తెలివైన కాకి | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

ఒక చెట్టు మీద గూడుకట్టుకుని రెండు కాకులు అన్యోన్యంగా వుండేవి. ఆ చెట్టు ఒక మహావృక్షం. అది కాశీరాజుగారి ఉద్యాన వనంలో చివరిగా ఉండేది. 


చుట్టూ పచ్చటి రాజోద్యానవనం. ఆహారానికి కొరత లేదు.


వృక్షశాఖల్లో ఇతర జాతుల పక్షులు కూడా నివశించేవి. అవన్నీ కలిసి మెలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేవి. ఇలా ఉండగా ఆ చెట్టు క్రింద ఒక పుట్ట ఏర్పడింది.


క్రమంగా ఆ పుట్టలోకి ఒక పెద్ద సర్పం చేరింది. అది చేరినప్పట్నుంచి వృక్షశాఖల్లోని పక్షిజాతులకు కష్టాల మీద కష్టాలు మొదలయ్యాయి.


నిశ్శబ్దంగా చెట్టెక్కిన పాము పక్షిగూళ్ళలోని గుడ్లను ఎంచక్కా తిని దిగిపోయేది.


చక్కగా పొదిగి పిల్లలు కావాల్సిన తమ ప్రియమైన గుడ్లు అలా పాముకి ఎరగావటం పక్షి జాతులకి తీరని శోకం కలిగించింది. రెండుసార్లు తమ సంతానమైన గుడ్లను పాముకు ఎర చేసుకున్న వాయసం జంట కూడా చాలా విచారించింది.


"ఈ సర్పాన్ని వదిలించుకుంటే గాని మనం ప్రశాంతంగానూ, సంతోషంగానూ బ్రతకలేం" అంది మగకాకి.


"అవును. కాని అందుకు దారేముంది? బలమైన ఆ సర్పాన్ని మనం ఎలా నిర్జించగలం?” అంది నిరాశగా ఆడకాకి.


“దాన్ని చంపటానికి మనకు శక్తి లేకపోవచ్చు. కాని ఉపాయం వుంటే అపాయాన్ని సులువుగా అధిగమించవచ్చు. మనకే కాదు. ఈ చెట్టు మీద కాపురం వుంటున్న పక్షిజాతులు అన్నింటికి సర్పం నుంచి విముక్తి కలిగిస్తాను. కొంచెం ఓర్చుకో” అంటూ ధైర్యం చెప్పింది మగకాకి.


మరునాడు రాజప్రసాదం వైపు ఆహారానికి వెళ్ళి తిరిగి వస్తుండగా జలాశయం వద్ద మహారాణి వారు స్నానం చేయటం కన్పించింది.


ఒడ్డున ఆమె నగలు, దుస్తులు వున్నాయి. చెలికత్తెలు దూరంగా వున్నారు.


రాణిగారి నగలను చూడగానే తళుక్కున ఒక ఉపాయం తట్టింది వాయసానికి. అది వెనుతిరిగి రివ్వున వచ్చి రాణి గారి నగల దగ్గర వాలింది.


అక్కడున్న నగలలో వెలలేని మణులు, మాణిక్యాలు పొదిగి వున్న హారాన్ని ముక్కుతో పట్టుకుంది.


అది చూసి చెలికత్తెలు పరుగున వచ్చేసరికి ఎగిరి చెట్టుమీద వాలింది.


రాణి వారికి ఎంతో ప్రియమైన హారం అది. కాకి ఎత్తుకు పోవటం చూడగానే ఆగమేఘాల మీద రాజభటులు రంగంలోకి దూకారు.


కాకి కోసం పరుగులు తీసారు.


వారికి అందినేట్టే అంది తిరిగి కొంతదూరం పోతూ భటుల్ని తమ నివాసమైన వృక్షం వైపు మళ్ళించింది కాకి. వారు చూస్తుండగానే ఆ హారాన్ని తెచ్చి పాము పుట్ట కలుగులోకి జారవిడిచి తుర్రున ఎగిరి చెట్టు మీద కూర్చుంది.


“ఏమైంది?” అడిగింది ఆడకాకి.


“చూస్తుండు... ఈ రోజుతో మనకు సర్పం నుంచి విముక్తి” అంది ఉత్సాహంగా మగకాకి.


చెట్టు కింద భటుల హడావుడి చూసి కొన్ని పక్షులు కొమ్మలు వదిలి పారిపోయాయి. కొన్ని ధైర్యంగా కొమ్మల మాటు నుండి గమనించసాగాయి.


రాజభటులు రంగంలోకి దిగారు.


పలుగు పారలతో హారం కోసం... పుట్టను తవ్వటం ఆరంభించారు.


పుట్టలోపలున్న సర్పం బుసలు కొడుతూ బయటకు దూకి వారి మీదకు దాడి చేయబోయింది. భటులు చాకచక్యంగా తప్పించుకుని కర్రలతో దాడి చేసి భయంకరమైన ఆ సర్పాన్ని చంపేసారు.


హారాన్ని తీసుకెళ్ళి రాణి గారికి అందచేసారు. కాకి ఉపాయం ఫలించింది.


ఆ రోజు నుండి ఆ చెట్టు మీది పక్షులు తమ పిల్లాపాపలతో కళకళలాడుతూ నిశ్చింతగా హాయిగా జీవించసాగాయి. 


నీతి : ఉపాయం తెలిసిన వారు అపాయం నుంచి సులువుగా బయటపడగలరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)