కోపదారి | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

కపిలముని ఆశ్రమంలో గురుకులం కూడా ఉండేది. ఆ కాలంలో ఎందరో విద్యార్థులు అక్కడ వుంటూ సకల విద్యలూ అభ్యసించేవారు. వారిలో సునందుడనే వాడు ఒకడు.


సునందుడు అమాయకుడిగా కన్పిస్తాడు. కాని గొప్ప మేధావి. సునిశితమైన, క్లిష్టమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టుకోవడంలో దిట్ట. తెలీని ఎన్నో విషయాలు అడుగుతుంటాడు. అతడి జిజ్ఞాస గమనించిన కపిలముని కూడా విసుక్కోకుండా సమాధానాలు చెప్పేవాడు. అంతే కాదు.. ఆయన ప్రియ శిష్యుడు సునందుడే.


ఒకరోజు వేకువజాము...


సంధ్యవార్చుకోడానికి నదికి బయలుదేరాడు కపిలముని. శిష్యగణం కూడా ఆయన వెంట కదిలారు. పచ్చని అడవి. ఆహ్లాదభరితమైన వాతావరణం. అంతా స్నానాదికాలు ముగించి సంధ్య వార్చుకున్నారు.


ఎప్పటిలాగే శిష్యుల్ని ఆశ్రమానికి పంపించి వేసి తను ప్రశాంతంగా నదీ తీరంలోని చెట్టు కింద జింక చర్మం మీద కూచుని తపోనిష్టలో మునిగి పోయాడు కపిలముని.


అంతా ఆశ్రమానికి వెళ్ళిపోయినా సునందుడు మాత్రం వెళ్ళలేదు. గురువుగారిని కనిపెట్టుకొని అక్కడే కూర్చున్నాడు. క్రమంగా తొలివెలుగులు విచ్చుకున్నాయి. సూర్యోదయమైన కొంతసేపటికి తపోదీక్ష విరమించి కళ్ళు తెరిచాడు కపిలముని.


సునందుడు గురువుగారికి నమస్కరించాడు.


“నీవు ఆశ్రమానికి వెళ్ళలేదా?” వాత్సల్యంగా అడిగాడు కపిలముని.


“కొన్ని సందేహాలున్నాయి గురుదేవా.. ఏకాంతంలో తమను అడిగి తెలుసుకుందామని ఆగిపోయాను" అంటూ అసలు విషయం చెప్పాడు.


“తెలుసుకోవాలనే నీ జిజ్ఞాస నన్ను పులకింప చేస్తోందిరా.. అడుగు. ఏమా సందేహము?" అనడిగాడు.


"ఈ లోకంలో మూర్ఖుడు ఎవరు గురుదేవా?”


“తనను తాను తెలుసుకున్న వాడు జ్ఞాని, తెలుసుకోలేని వాడు మూర్ఖుడు” చెప్పాడు కపిలముని.


"ఆత్మ.. పరమాత్మ.. వీటి సంబంధం ఏమిటి?”


"పరమాత్మ విశ్వవ్యాప్తమైనది. అందులోని ఒక అణువు ఆత్మ. పరమాత్మను తెలుసుకున్న ఆత్మ తిరిగి అక్కడకు చేరుకుంటుంది. తెలుసుకోలేని ఆత్మలు పుడుతూ చస్తూ అనేక జన్మలు ఎత్తి ఇక్కడే అంతరించి పోతుంటాయి.”


"కోరికల్ని జయించాలంటే ఏం చేయాలి గురువుగారూ?”


“మనసును అదుపులో వుంచుకోవాలి నాయనా.. నీ పతనానికి పురోగతికి కూడా మనసే కారణం. దీన్ని అదుపు చేయని వాడు ఇహపరాలకు చెడి పతనమవుతాడు.”


"మనిషికి ప్రథమ శతృవు?”


"కోపం.. తన కోపమే తనకు శతృవు అన్నారు. కోపాన్ని జయించని వాడు ఏవీ జయించలేడు.. సాధించలేడు...” 


కపిలముని వివరిస్తున్నాడు.


అంతలో వృక్షశాఖమీది కొంగ ఒకటి రెట్ట వేసింది. అది సూటిగా వచ్చి కపిలముని మీద పడింది. తన ఏకాగ్రతను భంగపరుస్తూ గొప్ప ముని అయిన తన మీదే రెట్ట వదిలింది.. ఎవరాని వృక్ష శాఖ మీదకు తీక్షణంగా చూసాడాయన.


అంతే -


ఆ చూపుల తాకిడికి కొంగ ప్రాణం వదిలి కిందపడింది. జరిగిన సంఘటన చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు సునందుడు.


వెంటనే వివేకం మేల్కొని కపిలముని కూడా ఖిన్నుడయ్యాడు. 


పశుపక్ష్యాదులు జ్ఞాన శూన్యులు. వాటికి మంచి చెడు తెలీదు. ఆ సంగతి తెలిసి కూడా ఆవేశంలో కోపం ప్రదర్శించి కొంగ చావుకి తాను కారణమయ్యాడు.


"గురుదేవా! మీరింకా కోపాన్ని జయించలేదు” అంటూ గుర్తు చేసాడు సునందుడు.


“అవును సునందా...” అంటూ బాధగా తలవంచుకున్నాడు కపిల ముని.


“ఎదుట వారికి నీతులు చెప్పటం సులువు. కాని ఆచరించటమే కష్టం. కోపాన్ని పూర్తిగా జయించలేకపోయిన విషయం ఇప్పుడే అర్థమైంది. ఈ బక్క ప్రాణి చావుకి కారణమై నా శక్తిని కొంత కోల్పోయాను.


దోషనివారణ కోసం కొంతకాలం తపస్సు చేయాలి. నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను. తిరిగి వచ్చేవరకు ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకో....” అంటూ సునందుడికి బాధ్యత వప్పగించి అప్పటికప్పుడు బయలుదేరి తపోవనానికి వెళ్ళిపోయాడు కపిలముని. 


నీతి : నీతులు చెప్పటమే కాదు... ఆచరించి చూపే వాడే గొప్ప వ్యక్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)