కళాకారుడి వింత కోరిక | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

ఒకసారి అక్బర్ పాదుషా వారి దర్శనార్ధం ఖుస్రూ అనే అరబ్బీ కళాకారుడు వచ్చాడు. అతని వెంట కొంత పరివారం, కొన్ని అరబ్బీ గుర్రాలు కూడా వున్నాయి.


అతికష్టం మీద దర్బారులో ప్రవేశించి పాదుషా ముందు నిలిచాడు. తను తెచ్చిన కొన్ని కానుకలను అక్బర్కు సమర్పించు కున్నాడు. పాదుషా ప్రసన్నుడవుతూ “ఎవరు నువ్వు . ఎవరు కావాలి?" అనడిగాడు.


“జహాపనా! నా పేరు ఖుస్రూ. బాగ్దాద్ నివాసిని. అశ్వ హృదయం తెలిసిన వాడ్ని. గుర్రపు స్వారీలో దిట్టను. గుర్రం పై నుండి అనేక సాహస విద్యలు ప్రదర్శించే కళాకారుడ్ని. చాలా దేశాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను.


తమరు అనుమతిస్తే నా కళా కౌశలాన్ని ప్రదర్శిస్తాను” అంటూ వచ్చిన పని విన్నవించుకున్నాడు.


అక్బర్ చక్రవర్తి మహావీరుడు. గుర్రపు స్వారీలో మేటి. సహజంగానే ఆయనకు అశ్వాలంటే చాలా యిష్టం. అందుచేత ఖుస్రూకు సులువుగానే ఆయన అనుమతి లభించింది.


ఆ రోజు సాయంత్రమే క్రీడా మైదానంలో ఖుస్రూ ప్రదర్శనకు ఏర్పాటు చేయబడింది. ప్రదర్శన తిలకించేందుకు తన పట్టపు గుర్రం మీద వేంచేసాడు అక్బర్ చక్రవర్తి.


ఆయన గుర్రాన్ని చూసి అబ్బురపడ్డాడు ఖుస్రూ. అశ్వాలకు తమ అరబ్బు దేశాలు పెట్టింది పేరు. కాని పాదుషా వారి గుర్రాన్ని మించిన గుర్రాన్ని ఇంతవరకు తను చూడలేదు.


ప్రదర్శన చూడ్డానికి అక్బర్ పాదుషా వారితో బాటు దర్బారు ప్రముఖులు, పురప్రజలు కూడా క్రీడా మైదానానికి చేరుకున్నారు. 


ఖుస్రూ ప్రదర్శన ఆరంభమైంది. 


అతడు గొప్ప కళాకారుడని చెప్పటంలో కొంచెం కూడా అతిశయోక్తి లేదు. గుర్రాన్ని మెరుపు వేగంతో దూకించ గల దిట్ట. పరిగెత్తే అశ్వం మీద నిలబడి, కూచుని... కిందకు జారి ఇలా అద్భుత విన్యాసాలు చేసాడు.


ఇంకా-


పరిగెత్తే గుర్రంపై నుంచి గురి తప్పకుండా కత్తులు విసరగలడు. బాణాలు వేసి లక్ష్యాన్ని ఛేదించగలడు. కళ్ళకు గంతలు కట్టుకుని గుర్రం మీద వేగంగా స్వారీ చేస్తూ గురి తప్పకుండా బాణాలు వేయటం యిలా ఒక దాని తర్వాత ఒకటిగా అనేక విన్యాసాలను ప్రదర్శించాడు ఖుస్రూ.


క్రీడా మైదానం చప్పట్లతో మారుమ్రోగింది.


అద్భుతమైన ఖుస్రూ ప్రదర్శన తిలకించిన అక్బర్ పాదుషా ఎంతో ప్రసన్నుడయ్యాడు. ఖుస్రూను పిలిచి ఏం కావాలో కోరుకోమన్నాడు.


అడగటానికి సందేహించాడు ఖుస్రూ.


“సందేహించకు.. మీ దేశానికి మోసుకుపోడానికి మణులు కావాలా. బంగారం కావాలా... తిండి గింజలు కావాలా...


పశుసంపద కావాలా...” ప్రోత్సహించాడు పాదుషా.


“అవేమీ వద్దు ప్రభూ...” అన్నాడు ఖుస్రూ.


అక్బర్తో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. చక్రవర్తి వరమిచ్చినా ఏమీ కోరుకోలేదంటే అది నేరమవుతుంది. ఖుస్రూకు ఆ విషయం తెలుసు. అందుకే తిరిగి తనే విన్నవించుకున్నాడు.


"జహాపనా! మీ అంతట మీరు ఏమిచ్చినా పుచ్చుకుని వెళ్ళి పోయేవాడిని. కాని ఏం కావాలో నన్ను కోరుకోమన్నారు. నేను అడిగింది కాదనకూడదు” అన్నాడు.


“కాదనకుండా ఇస్తాను.. అడుగు” అన్నారు పాదుషా. 


"ప్రభూ... మీ పట్టపుగుర్రాన్ని ఇప్పించండి చాలు” అన్నాడు ఖుస్రూ.


అక్బర్ వారికి కోపం వచ్చింది.


"ఇది దుస్సాహసం. మా అశ్వాన్ని అధిరోహించగల అర్హత నీకుందనుకుంటున్నావా?” అనడిగాడు.


“ప్రభూ.. నా కోరిక చెప్పాను. మాట తప్పని పాదుషా వారు నా కోరిక తీర్చకున్నా సంతోషంగా వెళ్ళిపోగలను” అన్నాడు ఖుస్రూ. 


అతడి మూర్ఖత్వం పాదుషా గ్రహించారు.


వెంటనే అశ్వాన్ని అతనికిచ్చారు.


“స్వారీ చేసి నీ అర్హత నిరూపించుకుంటే మా అశ్వాన్ని తీసుకుపోవచ్చు" అన్నారు.


కోరితే గుర్రాలే కాదు ధనకనకవస్తు వాహనాలు బహూకరించే వారు అక్బర్ పాదుషా.


కాని చక్రవర్తి గుర్రం మీద స్వారీ చేయాలన్న దురాశతో ఆ గుర్రమే కావాలన్నాడు ఖుస్రూ. తనకు అశ్వహృదయం తెలుసన్న గర్వంతో అక్బర్ గుర్రాన్ని ఎక్కి స్వారీ చేయబోయాడు. అక్బర్ మాట తప్ప ఎవరి మాట వినని ఆ పట్టపు గుర్రం మెరుపు వేగంతో పరుగెత్తి ఖుస్రూని కింద పడేసింది. ప్రమాదంలో ఖుస్రూ కాలు, చెయ్యి పోగొట్టుకున్నాడు.


నీతి : చూసారా! ఆశ మంచిదే.. దురాశ చెడ్డది. దురాశ దుఃఖానికి చేటన్న నీతి అప్పటిగ్గాని ఖుస్రూకి అర్థం కాలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)