ఒంటరి కప్ప | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

ఒక వూరి చివర పెద్ద చెరువుంది. అది తామరాకుల చెరువు. చెరువు నిండా నీళ్ళుండేవి. పెద్ద పెద్ద తామరాకులు విరబూసిన తామరల పూలతో చెరువు కళకళలాడేది.


ఆ చెరువులో అనేక రకాల చేపలున్నాయి... కప్పలున్నాయి... ఎండ్రకాయలున్నాయి. మీసాలు తిప్పుతూ రొయ్యలూ వున్నాయి. పాములూ నివశించేవి.


ఆ చెరువుకు వచ్చే అతిధులూ వున్నారు. కొంగలు తామరాకుల మీద నిలబడి కొంగజపం చేసేవి.


ఝుమ్మని శబ్దాలు చేస్తూ తేనె కోసం తామరపూవు వెంట తిరిగే తేనెటీగలు తుమ్మెదలు కూడా వచ్చేవి. అప్పుడప్పుడూ దొంగలా రివ్వు రివ్వున దూసుకొచ్చి చేప పిల్లల్ని ఎత్తుకుపోయే లకుముకి పిట్టలూ వచ్చేవి.


ఇక ఉదయం సాయంత్రం చెరువు ఒడ్డున వూరి పిల్లలు స్నానాలు చేస్తుంటే సందడే సందడి.


ఆ చెరువు అలా కళకళలాడిపోతూ కనువిందు చేసేది. 


ఇలా వుండగా ఆ చెరువు లోకి కొత్తగా ఓ కప్ప పిల్ల వచ్చి చేరింది. అది బోదురు కప్ప జాతికి చెందిన పిల్ల. ఆ కప్ప పిల్లకు ఆకలెక్కువ. దొరికింది దొరికినట్టు స్వాహా చేసేసేది. 


అంత పెద్ద చెరువులో-


ఆ కప్పకు ఆహారానికి లోటేమిటి?


చిన్న చిన్న పురుగులూ, నాచు మొక్కలు ఏలిక పాములు ఇలా ఒకటేమిటి..?


రోజూ విందు భోజనమే దానికి. ఎంత పుష్కలంగా తిండి దొరికినా ఆహారనియమాల్ని పాటించాలి గదా! వూహు.. ఈ కప్పగారికి అలాంటి నియమాలేమీ లేవు. ఎప్పుడూ తిండి... తిండి... తిండి.


అలా తినేస్తూనే పెరగసాగింది.


ఆ చెరువు స్వర్గంలా వుంది కప్పపిల్లకి.


చల్లటి నీటిలో రకరకాలుగా ఈతలు కొడుతూ ఆనందించేది. 


సంతోషమే సగం బలం ఇస్తుంది అన్నారు.


ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు.


తిండి ఉంటేనే కండ కలదోయ్ అన్నారు. ఇవన్నీ ఆ కప్పగారికి చక్కగా అమిరాయి.


దాంతో ఆ చెరువులో దిన దిన ప్రవర్ధమానమై పెరగసాగిందా బోదురు కప్ప. అంతే కాదు...


ఆకుపచ్చ పసుపు కలగలిపిన రంగులో వుండే తన కన్నా అందమైన ప్రాణి ఈ లోకంలో లేదని గర్వం.


ఇక ఈతలో తనకు తానే సాటి అనుకునేది. వెనక కాళ్ళతో దూకితే ఎంత దూరమైనా చకచకా తరిగిపోవాల్సిందే.


కాబట్టి దూకుడు పోటీలు పెడితే తనను మించిన మొనగాడు లేడని గట్టి నమ్మకం. పైగా తనకన్నా గట్టిగా అరవగల ప్రాణి కూడా లేదని ఛాతీ విరుచుకునేది.


ఇన్ని విశిష్ట లక్షణాలు తనలో వున్నాయనే అహంతో ఆ కప్ప ఎవరినీ లెక్క చేసేది కాదు. సాటి కప్పల్తో గాని, చేపలతో గాని కలిసి మెలసి తిరిగేది కాదు.


ఎప్పుడూ తన తిండి తన ఆట పాటలు తన లోకం అంతే. ఇదిలా వుంటే ఆ కప్పకు మరో గర్వం కూడా వచ్చి చేరింది. ఎప్పటిలాగే డైవింగ్ చేద్దామని తామరాకు మీదకు దూకితే అది దాని బరువు ఆపలేక నీటిలోకి కుంగింది.


'చీ... రాను రాను తామరాకుల్లో బలం తగ్గిపోతుంది' అను కుంది కాని తను బరువు పెరుగుతున్న సంగతి గమనించలేదు.


ఓరోజు నీటి ఒడ్డున రాయి మీద కూర్చుని నీటిలో తన రూపం చూసుకున్నాక అర్థమైంది. తను తిని తిని చాలా లావైన సంగతి. అంతే...


అందంలోనే కాదు ఆట పాటల్లోనే కాదు ఈతల్లోనే కాదు తనను మించిన లావు బరువున్న కప్ప ఇంకోటి లేదని గొప్ప గర్వం ఏర్పడింది.


తనిప్పుడు పెద్దదయింది.


తను మహాబలవంతుడు.


ఎవరినీ లెక్క చెయ్యాల్సిన పనిలేదు.


అందుకే అది రాత్రిపూట నీటిలోంచి రాతి మీదకు ఎగిరి కూచుని...


“నా కన్నా బలవంతుడు ఎవడు... నాకన్నా అందగాడు ఎవడు.... ఎవడు.. ఎవడు...” అంటూ తన బెక్ బెక్ ల పాటలు ఆరంభించేది.


ఆ కప్ప గారి గొంతు విని సాటి కప్పలే జడుసుకునేవి. దాని గొంతు రాత్రి పూట ఎంత సందడి చేసేదంటే వూరంతా మారు మోగి నిద్రపోతున్న పిల్లలు ఉలిక్కిపడి లేచి గుక్క పెట్టి ఏడ్చేవారు. వూరి జనం నిద్రపట్టక చచ్చేవారు.


ఇలా కాదని కనిపిస్తే కర్రలతో కొట్టి చంపాలని టార్చిలైట్లు, లాంతర్లు వేసుకుని చెరువు చుట్టు తిరిగి గాలించేవారు.


అది గమనించి అలికిడి కాగానే టక్కున నోరు మూసేసి నిశ్శబ్దంగా నీటిలో ఈదుకుంటూ మరో పక్కకు వెళ్ళిపోయేది టక్కరి కప్ప. అంతేనా తనను పట్టుకోలేకపోయారన్న ఆనందంలో మరింత ఉత్సాహంగా పాటలు పాడుతూ వూరి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసేది.


అలా బోదురు కప్ప బాధితులంతా దాన్ని చంపలేక పోయినందుకు భోరున విచారించేవారు.


ఏమైతేనేం శీతాకాలం వర్షాకాలం ఆ బోదురు కప్పకు ఆడింది ఆటగా పాడింది పాటగా హ్యాపీగా గడిచిపోయింది. అంతలో ఎండాకాలం మొదలయింది.


చెరువులోకి నీరు రావటం ఆగిపోయింది. ఉన్న నీరు క్రమంగా తరిగిపో నారంభించింది. తామరపూలు వికసించటం లేదు. తేనెటీగలు తుమ్మెదలు రావటం లేదు. చేపల కోసం వచ్చే కొంగల తాకిడి ఎక్కువయింది.


చెరువు జీవులు తమకు కష్టాలు ఆరంభమయ్యాయని గ్రహించాయి. ముందుగా చెరువులో కప్పలన్నీ మరొక చోటుకి వలస ఆరంభించాయి. వాటితో బాటు తానూ బయలుదేరింది బోదురు కప్ప.


“ఇంతకాలం మా లెక్కలేనట్టున్నావ్. ఇప్పుడేంది స్నేహం.. నీ దారి నీది మాతో రావద్దు" అని చెప్పి అవన్నీ వెళ్ళిపోయాయి. తర్వాత చేపల వలస మొదలయింది.


చేపలు కూడా బోదురు కప్పను తమతో రానివ్వలేదు. ఇక పాములు.... వాటి నోళ్ళు అసలే పెద్దవి..... ఎక్కడో పెద్దపాము తనని పట్టి మింగేస్తుందని భయం.


అలా బోదురు కప్ప ఎవరితోనూ పోలేక ఏం చేయాలా అని ఆలోచనలో పడింది. దిగులు చెందింది. పూర్వపు ఉత్సాహం లేదు. ఇప్పుడు పాటలు కూడా పాడటం లేదు.


అంతలో నీరు మరింత తగ్గింది.


వూరి జనం వలలు వేసుకుని చెరువులో చేపలు పట్టుకోవడానికి బయలుదేరారు. ఒకటే సందడి.


ప్రాణభయంతో-


దూకుతూ గెంతుతూ-


బురదనీటిలో అటూ ఇటూ పరుగులు తీసింది బోదురు కప్ప. కాని తప్పించుకోలేక ఒకసారి ఒక వలలో తగులుకుంది. చేపల్ని పట్టుకున్న జనం బోదురు కప్పను ఎత్తి దూరంగా విసిరి వేసారు.


అలా దూరంగా పడిన కప్ప దారి మర్చిపోయింది. చెరువు వైపుగా కాకుండా అలా ముందుకు పోయి పొదల్లో చేరింది. రెండు రోజులుగా గాయాలతో బాధపడుతూ పొదల్లో సంచరించింది. తన కష్టాలకు కుమిలి కుమిలి ఏడ్చింది.


సాటి కప్పలతో సఖ్యంగా వుంటే తనకీ కష్టాలు వచ్చేవి కాదు. వాటితో వెళ్ళిపోయి సంతోషంగా వుండేది. గర్వంతో తను వాళ్ళని లెక్క చేయక ప్రాణాల మీదికి తెచ్చుకుంది.


అప్పటికి జ్ఞానోదయం కలిగి తన మూర్ఖత్వానికి ఎంతో బాధపడింది.


ఇప్పుడు చేయగలిగింది ఏముందని.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? జరిగిన దానికి వగచి, విచారపడి, వేదన చెంది, దిగాలుగా పొదల్లో సరైన తిండిలేక సంచరిస్తున్న బోదురు కప్పను ఒక జంగు పిల్లి చూడనే చూసింది. 


ఇంకేముంది?


చక్కటి విందు భోజనం దొరికిందని సంబర పడిపోతూ బోదురు కప్పను చంపి తినేసింది.


నీతి : కలసి వుంటే కలదు సుఖం. సాటి వాళ్ళతో నాకేమిటి అని మిడిసి పడితే చివరకు సాయం చేసే వాళ్ళెవరూ వుండరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)