచీని చూసి ఆశ్చర్యపోయాడు భద్రయ్య. అది తనదే.. అందులోని బంగారు నాణేలు... తన సంపాదన సొత్తంతా భద్రంగా వుంది. దేవుడి దయ వలన తన తోలు సంచీ తిరిగి దొరకటం ఆశ్చర్యం కలిగించినా, దాన్ని అపహరించిన పాపయ్య ఏమయ్యాడో అర్థంకాలేదు.
“నీ అనుమానం నిజమే వీరబాహు. ఇది నాదే. చోళదేశంలో చేసిన వ్యాపారం తాలూకు కష్టార్జితం. రాత్రి సింహపురి సతంలో నిద్రిస్తుండగా పాపయ్యనే వ్యాపారి దీన్ని తస్కరించుకు వెళ్లిపోయాడు” అంటూ వివరించాడు.
“అయితే ఆ పాపయ్యకు తగిన శాస్తి జరిగింది సామీ.. కిందటేడు మీరు నా బిడారుతో విజయనగరం వచ్చారు. అప్పుడు ఈ తోలు సంచీని మీరు ఖరీదు చేసారు. నేను పక్కనే వున్నాను. అందుకే చూడగానే మీ సంచీని గుర్తించగలిగాను.
జరిగినదేమంటే ముగ్గురు వ్యక్తులు అడవిదారిలో బండి మీద వస్తుండగా కొందరు దొంగలు దాడి చేసారు. ఆ దాడిలో బండి యజమాని మరణించాడు. పనివాళ్ళిద్దరూ పారిపోయారు. అంతలో అటుగా వస్తున్న మేము దాడి చేసిన దొంగల్ని చంపేసాము. చనిపోయిన యజమాని పాపయ్యే కావచ్చు. అతని వద్ద ఈ సంచీ దొరికింది” అంటూ జరిగింది చెప్పాడు బిడారు నాయకుడు వీరబాహు.
భద్రయ్య తన డబ్బు దొరికినందుకు ఎంతో సంతోషించాడు. అంతా మన మంచికే జరిగిందని ఆనందించాడు. పాపయ్యకు బదులు తను ప్రయాణించి వుంటే దొంగలకు తాను బలయి వుండేవాడు గదా... డబ్బు తిరిగి దొరికిన ఆనందంలో వేగంగా తమ వూరు చంద్రగిరికి ప్రయాణమయ్యాడు భద్రయ్య. పరుల సొమ్ముకు ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు పాపయ్య.
నీతి : పరుల సొమ్ముకు ఆశపడరాదు.