మిత్రద్రోహి | నీతి కథలు | Moral Stories in Telugu

writer
0

రంగాపురం గ్రామంలో గోపయ్య చెలమయ్య అని ఇద్దరు మిత్రులు పక్క పక్క వీధుల్లో నివశించేవారు. 


ఇద్దరూ చెరో పదెకరాల రైతులు.


వారి ఇళ్ళు పక్క పక్క వీధుల్లో ఉన్నా వారి పొలాలు మాత్రం ఒకదాని ప్రక్కన ఒకటి వున్నాయి. చాలా కాలంగా వున్న స్నేహం కొద్దీ తరచూ పొలం గట్ల మీద కలుసుకుని ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకునేవారు.


గోపయ్య చాలా మంచివాడు.


మంచినీ మానవత్వాన్నీ నమ్మే మనిషి. ఇతరుల కష్టాల్ని తన కష్టంగా భావించి తోచినంత సాయం చేసేవాడు. చక్కని భార్య వయసుకొచ్చిన కూతురితో ఆయన కుటుంబం ఎప్పుడూ సుఖసంతోషాలతో నిండి వుండేది.


గోపయ్యలో మరో మంచి గుణం ఏమంటే కష్టేఫలి అని పూర్తిగా విశ్వసిస్తాడు. అతనికి ఏ విధమైన చెడు అలవాట్లు లేవు. వ్యవసాయంలో కష్టపడి పని చేసేవాడు. పైరు పెరిగి కోతకు వచ్చే వరకు పైరును కనిపెట్టుకుని పసిబిడ్డను సాకినట్టు సాకేవాడు. అందుకే అతని పొలంలో రతనాలు పండేవి.


కాని చెలమయ్య పరిస్థితి అదికాదు.


తను కష్టపడకుండా అంతా దైవం మీద భారం వేసేవాడు. స్వయంగా పొలంలో దిగకుండా పనివాళ్ళ మీద పూర్తిగా ఆధారపడేవాడు. అదను పదను కనిపెట్టుకుని పైరును రక్షించుకునే వాడు కాదు. ఫలితంగా దిగుబడి తగ్గేది.


ఇంకో విషయం ఏమంటే అతనికి ఓ చెడు అలవాటుంది. దీని మూలంగా తరచూ భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తి మనశ్శాంతి ఉండేది కాదు. ముఖ్య విషయం ఏమంటే చెలమయ్య దంపతులకూ ఒక్కతే ఆడపిల్ల. ఆ అమ్మాయి కూడా వయసుకొచ్చి వుంది.


ఈ పరిస్థితుల్లో గోపయ్య చక్కటి సంసారాన్ని చూసి చెలమయ్య అసూయ పడేవాడు. అతనిలా తనూ ఎందుకు సంతోషంగా వుండలేకపోతున్నాడో తర్కించుకుని మంచి నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేసేవాడు కాదు.


ఎంతసేపూ అసూయ పడడమే కాని అభినందించటానికి మనసు వచ్చేది కాదు. పైగా అతడి పొలంలో అధిక దిగుబడి తన పొలంలో పంట దిగుబడి తగ్గటం కూడా అతనికి అసూయకు కారణమైంది.


దాంతో ఎలాగయినా గోపయ్యను చెడగొట్టాలి... ఆ కుటుంబం బాధ పడుతుంటే సంతోషించాలి అని చెలమయ్య చెడు బుద్ధితో ఆలోచించేవాడు.


ఇలా ఉండగా గోపయ్య తన కూతురికి ఒక మంచి సంబంధం చూసాడు.


ఆ సంవత్సరమే పంటలు చేతికి రాగానే కూతురు పెళ్ళి వైభవంగా జరిపించాలని ఉత్సాహంగా వున్నాడు గోపయ్య.


ఈ విషయం తెలిసి అసూయతో రగిలిపోయాడు చెలమయ్య. తనకూ వయసు కొచ్చిన కూతురుంది. పెళ్ళి చేద్దామంటే అప్పులున్నాయి. పంట దిగుబడి ఎంత వస్తుందో తెలీదు.


తనకన్నా ముందే గోపయ్య తన కూతురుకి పెళ్ళి చేయటం సహించలేకపోయాడు. అందుకని తన మాట వినే మధ్యవర్తిని పంపించి గోపయ్య కుటుంబం మీద వున్నవీ లేనివీ చెప్పించి ఆ సంబంధం చెడ కొట్టించాడు చెలమయ్య.


అలా అయిదారు సంబంధాలు తిరిగిపోవటంతో గోపయ్య దంపతులు చాలా బాధపడ్డారు. ఎందుకిలా జరుగుతుందో అర్థంకాలేదు. ఈ లోపల తమ అమ్మాయికి చూసిన ఒక సంబంధమే చెలమయ్య కూతురికి ఖాయమైందని తెలసింది గోపయ్యకు. అతను చాలా సంతోషించాడు.


తన కూతుర్ని చేసుకోకపోయినా తన మిత్రుడి కూతుర్ని చేసుకుంటున్నందుకు ఆనందించాడు.


అసలు విషయం ఏమంటే చెలమయ్య ఆ సంబంధం చెడగొట్టి తన కూతురికి ఖాయం చేసుకొచ్చాడు. ఏమయితేనేం చెలమయ్య కూతురి పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. ఆ మరుసటి నెలలోనే గోపయ్య కూడా మంచి సంబంధం చూసి తన కూతురి పెళ్ళి కూడా జరిపించేసాడు.


అప్పుడు కూడా చెలమయ్య కడుపుమంట తీరలేదు. ఈ లోపల అసలు విషయం కూడా తెలిసింది. చెలమయ్య అల్లుడు జులాయి. భార్యను కష్టపెడుతున్నాడు.


కాని గోపయ్య అల్లుడు అలా కాదు. భార్యా భర్తలిద్దరూ హాయిగా సంసారం చేసుకుంటున్నారు.


ఇటు తన కూతురు కాపురం కష్టాల్లో ఉండటం అటు తన చేను కన్నా గోపయ్య చేను విరగ పండటం చెలమయ్యలో మరింత అసూయను రేపాయి.


ఎలాగైనా గోపయ్యను నష్టపరిచి తన అసూయను తీర్చు కోవాలనుకున్నాడు చెలమయ్య.


ఒక రాత్రి వేళ గోపయ్య పండిన పొలానికి నిప్పు పెట్టాడు. చెలమయ్య. మంటలు చూడగానే వూరి జనమంతా పరుగులెత్తుకు వచ్చారు. అందరికీ ఉపకారి అయిన గోపయ్య పొలంలో మంటలు ఆర్పి పంటను కాపాడారు. కాని గాలివాటు మారి పక్కనే ఉన్న


పంటను అంటుకుని తగలబడుతున్న చెలమయ్య పంటను గూర్చి ఎవరూ పట్టించుకోలేదు. దాంతో చేతికొచ్చిన కాస్త పంట పూర్తిగా కాలిపోయింది.


గోపయ్య పొలం నాలుగు వంతుల్లో ఒక వంతు మాత్రమే కాలి నష్టం జరిగింది. కాని తను మాత్రం పూర్తిగా మునిగిపోయాడు. బూడిదయిన తన పంటను చూసి బావురుమని ఏడ్చాడు చెలమయ్య. అతనికి జ్ఞానోదయం కలిగింది. తన తప్పు తెలుసుకున్నాడు.


గోపయ్య పచ్చని సంసారాన్ని చూసి తను అసూయపడ్డాడు. స్నేహితుడని కూడా చూడలేదు. వాళ్ళకి నష్టం కలిగించాలను కున్నాడు.


వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించాలనుకున్నాడు. చివరికి తనే చెడ్డాడు.


కూతురి కాపురం కష్టాల్లో ఉంది.


పెళ్ళికి చేసిన అప్పులు తీరనే లేదు.


పంటంతా కాలిబూడిదయింది.


వూరి వాళ్ళతో ఎప్పుడూ తను మంచిగా లేడు. ఈ కష్ట కాలంలో తనని ఎవరు ఆదుకుంటారు? తనకీ శాస్తి జరగాల్సిందే ఇలా పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు చెలమయ్య.


వెళ్ళి గోపయ్యను కలుసుకున్నాడు. జరిగినదంతా చెప్పాడు. కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. గోపయ్య అంతా తెలిసినా మిత్రుడి మీద కోప్పడలేదు. భుజం తట్టి లేపి కన్నీళ్ళు తుడిచాడు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేసే మంచి మనసు గోపన్నది.


చెలమయ్యా... ఒకరికి మనం మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు. ఒకరికి చెడు చేస్తే దేవుడు మనకూ చెడు చేస్తాడు. అయిందేదో అయింది.


ఇప్పటికయినా పశ్చాత్తాపం చెందావు. నీ తప్పు తెలుసు కున్నావు. బాధపడకు. నాకు చెడు చేశావని మన స్నేహని వదులు కోలేను.


నీ అప్పుల వాళ్ళకి నేను హమీలండి. కొంత డబ్బు ఇప్పిస్తాను. వ్యవసాయానికి పెట్టుబడీ ఏర్పాటు చేస్తాను. కష్టపడి పనిచేస్తే నేల తల్లి మనల్ని చల్లగా చూస్తుంది.


కష్టాలు తొలగిపోతాయి. ఇక నీ కూతురి కాపురం గురించి కూడా దిగులు వద్దు. నలుగురు పెద్ద మనుషుల్ని తీసుకుని ఆ వూరు వెళ్తాం. నీ అల్లుడికి బుద్ధి చెప్పి మంచి దారిలో పెడదాం" అంటూ ధైర్యం చెప్పాడు.


గోపయ్య మాట తప్పని మనిషని చెలమయ్యకు తెలుసు. అతడి మంచితనానికి, ఔదార్యానికి అతని ముందు సిగ్గుపడిపోయాడు. మరోసారి అతడి చేతులు కళ్ళకు అద్దుకున్నాడు.


తర్వాత కాలంలో ఇంకెప్పుడూ ఎవరి అభివృద్ధిని చూసి అసూయ పడలేదు చెలమయ్య.


గోపయ్య సలహాలు తీసుకుంటూ తనూ కష్టపడి అనతి కాలంలోనే కష్టాల నుంచి బయట పడి సుఖశాంతులతో జీవించసాగాడు.


నీతి : చెరపకురా చెడేవు అన్నది నీతి. అది అక్షర సత్యమైనది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)