నిత్యం మనకు ఎన్నో సమస్యలు, ప్రమాదాలు ఇతరత్రా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అప్పటికప్పుడు సమయానుకూలంగా స్పందించటం.. తగిన నిర్ణయం తీసుకుని ఆచరించటమే సమయ స్ఫూర్తి. ఇప్పుడు ఇబ్బంది వస్తే రేపు ఆలోచిస్తానంటే లాభం లేదు. పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.
కాబట్టి పిన్నలు పెద్దలు అందరికీ సమయస్ఫూర్తితో మెలగటం చాలా అవసరం.
బాలలు చిన్నప్పట్నుంచి ఈ విషయంలో అవగాహన పెంచుకుంటే ఇంకా మంచిది.
ఒక నదిలో చాలా మొసళ్ళున్నాయి. ఒడ్డునే మామిడి చెట్ల మీద అనేక కోతులున్నాయి. ఎలాగయినా కోతి మాంసం రుచి చూడాలని ఒక మొసలి కోరిక.
అది రోజూ తీరానికి వచ్చి నోరు తెరిచి చెట్టు మీదకి చూసేది. ఒక తుంటరి కోతి ఆ చెట్టు మీదే ఎక్కువ తిరుగతూండేది. కొమ్మల వెంట దూకుతూ అల్లరి చేసేది. నమ్మకంగా ఆ కోతితో స్నేహం చేసింది మొసలి.
ఒకరోజు “నా భార్య నిన్ను చూడాలంటోంది. ఒకసారి మా యింటికి రారాదూ...” అని పిలిచింది.
అమాయకంగా సరేనంది కోతి. కోతి వచ్చి మొసలి వీపు మీద కూచుంది.
మొసలి నది మధ్యకు తీసుకెళ్ళింది. నది మధ్యలో చేరాక అప్పుడు అసలు విషయం చెప్పింది.
“ఒరే కోతి వెధవా.. నీ గుండెకాయ తినాలని చాలా రోజులుగా ఆశరా.. నిన్ను చంపటానికి తీసుకుపోతున్నాను” అంది.
మొసలి మోసం అర్థమైంది కోతికి. అయినా కంగారుపడలేదు. పైగా ఇది చాలా చిన్న విషయం అన్నట్టుగా "నీ కోరిక తీర్చటంకన్నా స్నేహధర్మం ఏముంది గాని ఇంత ఆలస్యంగా చెప్తున్నావేమిటి?” అంది.
“ఏమైంది?”
“ఇంకా ఏమైందని అడుగుతున్నావా! అసలే కొమ్మల వెంట కుదురు లేకుండా దూకుతుంటాను. గుండెకాయ ఎక్కడ జారిపడిపోతుందోనని భయం. అందుకే దాన్ని చెట్టు కొమ్మకి తగిలించి ఉంచుతాను. ఈ సంగతి అక్కడే చెప్తే తెచ్చేవాడ్ని. గుండెకాయ లేకుండా నన్ను చంపి తింటే నీకా రుచే వుండదుగా?” అంది.
కోతి మాటలు నమ్మి తిరిగి ఒడ్డుకు ఈదుకొచ్చింది మొసలి. వెంటనే గట్టు మీదకు దూకి చకచకా చెట్టెక్కి కిచ కిచ లాడుతూ మొసలిని వెక్కిరించింది కోతి.
“పోరా.. నిద్రపోతు ముఖమా? ఎవరన్నా గుండెకాయ తీసి కొమ్మకి తగిలిస్తారా? ఇంకోసారి ఒడ్డున నీ మొసలి మొహం చూపిస్తే మామిడి కాయలతో కొడతా” అంటూ బెదిరించింది.
నిరాశతో నీటిలో కెళ్ళిపోయింది మొసలి. కోతి సమయస్ఫూర్తే దాని ప్రాణాల్ని కాపాడింది.. అవునా?
నీతి: సమయస్ఫూర్తి అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైంది.