ఏకలవ్యుడు | మహాభారతం | Ekalaiva | Mahabharatham | Ep-08

writer
0

హస్తినాపురానికి సమీపంలో ఉండే అరణ్యాలలో హిరణ్యధన్వుడు అనే యెరుకల రాజు ఒక డుండేవాడు. ఏకలవ్యుడు అతని కుమారుడు. ద్రోణుడనే ఆయన వద్ద, దేశంలోని రాజకుమారులందరూ విలువిద్య నేర్చుతున్నారనీ, ఎక్కడెక్కడి నుంచో రాజకుమారులు వచ్చి ద్రోణుడికి శిష్యులై సమస్త అస్త్రశస్త్ర విద్యలూ అభ్యసిస్తున్నట్టూ ఏకలవ్యుడు విన్నాడు. అతను ద్రోణుడి వద్దకు వచ్చి, తనను కూడా ఒక శిష్యుడుగా చేర్చుకోమన్నాడు. ఆ కుర్రవాడు ఎరుకలవాడని తెలిసి, ద్రోణుడు అతన్ని శిష్యుడుగా చేర్చుకొన నిరాకరించాడు.


ఏకలవ్యుడు ఎంతో వినయంతో ద్రోణుడికి మొక్కి సెలవు పుచ్చుకుని, తన అరణ్యానికి తిరిగివెళ్ళి, ఒకచోట ద్రోణుడి బొమ్మ ఒకటి చేసిపెట్టి, బాణాలు ప్రయోగించటం అభ్యాసం చేయసాగాడు. ఈ అభ్యాసం ఫలితంగా ఏకలవ్యుడు విలువిద్యలో ద్రోణుడి శిష్యులందరినీ మించి పోయాడు.


ఒకనాడు ద్రోణుడి శిష్యులు వేటాడటానికి ఏకలవ్యుడుండే వనానికే వచ్చారు. వేటకుక్కలలో ఒకటి మిగిలిన కుక్కల నుంచి వేరై, జింకతోలు కట్టుకుని, మట్టి కొట్టుకుని, జుట్టంతా జడలు కట్టుకుపోయి ఉన్న ఏకలవ్యుణ్ణి చూసి మొరిగింది. ఏకలవ్యుడు కుక్క చేసిన ధ్వనినిబట్టి ఒకేసారి ఏడు బాణాలు వేసేసరికి, ఆ ఏడూ కుక్క ముఖంలో గుచ్చుకున్నాయి. అలా గుచ్చుకున్న బాణాలతోనే ఆ కుక్క మరింత గట్టిగా మొరుగుతా, రాజకుమారుల వద్దకు తిరిగి వచ్చేసింది.


వాళ్ళు కుక్క ముఖంలో నాటిన బాణాలు చూసి, వాటిని వేసినవాడు చాలా గొప్ప విలుకాడై ఉండాలని గ్రహించి అతన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. చివరకు వాళ్ళకు ఏకలవ్యుడు కనబడ్డాడు గాని వాళ్ళు అతన్ని గుర్తించక, "ఎవరు నువు? మీ తండ్రి ఎవరు ? నీకు గురు వెవరు ?" అని అడిగారు.


ఏకలవ్యుడు వారితో, "నేను ఎరుకల రాజు కొడుకును. నా పేరు ఏకలవ్యుడు. నేను ద్రోణాచార్యులవారిని నా గురువుగా భావించి విలువిద్యాభ్యాసం చేస్తున్నాను,” అని చెప్పాడు.


రాజకుమారులు హస్తినాపురానికి తిరిగి వచ్చి, ఏకలవ్యుడి సంగతి సంగతి ద్రోణుడికి చెప్పారు. ఏకలవ్యుడు తన కన్న విలు విద్యలో గొప్పవాడై ఉంటాడని అర్జునుడికి బెంగపట్టుకున్నది. అతను ద్రోణుడితో, "నా కన్న గొప్ప విలుకాడు లోకంలో మరొకడు ఉండటానికి వీలులేకుండా నాకు శిక్షణ ఇస్తామన్నారు. కాని ఈ ఏకలవ్యు డికి నా కన్న హెచ్చు విలువిద్య నేర్పినట్టున్నారే ?" అన్నాడు.


అర్జునుడీ మాట అన్నమీదట ద్రోణుడు మిగిలిన శిష్యులు కెవరికీ తెలియకుండా అర్జునుణ్ణి మాత్రం వెంటబెట్టుకుని, అర ణ్యంలో ఏకలవ్యుడుండే చోటికి వెళ్ళాడు.


విలువిద్యాభ్యాసంలో ముణిగి ఉన్న ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి ఎదురువచ్చి నమస్కరించి, కూర్చోబెట్టి అతిథి మర్యా దలు చేసి, ఎదురుగా నిలబడి, “నేను తమ శిష్యుణ్ణి !" అన్నాడు.


"నువు నా శిష్యుడవే అయితే గురుదక్షిణ ఏ మిచ్చుకుంటావు?” అని ద్రోణుడు ఏకలవ్యుణ్ణి అడిగాడు.


"గురుదక్షిణగా ఇవ్వరానిదంటూ ఏముంటుంది? నా ఈ శరీరమంతా తమదే,” అన్నాడు ఏకలవ్యుడు.


"అలా అయితే నీ కుడి బొటన వేలు కోసి ఇయ్యి,” అన్నాడు ద్రోణుడు.


ఏకలవ్యుడు ఏ మాత్రమూ సంకోచించక తన కుడి బొటనవేలు నరికి ద్రోణుడి కిచ్చాడు. అటు తరువాత అతను విల్లును ఎడమచేత పట్టుకుని, కుడిచేతి మిగిలిన వేళ్ళతో బాణాలు సంధించటం అభ్యాసం చేశాడు. కాని అతను విలువిద్యలో మొదట ఉండిన ప్రావీణ్యాన్ని పోగొట్టుకున్నాడు.


ఈ విధంగా అర్జునుడి భయాన్ని తీర్చి, ద్రోణుడు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ అతనితో సహా హస్తినాపురానికి తిరిగి వచ్చాడు.


ద్రోణుడి దగ్గిర అన్ని విద్యలూ నేర్చుకున్నప్పటికీ కూడా పాండవులు వేరువేరు విద్యలలో ప్రవీణులయారు. ధర్మరాజు రధికుడుగా గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు. గదాయుద్ధంలో భీముడూ, దుర్యోధనుడూ బాగా రాణించారు. అర్జునుడు విలువిద్యలో సాటిలేనివాడయాడు; ఈ విద్యలో అతని బుద్ధి బలమూ, శర సంధానంలో వేగమూ, శస్త్రాస్త్రప్రయోగ నైపుణ్యమూ మరెవరికి రాలేదు. అశ్వతామకు తెలిసిన యుద్ధరహస్యాలు మరెవరికీ తెలియవు. నకులసహదేవులు కత్తి యుద్ధంలో హెచ్చుగా రాణించారు.


భీముడి గదాయుద్ధ కౌశలమూ, అర్జునుడి విలువిద్యాతిశయమూ చూసి దుర్యోధనుడు మొదలైనవాళ్ళు చాలా బాధపడుతుండేవారు.


ఒకనాడు ద్రోణుడు తన శిష్యులలో ఎవరికెంత గురి ఉన్నదీ తెలుసుకో గోరి, ఒక బొమ్మగద్దను చేయించి, దానిని కనపడీ కనపడకుండా ఒక చెట్టు మీద పెట్టించి, శిష్యులందరినీ చెట్టు వద్దకు తీసుకుపోయి, "ఈ చెట్టు మీద ఉన్న పక్షి ఆకుల సందుగా జాగ్రత్తగా చూస్తే కనబడుతుంది. మీరందరూ విళ్ళకు బాణాలు సంధించి, నేను చెప్పగానే దాని తల తెగేటట్టు కొట్టాలి," అన్నాడు.


ఈ పరీక్షలో మొట్టమొదటి వంతు ధర్మరాజుది.


బాగా చూడు. పక్షి కనిపిస్తున్నదా?" అని ద్రోణుడు అడిగాడు.


"కనిపిస్తున్నది," అన్నాడు ధర్మరాజు.


"పక్షితోబాటు నీకు నేనూ, మిగిలిన వాళ్ళూ కూడా కనిపిస్తున్నామా ?" అని ద్రోణుడు మళ్ళీ అడిగాడు.


"మీరందరూ కనిపిస్తున్నారు,” అన్నాడు ధర్మరాజు.


"నీ దృష్టి గురి పైన లేదు. నువు ఆ పక్షి తల తెగ వెయ్యలేవు," అన్నాడు ద్రోణుడు. ఆయన మిగిలినవారిని ఒక్కొక్కరినీ ఇదేవిధంగా ప్రశ్నించాడు. అందరూ ధర్మరాజులాగే జవాబు చెప్పారు.


చివరకు అర్జునుడు వచ్చి పక్షి కేసి చూశాడు. మిగిలినవాళ్ళంతా కనిపిస్తున్నారా అని ద్రోణుడడిగితే, తనకు పక్షి తప్ప ఇంకేమీ కనబడటం లేదన్నాడు.


"బాణం వదులు," అన్నాడు ద్రోణుడు. 


మరుక్షణం బొమ్మపక్షి తల తెగి కింద పడింది. ద్రోణుడు అర్జునుణ్ణి మెచ్చుకుని, ద్రుపదుణ్ణి యుద్ధంలో గెలవగలవాడు అర్జునుడేనని తన మనసులో అనుకున్నాడు.


ఒకనాడు ద్రోణుడు తన శిష్యులనందరినీ వెంటపెట్టుకుని యమునకు స్నానానికి వెళ్ళాడు. ద్రోణుడు నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక మొసలి ఆయన తొడను పట్టుకున్నది. మొసలిని బాణాలతో కొట్టమని ఆయన తన శిష్యులకు కేక పెట్టాడు. అందరూ బాణాలు వేశారు గాని ఒక్కరి బాణము మొసలికి గురిగా తగలలేదు. బాణాలు ఆయనకు తగులుతాయని వాళ్ళు భయపడ్డారు. ఒక్క అర్జునుడు మాత్రం అయిదు బాణాలు, గురువుగారి తొడకు తగలకుండా మొసలికే తగిలేటట్టు వేసి, మొసలిని చంపేశాడు.


ద్రోణుడు అర్జునుణ్ణి మెచ్చుకుంటూ, "అర్జునా, నీ నేర్పు చాలా గొప్పది. నీకు బ్రహ్మశిరోనామకాస్త్రం మంత్రసహితంగా ఉపదేశిస్తాను. దానిని మానవాతీతుడిపై ఉపయోగించవలిసిందే గాని సామాన్యునిపై ప్రయోగిస్తే లోకాలు దగ్ధమైపోతాయి," అన్నాడు.


అర్జునుడు అప్పటికప్పుడే స్నానం చేసి, శుచి అయి, ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ద్రోణుడి నుంచి ఉపదేశం పొందాడు.


ఒకనాడు ద్రోణుడు ధృతరాష్ట్రుడి సభకు వెళ్ళాడు. అక్కడ వ్యాసుడూ, భీష్ముడూ, విదురుడూ, కృపుడూ, బాహ్లికుడూ, సోమదత్తుడూ మొదలైన పెద్దలందరూ ఉన్నారు.


ద్రోణుడు ధృతరాష్ట్రుడితో, "మహారాజా, కుమారులందరూ ఇంతకాలంగా నా వద్ద విలువిద్య నేర్చుకున్నారు. వారి ప్రావీణ్యం పరీక్షించండి,” అన్నాడు.


ధృతరాష్ట్రుడు ద్రోణుడితో, "మీరు మాకు మహోపకారం చేశారు. పిల్లవాళ్ళ విద్యా ప్రదర్శనం ఎక్కడ జరిగేది, ఎప్పుడు జరిగేదీ మీరే నిర్ణయించండి. మిగిలిన ఏర్పాట్లు నేను చేయిస్తాను,” అన్నాడు.


ఆ ఏర్పాట్లు చేసే పని విదురుడికి అప్పగించారు. అవి బ్రహ్మాండంగా జరిగాయి. అస్త్రవిద్యా ప్రదర్శనకు తగిన విశాలమైన ప్రదేశాన్ని శుభ్రంచేసి, రాళ్ళూ, పొదలూ తీసిపారేసి చదును చేసి, ప్రేక్షకులు కూర్చునేటందుకు చుట్టూ ఇల్లులాగా కట్టి, ఉత్తరపు దిక్కున ప్రవేశద్వారం ఏర్పాటుచేశారు.


ఒక మంచి రోజున ప్రదర్శనకు ఏర్పాటు జరిగింది. ప్రదర్శన చూడటానికి పెద్దలందరూ బయలుదేరి వచ్చారు. గాంధారీ కుంతీ మొదలైన అంతఃపుర స్త్రీలు పల్లకీలలోనూ, డోలీలలోనూ వచ్చారు. అందరూ ఎవరి స్థానాలలో వారు కూర్చున్నాక ద్రోణుడు అశ్వత్థామను వెంటబెట్టుకుని వచ్చి, రంగస్థలం మధ్య నిలబడ్డాడు. ఆయన శిష్యులందరూ కవచాలూ, విల్లులూ, బాణతూణీరాలూ ధరించి, చేతుల్లో రకరకాల ఆయుధాలు పట్టుకుని రంగం మీదికి వచ్చారు. అందరిలోకీ పెద్ద వాడైన ధర్మరాజు ముందూ, మిగిలినవారు అతని వెనకా రంగప్రవేశం చేశారు.


అందరూ రథాల మీదా, ఏనుగులు మీదా, గుర్రాల మీద రంగస్థలంలో అనేక విన్యాసాలు చేసి తమ అస్త్రకౌశలాలు ప్రదర్శించారు, విలువిద్యలో తమ సామర్థ్యాలు చూపారు. బాణాలు తమ కెక్కడ తగులు తాయోనని ప్రేక్షకులు భయపడ్డారు. రంగ స్థలంలో జరుగుతున్నదంతా ధృతరాష్ట్రుడికి విదురుడూ, గాంధారికి కుంతీ వివరిస్తూ వచ్చారు.


కొంతసేపయాక భీమదుర్యోధనులు గదలతో రంగంలోకి దిగి యుద్ధం ఆరంభించారు. అది ప్రదర్శన కొరకు ఏర్పాటు చేసిన యుద్ధమే అయినా 'ప్రేక్షకులు కొందరు భీముణ్ణి, కొందరు దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టటం ప్రారంభించే సరికి ద్రోణుడు గదా యుద్ధం నిలుపు చేయించమని అశ్వత్థామను హెచ్చరించాడు.


చివరకు అర్జునుడు రంగస్థలం మీదికి వచ్చాడు. అతన్ని చూడగానే ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణు, "ఆ కలకలం ఏమిటి?" అని అడిగితే విదురుడు చెప్పాడు.


అర్జునుడి ప్రదర్శనం ఊహించరానంత అద్భుతమనిపించింది. అతను దివ్యాస్త్రాలను ప్రయోగించి గాలి, నిప్పూ, మేఘాలూ మొదలైనవి సృష్టించాడు. ఒక అస్త్రంతో అంతర్ధానమయాడు. అతని లక్ష్యసిద్ధి అమోఘం. గుండ్రగా తిరిగే పందిబొమ్మ ముఖాన ఒకేసారి అయిదు బాణాలు కొట్టాడు. ఒక్క ఆవుకొమ్ములో ఇరవై ఒక్క బాణాలు గురి తప్పకుండా గుచ్చుకునేటట్టు వేశాడు.


కుర్రవాళ్ళందరూ తమతమ విద్యలు ప్రదర్శించి, రంగస్థలం నుంచి నిష్క్ర మించిన తరువాత అక్కడికి, సహజ కవచ కుండలాలతో బాల సూర్యుడిలాగా వెలిగి పోతూ, కర్ణుడు ధనుర్బాణాలు ధరించి వచ్చాడు. అతను ద్రోణాచార్యుడికీ, కృపా చార్యుడికి నమస్కరించి, గంభీరమైన స్వరంతో, "ఓరీ, అర్జునా! ధనుర్విద్యలో నువే మొనగాడవనుకోకు. నువు ప్రదర్శించిన విద్యలన్నిటినీ నేను కూడా ప్రదర్శిస్తాను," అన్నాడు.


ఈ మాటతో అర్జునుడికి కోపమూ, అవమానమూ కలిగాయి; ప్రేక్షకులలో ఆసక్తి కలిగింది. నిజంగానే కర్ణుడు అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ తానూ ప్రదర్శిం చాడు. వెంటనే దుర్యోధనుడూ, అతని తమ్ములూ వచ్చి కర్ణుణ్ణి కౌగలించుకుని, అభినందించి, "ఈనాటి నుంచీ నువు మాకు ఆప్తుడివిగానూ, మాలో ఒకడివిగానూ ఉండు. మా శత్రువులను నాశనం చేసి, మాకు మేలు చెయ్యి,” అన్నారు.


కర్ణుడు అందుకు సమ్మతించి, తనను అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యనివ్వమని ద్రోణాచార్యుణ్ణి అడిగాడు. అర్జునుడు అందుకు సిద్దమయాడు. తన కొడుకులు యుద్ధానికి తలపడటం చూసి కుంతి మూర్ఛపోయింది. చెలికత్తెలు ఆమెను సేదదీర్చారు.


అప్పుడు కృపుడు కర్ణుడితో, "నాయనా, నీ కులమేది? తల్లిదండ్రు లెవరు? నువు సుక్షత్రియుడివైతే తప్ప అర్జునుడు నీతో ద్వంద్వయుద్ధం చేయగూడదు,” అన్నాడు. కర్ణుడు తనను పెంచినవారి పేర్లు చెప్పడానికి సిగ్గుపడిపోయాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)