అంగరాజ్యాభిషేకం | మహాభారతం | Karna Coronation | Mahabharatham | Ep-09

writer
0

"అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యా లంటే నువు కూడా రాజువై ఉండాలి," అని కృపాచార్యులు అనటమూ కర్ణుడు తన తల్లిదండ్రుల పేర్లు చెప్పటానికి బిడియ పడటమూ గమనించి దుర్యోధనుడు కృపాచార్యులుతో ఇలా అన్నాడు:


"సుక్షత్రియ వంశంలో పుట్టినవారినీ, మహాశూరులనూ, పెద్ద సేనలు గలవారినీ రాజులనవచ్చునవి శాస్త్రాలు చెబుతున్నాయి. అయినా కర్ణుడు అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యటానికి అతడు రాజు కాదన్నదే అభ్యంతరమైతే అతన్ని ఈ క్షణాన్నే అంగరాజ్యానికి రాజుగా అభిషేకిస్తాను.” 


దుర్యోధనుడు ఆజ్ఞాపించగా మంత్ర వేత్తలైన పురోహితులు వచ్చారు. బంగారు సింహాసనం వచ్చింది. బంగారు కలశాలతో నీరు వచ్చింది. పుష్పాక్షతలు వచ్చాయి. దుర్యోధనుడు కర్ణుణ్ణి సింహాసనంలో కూర్చో బెట్టి, రాజుగా అభిషేకించాడు.


ఈ కర్మకాండ ముగియగానే కర్ణుడు దుర్యోధనుడితో, "మహారాజా, నేను నీ నుండి రాజ్యదానం పొందినందుకు ప్రత్యుపకారం ఏమి చెయ్యను ?" అన్నాడు.


"నీ వంటి పరాక్రమశాలి మైత్రి నాకు కావాలి,” అన్నాడు దుర్యోధనుడు.


ఇదంతా చూస్తున్న కర్ణుడి పెంపుడు తండ్రి సూతుడు తాను తోలే రథం మీది నుంచి దిగివచ్చి, అంగరాజైన కర్ణుణ్ణి అఖినందించాడు. కర్ణుడు సూతుడికి పుత్రభావంతో నమస్కరించాడు. సూతుడు కర్ణుణ్ణి లేవనెత్తి కౌగలించుకున్నాడు. ఇద్దరూ ఆనందబాష్పాలు రాల్చారు.


కర్ణుడు సూతుడి కొడుకన్నది బయట పడిపోయింది. భీముడు కర్ణుడితో, "సూత పుత్రా, రథాలు తోలుకోక అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేస్తానంటావే? ఇదేమైనా బాగుందా ? నీకి అంగరాజ్య సింహాసనం మటుకు దేనికి?” అన్నాడు.


కర్ణుడికి మండిపోయింది. కాని ఏమీ అనలేక, కోపంగా బుసలు కొడుతూ ఆకాశంలో సూర్యుడి కేసి చూస్తూ ఉండిపోయాడు. తమ్ముల మధ్య కూర్చుని ఉన్న దుర్యోధనుడు భీముడితో, “ భీమసేనా, నీ మాటలు ఉచితంగా లేవు. రాజైనవాడు బలంగల ప్రతివాడితోనూ యుద్ధం చెయ్యటానికి సిద్ధంగా ఉండాలి. అర్జునుడైనా అంతే. శూరుల పుటకా, ఏరులు పుటకా ఎవరూ చెప్పలేరు. దివ్యలక్షణాలూ, సహజ కవచకుండలాలూ గల ఈ కర్ణుడు సాధారణ జన్ముడు కాడు. అతను ఒక్క అంగరాజ్యాన్నే కాదు, భూమినంతా ఏలదగినంతటి పరాక్రమవంతుడు. నేనితనికి చేసిన అంగరాజ్యాభిషేకం ఎవరికైనా సమ్మతం కాకపోతే వాళ్ళు నాతో ద్వంద్వ యుద్ధం చేసి జయాపజయాలు తేల్చుకోవచ్చు,” అన్నాడు.


ఈ మాటకు ప్రేక్షకులందరూ హాహాకారాలు చేశారు.


ఇంతకూ ఏ ద్వంద్వ యుద్ధంగాని జరిగే లోపలనే సూర్యుడస్తమించాడు. కొందరు అర్జునుణ్ణి, కొందరు కర్ణుణ్ణి, కొందరు దుర్యోధనుణ్ణి మెచ్చుకుంటూ అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. దుర్యోధనుడికి మాత్రం ఆ రోజు పర్వదినం. ఈనాటిదాకా అతనికి అర్జునుడు పక్కలో బల్లెంలాగుండి బాధిస్తూ వచ్చాడు. ఈ రోజు నుంచీ దుర్యోధనుడికి అర్జునుడి భయం పోయింది. అతను గుండె మీద చెయ్యి వేసుకుని నిశ్చింతగా నిద్రపోయాడు.


కొంతకాలం గడిచింది. ఒకనాటి ఉదయం ద్రోణుడు తన శిష్యులందరినీ పిలిపించి, "నాకు గురుదక్షిణ ఇవ్వండి," అని ఆడిగాడు. అందరూ ఆయనకు నమస్కారాలు చేసి, "ఏమిటి తమ ఉత్తరువు?” అని అడిగారు.


"ఐశ్వర్య మదంతో కొట్టుకుంటున్న అవివేకి ద్రుపదుడు. అతన్ని పట్టి తీసుకురండి,” అన్నాడు ద్రోణుడు.


గురువుగారి ఆజ్ఞ నిర్వర్తించటానికి కుమారులందరూ సిద్ధపడి, రథాలు సిద్ధం చేశారు; కవచాలు ధరించారు, ఖడ్గాలనూ, విల్లంబులనూ తీసుకున్నారు; ద్రుపదుడి పైకి యుద్ధానికి పోవటానికి సన్నాహాలు పూర్తిచేసి, అందరూ ద్రోణుడి వెంట బయలుదేరారు.


పాంచాలపురం కనుచూపు మేరలో ఉన్నదనగా అర్జునుడు ద్రోణుడితో, "వీరిలో ఒక్కరుకూడా ద్రుపదుణ్ణి తీసుకు రాలేరు. వీరు విఫలులై తిరిగి వచ్చేదాకా మా పాండవులం ఇక్కడే ఉండి, ఆ తరవాత ద్రుపదుణ్ణి పట్టితెస్తాం," అన్నాడు.


దుర్యోధనుడి ముఠా కర్ణుణ్ణి వెంటబెట్టుకుని రాచనగరు ప్రవేశించి, ద్రుపదుణ్ణి పట్టుకుంటామని వీరాలాపాలాడుకుంటూ రాజమార్గాన వస్తున్న సంగతి ద్రుపదుడికి తెలిసింది. ఆయన వెంటనే తన సేనలనూ, తమ్ములనూ వెంటబెట్టుకుని వాళ్ళతో యుద్ధానికి వచ్చాడు. కౌరవులూ, కర్ణుడూ కొంతసేపు దర్పంగానే పోట్లాడారు గాని, ద్రుపదుడి ధాటికీ, ద్రుపదుడి సేనలు విజృంభణకూ తట్టుకోలేక, చావు తప్పి కన్ను లొట్టపోయిన విధంగా అయి, యుద్ధరంగం వదిలి పాండవులున్న చోటికి పారిపోయి వచ్చారు.


అప్పుడర్జునుడు ద్రోణుడికి ప్రణామం చేసి, ధర్మరాజు అనుమతి పొంది, భీముణ్ణి తన సేనకు నాయకుడుగానూ, నకుల సహదేవులను తన రథానికి చక్రరక్షకులుగానూ పెట్టుకుని, ద్రుపదుణ్ణి పట్టి తెస్తానని బయలుదేరాడు.


భీమార్జునులు ద్రుపదుడి సేనమీద పడి అల్లకల్లోలం చేసేశారు. అర్జునుడు భయంకరంగా యుద్ధంచేస్తూ తన రథాన్ని ద్రుపదుడి రథం ఉన్నవేపు పోనిచ్చాడు. ద్రుపదుడు రోషంతో అర్జునుడి మీద దారుణమైన దాడి చేశాడు. ఒక దశలో ద్రుపదుడు కనబడక ఆయన సైన్యం హాహాకారాలు చేసింది. అర్జునుడు ద్రుపదుడి రథాన్నీ, అశ్వాలనూ ధ్వంసం చేసి, కత్తి దూసి ద్రుపదుడి రథం కాడిపైకి దూకి ద్రుపదుణ్ణి పట్టుకున్నాడు.


ఈ లోపల భీమ నకుల సహదేవులు పారిపోయే ద్రుపదుడి సేనలను ఊచకోత కొయ్యటం అతని కంటపడింది. అర్జునుడు గట్టిగా కేక వేసి, "ద్రుపదుడు చిక్కాడు. మనం వచ్చిన పని పూర్తి అయింది. ఈయన మనకు బంధువు. అనవసరంగా ద్రుపదుడి సేనను హతమార్చకండి,” అని హెచ్చరించాడు.


తరవాత అర్జునుడు ద్రుపదుణ్ణి కట్టి తీసుకువచ్చి ద్రోణుడికి గురుదక్షిణగా సమర్పించాడు. ద్రోణుడు ద్రుపదుణ్ణి చూసి, "పాంచాలరాజా, ఇప్పుడు నీ కాంపిల్య నగరం మాకు చిక్కింది. ఇప్పటికైనా నన్ను నీ బాల్యస్నేహితుడిగా గుర్తిస్తావా? భయపడకు. నేను బ్రాహ్మణ్ణి. పరమ శాంతమూర్తిని. మన బాల్యస్నేహాన్ని నేను మరవలేదు. నీ స్నేహం కోసమే నిన్ను తెప్పించాను. నాకు రాజ్యాలు ఏలేవాళ్ళ స్నేహమంటే చాలా ఇష్టం. కాని.. ఇప్పుడు నీకు రాజ్యం లేదు. నీ స్నేహం కోసమై అర్ధరాజ్యం ఇస్తాను తీసుకో. గంగకు దక్షిణంగా ఉండేదంతా నీ రాజ్యం. ఉత్తరంగా ఉండేది నా రాజ్యం. ఇద్దరమూ హాయిగా రాజ్యాలు ఏలుకుందాం,” అన్నాడు.


ద్రుపదుడు ద్రోణుడితో శాశ్వత మైత్రికి ఒప్పుకున్నాడు. ద్రోణుడాయన కట్లు విప్పించి, వెళ్ళిపోనిచ్చాడు.


ఆదిమొదలు ద్రుపదుడు దక్షిణ పాంచాలానికి మాత్రమే రాజుగా ఉంటూ వచ్చాడు. మాకందీ, కాంపిల్య నగరాలు ఆయన రాజధానులు. సైనిక బలంతో ద్రోణుణ్ణి సాధించటం తనకు అసాధ్యమని ద్రుపదుడు గ్రహించాడు. అదీగాక ఆయనకు సంతాన కాంక్ష తీరలేదు. ఈ రెండు కారణాలచేతా, ఆయన దేశసంచారం చేస్తూ, గొప్ప తపస్సు చేసిన మునులను ఆశ్రయించ సాగాడు.


అహిచ్ఛత్రం రాజధానిగా చేసుకుని ఉత్తర పాంచాలాన్ని ద్రోణుడు పాలించాడు.


ఒక సంవత్సరం గడిచింది. ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజుగా అభిషేకించ నిశ్చయించాడు. ధర్మరాజు ధైర్యమూ, ఓర్పు గలవాడు, వక్ర స్వభావుడు కాడు; భృత్యులను ఆదరిస్తాడు.


యువరాజుగా ధర్మరాజు రాజ్యపాలనలో సమర్ధుడనిపించుకున్నాడు. అతను పాండురాజు కన్న కూడా మేటి అని అందరూ మెచ్చుకున్నారు.


భీముడు బలరాముడికి శిష్యుడై గదా యుద్ధంలోనూ, ఖడ్గయుద్ధంలోనూ నైపుణ్యం సంపాదించాడు.


అర్జునుడు విల్లును దృఢంగా పట్టుకుని, ఆ చేతికి ఎంత దెబ్బ తగిలినా సరే విల్లు వదలకుండా ఉండటం అభ్యాసం చేశాడు. ద్రోణుడికి నచ్చిన అంశాలలో ఒకటి ఏమంటే అర్జునుడు అతి వేగంగానూ, లాఘవంగానూ బాణాలు వేయగలడు; అన్నిరకాల ఆయుధ ప్రయోగాలలోనూ మంచి చాతుర్యం గలవాడు.


"ఎంతటివాళ్ళు నీతో యుద్ధానికి వచ్చినా సరే వారిపట్ల గౌరవంకొద్దీ మానవద్దు; యుద్ధం విధిగా చెయ్యి,” అని ద్రోణుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు.


అర్జునుడు ద్రోణుడి అభిమానానికి పాత్రుడై, కౌరవ రాజ్యానికి శత్రువులుగా ఉండి తన తండ్రికి కూడా లొంగని సౌవీర రాజు విమలుడనే వాణ్ణి, దత్తామిత్రుడనే వాణ్ణి, అతడి తమ్ముణ్ణి చంపాడు. తాను ఒక్కడే రథంమీద బయలుదేరి వెళ్ళి, తూర్పు దేశపు రాజులను పదివేల మందిని ఒక్కసారే జయించాడు; ఇంకా అనేక మంది పరిసర రాజులను కౌరవరాజ్యానికి సామంతులుగా చేసి, వారి నుంచి కప్పాలుగానూ, కానుకలుగానూ అంతులేని ధన రాసులను సంపాదించి, వాటిని హస్తినాపురానికి చేర్చాడు.


నకుల సహదేవులు కూడా కౌరవ రాజ్యానికి శత్రువులైన రాజులను అనేక మందిని జయించి, అంతులేని ధనాన్ని తెచ్చి బొక్కసం నింపారు.


పాండవుల ఖ్యాతి ఈ రూపంగా నాలుగు దిక్కులా వ్యాపించటం చూసి ధృతరాష్ట్రుడు సహించలేక పోయాడు. వారిని అలాగే పైకి రానివ్వటమా, లేక నిగ్రహించటమా అన్నది తేల్చుకోలేక, కణకుడనే ముసలి బ్రాహ్మణ మంత్రిని సలహా అడిగాడు. శత్రువైనవాణ్ణి ఏ మాయోపాయంచేత నిర్మూలించినా తప్పు లేదన్నాడు కణికుడు.


ధృతరాష్ట్రుడిలాగే దుర్యోధనుడు కూడా కర్ణ శకుని దుశ్శాసనులతో ఆలోచించి పాండవులను నిర్మూలించాలన్న నిశ్చయానికి వచ్చి, తండ్రితో చెబితే, తండ్రి అలాగే చెయ్యమన్నాడు. పాండవులను వారణావతపురానికి (కాశీకి) పంపి, అక్కడ లక్క ఇంట దహించటానికి పథకం తయారయింది.


ధృతరాష్ట్రుడి ఆజ్ఞను అనుసరించి ఆయన మంత్రులు ఒకరొకరే పాండవుల వద్దకు వచ్చి వారణావతపురం ఎంత అందంగా ఉంటుందో వర్ణించసాగారు; ఆ నగరాన్ని ఒక్కసారి చూడమని ప్రోత్సహించారు.


తరవాత ధృతరాష్ట్రుడే పాండవులను పిలిపించి, "నాయనలారా, వారణావతపురం చూడటానికి వెయ్యి కళ్ళు చాలవని అందరూ అంటున్నారు. త్వరలో అక్కడ శివుడికి ఉత్సవం కూడా జరగబోతున్నది. కావాలంటే, మీరు మీ అమ్మను వెంట బెట్టుకుని అక్కడికి వెళ్ళి, కొంతకాలం అక్కడ సరదాగా గడిపి, ఆ తరువాత హస్తినాపురానికి తిరిగి రండి,” అని అన్నాడు. ఇది దేశ బహిష్కరణ అని ధర్మరాజు గ్రహించి, ధృతరాష్ట్రుడి మాటలకు పెద్దగా ఆనందం ప్రదర్శించలేదు.


ఈలోగా దుర్యోధనుడు పురోచనుడనే శిల్పిని ఏకాంతంగా తీసుకుపోయి అతనితో ఇలా అన్నాడు :


"మా తండ్రి పాండవులను వారణావతపురానికి పంపేస్తున్నాడు. నువు ముందుగానే రథం మీద అక్కడికి వెళ్ళి, లక్క. మొదలుగాగల వస్తువులతో, తగల బెడితే దివిటీలాగా మండే ఇంటిని అందంగా తయారు చెయ్యి. అందులో సామగ్రి అంతా ఏర్పాటు చేసి, చూసిన వాళ్ళు ఎంతో బాగున్నదనేటట్టుగా చూడు. పాండవులా యింట ఏ అనుమానమూ లేకుండా కొన్నాళ్ళున్న తరువాత, అర్థరాత్రివేళ వారు నిద్రలో ఉన్న సమయంలో ఇంటికి నిప్పు పెట్టి వచ్చెయ్యి. వాళ్ళందులో కాలి చచ్చిపోతే నేను నిశ్చింతగా ఉంటాను. నేను తరవాత రాజునై నీకు ఎంత ఉపకారం చేస్తానో చూసుకో."


ఇందుకు పురోచనుడు సమ్మతించాడు. అతనికోసం వేగవంతమైన గుర్రాలను పూన్చిన రథం సిద్ధం చేయించి, దానిమీద అతన్ని వారణావతపురానికి పంపేశాడు. పురోచనుడు అక్కడికి చేరుతూనే శ్రద్ధగా తన పనిలో నిమగ్నుడయాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)