ఊరికి ఉపకారి | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

పూర్వం వెంటాపురం గ్రామంలో మాధవుడు అనే యువకుడు ఉండేవాడు.


మాధవుడు చాలా మంచివాడు. చాలా అందంగా ఉండేవాడు. హుషారయిన వాడు. తెలివైన వాడు.


పాపం మాధవుడు చిన్నప్పట్నుంచి కష్టాల్లోనే పెరిగాడు. అతడి తండ్రి వ్యసనాలకు బానిసయి ఆస్థి నాశనం చేసుకున్నాడు. కుటుంబాన్ని పట్టించుకోలేదు. చివరకు వూళ్ళో ఉండలేక దేశాలు పట్టి ఎటో వెళ్ళిపోయాడు.


తల్లి అష్టకష్టాలు పడి మాధవుడ్ని పదేళ్ళ వయసు వరకు పెంచింది.


తర్వాత అనారోగ్యంతో ఆమె కూడా గతించింది. మాధవుడు ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయాడు.


బంధువులెవరూ ఆ పసివాడ్ని చేరదీయలేదు. స్వయానా మేనమామ ఆ వూళ్ళోనే వున్నాడు. అతనూ పట్టించుకోలేదు. ఆయన పేరు కోటగిరి. 'ఈ దరిద్రం గొట్టు నాకెందుకు' అని మేనల్లుడ్ని చీదరించుకుని ఇంటి దరిదాపులకు రానీయలేదు. వాడ్ని అనాధగా వదిలేసాడు.


ఆ పరిస్థితిలో-


దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నట్టుగా - వూరి చివరి అమ్మవారి గుడిలో పూజారి అయిన గోవిందాచార్యులు మాధవుడి మీద జాలిపడ్డాడు. చేరదీసాడు. అన్నం పెట్టాడు. తల్లి తండ్రి గురువు అన్నీ తానే అయి మాధవుడికి ధైర్యం చెప్పి ఆదరించాడు.


ఆయన మాధవుడికి కష్టపడి పనిచేయటం నేర్పాడు. కష్టే ఫలి అనే సూత్రాన్ని వివరించాడు. చదువు చెప్పాడు. దైవభక్తి నేర్పాడు. పరోపకారం నేర్పాడు. మానవ సేవే మాధవ సేవ. మన జీవితం పదిమందికి ఉపయోగపడాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని బోధించాడు.


అలా గోవిందాచార్యుని శిష్యరికంలో చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు మాధవుడు. ఎంతో నేర్చుకున్నాడు. నేర్చుకోవటమే కాదు ఆచరించి చూపేవాడు. వూళ్ళో అందరికీ తల్లో నాలుకలా వుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి తన వంతు సాయం చేసేవాడు. దాంతో వూరందరి అభిమానం సంపాదించుకున్నాడు.


అంతేకాదు.. తాను నిరంతరం కష్టపడి డబ్బు సంపాదించే వాడు. సంపాదించిన దాంట్లో కొంత దానధర్మాలు చేసేవాడు. తన మంచితనంతో వూళ్ళో చాలామంది మితృల్ని సంపాదించుకున్నాడు. వాళ్ళని ఎప్పుడూ ఆదరిస్తూ వుండేవాడు.


అందగాడు వూళ్లో అందరికి కావలసిన వాడు మంచి వాడు అయిన మాధవుడ్ని పెళ్ళి చేసుకోవాలని గ్రామంలో చాలా మంది యువతులు ఆసక్తి కనపరిచేవాళ్ళు.


కాని మాధవుడి మనసు మాత్రం తన మామ కోటగిరి కూతురు కస్తూరినే ఇష్టపడేది. కస్తూరి చాలా అందంగా వుంటుంది. పూవుకు తావిలా అందంతో బాటు మంచి సుగుణవతి కస్తూరి. బావా మరదళ్ళు చిన్నప్పట్నుంచి ఒకరికొకరు తెలుసు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.


ఎన్నోసార్లు తండ్రికి తెలీకుండా గుడికి వచ్చి మాధవుడ్ని చూసి పరామర్శించి వెళ్ళేది కస్తూరి.


ఆమె సాయం చేస్తానన్నా ఎప్పుడూ తీసుకునే వాడు కాదు మాధవుడు. ఇది చిన్నప్పటి మాట.


ఇప్పుడు యిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. 


ఇద్దరూ ఒకరినొకరు యిష్టపడ్డారు.


పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.


మాధవుడు కస్తూరిల ప్రేమ గురించి వూళ్ళో కూడా కొందరు పెద్ద మనుషులకు తెలుసు. మాధవుడి మీద అభిమానంతో వాళ్ళు కోటగిరి దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. “వాడు మంచివాడు. ప్రయోజకుడయ్యాడు. పైగా నీ మేనల్లుడు. నీ కూతురు కూడా బావని ఇష్టపడుతోంది. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయటానికి నీ అభ్యంతరం ఏమిటి?" అనడిగారు.


“ఇంకోసారి వాడి గురించి నా దగ్గర మాట్లాడవద్దు. గ్రామం లోనే ధనవంతమైన కుటుంబం మాది. వాడు ఏం ప్రయోజకు డయ్యాడని? ఏ మాత్రం సంపాదించాడని పిల్లనివ్వాలి? రేపు తండ్రిలాగే వాడూ జులాయిగా మారితే నా కూతురి బతుకేమవు తుంది? వద్దయ్యా బాబు.. తెగిపోయిన బంధుత్వాన్ని తిరిగి అతికించుకోలేను" అంటూ తన అభిప్రాయాన్ని తెగేసి చెప్పాడు కోటగిరి.


తండ్రి అభిప్రాయం విన్న కస్తూరి ఆ రాత్రి తండ్రితో తన మనసులో మాట చెప్పేసింది. పెళ్ళంటూ చేసుకుంటే బావనే చేసుకుంటాను. అంటూ హఠం చేసింది.


జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిస్థితులు చేయి దాటి పోవచ్చుని భయపడ్డాడు కోటగిరి. తక్షణం కస్తూరి పెళ్ళి జరిపించేయాలన్న పట్టుదలతో తగిన సంబంధం కోసం ప్రయత్నాలు ఆరంభించాడు.


ఇలా ఉండగా-


ఉరుములు మెరుపులతో వర్షాకాలం మొదలయింది. వూళ్ళో గంగానమ్మ ఉత్సవాలు కూడా ఆరంభమయ్యాయి. వెంకటాపురం పండుగ వాతావరణంతో కళకళలాడింది.


కాని ఆ సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. ఎగువున కురిసిన భారీ వర్షాలకు వెంకటాపురం గ్రామాన్ని ఆనుకొని వున్న పెద్ద చెరువు పొంగి పొర్లటం ఆరంభించింది.


సుమారు అయిదుకోసుల దూరం విస్తరించిన పెద్ద చెరువు అది. ఆ చుట్టు ప్రక్కల చాలా గ్రామాల వ్యవసాయ అవసరాలను తాగు నీటి సమస్యను తీరుస్తున్న అతి పెద్ద చెరువు. ఆ చెరువు చుట్టూతా వున్న కట్ట తెగిందంటే వరద నీటిలో వెంకటాపురం మునిగిపోతుంది. వూరు నాశనమవుతుంది.


వూరి జనమంతా భయపడ్డారు. గంగానమ్మకు మరిన్ని కొల పులు పూజలు ఆరంభించారు. వరద శాంతించటానికి పొట్టేళ్ళను బలివ్వాలని తీర్మానించారు. ఈ వ్యవహారం మన మాధవుడికి నచ్చలేదు.


ఓ పక్క ఇంకా వర్షాలు పడుతున్నాయి. వరద పెరుగుతుంది గాని తగ్గే అవకాశం లేదు.


మన కష్టాల్ని మనమే నివారించుకోవాలి. దేవుడు సాయం చేస్తాడు. 


అంతే గాని యిలా కొలుపులు బలులు ఇచ్చి సమయాన్ని వృధా చేసుకుంటే ఏ దేవుడూ మనల్ని కాపాడలేడు.


చెరువు కట్టకు దక్షిణ భాగంలో చెరువు కట్ట తెగ్గొడితే వరద నీరు అటు పక్క పెద్ద మురుగు కాలువలో పడి దిగువకు పోతుంది. కొంత పంట నష్టం జరిగినా మన గ్రామం సురక్షితంగా వుంటుంది. పదండి" అంటూ సలహా యిచ్చాడు మాధవుడు.


వూరి జనం ఒప్పుకోలేదు. కొందరు దైవ నింద మంచిది కాదన్నారు. కొందరు చెరువు కరకట్ట కొట్టడం పాపం అన్నారు. మరి కొందరేమో అది జరిగే పని కాదన్నారు.


గ్రామం ఎంత ప్రమాదంలో వుందో గ్రహించిన మాధవుడు వూరి జనంతో చెప్పి లాభం లేదని గ్రహించాడు. పలుగు పారలతో తన మిత్రులు కొంతమందిని తీసుకుని బయలుదేరాడు.


దక్షిణంగా వున్న మురుగు కాలువ దిశకు చేరుకున్నారు. కరకట్ట మీద చాలా చోట్ల వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. ఊరు దిశగా గండి పడే ప్రమాదం పొంచి వుంది. పరిస్థితి విషమించే లోపలే మాధవుడు అతని మిత్రులు సాహసించి మురుగు కాలువ దిక్కుగా గండి కొట్టారు.


గండి పడగానే వరద నీరు ఒక్కసారిగా మురుగు కాలువలోకి దూకింది కరకట్ట కొంత మేర విరిగి పడిపోయింది.


ఆ ప్రమాదంలో మితృలంతా ఎలాగో తప్పించుకున్నారు. కాని వాళ్ళని కాపాడిన మాధవుడు మాత్రం వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయాడు.


వరద ఉధృతికి మరికొంత మేర చెరువు కట్ట కొట్టుకు పోయి విశాలమైన గండి ఏర్పడింది. మురుగు కాలువ గుండా నీరు పొంగి పొర్లుతూ చేలలోకి వెళ్ళిపోతుంది. వెంకటాపురానికి ప్రమాదం తప్పింది.


మాధవుడు వరద నీటిలో కొట్టుకుపోయిన సంగతి తెలీగానే వూరి జనమంతా తరలివచ్చారు. అతడి సాహసాన్ని తలుచుకొని విలపించారు.


ఈ లోపల ఆశ వదలని మిత్రబృందం పడవలు వేసుకొని దిగువకు వెళ్ళి అతని కోసం గాలించారు.


నాలుగు రోజులు వర్షాలు ముంచెత్తాయి. అయినా వెంకటా పురం క్షేమంగా వుంది. చెరువులోని వరద నీరు నిరపాయంగా దిగువకు వెళ్ళిపోయింది.


నాలుగు రోజుల తర్వాత దిగువన ఎక్కడో ఒక చెట్టు మీద మాధవుడు తన మిత్రబృందానికి కన్పించాడు. అతడ్ని క్షేమంగా పడవలోకి చేర్చి గ్రామానికి తీసుకొచ్చారు.


అతడు తిరిగి వచ్చినందుకు వూరంతా సంబరాలు జరుపు కుంది. తన ప్రాణాలు కూడా లెక్కచేయకుండా వూరును కాపాడిన ఆ వూరికి వుపకారికి గ్రామప్రజలు జేజేలు పలికారు. ఇక తన బావ క్షేమంగా తిరిగి వచ్చినందుకు కస్తూరి ఆనందానికి హద్దులేక పోయింది.


ఇదంతా గమనిస్తున్న కోటగిరి తన తప్పు తెలుసుకున్నాడు. అంతమంది అభిమానం సంపాదించుకున్న తన మేనల్లుడు మాధవుడు తక్కువ వాడు ఎలా అవుతాడు. అంతకన్నా మంచివాడ్ని తన కూతురుకి సంబంధం తేగలడా? ఇలా ఆలోచించి మనసు మార్చుకున్న కోటగిరి అందరి సమక్షంలోనూ మాధవుడ్ని క్షమించమని వేడుకున్నాడు.


వర్షాలు తగ్గి వెంకటాపురం యాధాస్థితికి వచ్చింది. ఒక మంచి ముహూర్తంలో గ్రామప్రజల సమక్షంలో కస్తూరి మాధవులకు వైభవంగా వివాహం జరిపించాడు కోటగిరి.


నీతి: చూసారా.. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. పదిమంది కోసం పాటుపడే స్వార్ధం లేని వారిని భగవంతుడెప్పుడూ చల్లగా చూస్తాడు. మొదట కష్టాలు ఏర్పడినా తర్వాత కలకాలం వాళ్ళు సుఖంగా వుంటారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)