చంద్రపూర్ గ్రామం రామాలయంలో పూజారి విష్ణుశర్మ. ఆలయం పక్కనే ఆయన ఇల్లు. భార్య పేరు వసుమతి. వారికిద్దరు పిల్లలు.
విష్ణుశర్మ కల్లాకపటం తెలీని మనిషి. సదా ఆ రామచంద్రుడ్ని నమ్ముకున్నవాడు.
ఇక ఆయన అర్ధాంగి వసుమతి మహాయిల్లాలు. అతిథి అభ్యాగతుల్ని చక్కగా ఆదరించేది.
పిల్లల్ని చదివించుకుంటూ వున్న దాంతోనే ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు.
వారింట్లో లక్ష్మి అనే పేరు గల కామధేనువు వంటి ఆవు వుంది. నిజంగా గోమాత. ముప్పొద్దులా పాలిచ్చేది.
ఆ యింట వెలుగంతా తానే అన్నట్టు నిత్యం కళకళలాడేది. ఉదయం లేవగానే తులసి కోటతో బాటు ఆవుకీ పూజ చేసేది వసుమతి.
మంచివాడు, వూరందరికీ తల్లో నాలుకలా వుండే విష్ణుశర్మన్నా, ఆయన కుటుంబమన్నా వూరి జనానికి ఎంతో అభిమానం.
అటువంటి విష్ణుశర్మ కుటుంబానికి పొరుగునే ఘటికాచలం అనే ఆయుర్వేద వైద్యుడి కుటుంబం నివశించేది. అతని భార్య పేరు శారద. వాళ్ళకీ యిద్దరు పిల్లలు. వాళ్ళది కూడా చక్కటి కుటుంబం.
ఘటికాచలం ఆయుర్వేదంలో ఘనాపాటి. గొప్ప వైద్యుడు. అందులో సందేహం లేదు. ఎక్కడెక్కడి నుంచో వైద్యం నిమిత్తం అతని వద్దకు రోగులు వచ్చేవారు. అయితే ఘటికాచలానికి ధనాశ ఎక్కువ.
వచ్చిన రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజేవాడు. అలా రెండు చేతులా సంపాదిస్తూ వూళ్ళోని ధనవంతుల్లో ఒకడయ్యాడు.
ఎంతో పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించినా కూడా ఘటికాచలానికి తృప్తి లేదు. మనశ్శాంతి లేదు. అందుక్కారణం విష్ణుశర్మ కుటుంబం.
గుడి పూజారిగా వుంటూ అంతంత మాత్రం సంపాదనతో జీవించే ఆ కుటుంబం అంత సంతోషంగా ప్రశాంతంగా వుండటం చూసి ఓర్వలేకపోయాడు.
అదీ గాక గొప్ప వైద్యుడయి వుండి ఇంత డబ్బు సంపాదించి కూడా విష్ణుశర్మ పరపతి ముందు తను ఎందుకూ కొరగాకుండా పోతున్నాడు.
వూరంతా ఆ కుటుంబం మీద చూపించే అభిమానంలో పదోవంతు కూడా తమ కుటుంబం మీద చూపించరు. అందుకని విష్ణుశర్మ మీద అకారణంగా అసూయా ద్వేషాల్ని పెంచుకున్నాడు ఘటికాచలం.
అసలు ఆ ఇంటి వైభవానికి ఆవు లక్ష్మి కారణమని వూహించి ఆ ఆవుని వాళ్ళకి కాకుండా చేస్తే విష్ణుశర్మ పరపతి పడిపోతుందని అతన్ని ఎవరూ పట్టించుకోరని అపోహపడ్డాడు.
మూర్ఖుడి వద్ద ఎన్ని విద్యలున్నా ఎంత చదువున్నా నిరర్ధకమే గదా! తన లోపాన్ని గమనించి సరిచేసుకోకుండా ఎదుట వారి గొప్పతనానికి అసూయ చెందుతారు.
పేద బిక్కి అని జాలి లేకుండా వైద్యానికి ముక్కుపిండి డబ్బు వసూలు చేసే ఘటికాచలం వద్దకి తమ అవసరానికి వస్తారు గాని ఎవరూ అభిమానం చూపలేరుగదా.
అసూయా ద్వేషాలు కవల పిల్లల్లాంటివి. ఒకటి చేరితే రెండోదీ వచ్చేస్తుంది.
కాబట్టి విష్ణుశర్మ కుటుంబం పరపతి పోయి కష్టాల్లో పడితే చూసి ఆనందించాలని ఘటికాచలం ఉవ్విళ్లూరేవాడు. ఎలాగయినా గంగిగోవు లాంటి ఆవు లక్ష్మిని ఆ కుటుంబం నుంచి వేరు చేయాలని అదను కోసం ఎదురు చూడసాగాడు.
ఇలా వుండగా-
ఘటికాచలం దృష్టి తగిలిందో చెడుకాలం ఆరంభమైందో గాని పూజారి విష్ణుశర్మ ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యాడు. అది తెలిసి మురిసిపోయాడు ఘటికాచలం. ఎదురు చూసిన సమయం వచ్చిందని ఆనందించాడు.
ఇంట్లో చిట్కా వైద్యాలతో వారం రోజులు గడిచిపోయింది. విష్ణుశర్మ ఆరోగ్యం కుదుట పడలేదు. ఇక తప్పదని వైద్యం కోసం ఘటికాచలం గడప తొక్కాడు విష్ణుశర్మ.
అతన్ని పరీక్షించి పెదవి విరిచాడు ఘటికాచలం.
“జబ్బు ముదర పెట్టుకుని నా వద్ద కొస్తే లాభం ఏమిటి? ఇది విషజ్వరం పైగా శ్లేష్మం ప్రకోపించి ఉబ్బసంలోకి దించే ప్రమాదం ఏర్పడింది... జాగ్రత్తగా వుండాలి” అన్నాడు.
“ఎంత ఖర్చయినా ఫరవాలేదు. జబ్బు నయం చేయండి” అర్ధించాడు విష్ణుశర్మ.
"భయపడక్కర్లేదు. నయం చేస్తాను. కానీ నీ నుంచి డబ్బు తీసుకుంటే జబ్బు తగ్గదు.
ఇది అలాంటి జబ్బు. ఆవు నమ్మిన సొమ్ముతో వైద్యం చేయాలి. అప్పుడే తగ్గుతుంది.”
“ఆవును అమ్మాలా...!?" తెల్లబోయాడు విష్ణుశర్మ.
"అవునయ్యా.. మీ ఆవు లక్ష్మి వుంది గదా. దాన్ని సంతలో తెగ నమ్మి డబ్బిస్తాంటే చెప్పు.. ఇప్పుడే వైద్యం ఆరంభిస్తాను. మందులు పాశుపతాస్త్రంలా పని చేసి తొందరగా కోలుకుంటావు” అన్నాడు ఘటికాచలం.
ఆవును అమ్మటానికి తన రోగానికి సంబంధం ఏమిటో పాపం విష్ణుశర్మకి అర్థం కాలేదు. తను ఆపదలో వున్నాడు గాబట్టి ఆ షరతుకు అంగీకరించి వైద్యం చేయించుకున్నాడు.
వారం తిరిగే సరికి జబ్బు నయమైంది విష్ణుశర్మకు. ఎప్పటి ఆరోగ్యం చేకూరింది.
కాని ఆవుని అమ్మి వైద్యునికి డబ్బు చెల్లించాలని గుర్తుకు రాగానే విష్ణుశర్మ దంపతులకు బెంగ పట్టుకుంది. ఆ ఆవును వదిలి తమ పిల్లలు వుండలేరు. అంతేనా.. ఆవును అమ్మేస్తే రేపటి నుంచి పాలకు ఏం చేయాలి?
“ఇలాంటి విషయాల్లో మర్యాద రామన్న గారు మంచి సలహా యిస్తారంటారు. ఓ సారి ఆయన్ను కలసి మన సమస్య చెప్పరాదూ.. పరిష్కారం దొరుకుతుందేమో..” అంటూ సలహా యిచ్చింది అర్థాంగి వసుమతి.
ఆ సలహా విష్ణుశర్మకు నచ్చింది.
తనకు తెలీనప్పుడు తెలిసిన వాళ్ళ నడిగి సలహా పొందటం తెలివైన పని. ఆ రోజే మర్యాద రామన్నను కలిసి జరిగింది వివరించాడు విష్ణుశర్మ. ఘటికాచలం కుతంత్రం మర్యాద రామన్నకు అర్థమైంది.
“ఆవును అమ్మగా వచ్చిన సొమ్మంతా తనకే కావాలన్నాడా?” అడిగాడు.
“అవును స్వామీ” అన్నాడు విష్ణుశర్మ.
“వైద్యం ఖర్చులు వందరూపాయలు మించవు కదూ?”
“అంతేనండి”
"ఆవును మీకు దూరం చేయటానికి చేసిన పన్నాగం యిది. భయపడకు.
నేను చెప్పినట్టు చెయ్యి. ఎవరూ పోటీకి రాకుండా చేసి నీ ఆవును నా మనుషులే కొంటారు” అంటూ ఏం చేయాలో వివరించాడు మర్యాద రామన్న.
మరునాడు వైద్యుడు ఘటికాచలాన్ని వెంట బెట్టుకొని ఆవును సంతకు తోలుకెళ్ళాడు విష్ణుశర్మ. వంద రూపాయలు మించి ధర పలకలేదు. చెప్పినట్టే మర్యాదరామన్న తగిన ఏర్పాట్లు చేసాడు. అతని మనుషులే బేరం చేసారు.
డబ్బుదేముంది. ఆవు దూరమైతే చాలని సంతోషించాడు. ఘటికాచలం
విష్ణుశర్మ ఆవుని అమ్మగా వచ్చిన వంద రూపాయలు ఘటికాచలానికి సమర్పించుకున్నాడు.
మరునాడు ఉదయం ఘటికాచలం నిద్రలేచేసరికి ఎప్పటిలాగే విష్ణుశర్మ పెరటిలోంచి ఆవు లక్ష్మి అరుపు విన్పించింది.
ఆశ్చర్యంతో బయటకొచ్చి చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయడు. ఎప్పటిలా పెరట్లో నిలబడి పచ్చిక మేస్తోంది. ఆవు. విష్ణుశర్మ పాలు పితుకుతున్నాడు.
ఘటికాచలం కోపంతో ఉడికిపోయాడు. గబగబా దగ్గర కెళ్ళాడు.
"అమ్మేసిన ఆవు ఎలా వచ్చింది?" అంటూ నిలదీసాడు.
విష్ణుశర్మ తొణక్కుండా చిరునవ్వుతో..."ఎలా ఏమిటి సామీ.. మళ్ళీ కొనుక్కున్నాను. నూటొక్క రూపాయి" అంటూ బదులిచ్చాడు.
“ఇదన్యాయం అమ్మేసిన ఆవును ఎలా కొంటావు?” అనరిచాడు అసహనంగా.
“ఎలా ఎంది సామీ... ఇది మా తల్లి లాంటిది. ఎలా వదులు కుంటాను?
దీన్ని అమ్మగా వచ్చిన డబ్బు మీకివ్వాలి ... ఇచ్చేసాను. ఇక పేచీ ఏముందని.. వెళ్ళండి" అన్నాడు విష్ణుశర్మ.
తన పాచిక పారలేదని గ్రహించి కడుపులో మండిపోయింది ఘటికాచలంకి.
కాని చేసేదేమీ లేక వెనక్కి వచ్చేసాడు.
ఆ సాయంకాలం వీధిలో మర్యాదరామన్న ఎదురుపడి వైద్యుడ్ని ఆపాడు.
“నువ్వు గొప్ప వైద్యుడివే కావచ్చు. కాని జనం దగ్గర డబ్బు గుంజుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. అందుకే వూళ్ళో నీకు పరపతి లేదు.
విష్ణుశర్మ తనకు లేకపోయినా ఎదుటి వాళ్ళకు పెట్టే మనిషి. రామభక్తుడు. అతనంటే వూరి జనానికి ఎంతో అభిమానం.
ఆ కుటుంబ సుఖసంతోషాలు చేసి ఓర్వలేక ఆవుని అమ్మిం చాలని చూసావు. నీ పద్ధతి మార్చుకో. అసూయతో ఇంకో సారి విష్ణుశర్మకు నష్టం కలిగించాలని చేస్తే మర్యాదగా వుండదు.
నిన్ను వూరు నుంచి పంపించేసి వేరే వైద్యుడ్ని తెచ్చుకోవల సుంటుంది” అంటూ హెచ్చరించి పంపించాడు.
ఆ దెబ్బతో వైద్యుడు ఘటికాచలం రోగం కుదిరింది. ఆ తర్వాత ఎప్పుడూ విష్ణుశర్మకు నష్టం కలిగించే ఆలోచన చేయలేదు. విష్ణుశర్మ కుటుంబం ఎప్పటిలా సంతోషంగా వుందిప్పుడు.
నీతి : తెలీని విషయాన్ని తెలసిన వాళ్ళని అడిగి తెలుసు కోవాలి. అప్పుడు పరిష్కారం తప్పక లభిస్తుంది.