పరీక్షిత్తుశాపం | మహాభారతం | Curse of Parikshit | Mahabharatham | Ep-01

writer
0

నైమిశారణ్యంలో ఋషిగణాలుండేవి. ఆ ఋషులకు కులపతి శౌనకమహాముని. ఆయన ఒకప్పుడు పన్నెండేళ్ళ పాటు జరిగే సత్రయాగం చేశాడు. అనేకమంది మహాఋషులు కలిసి ఆ యాగం చేస్తూం డగా అక్కడికి రోమహర్షుడి కొడుకు ఉగ్ర శ్రవసు డనే సూతుడు వచ్చాడు. సూతుడికి తెలియని పురాణగాథలు లేవు.


సూతుణ్ణి చూడగానే మునులందరూ అతని చుట్టూ మూగి, "నువు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువు రావటం మా కెంతో సంతోషమయింది. నీ నుంచి మేము ఎన్నో పుణ్య కథలు వినవచ్చు,” అన్నారు.


సూతుడు వారితో, "మహర్షులారా, పరిక్షితుడి కొడుకు జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఆ సమయంలో వైశంపాయనుడు జనమేజయుడికి భారతకథలను చెప్పాడు. ఆ కథలను రాసినవాడు వైశంపాయనుడి గురువైన వేదవ్యాసుడే. నేనా కథలన్నీ విని, అనేక తీర్థాలు సేవించి, కౌరవ పాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకమనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి, అటు నుంచి ఇలా వచ్చాను," అన్నాడు.


ఇంకేముంది ? వ్యాసుడు రచించిన భారతకథలను తమకు చెప్పమని సూతుణ్ణి శౌనకాది మహామునులు కోరారు.


సూతుడు వారితో ఇలా చెప్పాడు: భారతరచన ఎలా జరిగిందనుకున్నారు? కృష్ణద్వైపాయనుడనే పేరుగల వ్యాసుడు వేదాలను నాలుగుగా విభజించిన అనంతరం హిమాలయాల మీద తపస్సు చేశాడు. ధృతరాష్ట్రుడితరం వారంతా చనిపోయాక భారతం ఆలోచించాడు. అది లోకానికంతకూ పఠనీయంగా ఉండేటట్టు చేసే మార్గమేమిటా అని ఆలోచిస్తూండగా ఆయనను చూడటానికి బ్రహ్మ వచ్చాడు. వ్యాసుడు బ్రహ్మకు ప్రణామం చేసి, కూర్చోబెట్టి, " దేవా, నేను వేదవేదాంగాల సారమంతా ఇమిడ్చి, భారతమనే ఇతిహాసాన్ని రచించాను. ప్రజలు దాన్ని చదివి ఆనందించేటట్టుగా లిఖించే వాడెవడూ కనబడడు," అన్నాడు.


"నాయనా, విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి, అతని ద్వారా నీ భారత ఇతిహాసాన్ని రాయించు," అని బ్రహ్మ వ్యాసుడికి సలహా ఇచ్చాడు.


వ్యాసుడు ధ్యానించగా విఘ్నేశ్వరుడు వచ్చాడు. వ్యాసుడు కోరిన ప్రకారం, ఆయన చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని లిఖించాడు. దాన్ని దేవ లోకంలో నారదుడూ, పిత్రులోకంలో దేవలు డనే అసితుడూ, గంధర్వాది లోకా లలో శుకుడూ ప్రచారం చేశారు. జనమే జయుడు సర్పయాగం చేసినప్పుడు వైశం పాయనుడు దానినే పఠించి, భూలోకంలో ప్రచారంలోకి తెచ్చాడు.


శౌనకాది మునులు ఈ విషయాలు విని సంతోషించి, "కౌరవపాండవులు యుద్ధం చేసిన శమంతక పంచకం అనే క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?" అని సూతుణ్ణి అడిగారు.


సూతుడు వారికి ఇలా చెప్పాడు:


త్రేతా ద్వాపరయుగ సంధిలో రాజులు మదించి, అధర్మమార్గాన సంచరిస్తూ ఉంటే పరశురాముడు వారిని ఇరవై ఒక్కసారి వెతికి వెతికి చంపి, వారి రక్తంతో అయిదు మడుగులు కల్పించి, ఆ మడుగులలో పితృదేవతలకు తర్పణా లిచ్చాడు. పితృ దేవతలు, ఆ మడుగులైదూ పుణ్యతీర్థమయేటట్టు పరశురాముడికి వరమిచ్చారు. ఆ ప్రదేశంలోనే అతి ఘోరమైన భారత యుద్ధం జరిగింది. ఆ కారణంగా శమంతక పంచకక్షేత్రానికి కురుక్షేత్ర మనే పేరు వచ్చింది.


పరీక్షితుడి కొడుకైన జనమేజయుడు ఆ కురుక్షేత్రంలో, తన తమ్ములైన శ్రుత సేన, ఉగ్రసేన, భీమసేనుల సహాయంతో దీర్ఘమైన సత్రయాగం చేశాడు. ఆ సమ యంలో, సరము అనే దేవతాశునకం కొడుకు సారమేయం అనేది యజ్ఞవాటికలో తిరుగుతూంటే, జనమేజయుడి తమ్ములు ఆ కుక్కను కొట్టారు. అది వెళ్ళి తన తల్లి అయిన సరమతో చెప్పింది. "సాధువులూ, పేదలూ అయిన వారికి కీడుచేస్తే కట్టికుడపకపోదు," అని సరమ తిట్టింది.


సరమ తిట్టు శాపమై తగులుతుందేమోనని భయపడి జనమేజయుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి, శాంతికర్మలు చేయించటానికి పురోహితుడెవడైనా దొరుకుతాడా అని చూడసాగాడు. ఒకసారి అతను అరణ్యంలో వేటాడబోగా, అక్కడ శ్రుతశ్రవుడి ఆశ్రమం కనబడింది. శ్రుతశ్రవుడికి సోమశ్రవుడనే కొడుకున్నట్టు తెలిసి, జనమేజయుడు, "మీ కుమారుణ్ణి నాకు పురోహితుడుగా ఇవ్వగలరా?” అని శ్రుతశ్రవుణ్ణి అడిగాడు.


"నా కొడుకుకు ఒక నియమమున్నది. బ్రాహ్మణుడైనవాడు ఏది అడిగినా నా కొడుకు ఇచ్చేస్తాడు. అతని ఈ నియమానికి భంగం రాకుండా నువు చూసే పక్షంలో, అతను నీకు పురోహితుడుగా ఉంటాడు," అన్నాడు శ్రుతశ్రవుడు. జనమేజయుడు అందుకు సమ్మతించి, సోమశ్రపుణ్ణి హస్తినాపురానికి తీసుకుపోయి, అతని సహాయంతో అనేక యజ్ఞలు చేశాడు.


ఇలా ఉండగా ఒకనాడు జనమేజయుడి వద్దకు ఉదంకుడనే మహర్షి వచ్చి, "రాజా, చెయ్యవలిసిన పని ఉపేక్షించి, చేతులు కట్టుకు కూర్చున్నావేమిటి?” అన్నాడు.


"స్వామీ, క్షత్రియ ధర్మాలన్నీ తప్ప కుండా ఆచరిస్తున్నానే? ఏమిటి నేను చెయ్యక మానినది?” అని జనమేజయుడు ఉదంకుణ్ణి అడిగాడు.


"సర్పయాగం చెయ్యి! ఆ దుర్మార్గుడు తక్షకుణ్ణి బూడిద చెయ్యి. మీ తండ్రి అయిన పరీక్షిత్తును కాటు వేసి చంపింది ఆ తక్షకుడు కాడూ? మీ తండ్రి ప్రాణాలను రక్షించటానికి వచ్చే కాశ్యపుడికి అంతులేని ధనాన్ని లంచం పెట్టి, తిప్పి పంపేసినదీ వాడేగా ?” అన్నాడు ఉదంకుడు.


నిజానికి ఉదంకుడికి కూడా తక్షకుడి పైన పగ ఉన్నది. దానికి కారణం అది: 


ఈ ఉదంకుడు వేదుడనే ఋషి దగ్గిర చదువుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోతూ, తన గురువును గురుదక్షిణ ఏమి ఇవ్వమంటారని అడిగాడు. "నా భార్య ఏమి కోరుతుందో అడిగి చూడు," అన్నాడు వేదుడు. ఉదంకుడు గురుపత్నిని ఏమి కావాలని అడిగాడు.


"ఇవాళకు నాలుగో రోజున నేను పుణ్యక వ్రతం చేసుకుంటాను. అప్పుడు కుండలాలు పెట్టుకోవాలని ఉన్నది. నేను కోరే కుండలాలు పౌష్యడనే రాజు భార్య వద్ద ఉన్నాయి. చాతనయితే వాటిని తెచ్చి ఇయ్యి,” అన్నది గురుపత్ని.


ఉదంకుడు పౌష్యరాజు భార్య వద్దకు పోయి సంగతి చెప్పాడు. ఆమె తన కుండలాలు ఇవ్వటానికి ఒప్పుకున్నది, కాని వాటిని తస్కరించటానికి తక్షకుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడని హెచ్చరించింది.


ఆమె అన్నట్టే జరిగింది. ఉదంకుడు ఆ కుండలాలు తీసుకుని అరణ్య మార్గాన పోతూ, ఒక చోట మడుగు చూసి, కుండలాలను ఒక చోట పెట్టి, ఆచమించటానికి మడుగు దగ్గిరికి పోయేసరికి, అప్పటిదాకా ఉదంకుణ్ణి దూరదూరంగా వెన్నాడుతూ వచ్చిన తక్షకుడు ఆ కుండలాలను హరించి పారిపోసాగాడు. నగ్నమానవ రూపంలో ఉన్న తక్షకుణ్ణి ఉదంకుడు తరిమి పట్టుకున్నాడు. వెంటనే తక్షకుడు పాముగా మారి ఒక బిలంలో దూరాడు.


ఉదంకుడు ఆ బిలాన్ని ఒక కర్రతో తవ్వి పెద్దది చేస్తూ, ఆ మార్గాన పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న నాగులను ఉదంకుడు ఎంత స్తోత్రం చేసినా లాభం లేకపోయింది. చివరకు అతనికి ఒక గుర్రం మీద కూర్చుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. ఆ గుర్రం అగ్ని, దాని మీద ఉన్నవాడు ఇంద్రుడు. ఆ సంగతి ఉదంకుడికి తెలియదు. అయినా, ఆ మనిషి తనను, "నీకేం కావాలి?" అని అడిగితే, ఉదంకుడు నాగలోకాన్ని తనకు అధీనం చెయ్యమన్నాడు. వెంటనే ఆ గుర్రం నుంచి భయంకరమైన అగ్ని జ్వాలలు వెలు వడ్డాయి. నాగలోకమంతా బూడిద అయిపోతుందని భయపడి, తక్షకుడు కుండలాలను తెచ్చి ఉదంకుడికిచ్చాడు. అతను వాటిని సకాలంలో గురుపత్నికి అందజేశాడు. 


ఉదంకుడి ద్వారా తన తండ్రిని చంపి నది తక్షకుడని తెలియగానే జనమేజయుడు తన మంత్రులను, "అలా జరగటానికి కారణమేమిటి?” అని అడిగాడు. వాళ్ళు పరీక్షిత్తు మరణ వృత్తాంతం ఇలా చెప్పారు: భారత యుద్ధంలో చనిపోయిన అభిమన్యుడికి, ఉత్తరకూ పుట్టిన పరీక్షిత్తు కృపాచార్యుడి వద్ద విలువిద్య నేర్చి, పాండవుల అనంతరం రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. ఆయనకు వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడాయన వేట తమకంలో అరణ్యంలో తన చేత దెబ్బతిని పారిపోయే జంతువును తరుముకుంటూ, శమీకుడనే మహాముని తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి, "బాణం తగిలిన మృగం ఇటుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అది ఎటుగా పోయింది?" అని అడిగాడు.


మౌనంగా తపస్సు చేసుకునే శమీకుడు సమాధానం చెప్పలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అతను ఒక చచ్చిన పామును బాణం ములికితో ఎత్తి శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీకుడి కొడుకైన శృంగికి ఒక మిత్రుడి ద్వారా పరీక్షిత్తు చేసిన పని గురించి తెలిసింది. ముక్కోపి అయిన శృంగి, "ఇవాళకు ఏడోరోజున పరీక్షిత్తు తక్షకుడి విషంతో చచ్చిపోవుగాక !" అని శాపం ఇచ్చాడు.


తన కొడుకు పరీక్షిత్తులాటి మంచి రాజుకు ఇంత దారుణమైన శాపం ఇచ్చా డని తెలిసి శమీకుడు చాలా నొచ్చుకుని, గౌరముఖుడనే తన శిష్యుణ్ణి పిలిచి, "నువు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి, శాపం సంగతిచెప్పి, తక్షకుడి వల్ల అపాయం రాకుండా జాగ్రత్త పడమని చెప్పు,” అన్నాడు. గౌరముఖుడు పరీక్షిత్తు వద్దకు వెళ్ళి, గురువుగారు చెప్పమన్నట్టే చెప్పాడు.


పరీక్షిత్తు తాను చేసిన పనికి నొచ్చుకుని, శృంగి ఇచ్చిన శాపానికి భయపడి, శాపం తగలకుండా ఏదైనా ఉపాయం చూడమని మంత్రులను కోరాడు. వాళ్ళు ఒక ఒంటి స్తంభం మేడ కట్టించారు. అందులోకి బయటి గాలి కూడా పోవటానికి లేదు. మేడ  నిండా విషాలకు విరుగుడుగా పనిచేసే ఔషధాలను ఉంచారు. విషవైద్యులనూ, మంత్ర సిద్ధులనూ పిలిపించారు. రాజుతో సహా మంత్రులందరూ ఆ మేడలోనే చేరారు.


ఆరు రోజులు ఏ ప్రమాదమూ లేకుండా గడిచాయి. ఏడో రోజున కాశ్యపుడనే బ్రాహ్మణుడు, పరీక్షిత్తుకు కలిగిన శాపం గురించి విని, తక్షకుడు కరిచిన పక్షంలో రాజు ప్రాణాలను కాపాడటానికి బయలు దేరి వస్తున్నాడు. తక్షకుడు కూడా రాజును కరవటానికి మార్గమేదా అని ఆలోచిస్తూ, బ్రాహ్మణ వేషంలో వస్తూ కాశ్యపుణ్ణి కలుసుకుని, అతను వెళ్ళే పని తెలుసుకున్నాడు.


కాశ్యపుడు తక్షకుడితో, "నాకు పాముల విషానికి విరుగుడు తెలుసును. నా మంత్ర శక్తితో, పాములచేత చచ్చినవారిని బతికించ గలను. రాజును తక్షకుడు కరిచే పక్షంలో ఆయనను బతికించితే, నాకు బోలెడంత ధనమూ, కీర్తీ కూడా లభిస్తుంది,” అన్నాడు.


"అయ్యా, నేనే తక్షకుణ్ణి. నా విషంతో చచ్చినవారు బూడిద అయిపోతారు. నీ మంత్రాలతో తిరిగి బతకరు. నువు తిరిగి వెళ్ళు," అన్నాడు తక్షకుడు.


కాశ్యపుడు ఒప్పుకోలేదు. తక్షకుడు సమీపంలో ఉన్న మర్రిచెట్టును కాటు వేసి, తన విషాగ్నితో దాన్ని బూడిద చేసేశాడు. వెంటనే కాశ్యపుడు తన మంత్రంతో దాన్ని ఎప్పటిలాగా చేశాడు.


"నా విషానికి విరుగుడు వెయ్యగల వేమోగాని, శాపానికి విరుగుడు వెయ్యగలవా? రాజు ఇచ్చే ధనం కంటె చాలా హెచ్చు ధనమిస్తాను. వెళ్ళిపో,” అని తక్షకుడు కాశ్యపుణ్ణి లోభ పెట్టి, డబ్బిచ్చి పంపేశాడు.


తరవాత తక్షకుడు కొందరు నాగులను మునికుమారుల రూపంలో పరీక్షిత్తు వద్దకు పంపాడు. వాళ్ళు ఫలాలూ, పుష్పాలతో పరీక్షిత్తు వద్దకు వెళ్ళారు. వాళ్ళిచ్చిన ఫలాలలో ఒకదాన్ని పరీక్షిత్తు పగల దీశాడు. అందులో ఒక చిన్న పురుగు కనబడింది.


పరీక్షిత్తు తన చుట్టూ ఉన్నవారితో, "శాపకాలం ముగుస్తున్నది. సూర్యాస్త మయం కావస్తున్నది. నన్ను కరిస్తే ఈ పురుగు కరవాలిగాని, సర్ప భయం లేదు,” అన్నాడు. అంతలోనే ఆ పురుగు తక్షకుడై పరీక్షిత్తును కరిచాడు. అందరూ చెల్లా చెదరుగా పారిపోయారు. తక్షకుడి కాటుకు పరీక్షిత్తు తగలబడి పోవటమేగాక, ఒంటి స్తంభం మేడ నిలువునా మండింది! 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)