అమాయక చక్రవర్తి | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

 రాజశేఖరుడు చక్రవర్తి. మగధ దేశాన్ని పాలించే వాడు. పాటలీపుత్రం ఆయన రాజధాని. ఆ నగరం గురించి మీకు తెలసా? 


నేటి బీహారు రాష్ట్ర రాజధాని పాట్నా నగరం అని మీకు తెలుసు గదా! ఆ నగరం యొక్క ప్రాచీన నామమే పాటలీపుత్రం. మన భారతదేశంలోని ఘనకీర్తి వహించిన అనేక ప్రాచీన నగరాల్లో ఈ పాటలీపుత్రం ఒకటి.


చక్రవర్తి రాజశేఖరుడని చెప్పుకున్నాం గదా!


ఆయన చాలా ఘటికుడు. గండర గండడు. శతృభయం కరుడు. మహావీరుడు. అతని సామ్రాజ్యంలోని ప్రజలు సుఖశాంతుల్తో హాయిగా జీవించే వాళ్ళు. ప్రజారంజకమై సుస్థిర పరిపాలన అందించాడు రాజశేఖరుడు. అతడి మంత్రి సామంత దండ నాయకులు అంతా నీతి తప్పకుండా పరిపాలనలో చక్రవర్తికి సహకారం అందించేవారు.


అంతా బాగానే వుంది. కాని -


చక్రవర్తిలో కూడా ఒక బలహీనత వుంది. అదేమంటే-


పొగడ్తలంటే ఆయనకు మహాయిష్టం. పొగిడించుకొని మురిసిపోవడంలో తనకు తానే సాటి. తనను ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడేవారంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన చరిత్రను వీరగాధలుగా గానం చేసేవారంటే మరింత యిష్టం. తన మీద కవిత్వాలు చెప్పే పండితులంటే మరీ మరీ యిష్టం. అటువంటి వారికి భూరి విరాళాలు, కానుకలు ఇచ్చి సత్కారాలు సన్మానాలు చేసేవాడాయన.


అసలు ఆ పొగడ్తల్లోని సారూప్యాలు గాని కవిత్వ విలువలు గురించి గాని పట్టించుకునే వాడు కాదు. ఆలోచించేవాడు కాదు. పొగడ్తలంటే చాలు ధన, కనక, వస్తు, వాహనాల్ని బహుమతులుగా యిచ్చి పారేసేవాడు.


అమూల్యమైన దర్బారు సభా సమయంలో సగంపైగా ఈ భట్రాజు పొగడ్తలకే ఖర్చయి పోయి ప్రజా సమస్యలు చర్చకొచ్చేవి. కావు.


ఈ పరిస్థితి మంత్రి సామంతులకు నచ్చేది కాదు. ఎంత చక్రవర్తి అయితే మాత్రం చేతికి ఎముక లేనట్టు దానధర్మాలు చేస్తూంటే ఖజానా సంపద తరిగిపోకుండా వుంటుందా? అలాగని పన్నులు పెంచితే బాధలు పడేది దేశ ప్రజలే. ఫలితంగా అల్లర్లు, తిరుగుబాట్లు చెలరేగవచ్చు.


ఏం చెయ్యాలో అర్థం కాలేదు వారికి. చివరకు చక్రవర్తికి వాస్తవిక పరిస్థితుల్ని వివరించే బాధ్యతను పెద్దలంతా కలసి ఆస్థాన


విదూషకుడు, ప్రభువుకత్యంత సన్నిహితుడు అయిన వీరబాహుకు అప్పగించారు.


విదూషకుడు అంటే మీకు తెలుసు కదా!


హాస్యగాడు. హాస్యాన్ని పలికించి నవ్వులు పూయించేవాడు. తన వాక్చాతుర్యంతో వెకిలి చేష్టలతో ప్రభువున్ని సభికుల్ని నవ్వులతో ముంచెత్తేవాడు.


రాజ దర్బారుల్లో ఆస్థాన నర్తకీ మణులు, ఆస్థాన విద్వాంసులు, ఆస్థానగాయకులు, ఆస్థాన జ్యోతిష్యులు ఉన్నట్టే ఆస్థాన విదూషకులూ వుండేవారు.


రాచకార్యాల్లో ఎప్పుడూ మునిగితేలే ప్రభువుకు విశ్రాంతిని కాలక్షేపాన్ని సభికులకు వినోదాన్ని పంచటం ఈ విదూషకుల పని. అక్బర్ బాదుషా ఆస్థానంలోని బీర్బల్ గురించి మీరు వినే వుంటారు. అలాంటి వారన్నమాట.


మగధ ఆస్థాన విదూషకుడయిన వీరబాహు చతురుడే కాదు. చాలా తెలివైన వాడు.


జబ్బుకి ఏ మందు వాడాలో ఆస్థానవైద్యుడికి తెలిసినట్టు, ఏ నేరానికి ఏ శిక్ష వేయాలో ఆస్థాన న్యాయనిపుణులకు తెలిసినట్టు, ఏ సమయంలో రాజుగారికి ఎలా జ్ఞానోదయం కలిగించాలో వీరబాహుకి తెలుసు.


రాజుగారి పొగడ్తల కండూతి వీరబాహుకీ చికాగ్గానే వుంది. ఏదో ఒకటి చేయాలని అతనూ ఆలోచిస్తున్నాడు.


ఇప్పుడు పెద్దలు తన మీద బాధ్యత ఉంచటంతో ఏదో ఒకటి చేయక తప్పలేదు.


చక్రవర్తితో పరాచికాలు ఎంత ప్రమాదమో వీరబాహుకి తెలింది కాదు.


విదూషక వృత్తి కత్తి మీద సాము లాంటిది. ఒక్కోసారి హాస్యరసం వికటించి రాజాగ్రహానికి గురయ్యే ప్రమాదం వుంటుంది. తన తెలివిని ఉపయోగించి చాలాసార్లు అలాంటి ప్రమాదాల నుంచి బయటపడ్డాడు వీరబాహు.


అందుకే ఆచి తూచి అడుగు వేయదలుచుకున్నాడు.


అదను కోసం ఎదురుచూడసాగాడు. ఆ అవకాశం రానే వచ్చింది. ఒకరోజు దేశంలోని కొందరు జ్యోతిష్యులు, గాయకులు రాజదర్బారుకు వచ్చారు.


వాళ్ళంతా గొప్ప వాళ్ళు కారు. అయినా తమ మిడిమిడి జ్ఞానంతోనే ప్రభువులను పొగడ్తల్లో ముంచి గొప్ప గొప్ప బహు మానాలు కొట్టుకుపోవాలని పేరాశతో వచ్చారు.


"ప్రభూ! మీరు యోగ పురుషులు. ముల్లోకాల్లోనూ మీ అంత గొప్ప చక్రవర్తి లేరు. మీరు కారణ జన్ములు. గత పది జన్మలుగా మీరు మగధ వంశంలోనే పుట్టి ఈ భూమాతను పరిపాలిస్తున్నారు. ఇంకో పది జన్మలు పాలించబోతున్నారు. మీకు సాటి ఎవరూ లేరు” అంటూ ప్రభువును అతి పొగడ్తల్లో ముంచారు జ్యోతిష్యులు. ఇక గాయకులు మీరు ఇంద్రుడు చంద్రుడు అంటూ పాటలు ఎత్తుకున్నారు.


ఇదంతా గమనిస్తున్నాడు వీరబాహుడు. ఇదే మంచి సమయం అనుకున్నాడు. లేచి దర్బారు బయటి ద్వారం వద్దకు చేరుకుని సిద్ధంగా వున్నాడు.


కొంతసేపటికి చక్రవర్తి రాజశేఖరుని నుంచి గొప్ప గొప్ప బహుమానాలు పొందిన గాయకులు, జోతిష్యులు ఒక్కొక్కరే బయటకు బయలుదేరారు.


బయటి ద్వారం వద్ద సిద్ధంగా వున్న విదూషకుడు వీరబాహు వంగుని, బయటకొచ్చిన వాళ్ళను వచ్చినట్లు గాడిదలా ఎగిరి తన్నటం ఆరంభించాడు. కుయ్యో మొర్రో మంటూ వాళ్ళు ఒకటే గోల.


కొంతసేపటికి ఎలాగో భటుల ద్వారా విదూషకుడి వింత ప్రవర్తన గురించి చక్రవర్తి చెవులకు చేరింది. ఆయన కోపంతో మండి పడ్డాడు.


వెంటనే తన్నులు తిన్న వారిని, తన్నిన వానిని కూడా తన ముందు ప్రవేశ పెట్టమని ఆజ్ఞాపించాడు. భటులు వెంటనే రాజాజ్ఞను పాటించారు.


చక్రవర్తితో తాము తిన్న తన్నుల గురించి ఏడుపు ముఖంతో ప్రభువులకు మొరపెట్టుకున్నారు జ్యోతిష్యులు, గాయకులు. చక్రవర్తి నిప్పులు కురిసే కళ్ళతో వీరబాహును చూసాడు. ఆ క్షణంలో సభికులు వీరబాహుకి మరణదండన తప్పదనుకున్నారు.


కానీ వీరబాహు కొంచెం కూడా భయపడలేదు.


“దీనికి నీ సమాధానం ఏమిటి? మాచే సత్కారాలు పొందిన గొప్పవారు వీళ్ళంతా. వారిని గాడిద తోపులు తన్ని వారిని, మమ్మల్ని కూడా అవమానించావు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా?” అంటూ హుంకరించారు రాజశేఖరుడు.


“క్షమించాలి ప్రభూ. గత పది జన్మలుగా తమరే మా ప్రభువని ఈ జ్యోతిష్యులు శెలవిచ్చారు. ఆ మాట నిజమే ప్రభూ, కాని మా


గత జన్మల మీ అంత గొప్పవి కాదు ప్రభూ, నాకూ గతంలో పది జన్మలున్నాయి. మొదటి జన్మలో కప్పనై బెకబెకమని అరిచాను. వీళ్ళు రాళ్ళతో కొట్టారు.


రెండో జన్మలో కుక్కనై అరిచాను. అప్పుడూ రాళ్ళతో కొట్టారు. కరవబోతే తప్పించుకున్నారు. మూడో జన్మలో మేకనై పుట్టాను. కోసి మాంసం అమ్ముకున్నారు. నాలుగో జన్మలో ఎద్దునై పుట్టాను. బండి లాగలేదని చర్మం పగిలేలా కొట్టి హింసించారు ప్రభూ.. ఇలా పది జన్మల్లోనూ వీళ్ళు నా శత్రువులే, చివరకు కిందటి జన్మలో గాడిదనై పుట్టాను.


అప్పుడు వీపుమీద మోయలేనంత బరువు వేసి నేను నడవలేకపోతుంటే దుడ్డు కర్ర విరిగేలా రోజూ కొట్టేవారు. నాకు


వీళ్ళు జన్మజన్మల శతృవులు. జంతువులుగా వున్నపుడు వీళ్ళనేమీ చేయలేకపోయాను. ఇప్పుడు మానవ జన్మ ఎత్తాక కూడా ఎలా ఊరుకోగలను.


అందుకే గతజన్మల్లో చేయలేని పని ఇప్పుడు చేసి నా కసి, కోపం చల్లార్చుకున్నాను. వీళ్ళు జ్యోతిష్యులు కదా.. నేను చెప్పింది నిజమో అబద్ధమో వారినే అడగండి ప్రభూ!” అంటూ తన తన్నులకి కారణాన్ని వివరించాడు వీరబాహు.


అంతే ఒక్కసారిగా సభ నవ్వుల మయం అయింది. అతడి వాదన వినగానే జ్యోతిష్యుల గొంతులో వెలక్కాయ అడ్డం పడినట్లయింది.


అవునంటే గతజన్మల్లో జీవహింస చేసిన పాపానికి ఈ జన్మలో శిక్ష తప్పదు. కాదంటే రాజుగారికి చెప్పిన పది జన్మల కథ అబద్ధమని తేలిపోతుంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అయిపోయింది. వారి పరిస్థితి.


ఇక చేసేది లేక తమ తప్పును ఒప్పుకుంటూ వారంతా చక్రవర్తి పాదాల మీద పడిపోయారు. ఇచ్చిన బహుమానాలు వెనక్కి తీసుకోవటం గౌరవభంగం కాబట్టి వారందర్నీ క్షమించి వదిలేసాడు చక్రవర్తి.


ఆ నాటికి సభ చాలించి వీరబాహును తన మందిరానికి వెంట తీసుకెళ్ళాడు.


అప్పుడు పొగడ్తలు విని దానాలు చేయటం వల్ల రాజ్యానికి, ప్రజలకు జరుగుతున్న నష్టం ఏమిటో ప్రభువులకు వివరించి చెప్పాడు వీరబాహు.


దాంతో చక్రవర్తి అమాయకత్వం తొలగిపోయింది. తన కళ్ళు తెరిపించిన వీరబాహుకి వజ్రాలహారం బహుమతిగా యిస్తుంటే నిరాకరించాడు వీరబాహు.


"ప్రభూ.. తమ ఏలుబడిలో అంతా సుఖంగా వున్నాం. దేనికీ లోటు లేదు.


ఈ బహుమతుల్ని ప్రజల సంక్షేమానికి వినియోగించండి” అంటూ ప్రార్థించాడు.


ఆ రోజు నుంచి చక్రవర్తి పొగడ్తలను పట్టించుకోవటం మానేసాడు.


నీతి : చూసారా... పొగడ్తలకు పొంగిపోతే విచక్షణా జ్ఞానం నశిస్తుంది. అమాయకత్వం దోపిడీని ప్రేరేపిస్తుంది. కాబట్టి పొగడ్తలకు దూరంగా వుండటం అన్ని విధాలా మంచిది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)