పులిమెడలో పచ్చల హారం | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

ఒక అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు అన్నీ కలసిమెలసి బ్రతికేవి. ఎంతో ఆనందంగా వుండేవి.


ఆ అడవిలో పచ్చని చెట్లున్నాయి.


పండ్లతో బరువుగా వంగిన శాఖలతో ఎన్నో ఫలవృక్షా లున్నాయి. పరిమళభరితమైన పూలు పూచే తీగలు లతలు మొక్కలకు కొదవ లేదు. లేత చిగుళ్ళతో మెరిసే పచ్చిక బీళ్ళు వున్నాయి. గల గల పారే మంచి నీటి వాగులున్నాయి.


దేనికీ ఆ అడవిలో లోటు లేదు.


కొమ్మల వెంట ఎగురుతూ కుహూ కుహూ రాగాలతో కోయలలు పాటకచేరీలు చేస్తుంటాయి. తమ ముద్దు ముద్దు పలుకులతో చిలకమ్మలు గుంపులుగా తిరుగుతూ సందడి చేస్తుంటాయి.


వయ్యారాలు పోయే నెమళ్ళు, వన్నె చిన్నెల పావురాళ్ళు, ఒద్దికైన పాలపిట్టలు అడవంతా తమ అందాలు ఆరబోస్తుంటాయి. గుంపులుగుంపులుగా ఎగిరొచ్చే నీటి బాతులు వాగుల్లో స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. అడవికోళ్ళు మెడలు చాపి గర్వంగా కొక్కొరకో అని కూస్తుంటాయి.


లేళ్ళు దుప్పులు అడవి గొర్రెలు మొదలయిన జంతుజాలం విశాలమైన పచ్చి బీళ్ళలో గుంపులుగా తిరుగుతూ లేత చిగుళ్ళ పచ్చిక ఆరగిస్తుంటాయి. ఎటు చేసినా సంతోషం ఆనందం తాండవించే అందాల అడవి అది.


ఇలా ఉండగా-


వాటి ఆనందాలకు విఘాతం కలిగిస్తూ ఎక్కడి నుంచో ఒక చిరుతపులి వచ్చి చేరిందక్కడికి. అది వచ్చినప్పట్నించి ఆ అడవి జీవాలకు కష్టాలు దాపురించాయి.


మంచి జవసత్వాలున్న కుర్ర చిరుత అది.


గాలితో పోటీపడి పరుగు తీయగల నేర్పరి. చెట్టుపుట్టలు ఎక్కేసి అదను చూసి నచ్చిన జంతువు మీద పడి క్షణంలో చంపేది. విందు భోజనం ఆరగించేది. చడీచప్పుడు లేకుండా దాడి చేయగల టక్కరి.


ఆ చిరుతను అదుపు చేయగల మొనగాడే ఆ అడవిలో లేకుండా పోయాడు. అందుకే అది యథేచ్ఛగా విహరిస్తూ అక్కడే స్థిరపడిపోయింది.


ఇలా ఉండగా ఒకసారి -


ఆ దారిన వస్తున్న నగల వ్యాపారిని చూసి తినేసింది చిరుత. అతడి నగలను చెల్లాచెదురు చేసింది.


అందులో అద్భుతంగా మెరిసిపోతున్న పచ్చల హారాన్ని తన మెడలో ధరించింది.


ఆ హారంతో తన అందం పెరిగి అడవికే రాజయినంత ఠీవిగా తిరగసాగింది.


అడవి జంతువులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరి మీద దాడిచేస్తుందో తెలీక భయంతో బిక్కు బిక్కు మంటూ బ్రతకసాగాయి.


ఈ పరిస్థితి నక్కబావ గారికి నచ్చలేదు.


తమ ఆనందాన్ని హరించిన చిరుత పులి మీద పీకల్దాకా కోపం వుంది. ఈ పరిస్థితి ఎలాగయినా మార్చాలి. చిరుతపులిని అంతం చేసి ఎలాగయినా అడవిలో తిరిగి ఆనందాలు చిగురింప చేయాలి అని కంకణం కట్టుకుంది.


తీవ్రంగా ఆలోచించింది.


టక్కరి నక్కబావకు ఉపాయాలకేమీ లోటు లేదు. కాని పథకం బెడిసి కొడితే పులి పంజా దెబ్బకి తన తల పగిలిపోతుంది. ఆచితూచి అడుగు వేయాలి. దానికి ముందు పులితో స్నేహం చేసి నమ్మకం కలిగించాలనుకుంది.


నక్కను చంపితినే నీచపు జంతువులేవీ అడవిలో లేవు. కాబట్టి చిరుత తనమీద దాడి చేస్తుందన్న భయం లేదు నక్క బావకి.


అందుకే ఆ రోజు నుంచి కావాలనే చిరుత కంటపడేలా సంచరించటం ఆరంభించింది.


మర్యాదగా పలకరించేది.


యోగక్షేమాలు విచారించేది.


పరిచయం బాగా పెంచుకుంది.


తన మీద నమ్మకం కలిగించటానికి ఎక్కడా ఏ యే జంతువులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయో చెప్పేది.


అడవిదున్నలు మూకుమ్మడిగా దాడి చేసి కొమ్ములతో కుమ్మి చంపాలని చిరుత మీద కుట్ర చేస్తున్నాయని హెచ్చరించేది.


అలా క్రమంగా నక్కబావ చిరుతపులికి చాలా ఆప్తుడైపోయింది. నమ్మించటం అయిపోయింది కాబట్టి ఇక గొంతుకోయాలి. ఎలా అని తీవ్రంగా ఆలోచించి ఒక వ్యూహం పన్నింది.


దేహబలం కన్నా బుద్ధిబలం గొప్పది కదా. తన బుద్ధి బలంతో శత్రువు చిరుతపులిని తుదముట్టించటం ఎలాగని తీవ్రంగా ఆలోచించింది. అందుకు కొండవాగు పక్కనున్న ఊబి అనుకూలమని భావించింది.


అది దొంగ వూబి. అంటే కొత్త వాళ్ళకి అక్కడ వూబి వున్న సంగతే తెలీదు. మామూలు బురద మట్టిలా వుంటుంది. అందులో పొరబాటున పడిన ఏ జంతువూ బతికి బలుసాకు తినలేదు.


పైగా ఆ వూబి మీదుగా వాలుతూ ఏటవాలున ఒక జీలుగు చెట్టు కూడా పెరిగింది.


ఏం చేయాలో ఆలోచించుకుని బయలుదేరింది నక్కబావ. ముందుగా గురక వీరుడు ఎలుగ్గొడ్డును కలిసి సమస్య చెప్పింది. విని బాధగా నిట్టూర్చింది ఎలుగ్గొడ్డు మామ.


“ఏం చేస్తాం రా... ఆ చిరుతగాడు బలవంతుడు. మనం ఏం చేయలేం” అంది నిరాశగా.


"అలాగని వూరుకోవలసిందేనా? రోజూ ఎన్నో జంతువుల్ని చంపి ఆ చిరుత పలహారం చేసేస్తోంది. ఇప్పటికే సగం అడవి బోసి పోయింది. పరిస్థితి ఇలాగే వుంటే కొన్నాళ్ళకి మనల్ని పలకరించే దిక్కుండదు..” అంటూ అంగలార్చింది నక్క.


“నిజమేరా... దీనికి నన్నేం చేయమంటావ్?” అంటూ విసుక్కుంది ఎలుగ్గొడ్డు.


“నీకేంది మామా ఉక్కు శరీరం నీది. నీ సాయం వుంటే చిరుతని పట్టొచ్చు” అంటూ తన పథకం వివరించింది నక్క.


“నువ్వు చెప్పింది బాగానే వుందిరా. కాని నీ నక్కజిత్తులు ఆ చిరుతగాడి ముందు పని చేస్తాయంటావా?” సందేహించింది ఎలుగుబంటి.


“మన ప్రయత్న లోపం వుండకూడదు. అప్పుడు చక్కగా పనిచేస్తాయి.


ఎవరో ఒకరం తెగించి ధైర్యం చేయాలి. లేకపోతే ఈ అడవిని కాపాడలేం. సిద్ధంగా వుండు” అంటూ హెచ్చరించి అక్కడి నుంచి బయలుదేరింది నక్క.


సరాసరి చిరుత వుంటున్న గుహ ముందుకెళ్ళింది


. . “ఏం చెప్పను మిత్రమా!” అంటూ బాధగా నిట్టూర్చింది నక్క. ఆగడాలు రోజు రోజుకు మితిమీరి


అక్కడ దిగాలుగా ముఖం పెట్టి కూర్చుంది.


“ఏమైంది?” ఉరుములాంటి గొంతుతో అడిగింది చిరుతపులి.


“ఏం చెప్పను మిత్రమా!” అంటూ బాధగా నిట్టూర్చింది నక్క. 


"ఎలుగ్గొడ్డు గాడి ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి. వాడి కోతలు వినలేక చెవులు పులిసిపోతున్నాయి”


 “ఏమంటాడు?”


“నువ్వు తన కన్నా ఎందులోనూ ఎక్కువ కాదట. నిన్ను ఎగతాళి చేస్తున్నాడు”


“అంత ధైర్యమా వాడికి... ఎందుకంత అహంకారం?” 


“చెట్లెక్కటంలో నువ్వు వేగం కావచ్చు. కాని తల్లక్రిందులుగా చెట్లెక్కటం నీకు రాదట. అందుకే అహంకారం”


"తలుచుకుంటే నేనూ ఎక్కగలను. దమ్ముంటే పోటీకి రమ్మను. రాకపోతే వాడు ఎక్కడున్నా వెదికి చంపేస్తాను” అంది కోపంగా చిరుత.


తనకు అలవాటయిన విద్యగాబట్టి తల్లక్రిందులుగా వెనక కాళ్ళతో చకచకా చెట్టేక్కేసింది ఎలుగుబంటి. తనూ అలా ఎక్కబోయింది చిరుత పులి. కొంత దూరం ఎక్కగానే పట్టు తప్పింది. జారిపోయి దబ్బున వూబిలో పడింది. జరిగిన మోసం గ్రహించి పెద్దగా అరిచింది. తమ పాచిన పారినందుకు నక్కబావ ఎలుగ్గొడ్డు మామ ఆనందంతో గంతులు వేసారు.


“నీ మూలంగా అడవి వల్ల కాడయిపోతోంది. నీ చావును అందరూ చూడాలి. అడవి జీవాలన్నింటిని పిలుచుకువస్తాను” అంటూ పరుగు తీసింది నక్క.


ఎలుగ్గొడ్డు కూడా తమ వాళ్ళని పిలవటానికి పరుగెత్తింది.


వూబిలోంచి బయట పడలేకపోయింది చిరుత. బురదలోంచి కాళ్ళు రావటం లేదు. కొంచెం కొంచెం దిగబడిపోతోంది. పరిస్థితి అలాగే వుంటే తన చావు ఖాయం అనిపించింది. ఏం చేయాలా అని ఆలోచించింది.


అంతలో ఒక జింక నీళ్ళ కోసం వాగు దగ్గర కొచ్చింది. చిరుతను చూసి భయపడి పారిపోబోయింది. దానికి ధైర్యం చెప్పి దగ్గరకు పిలిచింది చిరుత.


“నీకు తెలీదా? నిన్నటి నుంచి నేను మాంసాహారం మానేసాను. మీలాగే ఆకులు, పచ్చిక తిని బతుకుతున్నాను” అంటూ నమ్మ బలికింది.


అంతేకాదు-


“ఆహా....చుక్కల్లా మెరుస్తూ నీ ఒంటిమీద మచ్చలు చూస్తుంటే ముచ్చటేస్తోంది.


నా మెడలోని పచ్చలహారం నీ మెడలో వుంటే నువ్వు వన రాణిలా వుంటావు. నేను చెప్పినట్టు చేస్తే ఈ పచ్చలహారం నీదే" అంటూ ఆశ చూపింది.


పచ్చలహారం అనగానే-


జింకకు ఆశ పుట్టింది.


“ఏం చేయాలి?” అనడిగింది.


"ఏం లేదు.. పొడవాటి తీగను చెట్టుకు కట్టి రెండో కొన నా మీదకు విసిరేయ్” అంది.


అలాగే చేసింది అమాయకపు జింక.


ఆ తీగ పట్టుకుని వూబిలోంచి బయటపడింది చిరుతపులి. బయట పడిన ఆనందంతో పెద్దగా అరిచింది.


అయినా పచ్చలహారం మీద ఆశతో అక్కడే నిలబడింది జింక. చిరుత కొంచెం కూడా జాలి లేకుండా దాని మీద దూకి చంపేసింది. వాగులో దూకి బురద వదిలించుకు వచ్చి జింకను తినేసింది.


దుష్టులకు దూరంగా ఉండాలని తెలీక చిరుతకు బలయి పోయింది జింక.


అంతే కాదు ఎంతో శ్రమపడి సాధించిన నక్క పథకాన్ని కూడా నాశనం చేసింది.


తిరిగి వస్తున్న నక్క, ఎలుగొడ్డు, యితర జంతువులు జరిగింది గమనించి అటునుంచి అటే పారిపోయాయి.


తన కోసం చిరుతపులి గమనిస్తోందని తెలసిన నక్క ప్రాణ భయంతో మరోచోటుకి వలస పోయింది. 


తిరిగి అడవి జంతువులకు చిరుత నుంచి కష్టాలు తప్పలేదు. 


నీతి : దుష్టులకు దూరంగా ఉండవలెను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)