పాండవులు తమ తల్లితో సహా వారణావతానికి పోవటానికి సిద్ధమయారు. వారి కోసం గుర్రాలు పూన్చిన రథాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికీ, ద్రోణకృపులకూ, బాహ్లిక సోమదత్తుల వంటి ఇతర పెద్దలకూ నమస్కారాలు చేసి, వారి ఆశీర్వాదాలు పొంది, దీనవదనాలతో బయలుదేరారు.
అప్పుడు కొందరు సాహసికులైన బ్రాహ్మణులు పాండవుల వెంబడి పోతూ, రాజభయం ఏ మాత్రమూ లేక, "అయ్యో, ఈ గుడ్డిరాజు ఎంత పాపాత్ముడు! పాండవులు పాపం, ఎవరికేమి అపకారం చేశారు? వాళ్ల తండ్రి పాలించిన రాజ్యం వాళ్ళది కాదా? ఇలా వెళ్ళిపోవటానికి ధర్మరాజు మాత్రం ఎలా ఒప్పుకున్నాడు? ఈ పాపిష్టి రాజ్యంలో మనం ఎందుకుండాలి? ధర్మరాజు ఎక్కడికి పోతే మనమూ అక్కడికే పోదాం," అని గట్టిగా మాట్లాడుకున్నారు.
ఈ మాటలు విని ధర్మరాజు వాళ్ళతో, "అయ్యా, ధృతరాష్ట్రుడు మాకు పెద్ద దిక్కు. ఆయన ఎక్కడికి పొమ్మంటే మేము అక్కడికి పోతాము. మీరు మా మేలు కోరేవారు గనక మాకు ఎదురుగా వచ్చి దీవించి, మీ మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి,” అని చెప్పి, వారిని పంపేశాడు. సాగనంపటానికి వచ్చినవాళ్ళు కూడా వెనక్కు తగ్గినాక, విదురుడు ధర్మరాజు వెంట కొంతదూరం వెళ్ళి, వారి కోసం లక్క ఇల్లు నిర్మాణమై సిద్ధంగా ఉన్నదనీ శత్రువులు మనిషి ఒకడు ఆ యింట వారి వెంట ఉంటాడనీ, వారిని ఆ లక్క ఇంటితో పాటు కాల్చేసే ప్రయత్నం జరుగుతుందనీ ఏమరుపాటు ఏ మాత్రమూ లేక వారు ఆ ఇంటి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకోవాలనీ, తన మనిషి ఒకడు లక్కఇంటి నుంచి ఆరణ్యంలోకి సొరంగం తవ్వి ఉంచుతాడనీ, పాండవులు ప్రాణాలు దక్కించుకుని అరణ్యం చేరుకున్నాక నక్షత్రాలను బట్టి దిక్కు తెలుసుకుంటూ ఎటైనా వెళ్ళిపోవాలనీ, లక్క ఇంట ప్రవేశించటం మాత్రం మానవద్దనీ రహస్యంగా చెప్పి, తాను కూడా వెనక్కు మళ్ళాడు.
తరవాత కుంతీదేవి ధర్మరాజుతో, "నాయనా, విదురుడు నీతో ఏదో రహస్యంగా చెప్పాడు, దాన్ని మేము కూడా వినవచ్చునా?" అన్నది. ధర్మరాజు తల్లికీ, తమ్ములకూ, "అగ్ని వగైనా భయాలు కలిగితే నేర్పుగా తప్పించుకోమనీ, నేరు జీవిస్తూ, రాజ్యం సాధించుకోమనీ విదురుడు హెచ్చరించాడు. నేను సరేనన్నా" అని చెప్పాడు.
ఫాల్గుణ శుద్ధ అష్టమి రోహిణీ నక్షత్రం నాడు పాండవులు వారణావతం చేరారు.. వారి రాక ముందుగానే తెలిసి వంది మాగధులూ, బ్రాహ్మణులూ మేళతాళాలతో ఎదురు వచ్చారు. వారికోసం ఊరంతా తోరణాలతోనూ, ముగ్గులతోనూ, పుష్ప మాలలతోనూ అలంకరించారు. పాండవులు పురప్రవేశం చేసి, అక్కడి బ్రాహ్మణ; వైశ్య, శూద్ర గృహాలకు వెళ్ళి, అందరికీ బహుమతులిచ్చారు.
తరువాత పురోచనుడు వారిని వారికోసం ఏర్పాటు చేసిన ఇంటికి తీసుకుపోయి, అక్కడ వారికి భోజనంకూడా తానే ఏర్పాటు చేశాడు. అక్కడ వారు పదిరోజులున్న అనంతరం పురోచనుడు ధర్మరాజుతో, "అయ్యా, మీ కోసం కొత్తగా కట్టించిన ఈ ఇంట్లో మీరు ప్రవేశించండి," అని ఆ ఇంటి గొప్పతనమంతా వివరించి చెప్పాడు. ఆ ఇంటి రహస్యం అదివరకే తెలుసుకుని ఉన్న ధర్మరాజు పురోచనుడితో ఆ ఇంటి అందచందాలు మెచ్చుకుంటున్నట్టుగా మాట్లాడి, తల్లితోనూ, తమ్ములతోనూ ఆ ఇంట ప్రవేశించాడు.
తరువాత ధర్మరాజు భీముడితో రహస్యంగా విదురుడు చెప్పినదంతా చెప్పి, " భీమసేనా, ఈ ఇంటి సువాసన చూడు. అంటిస్తే ఇది క్షణంలో అంటుకుంటుంది. మనని ఈ ఇంట దహనం చెయ్యటానికి ఏర్పాటయినవాడే ఈ పురోచనుడు. అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి," అన్నాడు.
ఆ మాట విని భీముడు, "అయితే, మనం ఈ ఇంట్లో ఉండనే వద్దు. మొదట ఉన్న బసకే పోదాం,” అన్నాడు.
అది పెద్ద పొరపాటు. మనం ఈ ఇంట్లో కాలిపోయే అవకాశం లేకపోతే ఈ పురోచనుడు మనని మరొక విధంగా చంపే ప్రయత్నం చేస్తాడు. మనం ఈ ఇంటితో పాటు కాలిపోయామనే భ్రమ కలిగించి తప్పించుకు పారిపోవటం ఒకటే ఉపాయం. పారిపోవటానికి గాను మనకు అరణ్యమార్గాలు బాగా తెలియటం అవసరం. వేట నెపంతో రోజూ అరణ్య మార్గాలన్నీ అన్వేషింతాం,” అన్నాడు ధర్మరాజు. ఆ ప్రకారమే పాండవులు పగలంతా వేటాడుతూ అరణ్యంలో తిరిగి, రాత్రి తెల్లవార్లూ జాగర్త మీద ఉంటూ వచ్చారు.
ఈ లోపుగా హస్తినాపురంలో విదురుడు సొరంగాలు తవ్వటంలో నిపుణుడైన వాణ్ణి ఒకణ్ణి పిలిపించి, వాడికి చెప్పవలసినదంతా చెప్పి, వాడు తన మనిషి అని తెలియగలందులకు కొన్ని సంకేతాలు చెప్పి వారణావతంలో ఉన్న పాండవుల వద్దకు పంపాడు.
వాడు పాండవులను చేరుకుని, "దుష్ట చతుష్టయం నియోగించి పంపిన ఈ దుర్మార్గుడు పురోచనుడు వచ్చే కృష్ణచతుర్దశి రాత్రి ఈ లక్కఇంటికి నిప్పుపెట్టబోతున్నాడు. ఆ రాత్రి మీరు తప్పించుకుపోవటానికి ఈ ఇంటి మధ్య నుంచి ఊరి బయటి వనంలోకి సొరంగం తవ్వమనీ, దాని ద్వారా బయటపడి మీరు ఎటైనా వెళ్ళి పోవలసిందనీ విదురుడు హెచ్చరించాడు. నేను సొరంగం తవ్వటానికే వచ్చాను,” అన్నాడు.
ఆ మనిషి ఇంటి మధ్యనుంచి ఒక బిలం తవ్వి, దాని ద్వారాన్ని ఎంతో నేర్పుగా కప్పిపెట్టి పాండవులకు చూపాడు. పాండవులు తామున్న ఇంటిని గురించిగాని, దానిని తగల బెట్టటానికి నియోగించబడిన పురో చనుణ్ణి గురించిగాని తమకు ఏ మాత్రమూ అనుమానం లేనట్టే ప్రవర్తించి, పురోచనుడికి నమ్మకం కలిగించారు.
కృష్ణచతుర్దశి వచ్చింది. ఆ రోజు కుంతీదేవి పురంలోని బ్రాహ్మణులకూ, బ్రాహ్మణ స్త్రీలకూ అన్నసంతర్పణ చేసింది. పురోచనుడు ఒక ఆటవిక స్త్రీనీ, ఆమె పిల్లలనూ పాండవులకు సేవ చెయ్యటానికి నియోగించాడు. ఆ ఆటవిక కుటుంబం వాళ్ళు వన్యఫలాలు తెచ్చేవాళ్ళు, ప్రతి పనిలోనూ కుంతీదేవికి సాయపడేవాళ్ళు. ఆ రోజు ఉత్సవం గనక ఆ స్త్రీతోబాటు, ఆమె కొడుకులు అయిదుగురూ జాస్తిగా కల్లు తాగి, ఆ రాత్రికి ఆ ఇంటనే పడుకున్నారు.
అర్ధరాత్రివేళ భీముడు వెళ్ళి, పురోచనుడు పడుకునే గది వాకిలికి నిప్పు అంటించి, తల్లినీ, అన్నలనూ సొరంగం గుండా పంపేసి, ఇంటి నాలుగు మూలలా నిప్పు పెట్టి, తాను కూడా బిలం ప్రవేశించి, సొరంగం తవ్వినవాడికి తమ క్షేమం తెలిపాడు. అందరూ సొరంగ మార్గాన అరణ్యం చేరారు.
వారు అరణ్య మార్గాన పోయేటప్పుడు కుంతి నడవలేకపోయింది. ఆమెను భీముడు తన భుజాలమీది కెత్తుకున్నాడు. అతను మిగిలినవాళ్ళను కూడా పట్టుకుని నడిపించ వలిసి వచ్చింది. ఈ విధంగా వాళ్ళు కటిక చీకటిలో పడి అరణ్య మార్గాన వెళ్ళి గంగా నదిని చేరుకున్నారు.
అక్కడ వారిని గంగ దాటించటానికి ఒక పడవ సిద్ధంగా ఉన్నది. ఆ పడవను విదురుడే ఏర్పాటుచేశాడు. పడవవాడు చెప్పిన మాటలను బట్టి వాడు విదురుడి మనిషేనని రూఢి అయాక పాండవులు తల్లితో సహా వాడి పడవ ఎక్కి గంగ దాటారు. పడవవాడు పాండవులు చెప్పిన సంకేతపు మాటలు గ్రహించి, వాటిని విదురుడికి చేర్చటానికి హస్తినాపురానికి పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇంకా రాత్రి కొంత మిగిలి ఉన్నది. పాండవులు నక్షత్రాలను బట్టి దిక్కులు తెలుసుకుని, దక్షిణంగా నడవ నారంభించారు. కొంతదూరం వెళ్ళాక భీముడు తప్ప మిగిలినవాళ్ళు ఒక్క అడుగైనా నడవలేకపోయారు. రాత్రంతా నిద్ర లేదు, దారీ తెన్నూ లేని అరణ్య మార్గాన నడక! అందరూ చతికిలబడటం చూసి భీముడు అందరినీ ఒక్కసారే ఎత్తుకుని కొంతదూరం నడిచి, ఒక చోట దించి, కూర్చున్నాడు.
"కొంచెం సేపయాక కుంతి భీముడితో, "నాయనా, దాహంతో ప్రాణం పోయేటట్టున్నది,” అన్నది. భీముడు మళ్ళీ అందరినీ ఎత్తుకుని పోయి ఒక మర్రిచెట్టు కింద దించి, "మీరందరూ ఇక్కడే పడుకుని ఉండండి. నేను వెళ్లి మీ అందరికీ నీరు తెస్తాను," అని బయలుదేరాడు. కొంతదూరం పోగా అతనికి నీటిపక్షుల కల కలం వినిపించింది. ఆ దిక్కుగా పోగా ఒక కొలను కనిపించింది. భీముడందులో స్నానం చేసి, తల్లికి మిగిలినవారికీ కావలిసిన నీరు తీసుకుని తిరిగి వచ్చేసరికి, అందరూ గాఢనిద్రలో ఉండటం కనిపించింది.
"ఇంత ఆపదలో కూడా వీళ్ళు ఇంత నిద్ర పోతున్నారంటే ఎంతగా అలసి పోయారోగదా!" అనుకుని భీముడు, వాళ్ళను లేపటానికి మనసొప్పక, వారు ఎప్పుడు లేస్తారా, నీరిద్దామని వేచి కూర్చున్నాడు.
అక్కడ వారణావతంలో పాండవులుండిన ఇల్లు కాలిన సంగతి ఊరు ఊరంతా తెలిసింది. జనం పోగయారు. ఇంకా మంటలు అంతో ఇంతో మండుతూనే ఉన్నాయి. సొరంగం తవ్వినవాడు ఆ మంటలను ఆర్పేవాడిలాగా బూడిదను అటూ ఇటూ తోస్తూ బిలద్వారాన్ని అతి నేర్పుగా కప్పేశాడు. పురోచనుడి శవమూ, ఆటవిక స్త్రీ శవమూ, ఆమె అయిదుగురు కొడుకుల శవాలూ కాలి గుర్తించ రాకుండా ఉన్నాయి. కుంతితో సహా పాండవులూ, వారివెంట ఉన్న పురోచనుడూ ఆ ఇంట కాలిపోయారని జనం అనుకున్నారు.
ఈ వార్త హస్తినాపురం చేరింది. కుంతీ పాండవులు ఇంటితో సహా కాలిపోయారని వినగానే ధృతరాష్ట్రుడు గుండె లవిసి మూర్ఛపోయాడు. విదురుడు కూడా నలుగురితో బాటు తాను కూడా దొంగ కన్నీరు కార్చాడు.
అక్కడ పాండవులు అలిసి నిద్ర పోతున్న వనంలో హిడింబుడనే రాక్షసుడుండేవాడు. వాడిది నల్లగా, అతి బలిష్ఠంగా ఉండే దేహం, పసుపుపచ్చ కళ్ళు, భయంకరమైన ఆకారం, వేల్లాడే పెద్ద కడుపు, మొనతేలిన ఎర్రని మీసాలు. వాడు నరభక్షకుడు. ఆకలి దహించుకుపోతూ హిడింబుడు ఆహారం కోసం అరణ్యమంతా తిరుగుతూ, ఒక మద్దిచెట్టెక్కాడు. దాని మీద కూర్చుని వాడు జుట్టు విదిలించుకుంటూ, బుర్ర గోక్కుంటూ, పెద్ద పెట్టున ఆవలిస్తూ, చుట్టూ చూస్తుండగా వాడికి దూరాన మర్రిచెట్టు కింద పడుకుని కొందరు మనుషులు కనిపించారు.
హిడింబుడు తన చెల్లెలైన హిడింబను పిలిచి, "చెల్లీ, చాలా కాలానికి మనిషి మాంసం దొరికింది. నువు వెళ్లి, ఆ మర్రి చెట్టు కింద ఎంత మంది ఉంటే అంత మందినీ చంపి తీసుకురా. మనం కడుపు నిండా తిని నృత్యం చేద్దాం,” అన్నాడు.
హిడింబ అలాగే నని బయలుదేరి, పాండవులున్న చోటికి వచ్చి, నిద్రపోతున్న కుంతినీ, ధర్మరాజునూ, అర్జున నకులు సహదేవులనూ, వారికి కాపలా కాస్తున్న భీముణ్ణి చూసింది. హిడింబి కంటికి భీముడు ఎంతో నాజూకుగానూ, నవమన్మధుడుగానూ కనిపించాడు. ఆమెకు అతనిపై మోహం పుట్టుకొచ్చింది. ఆ మోహావేశంలో ఆమెకు అన్న చాలా దూరంగా ఉన్నట్టు తోచాడు. ఆ మనుషులను చంపేకన్న బతికి ఉండనిస్తే తాను ఆ నవమన్మధుడితో ఎంతోకాలం సుఖంగా ఉండవచ్చు ననుకున్నది హిడింబ.
ఆమె అందమైన రూపం ధరించి చక్కని బట్టలు కట్టుకుని సిగ్గుతో కూడిన చిరునవ్వులను భీముడి మీద ప్రసరింపజేస్తూ, దగ్గిరికి వచ్చి, "మహానుభావా, నువ్వెవరు మీదే దేశం? ఈ నిద్రపోయేవారెవరు? ఎంతో సుకుమారి లాగా ఉన్న ఈ ముసలావిడ ఎవరు? ఈ అరణ్యంలో నా అన్న హిడింబు డుంటాడనీ, అతను మహాబలుడైన రాక్షసుడనీ, అమిత క్రూరుడనీ తెలీదా? వీళ్ళు నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నారు? మిమ్మల్నందరినీ చంపి ఆహారంగా తెమ్మని మా అన్న నన్ను పంపాడు. కాని నీ అందం చూస్తుంటే నాలో మోహం పుట్టుకొచ్చి, మిమ్మల్ని చంప బుద్ధి కావటంలేదు. నా కోరిక తీర్చావంటే, మీకు మా అన్న భయం లేకుండా మిమల్ని కామగమనం ద్వారా సురక్షిత ప్రాంతానికి చేర్చుతాను. అక్కడ మన మిద్దరమూ సుఖంగా ఉండగలం. నా మాట కాదనకు,” అన్నది.