తన భార్యలైన కుంతినీ, మాద్రినీ వెంట బెట్టుకుని అరణ్యాలలో విహరిస్తూ, మృగాలను వేటాడటంలో పొద్దు పుచ్చుతున్న. పాండురాజు ఒకనాడు కలిసి ఉన్న లేళ్ళ మిధునాన్ని కొట్టాడు. అవి నిజానికి లేళ్ళు కావు; కిందము డనే మునీ, ఆయన భార్యా లేళ్ళరూపం ధరించి కామసుఖం అనుభవిస్తున్నారు. చచ్చిపోతూ ఆ ముని, "నీవు నీ భార్యలతో కూడినప్పుడు నీకు కూడా మరణం సంభవించును గాక, " అని శపించాడు.
ఆ మునిదంపతులను చంపినందుకు పాండురాజు చాలా విచారించాడు. అప్పటి కింకా అతనికి సంతానం లేదు. ఇక ముందు మునిశాపం వల్ల సంతానం కలిగే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆయన తన భార్యలతో, తాను సన్యాసం పుచ్చుకుని అరణ్యవాసం చేస్తాననీ, వాళ్ళు హస్తినా పురానికి తిరిగి వెళ్ళి, భీష్మ ధృతరాష్ట్ర విదురులకూ, మిగిలిన వారికి ఈ విషయం చెప్పవలిసిందనీ అన్నాడు.
"నీ భార్యలమైన మేము ఎక్కడికి పోతాం? ఎక్కడ ఉంటాం? అందరమూ కలిసే తపస్సు చేసి, ఆయువు తీరినాక పుణ్యలోకాలకు పోదాం,” అన్నారు కుంతీ మాద్రిలు. అందుకు పాండురాజు ఒప్పని పక్షంలో అప్పటికప్పుడే దేహత్యాగం చెయ్య టానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు.
వాళ్ళ మాట కాదనలేక పాండురాజు, వారిద్దరినీ తన వెంటనే ఉండనిచ్చి వానప్రస్థం చెయ్య నిశ్చయించాడు. ముగ్గురూ విలువగల తమ వస్త్రాలనూ, ఆభరణా లనూ విసర్జించి నారబట్టలు కట్టుకున్నారు. తమ వెంట ఉన్న పరిచారకులను హస్తినా పురానికి పంపేశారు. వాళ్ళు దేశాటన చేస్తూ నాగశతపర్వతమూ, చైత్రరధమూ, కాల కూటమూ, హిమవంతమూ, గంథమాద నమూ, ఇంద్రద్యుమ్నహ్రదము, హంస కూటమూ తిరిగి, అక్కడక్కడా కొద్ది కొద్ది రోజులుండి, శతశృంగపర్వతం చేరారు. అక్కడ అనేకమంది మునులున్నారు. పాండురాజు వారితో కలిసి తాను కూడా తపస్సు చేయసాగాడు. మునులున్నారు.
అయితే అతని కొక అనుమానం కలి గింది. పుత్రులు లేనివాడికి, ఎంత తపస్సు చేసినా, పుణ్యలోకాలు లభించవు. తనకు సంతానప్రాప్తి లేదు. తనతో సమానులు గాని, తన కన్న ఉత్తములు గాని అయిన వాళ్ళకు తన భార్యలు కొడుకులను కంటే, వాళ్ళు తనకు క్షేత్రజులైన కొడుకులు అవుతారు. తాను కూడా క్షేత్రజుడే గద. ఈ విధంగా అనుకుని పాండురాజు తన అభిప్రాయాన్ని కుంతికి చెప్పాడు. ఇతరుల వల్ల కొడుకును కనటానికి ఆమె మొదట సమ్మతించలేదు. కాని పాండురాజు ఆమెను చివరకు ఒప్పించాడు.
కుంతి తన భర్తతో, "నాకు చిన్న తనంలో దుర్వాసమహాముని ఒక మంత్రం ఉపదేశించాడు. దాన్ని జపించినట్టయితే నేను తలచిన ఏ దేవత అయినా సరే వచ్చి నాకు పుత్రప్రాప్తి కలిగించగలడు. నేను ఏ దేవతను స్మరించను ? " అన్నది.
"మరీ మంచిది. కౌరవవంశానికి రాజు కాబోయేవాడు గొప్ప ధర్మజ్ఞుడై ఉండటం అవసరం. అందుచేత నువు ధర్మదేవతను స్మరించు,” అన్నాడు పాండురాజు.
ఆమె అలాగే చేసి, యముణ్ణి ప్రత్యక్షం చేసుకుని, అతని అనుగ్రహం వల్ల గర్భవతి అయింది. గాంధారి అప్పటికే ఒక సంవ త్సరం నుంచీ గర్భవతిగా ఉంటున్నది. కాని గాంధారి ఇంకా గర్భిణిగా ఉండగానే కుంతికి కొడుకు కలిగాడు. ఆశ్రమంలో ఉంటున్న మునులు ఆ పిల్లవాడికి యుధిష్ఠిరుడని నామకరణం చేశారు.
తరువాత కుంతి, బలశాలి అయిన కొడుకు కావాలని భర్త కోరిన మీదట, వాయుదేవుడికి భీముణ్ణి కన్నది. భీముడు పుట్టుతూనే ఒక వింత జరిగింది. కుంతి ఆ బిడ్డను తన ఒడిలో పెట్టుకుని కూర్చుని వుండగా, ఆ ప్రాంతాలకు ఒక పెద్దపులి వచ్చింది. దాన్ని చూసి కుంతి భయపడి, తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి కూడా మరిచిపోయి, చివాలున లేచింది. బిడ్డ ఒక రాతి మీద పడ్డాడు. వెంటనే ఆ రాయి . నాలుగుగా పగిలింది. అది చూసి అక్కడి. వాళ్ళంతా దిగ్భ్రామ చెందారు. ఇది జరి క ఆ బిడ్డకు మునులు భీమసేను డన్న పేరు పెట్టారు.
పాండురాజుకు లోకోత్తరుడైన మరొక కొడుకుని కూడా కనాలనిపించింది. ఆయన కోరికపై ఇంద్రుడి ద్వారా కుంతి అర్జునుణ్ణి కన్నది. హస్తినాపురంలో గాంధారి నూరు గురు కొడుకులను కంటే, శతశృంగంలో కుంతి ముగ్గురు కొడుకులను కన్నది. పాండురాజుకు కుంతి చేత ఇంకా కొడు కులను కనిపించాలని ఉన్నది. కాని ఆమె అందు కెంతమాత్రమూ ఒప్పుకోలేదు.
అయితే మాద్రి ఆయనతో, 'కుంతి మంత్ర ప్రభావంతో కొడుకులను కన్నది కదా, కుంతితో సమానురాలనైన నేను సంతానం లేకుండా ఎందుకుండాలి? కుంతి నా కా మంత్రం ఉపదేశించినట్టయితే నేను కూడా పుత్రవతి నౌతాను గదా," అన్నది.
ఆమె కోరికను పాండురాజు కుంతికి తెలిపాడు. కుంతి మాద్రికి మంత్రం ఉప దేశించింది. మాద్రి అశ్వనీదేవతల నారా ధించి, వారి ద్వారా నకుల సహదేవులనే కవల పిల్లలను కన్నది. మాద్రి మంత్ర ప్రభావంతో ఇంకా పిల్లలను కనేదే, కాని ఆమె ఒకేసారి ఇద్దరు దేవతలను ఆహ్వానించిందని అలిగి, కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి మరి ఉపదేశించ నన్నది.
ఒక్కొక్క యేడాది తేడాగా పుట్టిన బిడ్డల ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ పాండురాజు కొంతకాలం గడిపాడు. ఆశ్రమ వాసులందరూ ఆ పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపారు. వసుదేవుడు తన పురోహితుడైన కశ్యపు డనే బ్రాహ్మణుడి ద్వారా తన మేనల్లుళ్ళకు బంగారు నగలూ, పట్టు బట్టలూ, ఆటబొమ్మలూ, ఇతర వస్తువులూ పంపాడు. పాండురాజు తన పిల్లలకు చౌలమూ, ఉపనయనమూ మొదలైనవి చేయించి, అక్కడి రుషుల చేత వేదా ధ్యయనం చేయించాడు.
ఇలా కొంతకాలం జరిగినాక ఒక వసంత కాలంలో, కుంతి బ్రాహ్మణ సమారాధనలో ముణిగి ఉన్న సమయంలో పాండురాజు, ఒంటరిగా ఉన్న మాద్రిని చూసి కామ మోహితుడై, ఆమెను కలిసి, కిందముడి శాపం తగిలి చనిపోయాడు.
చచ్చిపోయిన తన భర్తను కౌగలించు కుని మాద్రి ఏడుస్తూండటం విని కుంతీ, పాండవులూ, శతశృంగంలో ఉండే మునులూ వచ్చి, జరిగినదానికి ఆశ్చర్య పోయారు. మాద్రి కుంతిని దగ్గిరికి పిలిచి, పాండురాజు మరణానికి కారణం చెప్పింది.
అయ్యో, మాద్రి! రాజుకు ముని శాపం ఉందని తెలిసి, నేనెంతో జాగ్రత్త పడుతూ వచ్చాను గదా, ఇలా ఎందుకు జరగ నిచ్చావు ? ఇప్పుడు చేసేదేముంది? పెద్ద భార్యను గనక నేను సహగమనం చేస్తాను. నువు పిల్లలను దగ్గిర పెట్టుకుని పెంచు," అన్నది కుంతి.
మాద్రి ఏడుస్తూ, "నేను ఎంత ప్రయ త్నించి కూడా భర్తను నిరోధించలేక పోయాను. భర్త ప్రాణాలు కాపాడుకో లేని దాన్ని, ఈ పిల్లలను నేనేం కాపాడ గలను? ఈ లోకంలో భర్తను సుఖపెట్టి లేక పోయినందుకు, మరో లోకంలో నైనా సుఖపెట్ట గలనేమో, భర్త వెంట నేనే పోతాను,” అని కుంతి వద్ద సెలవు పుచ్చుకుని, భర్త చితి మీద తాను కూడా కాలిపోయింది.
తరవాత శతశృంగంలో ఉండే మునులు కుంతినీ, పాండవులనూ వెంటబెట్టుకుని, మాద్రీ పాండురాజుల అస్థికలను తీసుకుని హస్తినాపురం చేరి, జరిగినదంతా భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన కౌరవముఖ్యులందరికీ చెప్పారు.
పాండురాజు పోయాడని విని భీష్ముడూ, ధృతరాష్ట్రుడూ చాలా దుఃఖించారు. ధృత రాష్ట్రుడు విదురుడితో, చనిపోయినవారికి యథావిధిగా పరలోక క్రియలు జరిపించ మని చెప్పాడు. మాద్రీ పాండురాజుల అస్థికలను పల్లకిలో ఉంచి, ఛత్రచామర లాంఛనాలతో ఊరేగించి, గంగలో కలిపారు. నగరంలో నుంచి అసంఖ్యాకులు వాటివెంట గంగాతీరం చేరారు. పన్నెండు రోజులపాటు అపరక్రియలు జరిగిన మీదట అందరూ నగరానికి తిరిగి వచ్చారు.
సత్యవతి వ్యాసుడి సలహా ననుసరించి, తన కోడళ్ళయిన అంబికా, అంబాలికలను వెంటబెట్టుకుని, తపస్సు చెయ్యటానికి అరణ్యాలకు బయలుదేరి పోయింది. అక్కడే తపస్సు చేసుకుంటూ ఆ ముగ్గురూ జీవితాలు ముగించారు.
అది మొదలు పాండవులూ, కౌరవులూ ధృతరాష్ట్రుడి వద్దనే పెరిగారు. అందరూ కలిసి ఆడుకునేవారు, ఒకరితో ఒకరు పందాలు పడేవారు. అన్ని ఆటలలోనూ భీముడిదే పై చెయ్యిగా ఉండేది. అతను తన బలం చూపటానికి ఒక్కసారిగా పది మందిని ఎత్తుకుని పరుగులు తీసేవాడు, కోపం వస్తే అవతలివాళ్ళ జుట్టు పట్టుకుని, వదిలేవాడు కాడు; ఈతలు కొట్టేటప్పుడు పది పన్నెండు మందిని ఒకేసారి నీటిలో అదిమి పెట్టేవాడు; పిల్లలు పళ్ళ కోసం చెట్లెక్కితే మాను పట్టి ఊపి, వేళ్ళతో సహా చెట్టును కూలదోయ జూసేవాడు; కింద పడిపోతామని చెట్టు మీది పిల్లలు హడిలి చచ్చేవాళ్ళు. భీముడి కిలా చెయ్య టంలో దుర్బుద్ధి ఏమీ లేకపోయినా, అతని చెలగాటం మిగిలిన వాళ్ళకు ప్రాణసంక టంగా ఉండేది. భీముడి అపారబలం చూస్తే దుర్యోధనుడికి మహా ఈర్ష్యగా ఉండేది. ఆ భీముడు ఒక్కడూ చస్తే, మిగిలిన వాళ్ళంతా తాను చెప్పినట్టు వింటారన్న దురాలోచన అతనికి కలిగింది. అందుకు తగిన అవకాశమే త్వరగా చిక్కలేదు.
గంగాతీరాన ప్రమాణకోటిస్థల మనే చోటున్నది. అక్కడ జలక్రీడలు జరప టానికి అనుకూలంగా, నాలుగువైపులా మెట్లుగల క్రీడా సరస్సులూ, ఉద్యాన వనాలూ, ఎత్తయిన మేడలూ మొదలైనవి. దుర్యోధనుడు కట్టించుకుని ఉన్నాడు. ఒక రోజు రాజకుమారు లందరూ అక్కడికి వెళ్ళి విహరించటానికి నిర్ణయం జరిగింది. రకరకాల భక్ష్యాలూ, భోజ్యాలూ, పానీయాలూ మొదలైనవి. తయారయాయి. వాటిని సేవకులు ప్రమాణకోటిస్థలానికి తీసుకుపోయారు.
రాజకుమారులతో కలిసి పాండవులు కూడా విహారానికి వెళ్ళారు. తెచ్చిన ఆహార పదార్థాలను అందరితోబాటు పాండవులు కూడా తిన్నారు. అయితే దుర్యోధనుడు భీముడి పక్కన చేరి, ఎంతో ప్రేమగా కబుర్లు చెబుతూ అతని చేత విషం కలిపిన భక్ష్యాలు తినిపించాడు. భీముడికి ఏ మాత్రమూ అనుమానం కలగలేదు. అతను మిగిలిన వాళ్ళతోబాటు జలక్రీడ లాడి, విషం పనిచెయ్య నారంభించేసరికి వికారం పుట్టి, గంగాతీరాన చల్లగాలి కొట్టే చోట పడుకుని, స్పృహ తప్పిపోయాడు.
తన ఎత్తు పారినందుకు సంతోషించి దుర్యోధనుడు, భీముడి కాళ్ళూ, చేతులూ గట్టిగా తీగెలతో బంధించి, గంగలోని లోతైన మడుగులో అతన్ని పారేశాడు. ఇవేవీ భీముడికి తెలియదు. అతను తిన్నగా పాతాళలోకానికి దిగిపోయాడు.
అక్కడ అతన్ని విషపుపాములు కాటు వేశాయి. వాటి విషంతో దుర్యోధనుడు పెట్టిన విషం విరిగిపోయి, భీముడికి స్పృహ వచ్చింది. తన చేతులూ, కాళ్ళూ కట్టివేసి ఉన్నట్టు తెలుసుకుని అతను గట్టిగా ఒళ్ళు విరుచుకుని, బంధాలన్నిటినీ తెంపేసి, తనను కరిచే పాములను పట్టు కుని చంప నారంభించాడు.
ఈ సంగతి వాసుకికి తెలిసింది. వాసుకి పోయాడు. వచ్చి, భీముణ్ణి చూసి, అతను తన బంధు వేనని గ్రహించాడు. ఎందుకంటే, కుంతి తండ్రి అయిన శూరుడు వాసుకి చెల్లెలి కొడుకు. అందుచేత వాసుకి భీముణ్ణి తీసుకు పోయి, వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వగల రసాన్ని తాగించాడు. భీముడు ఆ రసాన్ని ఎనిమిది కుండలు తాగి, సుఖంగా నిద్రపోయాడు.