ఒకప్పుడు మాళవదేశానికి రాజు మణివర్మ. అతను గొప్ప వీరుడు. అంతులేని పరాక్రమశాలి. అరివీర భయంకరుడు. సకల సద్గుణాలు కలిగిన గొప్ప ప్రభువు.
అతను ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందాడు. అనేక యుద్ధాలు చేసాడు. మాళవ రాజ్యాన్ని విస్తరించి మహావీరుడనిపించుకున్నాడు.
అతని పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండేవాళ్ళు.
సిరి సంపదలతో తులతూగే మాళవ రాజ్యాన్ని చూసి చాలామంది రాజులు అసూయ చెందేవాళ్ళు. అటువంటి వాళ్ళలో కార్తికేయుడు ఒకడు. ఇతను సౌరాష్ట్రదేశానికి ప్రభువు. మహా కపటి. దుర్మార్గుడు....
ఎప్పటికయినా పగ, ప్రతీకారం తీర్చుకోవాలని మాళవ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ఉవ్విళ్ళూరేవాడు. కాని మణివర్మను జయించటం అంత తేలికకాదని కార్తికేయుడికి తెలుసు.
శత్రువులను జయించాలంటే దైవ బలం, అంగబలం వుంటే చాలదు. బుద్ధి బలం కూడా వుండాలి. మణివర్మ యుద్ధతంత్రాల వెనక ఏదో అదృశ్య శక్తి సాయం చేస్తోందని వూహించాడు. అదృశ్య శక్తిని నాశనం చేస్తే గాని మణివర్మను ఓడించటం అసాధ్యం అనిపించింది.
అందుకు ఒక యుక్తి ఆలోచించాడు.
తన ఆంతరంగికుల్లో చిత్రాంగుడనే వాడున్నాడు. వాడు రహస్యకార్య కలాపాలు సాగించటంలో నేర్పరి. అనేక భాషలు తెలిసిన వాడు. శత్రువర్గంలో సులువుగా కలసి పోగలిగిన టక్కరి.
అటువంటి చిత్రాంగుడ్ని పిలిచి ఏం చేయాలో వివరించాడు. కావలసినంత ధనమిచ్చి మాళవ దేశానికి పంపించాడు. కొద్ది రోజులకే మాళవ దేశం చేరుకున్నాడు చిత్రాంగుడు.
సంవత్సరం తిరక్కుండానే మణివర్మ ఆంతరంగికుల్లో ఒకడయిపోయాడు. అతడ్ని శత్రు గూఢచారిగా ఎవరూ అనుమానించ లేకపోయారు.
ముందుగా చిత్రాంగుడు గమనించిన విషయం ఏమంటే రాజు మణిశర్మలో ఒక బలహీనత వుంది. ఎవరేం చెప్పినా సులువుగా నమ్మేస్తాడు. ఈ ఒక్క విషయం చాలు తనకు. మాళవ దేశాన్ని దెబ్బతీయటానికి.
క్రమంగా చిత్రాంగుడ్ని అనుసరించి అతనికి సాయం చేయ టానికి సౌరాష్ట్ర నుంచి మరికొందరు వేగులు కూడా మారు వేషాలతో వచ్చి మాళవ దేశం రాజధాని నగరంలో తిష్ట వేసారు. ఈ విషయాలేవీ రాజు మణివర్మకు తెలీదు. చిత్రాంగుడు ఆయనకు ఆప్తుడైపోయాడు.
అనతికాలంలోనే చిత్రాంగుడికి మణివర్మ విజయాల వెనక వున్న అదృశ్యశక్తి ఎవరో తెలిసిపోయింది. రాజుకు యుద్ధతంత్రాలు రణరంగ వ్యూహాలుకు సంబంధించి దిశానిర్దేశం చేస్తున్న అదృశ్యశక్తిని గుర్తించేసాడు.
ఆ అదృశ్య శక్తి ఎవరో కాదు. మణివర్మకు ప్రాణస్నేహితుడు. అతని పేరు యుక్తిమంతుడు.
మణివర్మ, యుక్తిమంతులు ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేసారు. సకల విద్యలు అభ్యసించారు. ఇద్దరి మధ్యన గాఢ స్నేహం ఏర్పడింది. యుక్తిమంతుడు వీరుడే గాని అతనికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. రాజనీతి, యుద్ధతంత్రాలు, గూఢచర్యం మొదలయినవి. ఎక్కువగా అభ్యసించాడు.
మణివర్మ సింహాసనానికి రాగానే తన మిత్రడయిన యుక్తిమంతుడ్ని అమాత్యునిగా ప్రకటించాడు. కాని ఆ పదవిని సున్నితంగా తరిస్కరించాడు యుక్తిమంతుడు.
నగర శివార్లలోని ఉద్యానవనంలో కుటీరం నిర్మించుకొని తపోనిష్టలో వుండి బ్రహ్మచారిగా ఒంటరిగా జీవిస్తున్నాడు. అతనికి అనేకమంది శిష్యులున్నారు.
తను ఐహిక సుఖాల్ని వదులుకున్నాడు. కాని దేశం కోసం దేశ ప్రజల కోసం రాజక్షేమం కోసం తన సహకారాన్ని అంది స్తున్నాడు. అతడి యుద్ధవ్యూహాలతోనే శతృవుల్ని జయించి గొప్ప వీరుడని పేరు పొందాడు మణివర్మ.
మహాపురుషులు ఎప్పుడూ తమ గొప్పతనం చాటుకోరు. తమ ప్రతిభకు గుర్తింపు కావాలని ఆశపడరు. లోకానికి మేలు చేయటం తమ ధర్మంగా భావించి తమ వంతు సాయం అందిస్తారు. అందుకే యుక్తిమంతుడి గురించి ఎవరికీ తెలీదు. రాజు మణివర్మకూడా అతని అభీష్టం మేరకు పదవి యివ్వకుండా వదిలేసాడు.
అలాగని యుక్తిమంతుడ్ని గుట్టుగా అంతం చేద్దామన్నా చిత్రాంగుడికి సాధ్యం కాదు.
అతనికి అనేక మంది శిష్యులున్నారు. వారంతా గురుకుల ఆశ్రమంలోనే వుంటారు. వాళ్ళు వేదవిద్యల్లోనే కాదు యుద్ధ విద్యల్లో కూడా ఆరితేరిన యోధులు.
ఆ పరిస్థితులన్నింటినీ బాగా ఆకళింపుచేసుకున్నాడు చిత్రాంగుడు. ఎంత ప్రాణస్నేహితుడయినా నేరం చేసిన వాడ్ని ప్రభువు క్షమించలేడు. ఆ విధంగా యుక్తిమంతుడ్ని యుక్తిగా నేరంలో ఇరికించాలి.
రాజు ముందు దోషిగా నిలబెట్టాలి. మరణ శిక్ష విధింప చేయాలి. తన వేలు తన కంటినే పొడిచినట్టు మణివర్మ ద్వారానే యక్తిమంత్రుడ్ని అంతం చేయించాలి.
ఈ విధంగా ఆలోచించిన చిత్రాంగుడు తెలివిగా పాత్రలు కదపనారంభించాడు. పర్యవశానంగా ఒక రోజు తెల్లవారేసరికి రాజనర్తకి మోహన కన్పించకుండా పోయింది. ఈ విషయం ప్రభువు మణివర్మకు తెలిసింది.
మణివర్మకు ప్రియురాలు మోహన.
ఆమె అదృశ్యం ఆయన్ని కలచివేసింది.
పథకం ప్రకారం జరిగిందంతా. ఆమె ఎలా మాయమైందో చిత్రాంగుడికి తెలుసు. సౌరాష్ట్ర నుంచి వచ్చిన తన మనుషుల ద్వారా రాజనర్తకిని హత్య చేయించాడు. శవాన్ని ఒక పేటికలో వుంచి రహస్యంగా గురుకులంలోని యుక్తిమంతుడి ఆశ్రమంలోకి చేర్పించాడు.
ఇప్పుడు తనే యుక్తిమంతుడి మీద ప్రభువుకు ఫిర్యాదు చేసాడు. రాజనర్తకి మోహన రహస్యంగా యుక్తిమంతుడి ఆశ్రమానికి రాకపోకలు సాగిస్తున్నట్టు తెలిసిందన్నాడు. ఆమె ఏమైందో యుక్తిమంతుడికి తెలిసి వుంటుందని నమ్మబలికాడు.
మరొకప్పుడయితే యుక్తిమంతుడి మీద అభియోగం తెచ్చినందుకు చిత్రాంగుడికి శిక్ష విధించేవాడు. కాని మాయమైంది రాజనర్తకి. ఇష్టం లేకపోయినా ముఖ్యాధికారికి భటులనిచ్చి గురుకులానికి పంపించాడు.
అక్కడ సోదా చేయగా రాజనర్తకి శవం దొరికింది. హత్యానేరం కింద నిరపరాధి అయిన యుక్తిమంతుడు ఖైదు చేయబడ్డాడు. అతడ్ని దర్బారులో రాజ సముఖానికి తీసుకొచ్చారు.
తనకే పాపం తెలీదన్నాడు యుక్తిమంతుడు.
పక్క నుండి రాజును రెచ్చగొట్టాడు చిత్రాంగుడు.
దర్బారులో అంతా యుక్తిమంతుడు నేరం చేసాడంటే నమ్మటం లేదు. కాని చిత్రాంగుడి మాటల గారడీలో పడిపోయి ముందు వెనుకలు ఆలోచించలేదు మణివర్మ. యుక్తిమంతుడ్ని నేరస్థుడిగా భావించాడు. కోపంలో వివేకం కోల్పోయాడు.
చివరి ప్రయత్నంగా యుక్తిమంతుడు-
"ప్రభూ.. మీరు ఆ పరదేశి మాయలో పడిపోయారు. నిజాన్ని తెలసుకోలేకపోయారు. చిత్రాంగుడు సౌరాష్ట్ర గూఢచారి. వాడి వెంట అనేకమంది గూఢచారులు రాజధానిలో తిష్టవేసారు. ప్రమాదం ముంచుకొస్తోందని మిమ్మల్ని హెచ్చరించే లోపలే ఇట్లా జరిగి పోయింది. నేను ముద్దాయి స్థానంలో వున్నాను.
మీరు నిజం గ్రహించాలి. నన్ను అడ్డు తొలగించటం కోసం జరిగిన కుట్ర యిది. మీరు మేలుకోకపోతే మాళవ దేశం విపత్తులో చిక్కుకుంటుంది” అంటూ హెచ్చరించాడు.
మూర్ఖం తలకెక్కిన మణివర్మ మరింత కోపం చెందాడు.
“నేరం నుంచి తప్పించుకోవటానికి అబద్ధాలు చెప్పకు. మా ఆంతరంగికుడయిన చిత్రాంగుడి మీద అభాండాలు వేయకు. అదియును గాక నీ మూలంగానే మాళవదేశం క్షేమంగా వున్నట్టు భావించకు.
మేము బలవంతులం. ప్రభువులం. మేం చెప్పింది శాసనం చేసింది చట్టం. రాజ్యాని మేం కాపాడుకోగలం. నిష్కారణంగా రాజనర్తకిని హత్య చేసిన నేరానికి నీకు మరణ దండన విధిస్తున్నాను” అన్నాడు.
ఆ విధంగా చిత్రాంగుడి దుష్టపన్నాగం ఫలించింది. రాజ భక్తుడు దేశభక్తుడు అయిన యుక్తిమంతుడు వురి తీయబడ్డాడు. అది జరిగిన మరునాడే చిత్రాంగుడితో బాటు సౌరాష్ట్ర గూఢచారు లంతా మాళవదేశం వదలి వెళ్ళిపోయారు.
యుక్తిమంతుని మరణ వార్త వినగానే సౌరాష్ట్ర ప్రభువు కార్తికేయుడు తన సైన్యంతో మాళవ దేశం మీదకి దండెత్తి వచ్చాడు. భయంకర యుద్ధం సాగింది.
ఆ యుద్ధంలో రక్తపుటేర్లు ప్రవహించాయి. ముందులా యుద్ధ వ్యూహాలు చెప్పడానికి రణతంత్రం నడపడానికి యుక్తిమంతుడు తన పక్కన లేడు. తన ఆంతరంగికుడిగా చూసుకున్న చిత్రాంగుడు వైరిపక్షంలో యుద్ధం చేస్తున్నాడు. రణరంగంలో ఓటమి అంచున ఉండగా మణివర్మకు కనువిప్పు కలిగింది. కాని ఏం లాభం? సమయం మించిపోయింది.
సౌరాష్ట్ర సేనలు మాళవ సేనల్ని వూచకోత కోసాయి. మణివర్మ యుద్ధరంగంలో మరణించాడు. మాళవదేశం శత్రు వశమైంది.
నీతి : చెప్పుడు మాటలు విని బాగుపడిన వారు లేరు. సొంతంగా ఆలోచించి మంచి చెడు గ్రహించి నిర్ణయాలు తీసుకోవాలి. స్వార్ధంతో ఇతరులు చెప్పే మాటలు విని తీసుకునే నిర్ణయాలు హాని కలిగిస్తాయి. చూసారు గదా. చిత్రాంగుడి మాటలు విన్నందుకు తన రాజ్యాన్ని ప్రాణాల్ని కూడా పోగొట్టుకున్నాడు. మణివర్మ.