ద్రోణుడి కథ | మహాభారతం | The Story of Drona | Mahabharatham | Ep-07

writer
0

ఈ లోపల ధర్మరాజు భీముడి కోసం అంతటా వెతికాడు. భీముడి జాడ లేదు. దుర్యోధనుణ్ణి అడిగితే, "అప్పుడే నగ రానికి వెళ్ళిపోయాడు,” అన్నాడు. ధర్మ రాజు వెంటనే నగరానికి తిరిగి వెళ్ళి, కుంతిని కలుసుకుని, భీముడు వచ్చాడా అని అడిగితే ఆమె రాలేదన్నది.


"వాడు ఒకచోట పడుకుని నిద్రపోవటం చూశాను. మళ్లీ చూస్తే అక్కడ లేడు. అంతటా వెతికాను. ఎక్కడా కనబడడు. నా ప్రయాస అంతా వృధా. ఏమై పోయాడో ?" అన్నాడు ధర్మరాజు.


కుంతికి దుఃఖం వచ్చింది. " నువూ, నీ తమ్ములూ నాలుగు దిక్కులా వాడికోసం వెతకండి, నాయనా,” అని ఆమె ధర్మరాజును పంపేసి, విదురుణ్ణి పిలిపించి, "మిగిలినవాళ్ళతో ప్రమాణకోటిస్థలానికి వెళ్ళిన భీముడు తిరిగి రాలేదు. ధర్మరాజు ఎంత వెతికినా వాడు కనిపించలేదుట. దుర్యోధనుడికి వాడంటే అమిత ఈర్ష్య వాడి ప్రాణాలు తీశాడో ఏమోనని భయంగా ఉన్నది," అన్నది.


“నాతో అంటే అన్నావు, ఈ మాట మరెక్కడా అనకు. దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. ఈ మాట వింటే వాడు నీ మిగిలిన కొడుకులను బతకనివ్వడు. అది చూసుకో. అయినా భీముడి ప్రాణాల కేమీ భయం ఉండదులే. నీ కొడుకు లందరూ దీర్ఘాయువులు," అని విదురుడు కుంతిని ఊరడించి వెళ్ళిపోయాడు.


అక్కడ నాగలోకంలో భీముడు ఎనిమిది రోజులు నిద్రపోయి, మేలుకున్నాడు. అప్పుడు నాగులు అతనితో, "నువు తాగిన దివ్యరసం ఇప్పుడు జీర్ణమయింది. నీ కిక వెయ్యి ఏనుగుల బలం ఉన్నది. గంగలో స్నానం చేసి, నీ తల్లినీ, తోబుట్టువులనూ చేరుకో,” అన్నారు.


వాళ్ళు భీముడి చేత గంగలో స్నానం చేయించి, కట్టుకోవటానికి పట్టుబట్ట లిచ్చి, అనేక ఓషదులు చేర్చి తయారుచేసిన పరమాన్నం పెట్టి, అనేక నగలతో అలంకరించారు. తరవాత ఒక నాగుడు భీముణ్ణి ప్రమాణ కోటిస్థలంలో ఒక వనానికి మోసుకు వచ్చాడు. భీముడు తనను సాగ నంప వచ్చిన నాగుల వద్ద సెలవు పుచ్చు కుని, హస్తినాపురం చేరి, తల్లికి, అన్నకూ నమస్కరించి, తమ్ముళ్ళను కౌగలించు కున్నాడు. అతని రాకతో అందరి విచా రమూ తొలగిపోయింది.


భీముడు తల్లితో తనను దుర్యోధనుడు చంపాలని విషాహారం పెట్టటమూ, కాళ్ళు చేతులు కట్టి నదిలోకి తొయ్యటమూ, నాగ లోకంలో తన అనుభవాలూ చెప్పాడు.


అది మొదలు పాండవులు ఒకరి నొకరు వెయ్యి కళ్ళతో కాపాడుకుంటూ వచ్చారు. దుర్యోధనుడు పాండవులకు ద్రోహం చెయ్య టానికి చేసిన ఆలోచనలను విదురుడు భగ్నం చేస్తూ వచ్చాడు.


కౌరవ పాండవ కుమారులు కృపా చార్యుల వద్ద విలువిద్య నేర్చుకునేటట్టు భీష్ముడు ఏర్పాటు చేశాడు. కుర్రవాళ్ళు కొంత కాలం కృపాచార్యుల వద్ద శిక్షలు పొందిన పిమ్మట భీష్ముడు వారికి గురువుగా ద్రోణాచార్యుణ్ణి ఏర్పాటు చేశాడు.


ఈ ద్రోణుడు భరద్వాజు డనే ఋషికి కొడుకు. అతను పెరిగి పెద్దవాడై వేద వేదాంగాలను పూర్తిగా చదివి, అస్త్రవిద్యలు నేర్చుకోవటానికి అగ్నివేశుడనే వాడివద్ద శిష్యుడుగా చేరి, ఆగ్నేయాది అస్త్రాలను సంపాదించాడు. అగ్నివేశుడి వద్దనే మరొక శిష్యుడు కూడా ఉండేవాడు. అతను వృష తుడి కొడుకు, ద్రుపదుడనేవాడు. ఇద్దరూ ఒక గురువు దగ్గిర శిష్యులు కావటంచేత ఇద్దరికీ స్నేహం కుదిరింది.


కొంత కాలానికి పాంచాల రాజైన వృష తుడు చనిపోగా, ద్రుపదుడు పాంచాల దేశానికి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. ద్రోణుడి తండ్రి అయిన భరద్వాజుడు కూడా పోయాడు. తరవాత ద్రోణుడు కృపాచార్యుడి చెల్లెలయిన కృపి అనే ఆమెను పెళ్ళాడాడు. వారిద్దరికీ అశ్వత్థామ అనే కొడుకు కలిగాడు.


ద్రోణుడు సంసారం ఈదే ప్రయత్నంలో సంపాదన మార్గం చూసుకోవలిసి వచ్చింది. పరశురాముడు బ్రాహ్మణులకు అడిగి నంతగా దానాలు చేస్తున్నాడని విని ద్రోణుడు అక్కడకు వెళ్ళాడు. పరశురాముడు ద్రోణుడితో, "నాయనా, నా కున్నదంతా బ్రాహ్మణులకు ఇచ్చేశాను. భూమి అంతా కశ్యపుడి కిచ్చాను. ఇక నా వద్ద అస్త్రాలు తప్ప మరేమీ లేవు," అన్నాడు.


"ఆ అస్త్రాలనే నాకు దయచేయించండి," అన్నాడు ద్రోణుడు.


"పరశురాముడు ద్రోణుడికి తన వద్ద ఉన్న అస్త్రాలన్నీ ఇచ్చేస్తూ, వాటిని ఎలా ప్రయోగించాలో, ఎలా ఉపసంహరించాలో శాస్త్రోక్తంగా చెప్పాడు.


తరవాత ద్రోణుడు, తన పూర్వ స్నేహితు డైన ద్రుపదుడు తనకు సహాయపడతాడనే ఉద్దేశంతో, అతని వద్దకు వెళ్ళాడు. రాజయాక ద్రుపదుడికి కళ్ళు నెత్తి కొచ్చాయి. అతను ద్రోణుణ్ణి చూసి, "నువ్వె వరో నే నెరగను. వెళ్ళు, వెళ్ళు,” అన్నాడు. అవమానం పొందిన ద్రోణుడు హస్తినా పురానికి తిరిగి వచ్చి, తన బావమరిది చాటున అజ్ఞాతంగా ఉంటూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకనాడు కౌరవకుమారులు నగరం వెలపల బంతి ఆడుతూండగా బంతి ఒక బావిలో పడింది. దానిని పైకి తీయటం వారికి సాధ్యం కాలేదు. ఆ సమయంలో ద్రోణుడు వాహ్యాళికి అటుగా వచ్చాడు. కుర్రవాళ్ళు అతని చుట్టూ మూగి, ఎలాగైన బావిలో నుంచి బంతిని పైకి తీసి పెట్టమని బతిమాలారు.


"అబ్బాయిలూ, మీ రందరూ భరత వంశాంకురాలు, అందులోనూ కృపా చార్యుడి శిష్యులు; బావిలో నుంచి బంతిని తీయలేకపోతున్నారా? ఈ నా ఉంగరాన్ని బావిలో వేసి, దాన్నీ, మీ బంతిని కూడా తీస్తాను, చూసుకోండి," అంటూ ద్రోణుడు తన ఉంగరాన్ని బావిలో వేశాడు.


ధర్మరాజు ద్రోణుడితో, "ముస లి బ్రాహ్మడా, ఈ పని చేశావంటే కృపా ఈ చార్యులుగారు నీకు యావజ్జీవం భోజనం ఏర్పాటు చేస్తాడు," అన్నాడు.


“చూస్తూ ఉండండి," అంటూ ద్రోణుడు ధనుర్బాణాలు తీసుకుని, ఒక బాణాన్ని బంతిలో ఇరుక్కు నేటట్టు కొట్టాడు, తర వాత వరసగా బాణానికి బాణం తగులు కునేటట్టు చేసి, ఆ బాణాల తాడుతో బంతిని పైకి తీశాడు. పిల్లలందరూ ఆశ్చర్యపోయి, " ఉంగరాన్ని కూడా తియ్యి." అన్నారు. ద్రోణుడొక బాణాన్ని మంత్రించి కొట్టి ఉంగరానికి తగులుకునేటట్టు చేశాడు. తరవాత, బంతిని లాగినటే ఉంగరాన్ని కూడా పైకి లాగాడు.


పిల్లలందరూ ఈ అద్భుతం చూసి దిగ్భ్రామ చెంది, ఒక్కసారిగా ఆయనకు నమస్కారాలు చేసి, "స్వామీ, ఇటువంటి శక్తి మే మెక్కడా చూడలేదు. మీరెవరు? మా వల్ల మీకేం ఉపకారం కావాలి?” అని అడిగారు.


"మీరు పిల్లలు. నా గొడవ మీ కెందుకు? ఈ సంగతి మీ తాతగారైన భీష్ముడికి చెప్పండి. నా సంగతి ఆయనే విచా రిస్తాడు." అన్నాడు ద్రోణుడు.


పిల్లల ద్వారా భీష్ముడు సంగతంతా తెలుసుకుని, ద్రోణుణ్ణి సాధరంగా నగరానికి ఆహ్వానించి, "మీరు హస్తినాపురానికి రావు టానికి కారణమేమిటి?" అని అడిగాడు.


ద్రోణుడు తన పుట్టుపూర్వోత్తరాలు చెప్పి, " మా తండ్రి నన్ను కృపాచార్యుడి చెల్లెలిని పెళ్ళాడమని ఆదేశించి చని పోయాడు. నే నలాగే చేసి అశ్వత్థామను కన్నాను. తన తోటి వాళ్ళు ఆవుపాలు తాగుతుంటే నా కొడుకు తనకు కూడా ఆవుపాలు కావాలని ఏడ్చాడు. ఆవును సంపాదించటం నాకు సాధ్యం కాక, నీటిలో పిండి కలిపి, అవే ఆవుపాలని ఇస్తే, నా కొడుకు సంతోషంతో తాగుతూ వచ్చాడు. మా ఆశ్రమంలో వాళ్ళు నా బీద స్థితిని చూసి నిందించారు. నాకు నా సహపాఠి అయిన ద్రుపదుడు గుర్తు వచ్చాడు. చిన్న తనంలో అతను తనకు రాజ్యం వస్తే దాన్ని నా కిస్తాననేవాడు. అతని సహాయం ఆశించి పాంచాలదేశం వెళ్ళి, అతనికి మా పాత స్నేహం గుర్తు చేశాను. రాజ్యమదాంధుడై అతను, రాజైన తనకూ, పేద బ్రాహ్మడి నైన నాకూ స్నేహమేమిటన్నాడు; నన్ను ఎరగనే ఎరుగనన్నాడు; కావలిస్తే ఒక పూట భోజనం పెడతానన్నాడు. నాకు మండి పోయింది. భార్యనూ, కొడుకునూ వెంట బెట్టుకుని ఈ కురుదేశం వచ్చాను. మీరు పిలవనంపగా వచ్చాను. ఏమిటి తమ ఆజ్ఞ?" అన్నాడు.


"మీరు కురుదేశం రావటం మా పిల్లల సుకృతం. మీకు కావలిసిన సుఖాలన్నీ అమర్చుతాను. మిమ్మల్ని రాజుగా భావించి, మీ ఆజ్ఞలు శిరసావహిస్తాము," అని భీష్ముడు కొద్ది రోజుల అనంతరం ఒక నాడు కౌరవ, పాండవ కుమారులందరినీ ద్రోణుడికి శిష్యులుగా సమర్పించాడు.


ద్రోణుడు కుర్రవాళ్ళనందరినీ చేర్చి, "మీకు నేను విలువిద్య చెప్పటం పూర్తి అయినాక నా పని ఒకటి చేసి పెట్టవలిసి ఉంటుంది,” అన్నాడు.


ఎవరూ మాట్లాడలేదు. అర్జునుడు మాత్రం, "గురుదేవా, మీరేం చెప్పినా చేస్తాను,” అన్నాడు.


ద్రోణుడికి చాలా ఆనందమయింది. ఆయన అర్జునుణ్ణి కౌగలించుకుని, చాలా సార్లు ముద్దాడాడు.


ద్రోణుడి దగ్గిర ధృతరాష్ట్రుడి కొడు కులూ, పాండురాజు కొడుకులూ మాత్రమే గాక, హస్తినాపురానికి వచ్చి ఉన్న యాదవ కుమారులు కూడా శిష్యులుగా చేరి విలు విద్య నేర్చుకున్నారు.


సూతుడి ఇంట పెరిగిన కర్ణుడు కూడా ద్రోణశిష్యుడయాడు.


అప్పటి నుంచి కూడా కర్ణుడికి దుర్యో ధను డంటే అభిమానం, అవకాశం దొరికి నప్పుడల్లా పాండవులను హేళన చేసేవాడు, అవమానించేవాడు.


ద్రోణుడు చెప్పిన విధంగా అస్త్రప్రయోగాలను సామర్థ్యంతో చేస్తూ వచ్చినవాడు ఒక్క అర్జునుడే. అందుచేత ద్రోణుడు, అర్జునుడు తనంతవాడు కాగలడని అను కుంటూ ఉండేవాడు.


ద్రోణుడు ఒక పని చేసేవాడు. శిష్యు లందరికీ చెంబులిచ్చి నీరు తెమ్మనేవాడు; తన కొడుకైన అశ్వత్థామకు పెద్ద మూతిగల చెంబు ఇచ్చి, మిగిలినవారికి చిన్న మూతి గల చెంబు లిచ్చేవాడు ; ముందు వచ్చిన వారికి అనేక అస్త్రరహస్యాలు చెబుతూండే వాడు. పెద్ద మూతిగల చెంబు తీసుకున్న అశ్వత్థామ తన చెంబును శీఘ్రంగా నించు కుని ముందు వచ్చేవాడు. అర్జునుడు, తన చెంబుమూతి చిన్నదైనా, వారుణాస్త్ర ప్రభావంతో దాన్ని శీఘ్రంగా నించుకుని, అశ్వత్థామతోపాటే తిరిగి వచ్చి, అశ్వత్థామ నేర్చుకున్న రహస్య విద్యలన్నీ తాను కూడా నేర్చుకునేవాడు. ఈ కారణంగా అశ్వత్థామకు అర్జునుడంటే చాలా అసూయ ఉండేది.


ద్రోణుడి ఇంట ఒక రాత్రి శిష్యులంతా భోజనం చేస్తూండగా గాలికొట్టి దీపం ఆరి పోయింది. అందువల్ల భోజనంచెయ్యటానికేమీ ఇబ్బంది కలగకపోవటం గ్రహించి అర్జునుడు, "అభ్యాసం వల్లగదా చీకటిలో కూడా అన్నం తినగలుగుతున్నాను. చీకటిలోనే విలువిద్య ఎందుకు అభ్యసించ గూడదు ?" అనుకుని, అలాచెయ్య నారంభించాడు.


ఒకరాత్రి ద్రోణుడికి ధనుష్టంకారం విని నిద్రాభంగమయింది. ఆయన లేచి వచ్చి, అర్జునుడు చీకట్లో విలువిద్యాభ్యాసం చేస్తూ ఉండటం గమనించి, కౌగలించుకుని, "నాయనా, నీతో సమానమైన విలుకాడు మరొకడు లేడనిపించేలాగా నిన్ను తయారు చేస్తాను,” అన్నాడు. అన్నవిధంగానే ఆయన అర్జునుడికి దొమ్మియుద్ధం ఎలా చేయాలో, రథాలమధ్యా, ఏనుగులమధ్యా నేలపై నిలబడి ఎలా యుద్ధం చెయ్యాలో, గదలూ మొదలైనవాటితో యుద్ధం ఎలా చెయ్యాలో, వాటిలోని రహస్యాలన్నిటితో సహా నేర్పాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)