వీధి బాలుడు | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

తుకారాం.. అతనో వీధి బాలుడు.


వీధి బాలల గురించి మీకు తెలుసు గదూ? అనాధలయిన వీళ్ళ గురించి గ్రామాల్లో తెలీకపోవచ్చు. కానీ నగరాల్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్పిస్తుంటారు.


అనాధ పిల్లలు, తప్పిపోయిన వాళ్ళు, ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు ఇతరత్రా అనేక కారణాల చేత ఒంటరయిన పిల్లలు నగరాలకు చేరుకుంటారు. అక్కడ రైల్వేస్టేషను, బస్టాండు మొదలయిన చోట తిరుగుతుంటారు. దొరికింది తిని ఏ బసెల్టర్లోనో పడుకుంటూ వీధిలోనే పెరిగి పెద్దాళ్ళవుతుంటారు.


వీళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేయటం, అల్లరి చిల్లరిగా తిరుగుతూ రౌడీయిజం చెలాయించటం వర్గపోరుతో కొట్లాడుకుంటూ అసాంఘిక శక్తులుగా మారుతుంటారు.


ఇలాంటి వీధి బాలల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వీరి కోసం వీధి బాలల సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేసారు. కొన్ని స్వచ్చంద సంస్థలూ వీధి బాలల్ని సంస్కరించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఎంత చేసినా కొత్తగా అనాధ పిల్లలు వీధిన పడుతూనే వున్నారు.


అలాంటి వాళ్ళలో ఈ తుకారాం ఒకడు.


అతని వయసు ఇప్పుడు పదహారేళ్ళు. మంచి చెడు గ్రహించ గలుగుతున్నాడు. ఆరేళ్ళ వయసులో వుండగా ఎక్కడో తిరునాళ్ళలో తను తప్పిపోయిన గుర్తు.


తల్లితండ్రులెవరో ఎక్కడుంటారో కూడా ఇప్పుడు తనకు తెలీదు. నా అనే వాళ్ళు లేని ఈ జీవితం ఇలా ఒంటరి బ్రతుకు తలుచుకుని తుకారాం ఎన్నోసార్లు బాధపడ్డాడు.


అతనితో పాటు ఇరవైమందికి పైగా అనాధ పిల్లలు ఒక గ్రూపుగా వున్నారు. వాళ్ళలో పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ మధ్య వయస్కులంతా.


తుకారాం ఫ్రెండ్ జానీ. వాళ్ళలో వాళ్ళు ఏదో విషయం గురించి చర్చించుకుంటుంటే ఏమిటని అడిగాడు తుకారాం... "చూడరా ఈ మధు గాడు.. అన్నిటికి తలరాత అంటాడు.. విధి అంటాడు.


అమ్మా బాబు ఏదో తిట్టారని అలిగి, ఒళ్ళు బలిసి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది వీడు. ఇప్పుడేమో విధి రాతంటాడు. మనం చేసే వెధవ పనుల నుంచి తప్పించుకోవటానికి విధిని తిడితే ఎలా?” అంటూ కోప్పడ్డాడు జానీ.


"అవును. మన జీవితం మన యిష్టం. మధ్యలో ఈ విధి ఎవరు?" అనడిగాడు తుకారాం.


ఆ మాటలకు మధుకి కోపం వచ్చింది.


“మీకు విధి ఎవరో తెలీదు. అంతేగా. ఒరే తుకారాం.. అటు చూడు. రోడ్డు అవతల చెట్టు కింద పండుగాడు నిలబడున్నాడు గదా.


నువ్వెళ్ళి వాడి భుజం మీద కొట్టి రావాలి. నువ్వు కొట్టి వస్తే నీ జీవితం నీ చేతిలో వున్నట్టే. కొట్టలేకపోతే విధిని నువ్వు కూడా నమ్మాలి” అంటూ సవాల్ విసిరాడు.


ఇది చాలా తమాషాగా అన్పించింది తుకారాంకి. “ఓసింతేనా.. అదెంత పని? చిటికెలో వాడ్నికొట్టి వస్తాను చూడు..” అంటూ లేచాడు.


రోడ్డు దాటబోయేసరికి లారీ అడొచ్చింది. అది వెళ్ళగానే కారు వచ్చింది.


అటు నుంచి సిటీ బస్సు వచ్చింది. అడ్డంకులు దాటి తుకారాం అవతల చెట్టు దగ్గరకు వెళ్ళే సరికి అక్కడ పండుగాడు కన్పించలేదు. వాడు సిటీబస్ వెళ్ళిపోయాడు.


“చూసావా? నీతో దెబ్బ తినే రాత పండుగాడికి లేదు. అందుకే నీకు అందకుండా వెళ్ళిపోయాడు. దీన్నే విధి అంటారు” తిరిగి వచ్చిన తుకారాంకి బోధించాడు మధు.


అయినా అర్థంగాక బుర్రగోక్కున్నాడు తుకారాం. అతడిలో తిరిగి విరక్తి.


జీవితం గురించి జిజ్ఞాస మొదలయ్యింది. ఏదో పని చేయటం దొరికింది కొనుక్కుతినటం.. ఏమిటీ జీవితం...? ఎన్నాళ్ళిలా? కడుపు నిండా తిని ఎన్ని రోజులయిందో...!


ఆలోచిస్తున్నాడు.


టీ క్యాంటీన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. మొదట వాడు రెండో వాడితో అంటున్నాడు. “ఒరే... మొన్న జరిగిన గొడవలో సుబ్బిగాడ్ని పోలీసులు తీసుకుపోయారు తెలుసా? ఆరు మాసాలు జైలు శిక్ష పడిందట...”


“అదృష్టవంతుడురా బాబు” అంతా విని సంతోషం వ్యక్తం చేసాడు రెండో వాడు.


"బయట వుండి తిండికి తిప్పలు పడేకన్నా అదే రైటు. టైంకి భోజనం.. టైంకి నిద్ర. చేసుకోవడానికి పని. ఈ ఆరుమాసాలు ప్రశాంతంగా బ్రతికేస్తాడు" అన్నాడు.


ఆ సంభాషణ తుకారాం విన్నాడు.


వాళ్ళిద్దరూ టీ తాగి వెళ్ళిపోయారు.


కాని వాళ్ళ మాటలు తుకారాంలో ఆలోచనలు రేకెత్తించాయి. జైలు కెళ్తే చేతినిండా పని చెప్పి కడుపు నిండా భోజనం పెడతారట. నిజమే కావచ్చు.


ఇలా బయట తిరిగే కన్నా జైలుకు పోయి కూచుంటేనే హాయిగా వుంటుందేమో...


మరి జైలు కెళ్ళాలంటే...?


ఏదో వెధవ పని చేస్తే పోలీసులొస్తారు.. వాళ్ళే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. చక్కగా భోంచేస్తూ ఏవో పనులు చేసుకోవచ్చు.


ఆలోచనే గాని వివేచన లేని వయసు తుకారాంది. మంచి చెడుల గురించి విడమర్చి చెప్పటానికి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన వాడు కాదు. అందుకే ఎలాగయినా సరే తనూ జైలు కెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.


ఏదో చెడ్డపని చేయాలి.


ఏం చేయాలి?


అటూ ఇటూ చూసాడు.


ఎదురుగా షాపు, పక్కన పెద్ద గ్లాస్ ఫిటింగు కన్పించాయి. ఒక రాయి తీసుకుని గ్లాస్ ని బలంగా కొట్టాడు తుకారాం.


అద్దం భళ్ళున పగిలింది.


ఇంకేముంది? షాపు ఓనరు పోలీసులకు ఫోన్ చేస్తాడు.. పోలీసులు వచ్చి తీసుకుపోతారు అని వూహల్లో తేలిపోతూ అక్కడే నిలబడ్డాడు తుకారాం. కాని పోలీసులు రాలేదు. షాపు ఓనరు బయటకొచ్చాడు.


“నేనే... నేనే ఆ అద్దం పగలుకొట్టాను.. పోలీసుల్ని పిలవండి” అన్నాడు ఓనరుతో.


“దీనికి పోలీసులెందుకు లేరా.. ఎప్పట్నుంచో ఆ చెత్త గ్లాసు మార్పించాలనుంది. కానీ వీలు పడలేదు. దాన్ని పగలకొట్టి మంచి పని చేసావ్? ఈ ఏభై రూపాయలు తీసుకుని వెళ్ళిపో. ఇక్కడ ఉండమాక. వెళ్ళిపో" అంటూ ఏభై నోటు చేతిలో పెట్టి పంపించాడు ఓనరు.


ఏదో అనుకుంటే ఏదో జరిగిందేమిటి? అర్థం కాలేదు తుకారాంకి. డబ్బు చూడగానే ఆకలి గుర్తొచ్చింది. భోంచేసాక ఇంకో వెధవ పని ఆలోచిద్దాంలే అనుకున్నాడు. హోటల్ కెళ్ళి భోంచేసాడు. 


అటునుంచి అటే బస్టాండ్ కొచ్చి కూర్చున్నాడు. ఏమైనా సరే జైలు కెళ్ళాలనిపించింది. ఏం చేద్దామా అని వచ్చే పోయే ప్రయాణీకుల్ని గమనిస్తూ కూర్చున్నాడు.


అంతలో ఒక వ్యక్తి బస్ దిగి వస్తూ కన్పించాడు. అతని భుజాన పెద్ద సంచీ వుంది. ఆ సంచీ లాక్కుంటే వాడు దొంగ దొంగ అని అరుస్తారు. పోలీసులు వస్తారు. అరెస్ట్ చేస్తారు. అయిడియా బాగుందనిపించింది. లేచి ఆ వ్యక్తికి ఎదురెళ్ళాడు.


వాడు పోరిపోబోతున్నాడు.


తుకారాం ఆ సంచి లాక్కున్నాడు. వాడు బోర్లా పడిపోయాడు. పోలీసులు వచ్చారు. వాళ్ళు తనను అరెస్ట్ చేస్తారని ఆశపడ్డాడు తుకారాం. మళ్ళీ అంచనా తప్పింది.


ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతడు తెచ్చిన సంచిని స్వాధీన పర్చుకున్నారు.


అందులో గంజాయి తెస్తున్నాడతను. వాడు పారిపోకుండా అడ్డుపడి పోలీసులకు సహకరించినందుకు యస్సై తుకారాంని అభినందించాడు. వంద రూపాయలు బహుమతిగా యిచ్చి మరీ వెళ్ళాడు.


తుకారాంకి కొద్దిసేపు మతి భ్రమించినంత పనయింది. ఏమిటిది? తను అనుకుంది ఒకటయితే జరిగేది మరొకలా వుంటోంది.


నేరస్థుడు కావాలనుకుంటే లాభం వచ్చి పడుతోంది. ఇవాళ టైం బాగున్నట్టు లేదు. రేపు ప్రయత్నిద్దాం అనుకున్నాడు.


మరునాడు రైల్వేస్టేషనుకు వెళ్లాడు. ప్రయాణీకులు చాలా మంది వున్నారు. పోలీసులు దగ్గరలో వున్న సమయం చూసాడు. సమీపంలో ఒక నడివయసు వ్యక్తి కూచునున్నాడు.


ఈసారి మిస్ కూడదు.. పోలీసలు అరెస్ట్ చేయాలి అనుకున్నాడు. కావాలనే ఆ పెద్దమనిషి వెనక్కు వెళ్ళి బలంగా ఎగిరితన్నాడు నడుం మీద.


ఏం జరిగిందో అర్థంగాక పెద్దగా అరిచి బోర్లాపడ్డాడు పెద్దమనిషి అంతే... చుట్టూ కలకలం... పోలీసులు వచ్చేసారు. తుకారాంని పట్టుకోబోయారు.


అంతలో ఆ పెద్దమనిషి నిటారుగా లేచి నిలబడ్డాడు. సంతోషంతో పొంగిపోతూ వచ్చి తుకారాంని కౌగిలించుకుని అభినందించాడు. అతడ్నేమీ చేయొద్దని పోలీసులతో చెప్పాడు.


“అదేమిటయ్యా.. ఒళ్ళు పొగరెక్కి అకారణంగా నిన్ను తన్నిన వెధవని ఏమీ చెయ్యద్దంటావేమిటి?” అనడిగాడు యస్సై.


"అయ్యా.. నడుం బెణికి సంవత్సరంగా ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఎన్నో ఆస్పత్రులు తిరిగాను. వేలకు వేలు ఖర్చు చేసినా తగ్గలేదు.


అలాంటి జబ్బును ఈ కుర్రాడు ఒక్క తన్నుతో బాగుచేసాడు. చూస్తున్నారుగా.. చక్కగా నిలబడ్డాను. .. మాట్లాడుతున్నాను. ఇంత ఉపకారం చేసిన వాడికి అపకారం చేయమంటారా?” అంటూ అసలు విషయం చెప్పేసరికి జనం సంగతి సరే.. తుకారాంకే పిచ్చెక్కినంత పనయింది.


అభినందించి వదల్లేదాయన. రెండు వేల రూపాయలు చేతిలో పెట్టి మరీ పంపించాడు. ఇది కలో మాయో అర్థంగాక బుర్ర గోక్కున్నాడు తుకారాం.


ఇలా చాలాసార్లు... జైలు కెళ్ళటం కోసం ఎన్నో వెధవ పనులు చేసాడు. ప్రతీసారి ఎంతో కొంత లాభమే గాని జైలు కెళ్ళాలన్న కోరిక మాత్రం తీరలేదు. చేతిలో అయిదారు వేలు డబ్బు సమకూరింది.


తనకు జైలు కూడు ప్రాప్తం ఉన్నట్టు లేదు అనుకుని ఇక ఆ ప్రయత్నం విరమించుకున్నాడు తుకారాం. ఏదో వ్యాపారం చేసి బ్రతకాలనుకున్నాడు. చేతిలో పెట్టుబడికి కొంత డబ్బుంది గదా.. హోల్సేల్ మార్కెట్ కెళ్ళి రంగు రంగులు జేబురుమాళ్ళు కొని సెంటర్లో నిలబడి అమ్ముకోనారంభించాడు.


వ్యాపారం బాగానే వుంది. లాభాలు వస్తున్నాయి. కూటికి గూడుకి లోటు లేకుండా తుకారాంకి జరిగిపోతోంది. ఇలా ఉండగా ఓ రోజు వ్యాపారం జోరుగా సాగి చేతిలో సరుకంతా అమ్ముడయి పోయింది.


ఆ ఆనందంలో రాళ్ళను తన్నుకుంటూ ఇంటి దారి పట్టాడు తుకారాం.


అంతలో అతడు తన్నిన రాయి ఎగిరి వెళ్లి అటుగా వస్తున్నవొక వృద్ధురాలి ముఖాన్ని తాకి నెత్తురొచ్చింది.


ఊహించని సంఘటనకి బిత్తరపోయాడు తుకారాం. చుట్టూ జనం చేరిపోయారు. పోలీసులు వచ్చారు. వృద్ధురాలిని రాయితో కొట్టిన నేరానికి తుకారాంని అరెస్ట్ చేసారు.


కోర్టులో అతడికి ఆరుమాసాలు జైలు శిక్ష పడింది. అంతా కలలా తోచింది తుకారాంకి.


తను జైలు కెళ్ళాలని చేసిన ప్రతిప్రయత్నం వృధా అయింది గతంలో...


వ్యాపారం బాగుంది హ్యపిగా వుండొచ్చనుకుంటున్న టైంలో అనుకోని సంఘటన తనను జైలు పాలు చేసింది. బహుశ ఆ రోజు మధుగాడు చెప్పిన విధి రాత అంటే యిదేనేమో. అందుకే మన జీవితం మన చేతుల్లో లేదేమో.


లేకపోతే తనేదో సంతోషంలో రాయిని తన్నటం ఏమిటి అది కాస్తా ఆ వృద్ధురాలికి తగిలి గాయపడటం ఏమిటి... తనిలా జైలుకు రావటం ఏమిటి?


ఆ రోజునించి మధులాగే తుకారాం కూడా విధిని నమ్మటం ఆరంభించాడు.


నీతి: విధిరాతకు అదృష్టం తోడయితే మనిషి సుఖపడతాడు. దురదృష్టం తోడయితే చెడిపోతాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)